సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల అంటురోగాల నివారణ కోసం పిల్లలకు వ్యాక్సిన్లూ వేయిస్తూ ఉంటాం. అలాగే పెద్దలకూ పలు రకాల జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు ఉంటాయి. కానీ వాటిని తీసుకునేవారు చాలా తక్కువ. ఇలాంటి వ్యాక్సిన్లపై అవగాహన లేకపోవడం ఒక కారణమైతే.. టీకాలు అంటే కేవలం పిల్లలకేననే అభిప్రాయం మరో కారణం. ‘అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇన్ ఇండియా (ఏపీఐ)’, ప్రముఖ పరిశోధన సంస్థ ఇప్పోస్‌లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
భారతదేశంలో వయో జనుల వ్యాధి నిరోధక టీకాల స్వీకరణ తక్కువగా ఎందుకు ఉందన్న అంశంపై హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 16 నగరాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. 50 ఏళ్లు దాటిన వయోజనులు, వారి సంరక్షకులు, వైద్యులను కలసి సర్వే చేశారు. ఈ సందర్భంగా.. 50 ఏళ్లు, ఆపై వయసున్న వారిలో 71 శాతం మందికి వ్యాక్సినేషన్ గురించి అవగాహన ఉన్నా.. కేవలం 16 శాతం మంది మాత్రమే వయోజన వ్యాక్సిన్లను తీసుకున్నట్టు తేలింది. దీనికి రోగులు, వైద్యులు పలు రకాల కారణాలు చెప్తుండటం గమనార్హం.
మార్గదర్శకాలుఏవీ లేక..
వయోజన ఇమ్యునైజేషన్‌కు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడం వల్ల.. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో ఆసక్తి లేదని సర్వేలో పాల్గొన్నవారిలో 90 శాతానికిపైగా వైద్యులు చెప్పారు. తమకంటూ ఉన్న కొన్ని పరిమితుల వల్ల కూడా పెద్దలకు వ్యాక్సినేషన్ గురించి చర్చించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఇక నివారణ కంటే చికిత్సకు రోగులు ప్రాధాన్యత ఇస్తారని భావించడం కూడా ఒక కారణమేనని అంటున్నారు.
పెద్దల్లో 69 శాతం మంది, వారి సంరక్షకుల్లో 76 శాతం మంది వయోజన టీకా గురించి వైద్యులను ఎప్పుడూ అడగలేదని.. అవసరమైతే వైద్యులే తమకు సిఫార్సు చేస్తారని భావిస్తున్నామని సర్వేలో వెల్లడించారు. వయోజనులు టీకా తీసుకోవడం పెరగాలంటే.. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం చేపట్టిన తరహాలో అవగాహన చర్యలు చేపడితే ప్రయోజనం ఉంటుందని వయోజనుల్లో 55 శాతం, వారి సంరక్షకుల్లో 48 శాతం మంది అభిప్రాయపడ్డారు.
అపోహలతోనూ దూరం..
వయోజన వ్యాక్సినేషన్ గురించి ఉన్న కొన్ని అపోహలు పెద్దలు టీకాలు తీసుకోకుండా నిరోధిస్తున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. దశలవారీగా వ్యాక్సిన్ డోస్‌లను తీసుకుంటే.. తాము అతిగా టీకా లపై ఆధారపడేలా మారుతామని వయోజనుల్లో 50 శాతానికిపైగా నమ్ముతున్నారని తేలింది. వయోజనుల్లో 58%, వారి సంరక్షకుల్లో 62% మంది రోగాల నుంచి రక్షించుకోవడానికి టీకా కంటే మెరుగైన మార్గాలు ఉన్నాయని భావిస్తున్నారని వెల్లడైంది.
‘షింగిల్స్’పై అవగాహన లేదు
పెద్దల్లో వచ్చే ప్రధానమైన, వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధి షింగిల్స్. దీని నివారణ గురించి ప్రజల్లో అవగాహన తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఈ అంశంపై విడిగా సర్వే నిర్వహించారు. పిల్లల్లో చికెన్‌ఫాక్స్‌కు కారణమయ్యే వైరస్ వల్ల పెద్దవారిలో షింగిల్స్ వ్యాధి వస్తుంది. చర్మంపై కురుపులతో నొప్పి, బాధాకరమైన పరిస్థితి కొన్ని వారాల నుంచి నెలల పాటు ఉంటుంది. షింగిల్స్‌కు, ఇతర చర్మ సంబంధ సమస్యల మధ్య తేడాను గుర్తించడం కష్టం. దీంతో రోగ నిర్ధారణ ఆలస్యమై చికిత్స ప్రభావం తక్కువగా ఉంటుంది. అధ్యయనంలో పాల్గొన్నవారిలో 72 శాతం మందికి ఈ వ్యాధి గురించి తెలియదు. ఒకవేళ దీనికి గురైనా, మళ్లీ వచ్చే అవకాశం ఉంటుందని.. వ్యాక్సిన్ల ద్వారా దీన్ని నివారించవచ్చని 73శాతం మందికి తెలియదని సర్వేలో తేలింది.
హైదరాబాదీల్లో అవగాహన ఉన్నా..
హైదరాబాద్ నగరంలో 50 ఏళ్లు దాటిన వయోజనుల్లో 53% మంది తమకు వ్యాక్సినేషన్ గురించి అవగాహన ఉందని చెప్పారు. కానీ వారిలో కేవలం 4% మందే వయోజన వ్యాక్సిన్లు తీసుకున్నారు. హైదరాబాద్‌లో 67 శాతం మంది కోవిడ్ కాకుండా ఇతర వ్యాధులు టీకాలు వేయాల్సినంత తీవ్రంగా లేవని భావిస్తున్నారు. పెద్దల్లో 67 శాతం, వారి సంరక్షకుల్లో 82% మంది వయోజన వ్యాక్సిన్‌లు అందుబాటు ధరల్లో లేవని చెప్తున్నారు.
ఇక 81శాతం మంది టీకాలు తీసుకోవాలని వైద్యులు చెప్తే విశ్వసిస్తామని చెప్పారు. కానీ తమకు వైద్యులు వ్యాక్సిన్లను సిఫార్సు చేశారని 7 శాతం మందే చెప్పడం గమనార్హం. జాతీయ స్థాయిలో సగటున 16 శాతం వైద్యులు వయోజన వ్యాక్సినేషన్‌ను సిఫార్సు చేస్తున్నట్టు సర్వేలో తేలగా.. దక్షిణాదిలో వారు 10 శాతమే.
పెద్దల్లో అవగాహన కల్పించాలి
పిల్లల్లో రోగనిరోధకత ఆవశ్యకతను ప్రజలు బాగానే అర్థం చేసుకున్నప్పటికీ పెద్దల్లో అవగాహన లేదు. సందర్భాన్ని బట్టి టెటనస్ టాక్సాయిడ్, యాంటీ–రేబిస్ టీకా వంటివి మినహా పెద్దలు ఇతర వ్యాక్సిన్లను అవసరాలకు తగ్గట్టుగా తీసుకోవడం లేదు. దీనిపై అవగాహన కల్పించాల్సి ఉంది.
– బిపిన్ కుమార్ సేథీ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment