వరల్డ్‌ జూనోసిస్‌ డే: ఇదే రోజు ఎందుకో తెలుసా? | World Zoonoses Day 2021: Must Know About World Zoonosis During Pandemic Times | Sakshi
Sakshi News home page

జూనోసిస్‌ డే: పెంపుడు జంతువులతో పొంచి ఉన్న వ్యాధులు

Published Tue, Jul 6 2021 9:44 AM | Last Updated on Tue, Jul 6 2021 1:47 PM

World Zoonoses Day 2021: Must Know About World Zoonosis During Pandemic Times - Sakshi

జంతువులంటే ఇష్టపడని వారుండరు. ఎన్నో ఏళ్లుగా కొన్ని రకాల జంతువులు, పక్షులు మనుషుల ఆదరణ చూరగొంటున్నాయి. వాటితో మానవులకు విడదీయలేని బంధం ఏర్పడింది. పాలు, మాంసం, రక్షణ కోసం మానవుడు వాటిపై ఆధారపడుతున్నాడు. అయితే పెట్స్‌ నుంచి రేబిస్, మెదడువాపు, బర్డ్‌ ఫ్లూ, ఎబోలా, ప్లేగు, ఆంథ్రాక్స్‌ వంటి అనేక రకాల వ్యాధులు మానవుడికి సంక్రమించే ప్రమాదం ఉంది.

వీటి పట్ల మానవుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పెంపుడు జంతువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి సకాలంలో టీకాలు వేయించడం వల్ల వాటి నుంచి వ్యాధి సంక్రమణను నిరోధించవచ్చు. ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్‌ డేను పురస్కరించుకుని పెంపుడు జంతువులకు ఉచితంగా టీకాలు అందిస్తున్నారు.

ఇదే రోజు ఎందుకు?
మంచిర్యాల అగ్రికల్చర్‌: 1885 జూలై 6న లూయిస్‌ పాశ్చర్‌ అనే శాస్త్రవేత్త పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి మొదటిసారిగా వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. ప్రయత్నం విజయవంతం కావడంతో అప్పటినుంచి జూలై 6న ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవంగా పాటిస్తున్నారు. 

వీరికి సోకే అవకాశం ఎక్కువ
పశువుల కాపరులు, పశువైద్యవృత్తిలో ఉన్నవారు, పశువుల డెయిరీఫాంలలో పనిచేసేవారు, పాల ఉత్పత్తుల్ని ఆహారంగా తీసుకునేవారు, సరదాకోసం కుక్కలు, పక్షులను పెంచుకునేవారికి వ్యాధిసోకే అవకాశం ఎక్కువగా ఉంది. జూనోసిస్‌ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శుచి, శుభ్రత పాటించడం చాలా అవసరం.

పోలీసు శాఖలో విశిష్ట సేవలు
ఆసిఫాబాద్‌అర్బన్‌: హైదరాబాద్‌లోని పోలీస్‌ అకాడమీలో 8నెలలపాటు స్నీపర్‌డాగ్‌తో శిక్షణ పొందిన అనుభూతి జీవితంలో మర్చిపోలేను. జిల్లా కేంద్రంలో స్నీపర్‌డాగ్స్‌ 2, ట్రాకర్‌ డాగ్స్‌ 3 ఉన్నాయి. ప్రతిరోజు వాటికి భోజనం పెట్టిన తర్వాతే నేను భుజిస్తా. వాటికి ఆహారంగా రాయల్‌ కెనాల్‌ భోజనం అందిస్తాం. పోలీసుశాఖలో డాగ్‌ విశిష్ట సేవలు అందిస్తుంది. ఇటీవల లింగాపూర్‌లో ఓ మహిళపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో డాగ్‌ చాకచక్యంతోనే వివరాలు సేకరించగలిగాం. ఒక్కో డాగ్‌ కోసం నెలకు సుమారు రూ.40వేల వరకు వెచ్చిస్తున్నాం.
– జి.విలాస్, డాగ్‌ హైండ్లింగ్‌ పీసీ, ఆసిఫాబాద్‌ 



బ్రూనీతో ఆడుకోవడం చాలా ఇష్టం
ఎదులాపురం: మాకు చిన్నప్పటి నుంచి కుక్క పిల్లలంటే చాలా ఇష్టం. మా అమ్మ, నాన్న మాకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఖానాపూర్‌ నుంచి రూ. 12 వేలకు ఫమిలియన్‌ జాతికి చెందిన కుక్క పిల్ల బ్రూనీని తీసుకొచ్చారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతీరోజు దానితో ఆడుకుంటున్నాం. బ్రూనీ కొత్త వాళ్లను ఇంటి ఆవరణలోకి రానివ్వకుండా అరుస్తూ ఉంటుంది. దానితో ఆడుకోవడం, దాని బాగోగులు చూసుకోవడమంటే మాకు చాలా ఇష్టం.
– శాలినీ, గౌరీ కీర్తన, హౌజింగ్‌ బోర్డు కాలనీ, ఆదిలాబాద్‌

కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం
ఎదులాపురం: మాకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. కుక్కలతో పాటు ఆవులు, మేకలు, గొర్రెలను పెంచుకుంటాం. వాటిని కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం. వాటితో కలిగే ఆనందం చెప్పలేనిది. ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా టీకాలు, మెడిసిన్, ఇతర వైద్య చికిత్సలు చేయిస్తాం. అదే విధంగా మా ఇంట్లో మూడేళ్ల జర్మన్‌ షెపడ్‌ జాతికి చెందిన భాగీ అనే డాగ్‌తో పాటు రాకీ అనే మూడు నెలల రాట్‌విల్లర్‌ కుక్కపిల్ల కూడా ఉంది. 
- ఎంబడి శ్రీజ, మావల, ఆదిలాబాద్‌ 

అమ్మకు కూతురు.. మాకు చెల్లిలా..
మంచిర్యాలఅగ్రికల్చర్‌: 25 రోజుల ‘చాక్‌లెట్‌ ల్యాబ్రెడ్‌’ కుక్కపిల్లను తెచ్చి పెంచుకుంటున్నాం. దానికి ‘సూ్నపి’ అని పేరుపెట్టి ముద్దుగా పిలుచుకుంటున్నాం. మా అమ్మకు కూతురిగా మాకు చెల్లెలుగా భావించి ప్రేమగా చూసుకుంటున్నాం. ఉదయం టిఫిన్, రెండు పూటలా అన్నం, రెండు గుడ్లు, పాలు, వారానికి ఒకసారి మాంసం పెడుతున్నాం. ఏడాదికోసారి వ్యాక్సిన్‌ వేయిస్తున్నాం. వీటికి వేటాడే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. పోలీసులు ఎక్కువగా ల్యాబ్రెడ్‌ డాగ్స్‌ వాడుతారు.
– బండారి రుద్రతేజ, ఐబీచౌరస్తా, మంచిర్యాల 

కుటుంబ సభ్యుల్లో ఒకరిలా..
మంచిర్యాలఅగ్రికల్చర్‌: మా ఇంట్లో ఐదేళ్లుగా ‘రోష్‌’ సందడి చేస్తోంది. జమ్మూ నుంచి తీసుకువచ్చిన ‘రాట్‌ విల్లర్‌’ జాతికి చెందిన ఈ శునకంపై మాకుటుంబ సభ్యులందరికీ ఎనలేని ప్రేమ. 2016 లో ఐదునెలల వయస్సు ఉన్నప్పుడు తీసుకువచ్చాం. రోష్‌కు మూడు పూటలా భోజనం, పాలు, మాంసం, గుడ్లు అందిస్తున్నాం. రోజూ స్నానం చేయిస్తాం. జాగింగ్‌కు తీసుకెళ్తాం. ఏటా ఆగస్టులో రెబీస్‌ టీకా వేయిస్తున్నాం.
– వేముల లక్ష్మి, రాజేశం,  గౌతమినగర్, మంచిర్యాల 

టీకాలు తప్పనిసరి..
భైంసాటౌన్‌: కుక్కలు, పిల్లులు వంటి జంతువులను చాలా మంది పెంచుకుంటారు. అయితే ఈ జంతువులు కరిచినప్పుడు తప్పనిసరిగా యాంటీ రేబీస్‌ టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ప్రాణాపాయ పరిస్థితులు నెలకొనే ప్రమాదముంది. పశు వైద్యాధికారుల వద్దకు తీసుకెళ్లి పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలి. పందులు, దోమల ద్వారా మెదడువాపు వ్యాధి, కుక్క కాటుతో రేబిస్‌ వ్యాధి సంక్రమిస్తుంది. కుక్క కాటు వేస్తే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి, చికిత్స తీసుకోవాలి. 
– రమేశ్‌ కుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి 

నేరాల ఛేదనలో కింగ్‌లు
జిల్లాలో నేరాలు, ఘోరాలు జరిగినప్పుడు కేసులను ఛేదించడంలో పోలీసు జాగీలాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో 9 పోలీసు డాగ్‌లు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం ఏడింటిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. రోమ రిటైర్‌మెంట్‌ కాగా రూమి రెస్ట్‌ తీసుకుంటుంది. ప్రస్తుతం తార, రాజ, డైన, చెర్రీ, దీప, గోల్డీ, చిన్న రోమా ఉన్నాయి. వీటిలో తార, రాజ, చెర్రీ, దీప, గోల్డీ వీటిని మర్డర్‌ కేసుల చేదనకు, డైనాను దొంగతనాలు జరిగినప్పుడు, చిన్న రోమాను మత్తు పదార్థాలు, నార్గోటిక్‌ను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నారు.

ఒక్కో జాగిలానికి ప్రభుత్వం నెలకు రూ.5150 చెల్లిస్తోంది. వీటి సంరక్షణ చూసేందుకు 11 మంది సిబ్బంది కూడా ఉన్నారు. చిన్న రోమా 2021 ఫిబ్రవరిలో మత్తుపదార్థ నిల్వలను పసిగట్టడంతో డీజీపీ మహేందర్‌రెడ్డి, డాగ్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జి పసుపు రమేశ్‌కు గోల్డ్‌ మెడల్‌  అందజేశారు. 

ఇటీవల డీజీపీ చేతుల మీదుగా గోల్డ్‌ మెడల్‌ అందుకుంటున్న రోమా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement