సాక్షి, హైదరాబాద్: అసలే ఎండాకాలం.. పైగా అది అడవి.. దాహార్తి తీర్చుకోవడమే గగనం.. మరోవైపు బీపీ, షుగర్, ఆస్తమా.. వీటికితోడు ఇప్పుడు కరోనా, లాక్‌డౌన్.. కొరియర్లు కలవలేకపోతున్నారు.. మందులు అందడంలేదు.. వెరసి దయనీయస్థితిలో మావోయిస్టులు. కనిపించే శత్రువుపైకి కాలుదువ్వే మావోయిస్టులు ఇప్పుడు కనిపించని శత్రువును ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పుడు రూటు మార్చి మందుల కోసం వేట మొదలుపెట్టారు. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మావోలకు కొత్తకష్టం వచ్చి పడింది. కరోనా వైరస్ రూపంలో వారు ఇప్పుడు కొత్త శత్రువుతో పోరాటం చేస్తున్నారు. మొదటి కరోనా వేవ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నారు. కానీ, సెకండ్‌వేవ్‌తో విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే 100 మందికిపైగా మావోయిస్టులు కరోనా బారిన పడ్డారని సమాచారం. అందులో పదిమంది వరకు మృతి చెందారు.
కొరియర్లు, ప్రజాకోర్టులు..
కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మావోయిస్టులు ఏప్రిల్ 26న భారత్‌బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పలుమార్లు బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పలు ఆదివాసీ గ్రామాల్లో వేలాదిమందితో సభలు, సమావేశాలు నిర్వహించారు. వందల సంఖ్యలో దళాల సభ్యులు, అగ్రనేతలు పాల్గొన్నారు. అక్కడక్కడా ప్రజాకోర్టులు నిర్వహించేవారు. తరచూ కొరియర్లు వచ్చి కలిసేవారు. ఈ కారణాల వల్ల దళాల సభ్యులకు వైరస్ పాకిందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు పారాసిటమాల్ మాత్రలతోనే సరిపెట్టుకుంటున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారిలో కరోనా లక్షణాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, అదే మరణాలకు దారితీస్తోందని పోలీసులు తెలిపారు. అందుకే, తెలంగాణలోకి తమ కొరియర్లను పంపి కరోనా మాత్రలను సమకూర్చుకోవడం, వయసు మీద పడిన మావోయిస్టు నేతలను సాధారణ గ్రామస్థుల రూపంలో తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించడంపై వారు దృష్టి పెట్టారని నిఘావర్గాలు గుర్తించాయి.
మరణాలకు కారణాలు ఇవే..!
- దండకారణ్యంలో సంచరించే మావోల్లో వ్యాపిస్తున్న స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమైనదని సమాచారం. అయితే అది ఏంటన్నది ఇంతవరకూ గుర్తించలేదు.
- ఆస్తమా, బీపీ, షుగర్, గుండెజబ్బులు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న మావోయిస్టులలో కరోనా తీవ్రత అధికంగా ఉంది.
- మహారాష్ట్ర, తెలంగాణలో లాక్‌డౌన్ కారణంగా కొరియర్లు, సానుభూతిపరుల కదలికలు కష్టమవడంతో వారి నుంచి మందులు సకాలంలో అందడంలేదు.
- కొందరికి మాత్రలతో వ్యాధి అదుపులోకి రాక ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది.
- వేసవి కావడంతో అడవుల్లో తాగునీటి కొరత ఏర్పడింది. డెంగీ, మలేరియా లక్షణాలకు కరోనా లక్షణాలకు పెద్దగా తేడా లేకపోవడంతో వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతోంది.
ర్యాంకుల ఆధారంగా మందులు
ప్రస్తుతం మావోయిస్టుల దళాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. వారికోసం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో మందుల సేకరణ జరుగుతున్నట్లు మాకు కూడా సమాచారం ఉంది. ఇప్పుడు లాక్‌డౌన్ వల్ల ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. గ్రామాల్లోకి మావోలు సాధారణ ప్రజల రూపంలో వచ్చి వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. కేడర్‌లోని ర్యాంకులను బట్టే వ్యాక్సిన్లు వేయస్తున్నారు, మందులు సరఫరా చేస్తున్నారు. ఇటీవల భారత్‌బంద్ నేపథ్యంలో వారు వేలాదిమందిని సమీకరించి ఏర్పాటు చేసిన సమావేశాల అనంతరం దళాల్లో వైరస్ తీవ్రత పెరిగింది. కరోనా పాజిటివ్ ఉన్న సభ్యులెవరైనా లొంగిపోతే, వారికి ఎలాంటి హానీ తలపెట్టం. కావాల్సిన చికిత్స అందజేస్తాం.
–అభిషేక్ ఎస్పీ, దంతెవాడ
(చదవండి: ‘సిటీమార్’ స్టెప్పులతో డాక్టర్ల డ్యాన్స్.. దిశా పటాని కామెంట్)
Comments
Please login to add a commentAdd a comment