
శరీరంలో కొవ్వును కరిగించే టీకా ఆవిష్కరణ
ఆకలిని చంపుకోకుండానే బరువు తగ్గే మార్గం
ఉటోపియా థెరపాటిక్ శాస్త్రవేత్త గోపి కడియాల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యధిక మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం ఒకటి. శరీరంలో కొవ్వు పెరుగుతున్నాకొద్ది.. కొత్త కొత్త వ్యాధులు కూడా పెరుగుతాయి. ఊబకాయాన్ని తగ్గించుకొనేందుకు కొందరు శారీరక శ్రమ చేస్తే.. మరికొందరు ఆకలిని తగ్గించే ఒజెంపిక్ వంటి మందులపై ఆధారపడుతున్నారు.
ఇకపై ఇలాంటి కష్టతరమైన పనులతో అవసరం లేకుండా ఒక్క టీకాతో ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చని చెబుతోంది ఉటోపియా థెరపాటిక్స్ సంస్థ. ఊబకాయాన్ని తగ్గించేందుకు ఈ సంస్థ ప్రత్యేక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ టీకా ఆవిష్కరణలో సంస్థ సీఈవో డాక్టర్ గోపి కడియాల కీలక భూమిక పోషించారు.
ఇది ఎలా పనిచేస్తుందంటే..: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఊబకాయాన్ని తగ్గించే మందుల్లో అత్యధికం ఆకలిని తగ్గించటం ద్వారా శరీరంలోని కొవ్వును కరిగించే పని చేస్తాయి. ఈ విధానంలో దుష్ప్రభావాలు కూడా అధికమే. అందుకు భిన్నంగా ఉటోపియా సిద్ధం చేసిన టీకా ఆకలిని తగ్గించకుండానే.. నేరుగా శరీరంలో కొవ్వును కరిగించే వ్యవస్థను చైతన్యవంతం చేస్తుంది. తద్వారా ఒక క్రమ పద్ధతిలో ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు.
కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని కూడా ఈ టీకా నియంత్రిస్తుందని ఉటోపియా చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ ఉదయ్ సక్సేనా తెలిపారు. ఈ టీకాను ఇప్పటికే కోళ్లు, ఎలుకలపై ప్రయోగించి చూశామని, శరీరానికి హాని చేసే ట్రైగ్లిజరైడ్స్ 42 శాతం వరకు తగ్గినట్లు గుర్తించామని డాక్టర్ గోపి కడియాల చెప్పారు. అలాగే పొట్ట భాగంలో ఉండే విసరల్ ఫ్యాట్ 24 శాతం తగ్గిందని, ప్రీక్లినికల్ ట్రయల్స్‌లో ఎలాంటి దు్రష్పభావాలు కానీ.. కండర నష్టం, ఆకలి తగ్గిపోవడం వంటివి కనిపించలేదని వెల్లడించారు.
త్వరలో ఈ టీకాను మనుషులపై కూడా ప్రయోగించనున్నట్లు తెలిపారు. వచ్చే ఫలితాల ఆధారంగా టీకాను అందరికీ అందుబాటులోకి తెస్తామని ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఉటోపియా థెరపాటిక్ సంస్థకు బయో ఆసియా–2025 సదస్సులో టాప్–5 ఉత్తమ స్టార్టప్‌లో ఒకటిగా అవార్డు రావటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment