టీకా వికటించి శిశువు మృతి | Baby passed away after being vaccinated | Sakshi
Sakshi News home page

టీకా వికటించి శిశువు మృతి

Published Thu, Feb 6 2025 4:24 AM | Last Updated on Thu, Feb 6 2025 4:24 AM

Baby passed away after being vaccinated

రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్ల పీహెచ్‌సీలో ఘటన 

ఆస్పత్రి ఎదుట తల్లిదండ్రుల ధర్నా

తంగళ్లపల్లి (సిరిసిల్ల): టీకా వికటించి శిశువు మృతిచెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి లలిత–రమేశ్‌ దంపతులకు ఇద్దరు సంతానం కొడుకు హన్షిత్‌ (9), కూతురు(45రోజులు) ఉన్నారు. కూతురుకు నేరెళ్ల పీహెచ్‌సీలో బుధవారం టీకా వేయించారు. ఇంటికెళ్లాక పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హుటాహుటిన సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు శిశువు అప్పటికే మృతిచెందిందని తెలపడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. 

పాప మృతదేహంతో నేరెళ్ల పీహెచ్‌సీ వద్ద ధర్నాకు దిగారు. సిరిసిల్ల రూరల్‌ సీఐ మొగిలి, ఎస్సై రామ్మోహన్‌ వారికి నచ్చజెప్పినా వినలేదు. కలెక్టర్‌ రావాలని పట్టుబట్టారు. జిల్లా వైద్యాధికారి రజిత అక్కడికి చేరుకొని బుధవారం ముగ్గురు చిన్నారులకు టీకాలు వేస్తే ఇద్దరు బాగానే ఉన్నారన్నారు. పాప మృతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయినా తల్లిదండ్రులు వినలేదు. 

వీరికి తోడుగా సిద్దిపేట–సిరిసిల్ల ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగిన బీజేపీ మండలాధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్‌రావుతోపాటు మరో పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాధాబాయి పాప కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.లక్ష చెక్కు అందించారు. తంగళ్లపల్లి తహసీల్దార్‌ గురువారం మరో రూ.లక్ష అందజేయనున్నట్లు ప్రకటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement