మంచి మాట: దృష్టి.. ఒక జీవిత పథం | Best Way to Create a Vision for the Life sakshi special | Sakshi
Sakshi News home page

మంచి మాట: దృష్టి.. ఒక జీవిత పథం

Published Mon, Jul 4 2022 12:14 AM | Last Updated on Mon, Jul 4 2022 12:14 AM

Best Way to Create a Vision for the Life sakshi special - Sakshi

‘ఇతరులకు గోచరం కానిది చూడగలగటమే దృష్టి అంటే...’’ అన్నాడు ప్రముఖ ఆంగ్ల నవలా రచయిత జోనాథన్‌ స్విఫ్ట్‌. ఎవరూ చూడలేని వైపు ఆలోచనా దృష్టిని ప్రసరింప చేయగలగటమే దృష్టి. చాలా మందికి తట్టని ఆలోచన ఒకరికి తట్టడం, ఒక నిశితమైన చూపు. దృష్టి ఒక శోధన, అన్వేషణ, దార్శనికత, సృజన, సంస్కారం, అద్భుత ఊహ. ఒక జీవిత పథం.

చర్మ చక్షువులు మనకి బాహ్య దృష్టిని మాత్రమే ఇస్తాయి. దానివల్ల ఈ  సమస్త ప్రపంచాన్ని  చూడగలం. దీనిని కేవలం చూపు అంటాం. మనం చూసే ప్రపంచాన్ని, దాని పోకడను, వైఖరిని , వర్తనను చూపిస్తున్న మన నయనానికి ఆలోచనను కలిపి చూడటమే అంతర దృష్టి. దీనినే మనోనేత్ర మంటాం. ఈ దృష్టి కొందరికి సహజం. కొందరికి చదువు వల్ల వస్తుంది. ఇంకొందరికి  జీవితం నేర్పుతుంది. సాధన వల్ల కూడ సాధ్యమే.

మస్తిష్క సాగరంలో వచ్చే ఆలోచనా తరంగాలను దాటి చాలా లోతుగా వెళ్ళటం దృష్టే.
మనకందరకూ ఆలోచనలు వస్తాయి. కొన్ని క్లిష్టమైన సందర్భాలలో, సమస్యల విషయంలో మనం తీవ్రంగా యోచించి పరిష్కారం లేదా సమాధానం కనుక్కోవలసివస్తుంది. అప్పుడు ఒక పరిధి.. పరిమితి లేకుండా ప్రసరించే మన ఆలోచనా కిరణాలను సమీకరించుకుని ఒక చోట కేంద్రీకృతం చేయాలి. ఇలా అందరూ చేయలేరు. మనలో కొందరికే ఆ శక్తి సామర్థ్యాలుంటాయి. వారు సమస్య మూలాలలోకి తమ దృష్టిని ప్రవహింప చేయగలరు. అపుడది శక్తిమంతమై మనం వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం దొరికేటట్టు చేస్తుంది. మన దృష్టిని సమస్య అన్ని కోణాలవైపు చొప్పించాలి. అన్ని దిశలలో వెళ్ళాలి. లోతుల్ని తాకాలి.

మన చుట్టూ ఎంతో ప్రపంచముంది. దానిలో అగణితమైన మనుష్యులున్నారు. ఎన్నో సుందర దృశ్యాలున్నాయి. హృదయ విదారకమైన దృశ్యాలు వున్నాయి. వాటిని మన కళ్ళు పరిశీలిస్తాయి.
మన దృష్టిని బట్టి ఒక బలమైన ముద్ర పడుతుంది. ఓ అనుభూతి.. కొన్ని భావనలు ఏర్పడతాయి. అవి ఏ రకంగా ఉంటాయి,  ఏ స్థాయి లో ఉంటాయన్నది మన దృష్టి వల్ల ఏర్పడిన సంస్కారాన్ని బట్టి ఉంటుంది.

ఒక మల్లెమొగ్గ రేకులు విప్పుకుని, వికసించి తన పరిమళాన్ని నలుదిశలా వెదజల్లుతుంది. కొన్ని గంటల తరువాత వాడి.. రేకులు ఒక్కొక్కటిగా భూమి మీదకు విడుస్తూ పూర్తిగా నశించిపోతుంది. ఇది చాలా సహజం..అతి సాధారణం. ఇలా అనుకునే వారు మనలో చాలా మంది వుంటారు. ఇది ఒక దృష్టి. ఈ సహజ పరిణామాన్ని కొందరు జీవితానికి అన్వయించి లోతుగా ఆలోచిస్తారు. మనిషి జీవితం కూడ ఆ మల్లె పువ్వు లాగా అశాశ్వతమైనది. మనిషి ప్రాణం విడవక తప్పదని  గ్రహించి మూన్నాళ్ళ ముచ్చటే ఈ జీవితమన్న ఎరుకతో దాన్ని మల్లెపువ్వులా పరిమళ భరితం చేసుకోవాలని చూసే దృష్టి మరికొందరిది. జీవితాని కొక విలువ.. సార్థకత  తెచ్చుకోవాలని వారి వైఖరి. మంచితనంతోనే అది సాధ్యం. ఆ దృష్టే వారి పేరును..  వారు చేసిన పనులను ప్రజల మనస్సుల్లో తరతరాలు నిలిచిపోయేటట్లు చేస్తుంది. అపుడా మనస్సులు సుగంధ పారిజాతాలవుతాయి. ఇది నిశిత దృష్టి. శాశ్వతత్వానికి.. ఆశాశ్వతత్వానికి ఉన్న భేదాన్ని  గుర్తెరిగే అద్భుత దృష్టి.

చేపట్టే పనులు.. వ్యాపారాలలో కొందరి బుద్ధి కొత్త పుంతలు తొక్కుతుంది. రకరకాల మార్గాలలో అన్వేషణ చేస్తారు ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో కష్టిస్తారు. ఇది ఒక రకమైన దృష్టి. ఒక పుస్తకాన్ని చదివే క్రమంలో.. ఆకళింపు చేసుకోవటంలో కూడా దృష్టి వుంటుంది. పైపైన  చదివి అర్ధం చేసుకునేవారు కొందరైతే, ఆ కనిపించే వాక్యాల అంతరార్థాన్ని పట్టుకునే యత్నం కొందరు చేస్తారు. ఈ దృష్టికలవారే రచయిత ఆలోచనను పట్టుకుని.. రచనలోని ఆత్మను చేరుకుంటారు. ఎంత లోతుగా వెళ్ళగలరో అంతవరకూ వెళ్ళగలరు. అంతే కాదు . వారి దృష్టి చెదరదు. తోవను వీడదు. చేర వలసిన చోటుకు చేరుకొని సఫలీకృతులవుతారు.

తమ కాలానికి .. దూరంగా తమ  ఆలోచనా దృష్టిని ప్రసరింప చేయగలిగే ప్రతిభా సంపన్నులు కొందరుంటారు. సమాజంలో అనేక రంగాలలో చోటు చేసుకునే అనేక పరిణామాలు భవిష్యత్తులో  ఏ రూపాన్ని తీసుకుంటాయి... వాటి ప్రభావం ఎలా వుంటుంది, సమస్యలకు పరిష్కారం ఏమిటనే యోచనే వీరిది. ఈ దృష్టికే దార్శనికతని పేరు. వీరు  నాయకులు కావచ్చు... సామాజిక విశ్లేషకులూ కావచ్చు.. వేదాంతులూ కావచ్చు.

తమ చుట్టూ ఉన్న బాధార్తులు... దాహార్తుల గురించి ఆలోచించే వారుంటారు. వారందించే  ఆపన్న హస్తం మానవత్వానికి చిహ్నం. కరుణకు సంకేతం. ఇది ఒక రకమైన దృష్టి. విద్యావేత్తలు విద్యావిధానాలను సమాజానికి కనుగుణంగా తయారు చేస్తారు. దాని కెంతో మేధోమధనం కావాలి. ఈ విద్యావిధానాలనే విత్తనాలు భవిష్యత్తులో ఫలానా విధంగా ఫలవంతమవుతాయనే అద్భుత ఊహాశక్తి, ఆలోచన... దృష్టి వల్లే సాధ్యమవుతాయి.

‘కేవలం చూవు మాత్రమే ఉండి.. దృష్టి లేనివాడు ఈ ప్రపంచంలో అతి దయనీయుడైన వ్యక్తి..’ అన్నారు హెలెన్‌ కెల్లర్‌. ఎంత అద్భుతమైన మాటలు! చూపు ఉన్నవారందరికి దృష్టి ఉండాలని  కానీ.. చూపు లేనివారికి దృష్టి ఉండకూడదన్న నియమం గాని లేదన్న భావనను ఎంత బాగా చెప్పారో!

నదిలో కొట్టుకుపోతున్నది ఆడ.. మగా అని కాక ఒక జీవి అన్న భావనలో రక్షించానన్న శిష్యుడి మాటల్లో.. రసవిహీనంగా ఉండి గంటపాటు సాగిన ఒక ఉపన్యాసాన్ని విని.. ఎలా మాట్లాడకూడదో నేర్చుకున్నానన్న వ్యక్తి మాటల్లో వ్యక్తమయ్యేది వారి దృష్టి మాత్రమే. అది ఎంత లోతైనదో.. స్పష్టమైనదో చూడండి. అటువంటి మనోనేత్రం మనకందరకూ కావాలి. దాన్ని అలవరచుకునే ప్రయత్నం చేయాలి. పొందాలి. దాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి. అలా కానట్లయితే అది పుస్తకాలనుండి నేర్చుకున్న జ్ఞానంలా మిగిలిపోతుంది. పుస్తకజ్ఞానాన్ని సందర్భానికి తగిన విధంగా, ఆపద్ధర్మంగా మంచి కోసం వాడుకోవాలి. దీనినే ఇంగిత జ్ఞానమంటారు. అలా వాడటానికి వివేచన అనే దృష్టి కావాలి.

జీవితమంటే ఏమిటి.. దాని పథం ఏమిటో స్పష్టమైన దృష్టిని ఏర్పరచుకుని పయనించాలి. మనం నేర్చిన విద్య యొక్క సారాన్ని జీర్ణించుకోవాలి. జీవన క్రమంలో ఎదురయ్యే అనుభవాలను.. సత్యాలను పొదవుకోవాలి. అటువంటి జీవితం ఎటువంటి కుదుపులొచ్చినా అతలాకుతలమవ్వక ఒక ప్రశాంత స్థితిలో సాగుతుంది.
మనం ప్రపంచాన్ని.. మనుష్యుల స్వభావాలను.. మనస్తతత్వాలను ఆకళింపు చేసుకున్న తీరు మన దృష్టికి దర్పణం. మన దృష్టి మన వ్యక్తిత్వాన్ని... ఆలోచనా విధానాన్ని... జీవిత దృక్పథాన్ని.. మనం జీవితాన్ని అర్థం చేసుకున్న తీరును తేటతెల్లం చేస్తుంది.

   దృష్టి ఆవశ్యకత ఏమిటి.. దాన్ని ఏర్పరచు కోవాలా అనే సందేహాలు వచ్చే వారుంటారు. దృష్టి మన జీవితాన్ని పరిపుష్టం చేస్తుంది. ఒక గౌరవం.. ఒక హుందాతనాన్నిస్తుంది. జీవితానికొక సమతౌల్యతనిస్తుంది. దృష్టి వ్యక్తి వికాసానికెంత అవసరమో... దేశవికాసానికి అంతే అవసరం.

కేవలం చూవు మాత్రమే ఉండి.. దృష్టి లేనివాడు ఈ ప్రపంచంలో అతి దయనీయుడైన వ్యక్తి..

– లలితా వాసంతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement