అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో పిడుగు పంజాతో పలువురు మరణించగా.. తీవ్రంగా గాయపడి పలువురు చికిత్స పొందుతున్నారు.
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ధనురా గ్రామం లో పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. గ్రామ చెరువు దగ్గర గొర్రెలను మేపుతుండగా.. ఇద్దరిపై పిడుగుపడింది. దీంతో అక్కడికక్కడే వాళ్లు మృతి చెందారు. మరణించిన వాళ్లను బండారు బేతయ్య(48), డాకూరి భరత్ (14) బండారు బేతయ్య (48)గా గుర్తించారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కాల్ నాయక్ తండాలో పిడుగు పాటుకు యువకుడు కొర్ర నాగరాజు(28) మృతి చెందాడు.
హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నాం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వికారాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది.
ఇక ఏపీ విషయానికొస్తే.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని సూర్యరావు పాలెం గ్రామంలో పిడుగు పంజా విసిరింది. బాణాసంచా తయారీ కేంద్రం పిడుగుపడడం.. షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో అక్కడ పని చేసే ఇద్దరు మహిళలు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. మరోవైపు..
తిరుమలలో కుండపోత వర్షంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దర్శనం అనంతరం వసతి గృహాలకు వెళ్లే క్రమంలోనూ భక్తులు తడిచిముద్దైయ్యారు. అలాగే.. లోతట్టు ప్రాంతాలలో వర్షపు చేరింది. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో వాహన దారులను జాగ్రత్తగా వెళ్లాలంటు సిబ్బంది సూచిస్తున్నారు. మరోవైపు చలి తీవ్రత కూడా ఎక్కవగా ఉండటంతో భక్తులకు వెన్నులో వణుకుపుట్టిస్తోంది.
ఇక.. గుంటూరు, పల్నాడు జిల్లాలోనూ వర్షం కురిసింది. అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో ఒక్కసారిగా మారిపోయింది వాతావరణం. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
ఇరు రాష్ట్రాల్లోని మిగతా చోట్ల పిడుగు నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగానే నవంబర్ 1వ తేదీ దాకా.. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment