Immunizations vaccinations
-
టీకాలంటే పిల్లలకేనా?.. పెద్దల వ్యాక్సినేషన్‌కు.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల అంటురోగాల నివారణ కోసం పిల్లలకు వ్యాక్సిన్లూ వేయిస్తూ ఉంటాం. అలాగే పెద్దలకూ పలు రకాల జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు ఉంటాయి. కానీ వాటిని తీసుకునేవారు చాలా తక్కువ. ఇలాంటి వ్యాక్సిన్లపై అవగాహన లేకపోవడం ఒక కారణమైతే.. టీకాలు అంటే కేవలం పిల్లలకేననే అభిప్రాయం మరో కారణం. ‘అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇన్ ఇండియా (ఏపీఐ)’, ప్రముఖ పరిశోధన సంస్థ ఇప్పోస్లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. భారతదేశంలో వయో జనుల వ్యాధి నిరోధక టీకాల స్వీకరణ తక్కువగా ఎందుకు ఉందన్న అంశంపై హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 16 నగరాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. 50 ఏళ్లు దాటిన వయోజనులు, వారి సంరక్షకులు, వైద్యులను కలసి సర్వే చేశారు. ఈ సందర్భంగా.. 50 ఏళ్లు, ఆపై వయసున్న వారిలో 71 శాతం మందికి వ్యాక్సినేషన్ గురించి అవగాహన ఉన్నా.. కేవలం 16 శాతం మంది మాత్రమే వయోజన వ్యాక్సిన్లను తీసుకున్నట్టు తేలింది. దీనికి రోగులు, వైద్యులు పలు రకాల కారణాలు చెప్తుండటం గమనార్హం. మార్గదర్శకాలుఏవీ లేక.. వయోజన ఇమ్యునైజేషన్‌కు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడం వల్ల.. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో ఆసక్తి లేదని సర్వేలో పాల్గొన్నవారిలో 90 శాతానికిపైగా వైద్యులు చెప్పారు. తమకంటూ ఉన్న కొన్ని పరిమితుల వల్ల కూడా పెద్దలకు వ్యాక్సినేషన్ గురించి చర్చించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఇక నివారణ కంటే చికిత్సకు రోగులు ప్రాధాన్యత ఇస్తారని భావించడం కూడా ఒక కారణమేనని అంటున్నారు. పెద్దల్లో 69 శాతం మంది, వారి సంరక్షకుల్లో 76 శాతం మంది వయోజన టీకా గురించి వైద్యులను ఎప్పుడూ అడగలేదని.. అవసరమైతే వైద్యులే తమకు సిఫార్సు చేస్తారని భావిస్తున్నామని సర్వేలో వెల్లడించారు. వయోజనులు టీకా తీసుకోవడం పెరగాలంటే.. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం చేపట్టిన తరహాలో అవగాహన చర్యలు చేపడితే ప్రయోజనం ఉంటుందని వయోజనుల్లో 55 శాతం, వారి సంరక్షకుల్లో 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. అపోహలతోనూ దూరం.. వయోజన వ్యాక్సినేషన్ గురించి ఉన్న కొన్ని అపోహలు పెద్దలు టీకాలు తీసుకోకుండా నిరోధిస్తున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. దశలవారీగా వ్యాక్సిన్ డోస్‌లను తీసుకుంటే.. తాము అతిగా టీకా లపై ఆధారపడేలా మారుతామని వయోజనుల్లో 50 శాతానికిపైగా నమ్ముతున్నారని తేలింది. వయోజనుల్లో 58%, వారి సంరక్షకుల్లో 62% మంది రోగాల నుంచి రక్షించుకోవడానికి టీకా కంటే మెరుగైన మార్గాలు ఉన్నాయని భావిస్తున్నారని వెల్లడైంది. ‘షింగిల్స్’పై అవగాహన లేదు పెద్దల్లో వచ్చే ప్రధానమైన, వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధి షింగిల్స్. దీని నివారణ గురించి ప్రజల్లో అవగాహన తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఈ అంశంపై విడిగా సర్వే నిర్వహించారు. పిల్లల్లో చికెన్ఫాక్స్కు కారణమయ్యే వైరస్ వల్ల పెద్దవారిలో షింగిల్స్ వ్యాధి వస్తుంది. చర్మంపై కురుపులతో నొప్పి, బాధాకరమైన పరిస్థితి కొన్ని వారాల నుంచి నెలల పాటు ఉంటుంది. షింగిల్స్‌కు, ఇతర చర్మ సంబంధ సమస్యల మధ్య తేడాను గుర్తించడం కష్టం. దీంతో రోగ నిర్ధారణ ఆలస్యమై చికిత్స ప్రభావం తక్కువగా ఉంటుంది. అధ్యయనంలో పాల్గొన్నవారిలో 72 శాతం మందికి ఈ వ్యాధి గురించి తెలియదు. ఒకవేళ దీనికి గురైనా, మళ్లీ వచ్చే అవకాశం ఉంటుందని.. వ్యాక్సిన్ల ద్వారా దీన్ని నివారించవచ్చని 73శాతం మందికి తెలియదని సర్వేలో తేలింది. హైదరాబాదీల్లో అవగాహన ఉన్నా.. హైదరాబాద్ నగరంలో 50 ఏళ్లు దాటిన వయోజనుల్లో 53% మంది తమకు వ్యాక్సినేషన్ గురించి అవగాహన ఉందని చెప్పారు. కానీ వారిలో కేవలం 4% మందే వయోజన వ్యాక్సిన్లు తీసుకున్నారు. హైదరాబాద్‌లో 67 శాతం మంది కోవిడ్ కాకుండా ఇతర వ్యాధులు టీకాలు వేయాల్సినంత తీవ్రంగా లేవని భావిస్తున్నారు. పెద్దల్లో 67 శాతం, వారి సంరక్షకుల్లో 82% మంది వయోజన వ్యాక్సిన్లు అందుబాటు ధరల్లో లేవని చెప్తున్నారు. ఇక 81శాతం మంది టీకాలు తీసుకోవాలని వైద్యులు చెప్తే విశ్వసిస్తామని చెప్పారు. కానీ తమకు వైద్యులు వ్యాక్సిన్లను సిఫార్సు చేశారని 7 శాతం మందే చెప్పడం గమనార్హం. జాతీయ స్థాయిలో సగటున 16 శాతం వైద్యులు వయోజన వ్యాక్సినేషన్‌ను సిఫార్సు చేస్తున్నట్టు సర్వేలో తేలగా.. దక్షిణాదిలో వారు 10 శాతమే. పెద్దల్లో అవగాహన కల్పించాలి పిల్లల్లో రోగనిరోధకత ఆవశ్యకతను ప్రజలు బాగానే అర్థం చేసుకున్నప్పటికీ పెద్దల్లో అవగాహన లేదు. సందర్భాన్ని బట్టి టెటనస్ టాక్సాయిడ్, యాంటీ–రేబిస్ టీకా వంటివి మినహా పెద్దలు ఇతర వ్యాక్సిన్లను అవసరాలకు తగ్గట్టుగా తీసుకోవడం లేదు. దీనిపై అవగాహన కల్పించాల్సి ఉంది. – బిపిన్ కుమార్ సేథీ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి -
ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. అటు కాబోయే అమ్మలకు, ఇటు పిల్లలకు రోగ నిరోధక టీకాలివ్వడంలో మొదటి స్థానంలో ఉంది. ఆస్పత్రుల్లో కాన్పులు, నవజాత శిశువులకు 24 గంటల్లో హెపటైటిస్–బి డోసులివ్వడం, గర్భిణులకు యాంటి నేటల్ చెకప్ల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. పిల్లలకు, పోలియో టీకాలు అందించడంలోనూ జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. 2021–22లో వివిధ రాష్ట్రాల్లో వైద్య సేవలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. నివేదికలోని కీలక అంశాలు ♦ జాతీయ స్థాయిలో గర్భిణులకు రోగ నిరోధక టీకాలు 86.5 శాతం ఇవ్వగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో నూటికి నూరు శాతం వ్యాక్సిన్లు ఇచ్చారు. తమిళనాడు, దాద్రా నగర్ హవేలీ, డామన్ –డయ్యూ, మహారాష్ట్ర ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. ♦9 నుంచి 11 నెలల వయసున్న చంటి బిడ్డలకు రోగ నిరోధక టీకాలివ్వడంలోనూ ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉంది. జాతీయ సగటు 91 శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌లో నూటికి నూరు శాతం చిన్నారులకు రోగ నిరోధక వ్యాక్సిన్లు ఇచ్చారు. గుజరాత్, జమ్మూ– కశీ్మర్, జార్ఖండ్, మహారాష్ట్ర తరువాత స్థానాల్లో నిలిచాయి. ♦ పిల్లలకు పోలియో చుక్కలు వేయడంలో జాతీయ సగటు 87.1 శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌లో నూరు శాతం నమోదైంది. హెపటైటిస్–బి డోస్‌లకు సంబంధించి జాతీయ సగటు 75.8 % కాగా ఆంధ్రప్రదేశ్‌లో 98.4 %ఉంది. ♦ ఆస్పత్రుల్లో ప్రసవాల జాతీయ సగటు 95.5 శాతం కాగా రాష్ట్రంలో 99.9 శాతం ఆస్పత్రుల్లోనే కాన్పులు జరుగుతున్నాయి. ♦ పూర్తిగా రోగ నిరోధక వ్యాక్సిన్లు 9,14,644 మంది గర్భిణులకు ఇచ్చారు. ♦ 9 – 11 నెలల వయసున్న 8,42,404 మంది చిన్నారులకు టీకాలిచ్చారు. ♦పాఠశాలలకు వెళ్లే 2,58,68,458 మంది బాలికలు, 2,58,19,968 మంది బాలురకు, అంగన్వాడీ కేంద్రాల్లో 4,33,490 మంది బాలికలకు ఐఎఫ్ఐ మాత్రలను అందించారు. రాష్ట్రంలో 1,16,80,448 మంది కౌమార బాలికలకు శానిటరీ న్యాప్కిన్లను అందించి బాలికా విద్యను ప్రభుత్వం ప్రోత్సహించింది. -
షాకింగ్.. ఆ కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు ముప్పు!
వాషింగ్టన్: కరోనా ఎంఆర్ఎన్ఏ టీకాలకు తీసుకుంటే 18-39 ఏళ్ల వయసు వారికి గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువ ఉందని అమెరికా ఫ్లోరిడా సర్జన్ జనరల్ డా.జోసెఫ్ లడాపో వెల్లడించారు. ఫ్లోరిడా ఆరోగ్య శాఖ స్వయం నియంత్రిత కేసులపై(సెల్ఫ్ కంట్రోల్డ్ కేసెస్ సిరీస్) పరిశోధనలు జరిపిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఆయన చెప్పారు. టీకాల భద్రతను పరీక్షించేందుకు ఈ సాంకేతికతనే ఉపయోగించడం గమనార్హం. ఎంఆర్ఎన్ఏ కరోనా టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత 18-39ఏళ్ల యువకుల్లో గుండెపోటు, ఇతర హృదయ సమస్యల కారణంగా మరణం సంభవించే ముప్పు 84శాతం ఉంటుందని ఈ విశ్లేషణలో తేలింది. అగ్ర దేశాలన్నీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లనే పంపిణీ చేసిన నేపథ్యంలో ఈ పరిశోధన ఆందోళన కల్గిస్తోంది. అయితే ఎంఆర్ఎన్ఏ సాంకేతిక ఉపయోగించని ఇతర కరోనా టీకాల వల్ల ఈ ముప్పు లేదని పరిశోధన స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎంఆర్ఎన్ఏ టీకాలు తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని డా.జోసెఫ్ సూచించారు. ముఖ్యంగా మ్యోకార్డిటిస్, పెరికార్డిటిస్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ వ్యాక్సిన్ల పట్ల అప్రమత్తతో ఉండాలని చెప్పారు. ఏ ఔషధాన్నైనా, వ్యాక్సిన్‌నైనా అభివృద్ధి చేసేటప్పుడు వాటి భద్రత, సమర్థతపై పరిశోధనలు అత్యంత కీలకమని డా.జోసెఫ్ పేర్కొన్నారు. కరోనా టీకాల వచ్చినప్పుడు ఎన్నో ఆందోళనలు వ్యక్తమయ్యాయని, కానీ వాటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించలేదన్నారు. ఇప్పుడు నిర్వహించిన కీలక అధ్యయనం తర్వాతైనా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అయితే భారత్‌లో ఎంఆర్ఎన్ఏ సాంకేతికత ఉపయోగించిన టీకాలు వినియోగంలో లేవు. సంప్రదాయ పద్ధతిలో అభివృద్ధి చేసిన కరోనా టీకాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: పారేద్దామనుకున్న టికెట్‌కు 1.6 కోట్లొచ్చాయి -
93.94 % చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు
సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్‌లో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఓ వైపు కోవిడ్ ఉన్నా చిన్నారులకు ఇచ్చే టీకాల విషయంలో వైద్యారోగ్య శాఖ రాజీ పడకుండా ప్రతి చిన్నారికీ టీకా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారులకు 93.94 శాతం టీకా వేసినట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాన్ని మించి 108.90 శాతం వేశారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 76.20 శాతం నమోదైంది. పెంటావాలెంట్(ఐదు రకాల వ్యాధులకు ఒకే వ్యాక్సిన్) మూడో డోస్‌ను 92.76 శాతం మందికి ఇచ్చారు. ఓరల్ పోలియో(పోలియో చుక్కల మందు)ను మూడో డోస్‌లో 93.15% మందికి ఇచ్చినట్టు గణాంకాలు వెల్లడించాయి. మూడో డోసు పోలియో చుక్కల మందు 3.42 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా.. 3.18 లక్షల మందికి ఇచ్చారు. పుట్టగానే వేసే బీసీజీ వ్యాక్సిన్ సెప్టెంబర్ చివరి నాటికి 85.55% మందికి, పోలియో చుక్కల జీరో డోసు 80.30% మందికి, హెపటైటిస్బి జీరో డోస్ వ్యాక్సిన్ 75.17 శాతం మందికి వేశారు. హెపటైటిస్ వ్యాక్సిన్ వేయడంలో 2.56% వృద్ధి కనిపించినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆరోగ్య ఉప కేంద్రం మొదలుకుని బోధనాస్పత్రి వరకు అన్ని ఆస్పత్రుల్లోనూ వ్యాధి నిరోధక టీకాలున్నాయని, ప్రతి ఒక్క తల్లీ తమ బిడ్డకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని కుటుంబ సంక్షేమ శాఖ కోరింది. -
చిన్నారులకు టీకాలే రక్ష
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి అందరినీ బెంబేలెత్తిస్తోంది. దీంతో అందరూ శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు రకరకాల మందులూ, ఆహారం తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలే ఇప్పుడు పెద్ద శ్రీరామరక్షగా నిలుస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఓవైపు చిన్నారుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, థర్డ్ వేవ్‌లో చిన్నారులకే ముప్పు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారిలో ‘క్రాస్ ఇమ్యూనిటీ’ అంశం తెరమీదకు వచ్చింది. పుట్టినప్పటి నుంచి క్రమం తప్పకుండా వ్యాధినిరోధక టీకాలు వేయడం వల్ల వచ్చే రోగనిరోధక శక్తినే క్రాస్ ఇమ్యూనిటీ అంటారు. వ్యాధినిరోధక టీకాలతో వైరస్‌కు చెక్.. పుట్టినప్పటి నుంచే చిన్నారులకు పోలియో మొదలుకొని బీసీజీ, డీపీటీ ఇలా అనేక రకాల వ్యాధినిరోధక టీకాలు వేస్తారు. ఈ టీకాలన్నిటితో చిన్నారుల్లో క్రాస్ ఇమ్యూనిటీ వస్తుందని శాస్త్రపరంగా నిర్ధారణ అయ్యిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్రాస్ ఇమ్యూనిటీ.. చాలావరకు కరోనాను నియంత్రించగలదని అంటున్నారు. ఐదేళ్ల వయసొచ్చేవరకూ ఈ టీకాలన్నీ ఎప్పటికప్పుడు వేయించుకున్న చిన్నారులకు కరోనా సోకడం తక్కువని, ఒకవేళ సోకినా ప్రాణభయం ఉండదని చిన్నపిల్లల వ్యాధుల వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా సమయంలో టీకా ఎందుకులే అని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలని సూచిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ చిన్నారుల్లో ఎక్కువ అనేది అపోహ మాత్రమేనని అంటున్నారు. అలాంటి నివేదికలేమీ ఇప్పటివరకూ రాలేదని, అయితే చిన్నారులు కూడా కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. తల్లిదండ్రులు రొటీన్ టీకాలు తప్పనిసరిగా వేయించాలి.. చిన్నారులకు ఇచ్చే వ్యాధినిరోధక టీకాల వల్ల వారిలో క్రాస్ ఇమ్యూనిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా టీకాలు వేయిస్తే కరోనా వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది. ఈ క్రాస్ ఇమ్యూనిటీ అనేది చిన్నారులకు 10 ఏళ్ల వయసొచ్చే వరకూ కాపాడుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు రొటీన్ టీకాలు తప్పనిసరిగా వేయించాలి. –డా.కిరీటి, పీడియాట్రిక్ ప్రొఫెసర్, ఎస్వీ మెడికల్ కాలేజీ, తిరుపతి -
టీకా.. కేక!
సాక్షి, అమరావతి: ఏపీలో ఇమ్యునైజేషన్ (టీకాల) కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించడంలో చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ కార్యక్రమం ఏపీలో జరుగుతోందని రెండ్రోజుల కిందట విడుదలైన నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో 97 శాతం మంది చిన్నారులకు తల్లిదండ్రులు ఏదో ఒక వ్యాధి నిరోధక టీకా వేయిస్తున్నారు. మొత్తం 8 రకాల టీకాలు (బీసీజీ, ఓపీవీ, పెంటావాలెంట్ 5, మీజిల్స్) వేయించుకుంటున్న వారు 73.6 శాతం ఉన్నట్టు తేలింది. జాతీయ స్థాయిలో టీకాలు వేయించుకుంటున్న వారి సగటు కేవలం 59.2 శాతమే. ఆసక్తికర విషయమేంటంటే రాష్ట్రంలో 99 శాతం మంది తమ చిన్నారులకు టీకాలు వేయించేందుకు ప్రభుత్వాస్పత్రులకే వెళుతున్నట్టు వెల్లడైంది. ఏపీలో బాగా జరుగుతోంది – జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే 74.2 మంది టీకాల కోసం సబ్ సెంటర్లకు వెళుతున్నారు. – దేశంలో పట్టణ ప్రాంతాల్లో చూస్తే 45 శాతం మందే సబ్ సెంటర్, అంగన్వాడీలకు వెళుతున్నారు. – జాతీయ స్థాయిలో 9.1 శాతం మంది ప్రయివేటు ఆస్పత్రుల్లో టీకాలకు వెళుతుండగా, 2.6 శాతం మంది ఎన్జీవోలను ఆశ్రయిస్తున్నారు. – అత్యల్పంగా నాగాలాండ్ రాష్ట్రంలో కేవలం 12.8 శాతం మందే టీకాలు వేయించుకుంటున్నారు. – ఏపీలో టీకాలు వేయించుకుంటున్న వారిలో బాలుర కంటే బాలికలే ఎక్కువ. -
నేటి నుంచి టీకాలు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గతకొన్ని రోజులుగా గర్భిణులకు, చిన్నారులకు ఇచ్చే వ్యాధినిరోధక టీకాలు ఆగిపోయాయి. శనివారం నుంచి ఆ టీకాలు యథావిధిగా వేయాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశించారు. ప్రతి బుధవారం, శనివారం రోటావైరస్, డీపీటీ, తట్టు, పోలియో తదితర వ్యాక్సిన్లు ఇస్తారు. నేటి నుంచి జాగ్రత్తలు పాటిస్తూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయాలన్నారు. టీకాలు ఇలా వేయాలి.. ► టీకాలు వేయాల్సిన వాళ్లందరినీ గుర్తించాలి ► వారిలో అరగంటకు నలుగురుకి చొప్పున స్లాట్లు ఇవ్వాలి ► ఆశా కార్యకర్తల ద్వారా ముందురోజే ఈ స్లాట్ సమయం స్లిప్పులు ఇవ్వాలి ► గ్రామ, వార్డు పరిధిలోని లబ్ధిదారులందరికీ టీకాలు వేసే వరకూ స్లాట్లను కొనసాగించాలి ► ఏఎన్ఎంలు గానీ, ఆశాలు గానీ, అంగన్వాడీ వర్కర్‌గానీ కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే టీకాల్లో పాల్గొనకూడదు ► రెడ్‌జోన్ (కంటైన్మెంట్ జోన్) ప్రాంతాల్లో టీకాల కార్యక్రమం నిర్వహించకూడదు ► టీకాలకు వచ్చే వారి మధ్య కనీసం 7 అడుగుల భౌతిక దూరం ఉండేలా చూడాలి ► టీకాలు వేసే ఏఎన్ఎం సర్జికల్ మాస్కు ధరించడంతో పాటు టీకా వేసేముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలి -
రాష్ట్రంలో 92% టీకాలు
సాక్షి, హైదరాబాద్: వ్యాధి నిరోధక టీకాలలో తెలంగాణ ఉత్తమ పనితీరు కనపరుస్తున్న రాష్ట్రాలలో ఒకటని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణా శుక్రవారం ఓ ప్రకటనలో తెలి పారు. 2015–16లో నిర్వహించిన జాతీయ కుటుంబ సంక్షేమ సర్వే–4 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 68% టీకాలు వేశారని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ కిట్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయడం ద్వారా వ్యాధి నిరోధక టీకాల అమలు కార్యక్రమం 72% నుంచి 92.4 శాతానికి పెరిగిందని తెలిపారు. 2019–20 ఏడాదిలో జనవరి వరకు తెలంగాణ రాష్ట్రం 92.4% టీకాలు వేయడం వల్ల దేశంలో ఉత్తమ పనితీరు కనపరుస్తున్న మొదటి 10 రాష్ట్రాలలో ఒకటిగా నిలిచిందని వెల్లడించారు. మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంలో 100% కవరేజ్ సాధించిన రాష్ట్రం కూడా తెలంగాణాయేనని కమిషనర్ పేర్కొన్నారు. పొరపాటుగా సమాధానం లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో తెలంగాణలో టీకాల కార్యక్రమం 2019–20కు సంబంధించిన గణాంకాల్లో 54.20%గా పొరపాటున ఇచ్చామని, అప్పటికి తెలంగాణలో 94.89% టీకాల కార్యక్రమం పూర్తయిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ డాక్టర్ మనోహర్ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖకు పంపిన లేఖ లో తెలిపారు. మార్చి 2 నుంచి జరుగబోయే పార్లమెంటు సమావేశాల్లో దాన్ని సరిదిద్ది సరైన సంఖ్యను అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. -
వ్యాధి నిరోధక టీకాల స్పెషల్ డ్రైవ్
తాండూరు, న్యూస్‌లైన్ : మాతాశిశు సంరక్షణలో భాగంగా గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ నిర్మల్‌కుమార్ చెప్పారు. తమ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో వ్యాధినిరోధక టీకాలు వేయించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. గురువారం జిల్లా ఆస్పత్రి (పీపీయూనిట్)లో వైద్య సిబ్బంది సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జన్మనిచ్చే ఏ తల్లీ మరణించొద్దు...జన్మించిన ఏ శిశువూ మృతి చెందొంద’న్న లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా దశలవారీగా సమస్యాత్మక గ్రామాల్లో టీటీ, టీడీటీ తదితర ఏడు రకాల వ్యాధినిరోధక టీకాలను తల్లీబిడ్డలకు వేయనున్నట్టు ఆయన చెప్పారు. రెండేళ్లలోపు పిల్లలకు, గర్భిణులకు టీకాలు వేస్తామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ మొదటి విడత ఈ నెల 3న ప్రారంభమైందని శనివారంతో ముగుస్తుందని చెప్పారు. మళ్లీ ఈ కార్యక్రమాన్ని మార్చి 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు, ఏప్రిల్ 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు, మే 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విడతలవారీగా గ్రామాల్లో నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 2013-14 సంవత్సరానికిగాను సుమారు 40వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటివరకు 32వేల ఆపరేషన్లు జరిగాయని, ఇంకా 8వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సి ఉందన్నారు. పీహెచ్సీలలో కు.ని. ఆపరేషన్ల లక్ష్యాలను పూర్తిచేయని ఆస్పత్రి బాధ్యులపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే పల్స్ పోలియో కార్యక్రమంలో పనిచేసిన సిబ్బందికి డబ్బులు చెల్లించని సూపర్‌వైజర్లపైనా చర్యలు ఉంటాయన్నారు. జననీ శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్ఎస్కె) కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకొని, రెండు రోజులపాటు చికిత్స పొందిన వారికి మందులు, రవాణా తదితర ఖర్చుల కింద ఒక్కో మహిళకు రూ.15వందలు చెల్లిస్తున్నామని చెప్పారు. సమావేశంలో కుటుంబ నియంత్రణ గణాంకాల అధికారి కృష్ణ, పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.