Feeling
-
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిఒక్కరూ చాలా బిజీ అనే చెప్పొచ్చు. పక్కోడితో మాట్లాడే టైం కూడా లేనంత బిజీగా ఉంటున్నారు మనుషులు. ఇలా బిజీగా ఉన్నాం అని చెప్పడాన్ని కొందరూ స్టేటస్ ఆఫ్ సింబల్‌గా ఫీలవ్వుతారు. ఎంత బిజీ అంటే అంత ఎక్కువ డబ్బు సంపాదించే వ్యక్తులుగా భావిస్తారని అపోహలకు పోయి బిజీగా ఉండాలని పనులన్ని నెత్తిమీద వేసుకోండి. ఇలా క్షణం తీరిక లేకుండా ఉండటం చాలా ప్రమాదమని మనస్తత్వవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు బిజీ అన్న ఫీలింగే అత్యంత డేంజరని చెబుతున్నారు. ఎందువల్ల అంటే..? చాలామంది వర్క్ లైఫ్‌లో బిజీగా ఉన్నామని కనీసం స్నేహితులతో మాట్లాడే అవకాశం చిక్కడం లేదని వాపోతుంటారు. చాలామంది తమ భాగస్వామికి, కడుపున పుట్టిన పిల్లలకు కాస్త కూడా టైం ఇవ్వరు. దీన్ని క్షణం తీరిక లేనితనం అంటారు. ఇది క్రమేణ వర్క్ లైఫ్‌పై ప్రభావం చూపి, నాణ్యతలేని పనితీరుకి దారితీసి మీ ఉద్యోగ భద్రతే ప్రమాదంలో పడుతుంది. జీవితంలో ఉన్నతంగా ఉండాలి అనుకుంటే పనిచేయడం అన్నది ముఖ్యమే. కానీ సమయాన్ని సమృద్ధిగా వినియోగించుకునేలా చేసుకుని సకాలంలో అన్నింటిని చేయగలిగేలా కేటాయించుకోవాటలి. అందుకు మూడు సులభమైన వ్యూహాలు ఉన్నాయంటున్నారు యేల్స్ యూనిర్సిటి సైకాలజీ ప్రొఫెసర్ శాంటోస్. మానసిక శ్రేయస్సుని పెంపొందించేలా క్షణం తీరిక లేని బిజీని అధిగమించేలా చేయాలి. బ్రేక్‌ఫాస్ట్ దగ్గర నుంచి వర్కౌట్లు, ఫోన్కాల్లు, మీటింగ్‌లు వంటి వాటిన్నింటికి ప్రాముఖ్యత వారిగా టైం ఇచ్చుకోండి. కనీసం వ్యక్తిగతంగా మీకంటూ కొన్ని నిమిషాలు మిగిలేలా చేసుకుండి. ఆ కొద్ది సమయంలో చేయాలనుకుంటున్న ఎంజాయ్‌మెంట్‌ని ఫుల్ జోష్‌గా చేయండి. అంటే వాకింగ్, లేదా కాసేపు మీతో మీరు గడపటం లేదా మీకు నచ్చిన వాళ్లతో తుళ్లుతూ హాయిగా గడటం వంటివి చేయండి. ఇది మీకు మానసికంగా ఒత్తిడి లేకుండా చేస్తుంది. పైగా పనితీరు నాణ్యత మెరుగుపడుతుంది. ఎంతటి బిజీలో అయిని కొన్ని నిమిషాల ఫ్రీడమ్‌ని జరుపుకోవాలి. అది మీకు మంచి రిలీఫ్‌ని ఇస్తుంది. అంటే ఒక మీటింగ్ లేదా ఏదైన షెడ్యూల్ పూర్తి అయిని వెంటనే రిలాక్స్ అవ్వండి. కొద్ది విరామం లేదా స్పేస్ దొరకగానే కొద్దిపాటి నడక, ధ్యానం, పెంపుడు జంతువులతో ఫోటోలు వంటివి చేయండి. సమయం అనేది తిరిగిపొందలేక పోవచ్చు. కాస్త రిలాక్స్‌గా గడిపేందుకు డబ్బు వెచ్చించినా.. తప్పులేదని అంటున్నారు శాంటోస్. ఒక్కోసారి ఆలస్యంగా పనులు అయ్యాయని..అనుకున్నట్లుగా త్వరతిగతిన పనులు కాలేదని బెంత్తిపోనవసరం లేదు. మిగతా వ్యక్తిగత పనులను తొందరగా చేసుకునేలా ట్రై చేయండి చాలు. లేదా ఈ రోజు కాస్త టైం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి తక్కువ టైం విరామం తీసుకున్నామని అనుకోండి తప్ప విరామం తీసుకోవడం మాత్రం స్కిప్ చెయ్యొద్దని చెబుతున్నారు. కొంతమంది ప్రొఫెషనల్స్ తొందరగా ఆఫీస్ పనులు పూర్తి చేయాలనకుంటారు. ఒక్కొసారి పలు కారణాల వల్ల ఆసల్యం అవుతాయి. దీంతో ఆగ్రహం తెచ్చుకోవద్దు. మరో అవకాశంలో త్వరితగతిన పనులు పూర్తి చేసుకుని ఆ దొరికిన సమయాన్ని ఎంజాయ్ చేయండి. అప్పుడు మీకే అనిపిస్తుంది. ఒక్కోసారి టైం మిగిల్చుకోలేకపోయిన మరోసారి ఆ అవకాశాన్ని దక్కించుకుని ఎంజాయ్ చేయొచ్చన్న ఫీలింగ్ మనలో తెలియకుండానే ఒత్తిడిని జయించేలా చేస్తుంది. ఫలితంగా మెదుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అని చెబుతున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. (చదవండి: వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె..?) -
మంత్రి ఎర్రబెల్లికి వింత అనుభూతి.. అసలేం జరిగిందంటే?
సాక్షి, వరంగల్: వెరైటీ కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వింత అనుభూతి ఎదురైంది. దేవుడి పెళ్లికి పోతే మొబైల్ ఫోన్ మాయమయ్యింది. కొద్దిసేపు అందరూ కంగారు పడ్డారు. కాసేపటికి భగవంతుడి మహిమతో దొరికిందని సంతోషపడ్డారు. జనగామ జిల్లా చిల్పూర్ గుట్ట శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ శ్రీధర్ రావుతో పాటు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవుడి కల్యాణంలో పాల్గొని తిరిగి వెళ్తున్న క్రమంలో మంత్రి మొబైల్ ఫోన్ పోయింది. ఫోన్ కనిపించకపోయేసరికి అందరూ కంగారు పడ్డారు. ఎమ్మెల్యే రాజయ్య ఏకంగా మైక్ అందుకొని మంత్రి గారి ఫోన్ పోయింది.. ఎవరికైనా దొరికితే ఆలయ చైర్మన్ శ్రీధర్‌రావుకు అప్పగించాలని కోరారు. ఆ నోటా ఈనోట అందరూ మంత్రి గారు ఫోన్ పోయిందట... ఏమైందో ఏమో అంటూ గుసగుసలు పెట్టారు. మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి ఆలయ అర్చకుడు రంగాచార్యులు మంత్రిగారి సెల్ ఫోన్ దొరికిందని సెలవిచ్చారు. మంత్రి సెల్ ఫోన్‌ను కారులోనే మరిచిపోయి వచ్చారట. అసలు విషయం తెలుసుకొని అందరూ నవ్వుకున్నారు. చదవండి: చేతిలో నుంచి జారి సల సల మరిగే నూనెలో పడ్డ ఫోన్.. తర్వాత ఏమైందంటే? -
మంచి మాట: దృష్టి.. ఒక జీవిత పథం
‘ఇతరులకు గోచరం కానిది చూడగలగటమే దృష్టి అంటే...’’ అన్నాడు ప్రముఖ ఆంగ్ల నవలా రచయిత జోనాథన్ స్విఫ్ట్. ఎవరూ చూడలేని వైపు ఆలోచనా దృష్టిని ప్రసరింప చేయగలగటమే దృష్టి. చాలా మందికి తట్టని ఆలోచన ఒకరికి తట్టడం, ఒక నిశితమైన చూపు. దృష్టి ఒక శోధన, అన్వేషణ, దార్శనికత, సృజన, సంస్కారం, అద్భుత ఊహ. ఒక జీవిత పథం. చర్మ చక్షువులు మనకి బాహ్య దృష్టిని మాత్రమే ఇస్తాయి. దానివల్ల ఈ సమస్త ప్రపంచాన్ని చూడగలం. దీనిని కేవలం చూపు అంటాం. మనం చూసే ప్రపంచాన్ని, దాని పోకడను, వైఖరిని , వర్తనను చూపిస్తున్న మన నయనానికి ఆలోచనను కలిపి చూడటమే అంతర దృష్టి. దీనినే మనోనేత్ర మంటాం. ఈ దృష్టి కొందరికి సహజం. కొందరికి చదువు వల్ల వస్తుంది. ఇంకొందరికి జీవితం నేర్పుతుంది. సాధన వల్ల కూడ సాధ్యమే. మస్తిష్క సాగరంలో వచ్చే ఆలోచనా తరంగాలను దాటి చాలా లోతుగా వెళ్ళటం దృష్టే. మనకందరకూ ఆలోచనలు వస్తాయి. కొన్ని క్లిష్టమైన సందర్భాలలో, సమస్యల విషయంలో మనం తీవ్రంగా యోచించి పరిష్కారం లేదా సమాధానం కనుక్కోవలసివస్తుంది. అప్పుడు ఒక పరిధి.. పరిమితి లేకుండా ప్రసరించే మన ఆలోచనా కిరణాలను సమీకరించుకుని ఒక చోట కేంద్రీకృతం చేయాలి. ఇలా అందరూ చేయలేరు. మనలో కొందరికే ఆ శక్తి సామర్థ్యాలుంటాయి. వారు సమస్య మూలాలలోకి తమ దృష్టిని ప్రవహింప చేయగలరు. అపుడది శక్తిమంతమై మనం వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం దొరికేటట్టు చేస్తుంది. మన దృష్టిని సమస్య అన్ని కోణాలవైపు చొప్పించాలి. అన్ని దిశలలో వెళ్ళాలి. లోతుల్ని తాకాలి. మన చుట్టూ ఎంతో ప్రపంచముంది. దానిలో అగణితమైన మనుష్యులున్నారు. ఎన్నో సుందర దృశ్యాలున్నాయి. హృదయ విదారకమైన దృశ్యాలు వున్నాయి. వాటిని మన కళ్ళు పరిశీలిస్తాయి. మన దృష్టిని బట్టి ఒక బలమైన ముద్ర పడుతుంది. ఓ అనుభూతి.. కొన్ని భావనలు ఏర్పడతాయి. అవి ఏ రకంగా ఉంటాయి, ఏ స్థాయి లో ఉంటాయన్నది మన దృష్టి వల్ల ఏర్పడిన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఒక మల్లెమొగ్గ రేకులు విప్పుకుని, వికసించి తన పరిమళాన్ని నలుదిశలా వెదజల్లుతుంది. కొన్ని గంటల తరువాత వాడి.. రేకులు ఒక్కొక్కటిగా భూమి మీదకు విడుస్తూ పూర్తిగా నశించిపోతుంది. ఇది చాలా సహజం..అతి సాధారణం. ఇలా అనుకునే వారు మనలో చాలా మంది వుంటారు. ఇది ఒక దృష్టి. ఈ సహజ పరిణామాన్ని కొందరు జీవితానికి అన్వయించి లోతుగా ఆలోచిస్తారు. మనిషి జీవితం కూడ ఆ మల్లె పువ్వు లాగా అశాశ్వతమైనది. మనిషి ప్రాణం విడవక తప్పదని గ్రహించి మూన్నాళ్ళ ముచ్చటే ఈ జీవితమన్న ఎరుకతో దాన్ని మల్లెపువ్వులా పరిమళ భరితం చేసుకోవాలని చూసే దృష్టి మరికొందరిది. జీవితాని కొక విలువ.. సార్థకత తెచ్చుకోవాలని వారి వైఖరి. మంచితనంతోనే అది సాధ్యం. ఆ దృష్టే వారి పేరును.. వారు చేసిన పనులను ప్రజల మనస్సుల్లో తరతరాలు నిలిచిపోయేటట్లు చేస్తుంది. అపుడా మనస్సులు సుగంధ పారిజాతాలవుతాయి. ఇది నిశిత దృష్టి. శాశ్వతత్వానికి.. ఆశాశ్వతత్వానికి ఉన్న భేదాన్ని గుర్తెరిగే అద్భుత దృష్టి. చేపట్టే పనులు.. వ్యాపారాలలో కొందరి బుద్ధి కొత్త పుంతలు తొక్కుతుంది. రకరకాల మార్గాలలో అన్వేషణ చేస్తారు ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో కష్టిస్తారు. ఇది ఒక రకమైన దృష్టి. ఒక పుస్తకాన్ని చదివే క్రమంలో.. ఆకళింపు చేసుకోవటంలో కూడా దృష్టి వుంటుంది. పైపైన చదివి అర్ధం చేసుకునేవారు కొందరైతే, ఆ కనిపించే వాక్యాల అంతరార్థాన్ని పట్టుకునే యత్నం కొందరు చేస్తారు. ఈ దృష్టికలవారే రచయిత ఆలోచనను పట్టుకుని.. రచనలోని ఆత్మను చేరుకుంటారు. ఎంత లోతుగా వెళ్ళగలరో అంతవరకూ వెళ్ళగలరు. అంతే కాదు . వారి దృష్టి చెదరదు. తోవను వీడదు. చేర వలసిన చోటుకు చేరుకొని సఫలీకృతులవుతారు. తమ కాలానికి .. దూరంగా తమ ఆలోచనా దృష్టిని ప్రసరింప చేయగలిగే ప్రతిభా సంపన్నులు కొందరుంటారు. సమాజంలో అనేక రంగాలలో చోటు చేసుకునే అనేక పరిణామాలు భవిష్యత్తులో ఏ రూపాన్ని తీసుకుంటాయి... వాటి ప్రభావం ఎలా వుంటుంది, సమస్యలకు పరిష్కారం ఏమిటనే యోచనే వీరిది. ఈ దృష్టికే దార్శనికతని పేరు. వీరు నాయకులు కావచ్చు... సామాజిక విశ్లేషకులూ కావచ్చు.. వేదాంతులూ కావచ్చు. తమ చుట్టూ ఉన్న బాధార్తులు... దాహార్తుల గురించి ఆలోచించే వారుంటారు. వారందించే ఆపన్న హస్తం మానవత్వానికి చిహ్నం. కరుణకు సంకేతం. ఇది ఒక రకమైన దృష్టి. విద్యావేత్తలు విద్యావిధానాలను సమాజానికి కనుగుణంగా తయారు చేస్తారు. దాని కెంతో మేధోమధనం కావాలి. ఈ విద్యావిధానాలనే విత్తనాలు భవిష్యత్తులో ఫలానా విధంగా ఫలవంతమవుతాయనే అద్భుత ఊహాశక్తి, ఆలోచన... దృష్టి వల్లే సాధ్యమవుతాయి. ‘కేవలం చూవు మాత్రమే ఉండి.. దృష్టి లేనివాడు ఈ ప్రపంచంలో అతి దయనీయుడైన వ్యక్తి..’ అన్నారు హెలెన్ కెల్లర్. ఎంత అద్భుతమైన మాటలు! చూపు ఉన్నవారందరికి దృష్టి ఉండాలని కానీ.. చూపు లేనివారికి దృష్టి ఉండకూడదన్న నియమం గాని లేదన్న భావనను ఎంత బాగా చెప్పారో! నదిలో కొట్టుకుపోతున్నది ఆడ.. మగా అని కాక ఒక జీవి అన్న భావనలో రక్షించానన్న శిష్యుడి మాటల్లో.. రసవిహీనంగా ఉండి గంటపాటు సాగిన ఒక ఉపన్యాసాన్ని విని.. ఎలా మాట్లాడకూడదో నేర్చుకున్నానన్న వ్యక్తి మాటల్లో వ్యక్తమయ్యేది వారి దృష్టి మాత్రమే. అది ఎంత లోతైనదో.. స్పష్టమైనదో చూడండి. అటువంటి మనోనేత్రం మనకందరకూ కావాలి. దాన్ని అలవరచుకునే ప్రయత్నం చేయాలి. పొందాలి. దాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి. అలా కానట్లయితే అది పుస్తకాలనుండి నేర్చుకున్న జ్ఞానంలా మిగిలిపోతుంది. పుస్తకజ్ఞానాన్ని సందర్భానికి తగిన విధంగా, ఆపద్ధర్మంగా మంచి కోసం వాడుకోవాలి. దీనినే ఇంగిత జ్ఞానమంటారు. అలా వాడటానికి వివేచన అనే దృష్టి కావాలి. జీవితమంటే ఏమిటి.. దాని పథం ఏమిటో స్పష్టమైన దృష్టిని ఏర్పరచుకుని పయనించాలి. మనం నేర్చిన విద్య యొక్క సారాన్ని జీర్ణించుకోవాలి. జీవన క్రమంలో ఎదురయ్యే అనుభవాలను.. సత్యాలను పొదవుకోవాలి. అటువంటి జీవితం ఎటువంటి కుదుపులొచ్చినా అతలాకుతలమవ్వక ఒక ప్రశాంత స్థితిలో సాగుతుంది. మనం ప్రపంచాన్ని.. మనుష్యుల స్వభావాలను.. మనస్తతత్వాలను ఆకళింపు చేసుకున్న తీరు మన దృష్టికి దర్పణం. మన దృష్టి మన వ్యక్తిత్వాన్ని... ఆలోచనా విధానాన్ని... జీవిత దృక్పథాన్ని.. మనం జీవితాన్ని అర్థం చేసుకున్న తీరును తేటతెల్లం చేస్తుంది. దృష్టి ఆవశ్యకత ఏమిటి.. దాన్ని ఏర్పరచు కోవాలా అనే సందేహాలు వచ్చే వారుంటారు. దృష్టి మన జీవితాన్ని పరిపుష్టం చేస్తుంది. ఒక గౌరవం.. ఒక హుందాతనాన్నిస్తుంది. జీవితానికొక సమతౌల్యతనిస్తుంది. దృష్టి వ్యక్తి వికాసానికెంత అవసరమో... దేశవికాసానికి అంతే అవసరం. కేవలం చూవు మాత్రమే ఉండి.. దృష్టి లేనివాడు ఈ ప్రపంచంలో అతి దయనీయుడైన వ్యక్తి.. – లలితా వాసంతి -
మంచి మాట: ఆధ్యాత్మికత అంటే..?
‘దేవుణ్ణి మీరు చూశారా..?’ అని ప్రశ్నించాడో యువకుడు ఒక సాధకుణ్ణి. చురుకైన కళ్ళు.. తీక్షణమైన చూపులు. గిరజాల జుట్టు.. దానిలో కొన్ని వంకీలు అతని విశాల ఫాలభాగాన నర్తిస్తుండగా. ‘ఆ“చూసాను’. అన్నాడాయన చిరునవ్వుతో. ‘చూశారా..!?’ అన్నాడా యువకుడు తన అనుమానానికి అపనమ్మకాన్ని జోడిస్తూ. ‘చూశాను. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా’ అన్నాడాయన మరింత ప్రశాంతంగా నవ్వుతూ. ఆ మాటలకు ఆ యువకుడు విభ్రాంతుడే అయ్యాడు. ఆ సాధకుడి గొంతులో ధ్వనించిన విశ్వాసం.. నమ్మకం.. సూటిదనం.. అతణ్ణి ఒక నిమిషంపాటు ఆపాదమస్తకాన్ని కంపింప చేసింది. ఇంతకుముందు తను కలసిన సాధకుకులు.. యోగులు.. గురువులు... అందరూ కూడా దేవుణ్ణి చూడలేదనే చెప్పారు. ఆ దేవదేవుని సాక్షాత్కారానికి తపస్సు చేస్తూనే ఉన్నామన్నారు. ఒకవేళ ఒకరిద్దరు చూశామని చెప్పినా ఇంత గట్టిగా.. విశ్వాసంతో చెప్పలేదు. ఇందుకే ఆ వంగ దేశీయుడికి ఆ పరమహంస మీద గురి.. ఏర్పడింది. అందుకే ఆయనను గురువుగా అంగీకరించాడు. ఆ పై ఆ గురుశిష్యులిరువురూ ఎంత విశ్వవిఖ్యాతులయ్యారో లోకవిదితమే. దేవుణ్ణి చూశామన్న వారెవరైనా ఆయన భావనను, తత్వాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారని అర్థం. దేవుడి సర్వాంతర్యామిత్వ భావనను గ్రంథాలనుండి గ్రహించటమే కాదు, దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ సకల చరాచరసృష్టిలో ప్రతి జీవిలో చూడగలగటం. ప్రత్యక్షంగా చూసి అనుభవంగా చేసుకోవటమే కదా! ఆ పరమహంస.. నిన్ను చూసినంత బాగా చూశాను’ అని చెప్పటంలో అదే అర్థం. ‘ఇందు గలడందు లేడని సందేహం వలదు..’ అన్న పద్య సారాంశ మదే కదా. తన ఎదురుగా తను ఆరాధిస్తున్న విగ్రహమే దేముడు.. అయన ఉనికి ఇక్కడే.. ఈ నాలుగు గోడల మధ్యే అన్న ఆలోచనా పరిధి.. పరిమితులనుండి నుండి మనిషి బయటకు రానంతకాలం.. రాకూడదనుకున్నంత కాలం ఆ సర్వాంతర్యామిత్వాన్ని బుద్ధికే పరిమితం చేసుకున్నాడు. అంతే కానీ మనస్సులో ఆ భావనను ప్రతిష్టించుకోలేకపోయాడు. నిజమైన ఆధ్యాత్మికమార్గానికిది పెద్ద అవరోధం. భావన.. అనుభూతి.. దృష్టి ఈ మూడింటిని ఆధ్యాత్మికపథంలో పయనించాలనుకున్న వారు తప్పనిసరిగా అలవరచుకోవలసిన లక్షణాలు. అనేక శాస్త్రాలు.. కావ్యాలు.. వేదాంత గ్రంథాలు చదివిన ఓ పండితుడు గంగానదిలో స్నానమాచరించి తన పాప ప్రక్షాళన చేసుకోవాలన్న తన జీవితేచ్ఛను జీవిత చరమాంకంలో కాని తీర్చుకోలేకపోయాడు. ‘ఈ గంగానదికి పాపాలను పరిహరించే మహత్తు నిజంగా వుందా..? అన్న అనుమానం మదిలో మొలకె త్తింది. తత్ఫలితంగా సద్గతులు కొంచెం ఆలస్యంగా ప్రాప్తించాయి. కారణం..!? భావన, అనుభూతి. అయితే ఈ పండితుడి పలుకుల మీద విశ్వాసముంచి మామూలు నదిలో స్నానం చేసిన సాధారణ వ్యక్తి ఆ పండితుడికన్నా ముందుగా సద్గతులు పొందాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకునేవారికి ఉండవలసిన ప్రథమ లక్షణం భావన.. అనుభూతి.. విశ్వాసం. మన భౌతికావసరాలు, బాధ్యతలు నెరవేర్చటం కోసం ఏదో ఒక వృత్తినో .. ఉద్యోగాన్నో.. పొంది డబ్బు సంపాదించాలి. భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని పోషించాలి. ఇది ప్రధాన బాధ్యత. ఇది కాని జీవితం ఇంకేమైనా ఉందా? ఇదే జీవిత పరమార్థమా? మనిషి ఈ చింతన చేయటానికి తన అంతరంగంలోకి చూడగలగాలి. తన మనస్సును న్యాయాధీశుని చేసుకుని తను చేసే పనుల మంచి చెడులను ప్రశ్నించుకోవాలి. ఆలోచనలను, ప్రవర్తనను సింహావలోకనం చేసుకోవాలి. తను ఎంతవరకు నిజాయితీగా.. న్యాయబద్ధతతో.. ప్రవర్తిస్తున్నాడు? నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాడా..? ఎదుటివారికి చేయగలిగిన మేలు చేస్తున్నానని కీడు చేయటంలేదు కదా..! ఇటువంటి ప్రశ్నలు తానే తన మీద సంధించుకోవాలి. వీటికి సంతృప్తికరమైన సమాధానాలు ఎవరు పొందగలరో వారు నిస్సందేహంగా చక్కని, ఆదర్శవంతమైన జీవితాన్నే గడుపుతున్నట్టే. ఈ పరిశీలన.. శోధనకే అంతర్ముఖత్వమని పేరు. ఆధ్యాత్మికతకు ఇదొక ముఖ్యమైన లక్షణమే కాదు కాదు, ఖచ్చితంగా ఉండవలసినది. ఇది ఆస్తికులకైనా, నాస్తికులకైనా.. ఆ మాట కొస్తే మనిషన్న వాడికెవడికైనా వర్తిస్తుంది. ఏ మత విశ్వాసానికైనా అన్వయించుకోతగ్గది, అందరికీ అభిలషణీయమైనదీ మార్గం. ఈ అంతరంగ యానం.. లోచూపు ఎవరైతే అలవరచుకుంటారో వారు జీవితాన్ని సరిగా అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. సరైన రీతిలో మలచుకుంటున్నారని అర్థం. ధనం వల్ల ఇహంలో మనం పొందే భౌతికమైన, ఉన్నతస్థితి కాక.. ఇంకా ఎంతో ఉన్నతమైన స్థితికి చేరినట్టు. కొందరు భౌతికపరమైన విషయాలను పక్కకు పెట్టి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండి అంతర్ముఖులు కాబోతున్నామని ప్రకటనలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నం చేయనే చేయరు. మన మనస్సు తీరు.. గతి.. ఆలోచనా పద్ధతి.. మన వ్యక్తిత్వాన్ని ఒక అంచనా వేసుకుని మన జీవితాన్ని, మన ఆలోచనా ప్రవాహన్ని క్రమబద్దీ కరించుకునేందుకు మన మనస్సు చెప్పే సంగతులు తెలుసుకోవాలి. సరిగా లేకుంటే దిద్దుకోవాలి. ఇందుకు అంతర్ముఖత్వం ప్రతి ఒక్కరికీ అవసరం. మానవ మేధ, శక్తియుక్తులకు పరిధులు, పరిమితులున్నాయని, ఆ మానవాతీత శక్తి భగవంతుడని సర్వశక్తిమంతుడని. సర్వవ్యాపకుడని, అతడివల్లే ఇంతటి సృష్టి జరిగిందని భావించే వారున్నారు. వారు అతడినే కేంద్ర బిందువు చేసుకుని తమ అంతర్ముఖ ప్రయాణపు తొలి.. ఆఖరి అడుగు అతడితోనే ముగిస్తారు. కొందరు ప్రకృతి పరిణామక్రమంలో ఏర్పడ్డదీ సృష్టి అంటూ ఒక మానవాతీత శక్తి వుందని అంటారు. కానీ దాన్ని భగవంతుడుగా భావన చేయరు. వీరిరువురూ కూడ అంతర్ముఖత్వానికి పెద్దపీట వేస్తారు. మనిషి మహాత్ముడు కాకపోయినా మనిషి గా నిలబడటానికి ఇది అవసరమని ఇద్దరూ ఏకీభవిస్తారు. జీవితం అర్థవంతమైనదవ్వాలంటే ఇది అత్యంత అవసరమైనదని ఇద్దరూ అంగీకరిస్తారు. ఈ ఆధ్యాత్మిక చింతన లేదా అంతర్ముఖత్వం ఒక సత్యాన్వేషణ. ఒక సత్యశోధన. మనలోని చైతన్యాన్ని తెలుసుకోవటం. జీవితాన్ని అర్థం చేసుకుని, దాని పట్ల ఉన్న భయాందోళనలు తొలగి నిర్భయులమై స్వేచ్ఛానందాలను పొందాలంటే ప్రతి ఒక్కరూ అంతర్ముఖులు కావాలి. ఆధ్యాత్మిక చింతనంటే కేవలం భక్తి ఒక్కటే కాదు. దానికి భావన..అనుభూతి.. విశ్వాసం.. వీటిని చేర్చాలి. ఆధ్యాత్మికత అంటే పెదవులతో దేవుడి నామాన్ని పలకటమే కాదు. భగవంతుడి రూపాన్ని అన్నిచోట్లా.. అందరిలోనూ చూడగలగటం. మన ఆణువణువునా ఆ భావనను పొందుపరచుకోవటం. అపుడే మనం ఆయన సర్వాంతర్యామిత్వాన్ని విశ్వసించినట్టు! ఆధ్యాత్మికత అంటే మనం నమ్మిన దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ దశకు చేరు కోవటమంటే నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టే. ఆధ్యాత్మికత తొలి మెట్టు ఇదే కావాలి. భగవంతుని తత్వాన్ని మనసులో నిలుపుకుని తోటివారితో ఎవరైతే చక్కగా సంభాషిస్తారో... అభాగ్యుల.. అనాథల మీద కరుణ, ప్రేమ చూపిస్తారో.. కష్టాలలో ఉన్నవారిని ఆదుకుంటున్నారన్న విషయాలకు ఎవరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారో వారు నిజమైన ఆధ్యాత్మికపరులు. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
బిజినెస్ మ్యాగ్నెట్ అయినా సరే.. మండే పనంటే మొరాయించుడే
బిజినెస్ మ్యాగ్నెట్ అంటే నిత్యం ఎంతో బిజీగా ఉంటారు. కాలంతో పాటు పరుగులు తీస్తుంటారు. క్షణం కూడా వృధా చేయరు. రెండు వేల రూపాయల నోటు కింద పడితే ఆ నోటు తీస్తే ఒక్క క్షణం వేస్ట్ అవుతుందని ఫీలయ్యేంతగా పని చేస్తుంటారని మనం భావిస్తుంటాం. సినిమాల్లో దర్శకులు, పుస్తకాల్లో రచయితలు బిజినెస్ మ్యాగ్నెట్ పాత్రలను ఇలాగే మలుస్తూ వస్తున్నారు. కానీ నిజ జీవితంలో వాళ్లు సెకన్ల ముల్లుతో పోటీ పడుతూ పని చేస్తుంటారా ? ఈ విషయం తెలియాలంటే మనం బిజిగా ఉండే బిజినెస్‌మేన్‌లనే అడగాలి. కానీ మనకా కష్టం లేకుండానే కళ్లకు కట్టినట్టుగా చూపించారు ఇండియాలోనే బిజీయెస్ట్ బిజినెస్‌మేన్‌లలో ఒకరు పద్మ భూషణ్ ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇక వీకెండ్ వచ్చిందంటూ మరో లెవల్లో పోస్టులు చేస్తుంటారు. కాగా 2021 నవంబరు 15 సోమవారం ఉదయం ఆయన ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో నవ్వులూ పూయిస్తోంది. కేరళాలో జరిగిన ఆఫ్ రోడ్ ర్యాలీలో ఓ జీపు బురదగుంటలో చిక్కుకుని ముందుకు కదిలేందుకు మొరాయిస్తుంటే అందులో ఉన్న డ్రైవరు, పక్కన ఉన్న వ్యక్తులు ఆ జీపు ముందుకు వెళ్లేలా సహకరిస్తూ ఉత్సహపరుస్తుంటారు. ఈ వీడియోను ఉదహరిస్తూ మండే మార్నింగ్ పని చేయాలంటే ఇలాంటి ఫీలింగే కలుగుతుందంటూ ట్విస్ట్ ఇచ్చారు. -
కార్లో తేలినట్టుందే...
గాల్లో కాదు నీళ్లల్లో! ఏకంగా సముద్రంలోనే తేలే సొరంగం ఇది. ఆ సొరంగంలో కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణించవచ్చు... కార్లో తేలిపోవచ్చు. మీరు ఫై లవోవర్లు చూసుంటారు. సస్పెన్షన్ బ్రిడ్జిలు, కొండల్ని తొలిచి కట్టిన టన్నెల్స్నీ చూసుంటారు. కానీ ఫొటోలో కనిపిస్తోందే.. అది అండర్‌వాటర్ బ్రిడ్జి. ఇది ప్రపంచంలోనే తొలి తేలియాడే బ్రిడ్జి కూడా. నార్వే దేశంలో కట్టనున్నారు ఈ హైటెక్ బ్రిడ్జీని. భలే అందంగా ఉంటుందీ దేశ సముద్రతీర ప్రాంతం! తీరం వెంబడి కొండలు, కోనలు.. బ్యాక్‌వాటర్స్ అబ్బో అదరహో అనుకోండి! అయితే ఓ చిక్కుంది. ఈ తీరం వెంబడి ఒక పక్క నుంచి ఇంకోపక్కకు వెళ్లాలంటే బోలెడు కష్టం. కొంతదూరం రోడ్డుపై మరికొంత దూరం పెద్దపెద్ద నౌకలపై మళ్లీ కొంత దూరం రోడ్డుపై ప్రయాణించాలి. ఆ దాందేముంది.. ఎక్కడికక్కడ బ్రిడ్జీలు కట్టేయవచ్చు కదా అనుకోవద్దు. అక్కడున్న నేల స్వభావానికీ, బ్యాక్‌వాటర్ చానెళ్ల వెడల్పుకూ బ్రిడ్జీలు కట్టడం అసాధ్యమని తేల్చేశారు. దీంతో నార్వే పబ్లిక్ రోడ్స్ కంపెనీ ఈ అండర్‌వాటర్ సస్పెన్షన్ సొరంగం ఆలోచనకు శ్రీకారం చుట్టింది. సముద్రంలో దాదాపు వంద అడుగుల లోతులో ఉండే ఈ సొరంగాలను బలమైన సిమెంట్ దిమ్మెల సాయంతో వేలాడదీస్తారు. ఫలితంగా నీటిపైన ఈ దిమ్మెల మధ్యలో నౌకలు, ఫెర్రీలు మామూలుగా ప్రయాణించవచ్చునన్నమాట. కొండలకు రెండు పక్కల బలమైన ఉక్కుతాళ్లతో సొరంగాలను అనుసంధానిస్తారు. దాదాపు 4000 అడుగుల పొడవైన సొరంగాన్ని కట్టేందుకు 2500 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందట. అన్నీ సవ్యంగా సాగితే మరో 19 ఏళ్లకు నిర్మాణం పూర్తవుతుందని అంచనా! -
కాఫీ విత్ ఫీలింగ్
పెదగంట్యాడ: ఒకప్పటి ప్రేమ వ్యక్తం చెయ్యడానికి పావురాలు, శునకాలు, ఇతరత్రా ప్రాణులు పనికొచ్చేవి( అవి రాజుల కాలం), 1980లో లెటర్లు, తర్వాత గ్రీటింగ్ కార్డులు, తర్వాత గిఫ్ట్‌లు పుట్టుకొచ్చాయి. ఎప్పుడైనా ఒక కొత్త పద్ధతి పుట్టిందంటే కొద్ది రోజులకే అది పాతబడుతుంది. ఇప్పుడున్న నెట్ లోకంలో ప్రేమ వ్యక్తీకరణ చాలా ఈజీ అయిపోయింది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్‌లో చెప్పేసుకుంటున్నారు. ట్రెండ్ ఎప్పుడూ కొత్తగానే ఉండాలి. అలా పుట్టుకొచ్చిన కొత్త వేదిక కాఫీ షాప్.... ఇప్పుడు ప్రేమను వ్యక్తం చేయడానికి, పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి దేనికైనా ఒక్క కాఫీ సరిపోతుంది. ఎందుకంటే మన మనసులోని ఫీలింగ్స్‌ను కాఫీషాప్‌లో డిజైనర్‌కు చెబితే ఫోమ్‌తో అందంగా బొమ్మవేసి కాఫీ పంపిస్తాడు. ఈ ట్రెండ్ విదేశాల్లో ఉన్నా విశాఖలో కొత్తదే. ఎక్కువ మంది యూత్ ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. కాలేజ్ జంటలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ అందరూ కాఫీ అంటే పడిపోతారు. అందుకే కుదిరితే కప్పు కాఫీ డైలాగ్ అంత పాపులర్ అయిపోయింది. ఇక కాఫీ ఫోమ్‌తో చేసే మ్యాజిక్ గురించి చెప్పాలంటే ముందుగా కాఫీపై తయారు చేసిన డిజైన్స్ గురించి తెలియాలి. అందులో అంత స్పెషల్ ఏమీ ఉండదు. చిక్కగా ఉన్న పాలను కాఫీలో సున్నితంగా వేసి కలపడం ద్వారా సష్టించే డిజైన్లే స్పెషాలిటీ చిక్కగా ఉన్న బ్లాక్ కాఫీలో వైట్ మిల్క్‌ను మెల్లగా వేసి పైన కొంచెం మిల్క్ ఫోమ్‌తో డిజైన్ చేస్తారు. దీనికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఉండకపోయినా కాఫీ తయారు చేసే వ్యక్తి సజనాత్మకత ఆధారంగా కొత్త డిజైన్లు పుట్టుకొస్తాయి. ప్రస్తుతం మెనూ కార్డ్ సైతం మారిపోయింది. ఇంతకు ముందు క్యాపుచినో, ఎక్స్‌ప్రెస్సో, కోల్డ్ కాఫీ వంటివి ఉండేవి ప్రస్తుతం క్యాపిచినో ఆర్డర్ చెబితే మెనూ ఇచ్చి ఇందులో ఏ డిజైన్ కావాలో సెలక్ట్ చేసుకోమనే పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాఫీ ధర మినిమం 80 రూపాయల నుంచి 250 రూపాయల వరకూ ఉంది. డిజైన్ కోసం ఏమీ చార్జ్ చెయ్యరు కాని మన భావాలు అవతలి వ్యక్తులతో షేర్ చేయాలంటే ఇప్పుడు కాఫీ ద్వారా సందేశం ఇస్తున్నారు. కాఫీషాప్‌లో కాఫీకి మన ఇంట్లో కాఫీకి తేడా ఎక్కడ వస్తుందంటే మనం పొడిని వాడతాం. వాళ్లు గింజల్ని బ్లెండ్ చేసి కాఫీలో కలుపుతారు. ఎక్కువగా బెంగళూరులో పండే అరబికా అనే గింజలే టేస్ట్‌కు ప్రత్యేక కారణం. ఏది ఏమైనా కాఫీలో వస్తున్న మార్పులు మరి కొన్ని రోజులు అయితే ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. అందుకే ముందుగా ఆలోచించడం మానేసి కాఫీ తాగండి డిజైన్ ప్రాక్టీస్ చెయ్యాలంటే ముందుగా మిల్క్ ఫోమ్‌ను సిద్ధం చేసుకోండి. -
ఉతికి ఆరేసినచో...
కొందరు నవ్వించడానికి రకరకాల ప్రయత్నిస్తారు. వారి వీర ప్రయత్నాలను చూసి మనకు నీరసం వస్తుంది తప్ప నవ్వు మాత్రం రాదు. అయితే కొందరు పెద్దగా ఏ ప్రయత్నమూ చేసినట్లు కనిపించరు. మౌనంగా నవ్వుల మంత్రదండాన్ని తిప్పుతారు. అంతే! మనకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది. ఈ రెండో కోవకు చెందినవాడు ఇరాన్ కార్టూనిస్ట్ మెహదీ అలిబెజీ. ఆయన వర్ణరేఖలు ఎలాంటి శబ్దాడంబరం లేకుండానే గిలిగింతలు పెడతాయి. ఇరాన్లో అడుగు పెట్టగానే కళా హృదయులకు ‘కార్టూన్ల దేశం’లో అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. అంతటా మహామహులు కనిపిస్తూనే ఉంటారు. ఒకరిని చూసి ‘మహాను భావా మీ కార్టూన్ ఉంది చూశారూ’ అనేలోపే అభిమాన కార్టూనిస్ట్ మరెవరో కనిపిస్తూనే ఉంటారు. ఆ దేశం నిండా అంత గొప్ప కార్టూనిస్టులన్నారు మరి. వాళ్లలో ఒకరు మెహదీ. మెహదీ హసన్ గజల్స్ వింటుంటే, అమృతం పరవళ్లు తొక్కుతున్న అనుభూతి కలుగుతుంది. మెహదీ హసన్ రేఖల్లో నవ్వులగంగ ఉప్పొంగిపోతుంది. ‘భాషతో నీకు పనిలేదు’ అన్నట్టుగా ఒక్క అక్షరం లేకుండానే అందమైన కార్టూన్లను అందించిన గొప్ప కార్టూనిస్టు మెహదీ. సామాజిక, రాజకీయ అంశాలే కాదు... ఆయన ఆయన దృష్టి నుంచి ఏ ఒక్క విషయమూ తప్పిపోదు. ‘రవి గాంచని చోటు కవిగాంచును’ అన్న నానుడిని, ‘కవి గాంచని చోటును సైతం కార్టూనిస్ట్ గాంచును’ అని మార్చేశారు మెహదీ! పందొమ్మిదో ఏట నుంచి నవ్వులు పూయిస్తున్న మెహదీ... ఇప్పుడు ఓ పే....ద్ద నవ్వుల తోటకు యజమాని. ఆ తోటలో పూసిన ఒక పువ్వు ఇది. దాని హాస్య పరిమళాన్ని హాయిగా ఆస్వాదించండి! -
అలాంటివాడే కావాలి!
పెళ్లి కాని అమ్మాయిలు తమకు కాబోయే భర్త ఎలాంటివాడైతే బాగుంటుందో ఊహించుకుంటుంటారు. బాలీవుడ్ కథానాయిక సోనమ్‌కపూర్ అప్పుడప్పుడూ ఆ ఊహల్లోనే మునిగి తేలుతున్నారు. కాబోయే భర్త ఎలా ఉండాలో ఓ లిస్ట్ కూడా రాసుకున్నారు. ఇలాంటివాడైతేనే బాగుంటుందనే క్లారిటీ తనకు పుస్తకాలు చదవడం వల్లే వచ్చిందంటున్నారు. ఇక, తను పెళ్లాడాలనుకునే వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలో సోనమ్ చెబుతూ - ‘‘ప్రేమకు స్థాయి ముఖ్యం కాదని చాలామంది అంటుంటారు. నా దృష్టిలో స్థాయి ముఖ్యమే. అందుకే నా స్టేటస్‌కి తగ్గవాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మాకన్నా తక్కువ స్థాయి వ్యక్తిని చేసుకుంటే అడ్జస్ట్ కావడం కష్టం. నా స్టేటస్‌కి మించినవాడైనా కష్టమే. ప్రాక్టికల్‌గా ఆలోచించి చెబుతున్న మాట ఇది. ఒకే స్థాయికి చెందిన అమ్మాయీ, అబ్బాయీ పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో ఏ సమస్యలూ రావని నా ఫీలింగ్. సోనమ్ డబ్బుకి విలువ ఇస్తుందని ఎవరైనా అనుకుంటే నో ప్రాబ్లమ్. ఎవరి అభిప్రాయం వాళ్లది. అయితే డబ్బుతో పాటు మంచి మనసున్న వ్యక్తిని పెళ్లాడాలనుకుంటున్నా. బంధాల మీద కూడా అతనికి నమ్మకం ఉండాలి’’ అన్నారు. -
టెంకాయ మీది పీచు... తలకాయ మీది కుచ్చు!
హ్యూమర్ ‘‘ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో కదా... ఆ చెట్టు మీది కాయనూ, ఈ నేల కింది ఉప్పునూ కలిపాడు కదా’’ అంటూ పచ్చడి తింటూ తన్మయత్వంతో పొంగిపోతూ అన్నాను నేను. చెట్టు ఒక చివరన చిటారుకొమ్మన ఉండే మామిడికాయకూ, నేలకు మరో చివరన ఉండే సముద్రంలోని ఉప్పురాయికీ సంబంధం కుదిర్చిన భగవంతుడి మీద అపారమైన గౌరవం కలిగింది నాకు. బయటికి అంటున్న ఆ మాటలు మా బుజ్జిగాడి చెవిన పడ్డాయి. అంతే... వాడు వెంటనే నా మాటలకు వంత పాడాడు. ‘‘అవున్నాన్నా.. ఆ కలయిక చాలా గొప్పది. ఆవకాయ తిని నువ్వూ, తినకుండానే అమ్మా... ఇద్దరూ ఒకేలా ఫీలవుతున్నారు’’ అన్నాడు. వాడన్న మాటతో నాకు కాస్త గర్వభంగం కలిగిన ఫీలింగ్ వచ్చింది. మా బుజ్జిగాడు కాస్త వంకర్ టింకర్గా ఆలోచిస్తుంటాడు. కానీ నేనో స్ట్రెయిట్ అండ్ గ్రేట్ థింకర్‌ను. మరి అంత మేధావినైన నేనూ, మా ఆవిడా ఒకేలా ఆలోచించడం ఏమిటి? పైగా నా తత్వమే గొప్పదని నా నమ్మకం. కడు సామాన్యురాలైన మా ఆవిడకూ నా అంతటి తాత్విక భావన ఉందంటే నాకెందుకో అంతగా రుచించలేదు. అయినా ఈ ఫీలింగ్‌ను కప్పిపెట్టుకున్నాను. కానీ నోటిని కట్టిపెట్టుకోలేక... ‘‘అమ్మకు ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందిరా’’ అని వాణ్ణి అడిగాను. ‘‘పచ్చడితో నీకు వచ్చిన ఫీలింగే అమ్మకూ వచ్చింది నాన్నా. ‘కొబ్బరి చెట్టు చివరన ఉండే కాయ మీది పీచునూ, ఈ నేల లోపల్నుంచి వచ్చే స్టీలునూ కలిపిన దేవుడెంతటి గొప్పవాడో కదా’ అంది అమ్మ. ఈ మాటల్ని అంట్లుతోముతున్న టైమ్‌లో అమ్మ అంటూ ఉంటుంది నాన్నా’’ అన్నాడు వాడు. నేను నేలను తాకే సముద్రం వరకు ఆలోచించా. కానీ మా ఆవిడ నేల లోపలికి కూడా వెళ్లింది. స్టీలు ఖనిజాన్ని తవ్వి తీసినట్లు, జ్ఞానాన్ని భూమి లోపలి పొరల్లోంచి పెకిలించి, పైకి తీసుకొచ్చింది. తద్వారా జ్ఞానాన్ని నాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కాకుండా, మరీ అండర్‌గ్రౌండ్ లెవెల్ నుంచి కనిపెట్టింది మా ఆవిడ. అంత ప్రాక్టికల్‌గా కనిపెట్టిన మా ఆవిడ జ్ఞానాన్ని ఒప్పుకోవాలంటే నాకు అహం అడ్డువచ్చింది. ‘‘నాలాగే ఆలోచించిందంటున్నావు నువ్వు. తనదీ అనుభవం నుంచి వచ్చిన పరిజ్ఞానమే అనుకో. కాకపోతే నా అంత కాదు. ఎందుకంటే మీ అమ్మది స్టీలు జ్ఞానం. నాలాగా ఆమెకు టేస్టు లేదు. కానీ నాది మామిడి తిన్న మధురానుభవం. గుర్తుపెట్టుకో. పీచు కంటే పికిల్ గొప్ప’’ అన్నాను. ‘‘నీకు జ్ఞానం రాకముందే అమ్మకు కలిగిన ఫీలింగే నాకూ వచ్చింది’’ అన్నాడు వాడు నా అహం మీద మరో దెబ్బ కొడుతూ. అయితే... వాడికీ జ్ఞానం వచ్చిందనగానే అమితమైన ఆనందం కలిగింది నాకు. నాకు పెద్దయ్యాక గానీ రాని నాలెడ్జీ వాడికి ఇంత చిన్నప్పుడే ఎలా వచ్చిందో అన్న ఆసక్తి కలిగింది. ఎంతైనా వాడు నా కొడుకు. నా హృదయం ఉప్పొంగింది. అలా పొంగిపోతూనే ఆరా తీశాను. ‘‘ఇంత చిన్నప్పుడే నీకు ఈ అనుభవం ఎలా కలిగిందిరా’’ ఇన్నర్‌గా ఇంటరెస్ట్ పుట్టి అడిగా. ‘‘నీకు మామిడికాయ నుంచి, అమ్మకు కొబ్బరికాయ నుంచి, నాకు తలకాయ మీద నుంచి ఈ నాలెడ్జి వచ్చింది నాన్నా! తల మీదికి చేరిందని జుట్టు విర్రవీగకూడదు. ఎందుకంటే తలమీద కుచ్చులా పెరిగినా, టెంకాయ మీద పీచులా చివరకు చేరాల్సింది నేల మీదికే’’ అన్నాడు వాడు. మా బుజ్జిగాడికి పుట్టెంటికలు తీయడం కాస్త లేటయ్యింది. దాంతో ఈమధ్యే వాడికి ఊహతెలిశాక గుండు చేయించాం. గుండు గొరుగుతున్నంత సేపూ వెంట్రుకలు మీద పడుతూ ఉన్నంతసేపూ చికాకు పడుతూనే ఉన్నాడు వాడు. అయితే నాకో విషయంలో సంతోషం కలిగింది. జుట్టు రాలిపోయాక వాడి అందం తాత్కాలికంగా దెబ్బతింది. కానీ దానివల్ల మా బుజ్జిగాడి మనసులో జ్ఞాన రోమాలు మొలిచాయని తెలిసి నా రోమాలు నిక్కబొడిచాయి. వెంట్రుకలు పీచులా రాలితేనేమి? జ్ఞానపు కుదుళ్లు వాడి తలకాయ మీదే ఉన్నాయి కదా! మరోమారు నా తండ్రి హృదయం పులకించింది. జ్ఞాన సముపార్జనకు అవకాశమిచ్చిన కొబ్బరిపీచుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాను. ‘‘మామిడికాయ, టెంకాయ, తలకాయ; తలపై కుచ్చూ... గిన్నెకు పీచూ. ఇంటి మూలలో చీపురుకట్టా... చెట్టు చివరన టెంకాయ కొబ్బరి మట్టా... కావేవీ జ్ఞాన సముపార్జనకు అనర్హం’’ అంటూ ప్రజలందరి గుండెలూ పీచుపీచుమనేలా ఒక చారిత్రక ప్రకటన కూడా చేసేశాను. - యాసీన్ ‘‘ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో కదా... ఆ చెట్టు మీది కాయనూ, ఈ నేల కింది ఉప్పునూ కలిపాడు కదా’’ అంటూ పచ్చడి తింటూ తన్మయత్వంతో పొంగిపోతూ అన్నాను నేను. చెట్టు ఒక చివరన చిటారుకొమ్మన ఉండే మామిడికాయకూ, నేలకు మరో చివరన ఉండే సముద్రంలోని ఉప్పురాయికీ సంబంధం కుదిర్చిన భగవంతుడి మీద అపారమైన గౌరవం కలిగింది నాకు. బయటికి అంటున్న ఆ మాటలు మా బుజ్జిగాడి చెవిన పడ్డాయి. అంతే... వాడు వెంటనే నా మాటలకు వంత పాడాడు. ‘‘అవున్నాన్నా.. ఆ కలయిక చాలా గొప్పది. ఆవకాయ తిని నువ్వూ, తినకుండానే అమ్మా... ఇద్దరూ ఒకేలా ఫీలవుతున్నారు’’ అన్నాడు. వాడన్న మాటతో నాకు కాస్త గర్వభంగం కలిగిన ఫీలింగ్ వచ్చింది. మా బుజ్జిగాడు కాస్త వంకర్ టింకర్గా ఆలోచిస్తుంటాడు. కానీ నేనో స్ట్రెయిట్ అండ్ గ్రేట్ థింకర్‌ను. మరి అంత మేధావినైన నేనూ, మా ఆవిడా ఒకేలా ఆలోచించడం ఏమిటి? పైగా నా తత్వమే గొప్పదని నా నమ్మకం. కడు సామాన్యురాలైన మా ఆవిడకూ నా అంతటి తాత్విక భావన ఉందంటే నాకెందుకో అంతగా రుచించలేదు. అయినా ఈ ఫీలింగ్‌ను కప్పిపెట్టుకున్నాను. కానీ నోటిని కట్టిపెట్టుకోలేక... ‘‘అమ్మకు ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందిరా’’ అని వాణ్ణి అడిగాను. ‘‘పచ్చడితో నీకు వచ్చిన ఫీలింగే అమ్మకూ వచ్చింది నాన్నా. ‘కొబ్బరి చెట్టు చివరన ఉండే కాయ మీది పీచునూ, ఈ నేల లోపల్నుంచి వచ్చే స్టీలునూ కలిపిన దేవుడెంతటి గొప్పవాడో కదా’ అంది అమ్మ. ఈ మాటల్ని అంట్లుతోముతున్న టైమ్‌లో అమ్మ అంటూ ఉంటుంది నాన్నా’’ అన్నాడు వాడు. నేను నేలను తాకే సముద్రం వరకు ఆలోచించా. కానీ మా ఆవిడ నేల లోపలికి కూడా వెళ్లింది. స్టీలు ఖనిజాన్ని తవ్వి తీసినట్లు, జ్ఞానాన్ని భూమి లోపలి పొరల్లోంచి పెకిలించి, పైకి తీసుకొచ్చింది. తద్వారా జ్ఞానాన్ని నాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కాకుండా, మరీ అండర్‌గ్రౌండ్ లెవెల్ నుంచి కనిపెట్టింది మా ఆవిడ. అంత ప్రాక్టికల్‌గా కనిపెట్టిన మా ఆవిడ జ్ఞానాన్ని ఒప్పుకోవాలంటే నాకు అహం అడ్డువచ్చింది. ‘‘నాలాగే ఆలోచించిందంటున్నావు నువ్వు. తనదీ అనుభవం నుంచి వచ్చిన పరిజ్ఞానమే అనుకో. కాకపోతే నా అంత కాదు. ఎందుకంటే మీ అమ్మది స్టీలు జ్ఞానం. నాలాగా ఆమెకు టేస్టు లేదు. కానీ నాది మామిడి తిన్న మధురానుభవం. గుర్తుపెట్టుకో. పీచు కంటే పికిల్ గొప్ప’’ అన్నాను. ‘‘నీకు జ్ఞానం రాకముందే అమ్మకు కలిగిన ఫీలింగే నాకూ వచ్చింది’’ అన్నాడు వాడు నా అహం మీద మరో దెబ్బ కొడుతూ. అయితే... వాడికీ జ్ఞానం వచ్చిందనగానే అమితమైన ఆనందం కలిగింది నాకు. నాకు పెద్దయ్యాక గానీ రాని నాలెడ్జీ వాడికి ఇంత చిన్నప్పుడే ఎలా వచ్చిందో అన్న ఆసక్తి కలిగింది. ఎంతైనా వాడు నా కొడుకు. నా హృదయం ఉప్పొంగింది. అలా పొంగిపోతూనే ఆరా తీశాను. ‘‘ఇంత చిన్నప్పుడే నీకు ఈ అనుభవం ఎలా కలిగిందిరా’’ ఇన్నర్‌గా ఇంటరెస్ట్ పుట్టి అడిగా. ‘‘నీకు మామిడికాయ నుంచి, అమ్మకు కొబ్బరికాయ నుంచి, నాకు తలకాయ మీద నుంచి ఈ నాలెడ్జి వచ్చింది నాన్నా! తల మీదికి చేరిందని జుట్టు విర్రవీగకూడదు. ఎందుకంటే తలమీద కుచ్చులా పెరిగినా, టెంకాయ మీద పీచులా చివరకు చేరాల్సింది నేల మీదికే’’ అన్నాడు వాడు. మా బుజ్జిగాడికి పుట్టెంటికలు తీయడం కాస్త లేటయ్యింది. దాంతో ఈమధ్యే వాడికి ఊహతెలిశాక గుండు చేయించాం. గుండు గొరుగుతున్నంత సేపూ వెంట్రుకలు మీద పడుతూ ఉన్నంతసేపూ చికాకు పడుతూనే ఉన్నాడు వాడు. అయితే నాకో విషయంలో సంతోషం కలిగింది. జుట్టు రాలిపోయాక వాడి అందం తాత్కాలికంగా దెబ్బతింది. కానీ దానివల్ల మా బుజ్జిగాడి మనసులో జ్ఞాన రోమాలు మొలిచాయని తెలిసి నా రోమాలు నిక్కబొడిచాయి. వెంట్రుకలు పీచులా రాలితేనేమి? జ్ఞానపు కుదుళ్లు వాడి తలకాయ మీదే ఉన్నాయి కదా! మరోమారు నా తండ్రి హృదయం పులకించింది. జ్ఞాన సముపార్జనకు అవకాశమిచ్చిన కొబ్బరిపీచుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాను. ‘‘మామిడికాయ, టెంకాయ, తలకాయ; తలపై కుచ్చూ... గిన్నెకు పీచూ. ఇంటి మూలలో చీపురుకట్టా... చెట్టు చివరన టెంకాయ కొబ్బరి మట్టా... కావేవీ జ్ఞాన సముపార్జనకు అనర్హం’’ అంటూ ప్రజలందరి గుండెలూ పీచుపీచుమనేలా ఒక చారిత్రక ప్రకటన కూడా చేసేశాను. - యాసీన్