Louis Pasteur
-
వరల్డ్ జూనోసిస్ డే: ఇదే రోజు ఎందుకో తెలుసా?
జంతువులంటే ఇష్టపడని వారుండరు. ఎన్నో ఏళ్లుగా కొన్ని రకాల జంతువులు, పక్షులు మనుషుల ఆదరణ చూరగొంటున్నాయి. వాటితో మానవులకు విడదీయలేని బంధం ఏర్పడింది. పాలు, మాంసం, రక్షణ కోసం మానవుడు వాటిపై ఆధారపడుతున్నాడు. అయితే పెట్స్ నుంచి రేబిస్, మెదడువాపు, బర్డ్ ఫ్లూ, ఎబోలా, ప్లేగు, ఆంథ్రాక్స్ వంటి అనేక రకాల వ్యాధులు మానవుడికి సంక్రమించే ప్రమాదం ఉంది. వీటి పట్ల మానవుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పెంపుడు జంతువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి సకాలంలో టీకాలు వేయించడం వల్ల వాటి నుంచి వ్యాధి సంక్రమణను నిరోధించవచ్చు. ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్ డేను పురస్కరించుకుని పెంపుడు జంతువులకు ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. ఇదే రోజు ఎందుకు? మంచిర్యాల అగ్రికల్చర్: 1885 జూలై 6న లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి మొదటిసారిగా వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. ప్రయత్నం విజయవంతం కావడంతో అప్పటినుంచి జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పాటిస్తున్నారు. వీరికి సోకే అవకాశం ఎక్కువ పశువుల కాపరులు, పశువైద్యవృత్తిలో ఉన్నవారు, పశువుల డెయిరీఫాంలలో పనిచేసేవారు, పాల ఉత్పత్తుల్ని ఆహారంగా తీసుకునేవారు, సరదాకోసం కుక్కలు, పక్షులను పెంచుకునేవారికి వ్యాధిసోకే అవకాశం ఎక్కువగా ఉంది. జూనోసిస్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శుచి, శుభ్రత పాటించడం చాలా అవసరం. పోలీసు శాఖలో విశిష్ట సేవలు ఆసిఫాబాద్‌అర్బన్: హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో 8నెలలపాటు స్నీపర్డాగ్తో శిక్షణ పొందిన అనుభూతి జీవితంలో మర్చిపోలేను. జిల్లా కేంద్రంలో స్నీపర్డాగ్స్ 2, ట్రాకర్ డాగ్స్ 3 ఉన్నాయి. ప్రతిరోజు వాటికి భోజనం పెట్టిన తర్వాతే నేను భుజిస్తా. వాటికి ఆహారంగా రాయల్ కెనాల్ భోజనం అందిస్తాం. పోలీసుశాఖలో డాగ్ విశిష్ట సేవలు అందిస్తుంది. ఇటీవల లింగాపూర్‌లో ఓ మహిళపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో డాగ్ చాకచక్యంతోనే వివరాలు సేకరించగలిగాం. ఒక్కో డాగ్ కోసం నెలకు సుమారు రూ.40వేల వరకు వెచ్చిస్తున్నాం. – జి.విలాస్, డాగ్ హైండ్లింగ్ పీసీ, ఆసిఫాబాద్ బ్రూనీతో ఆడుకోవడం చాలా ఇష్టం ఎదులాపురం: మాకు చిన్నప్పటి నుంచి కుక్క పిల్లలంటే చాలా ఇష్టం. మా అమ్మ, నాన్న మాకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఖానాపూర్ నుంచి రూ. 12 వేలకు ఫమిలియన్ జాతికి చెందిన కుక్క పిల్ల బ్రూనీని తీసుకొచ్చారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతీరోజు దానితో ఆడుకుంటున్నాం. బ్రూనీ కొత్త వాళ్లను ఇంటి ఆవరణలోకి రానివ్వకుండా అరుస్తూ ఉంటుంది. దానితో ఆడుకోవడం, దాని బాగోగులు చూసుకోవడమంటే మాకు చాలా ఇష్టం. – శాలినీ, గౌరీ కీర్తన, హౌజింగ్ బోర్డు కాలనీ, ఆదిలాబాద్ కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం ఎదులాపురం: మాకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. కుక్కలతో పాటు ఆవులు, మేకలు, గొర్రెలను పెంచుకుంటాం. వాటిని కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం. వాటితో కలిగే ఆనందం చెప్పలేనిది. ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా టీకాలు, మెడిసిన్, ఇతర వైద్య చికిత్సలు చేయిస్తాం. అదే విధంగా మా ఇంట్లో మూడేళ్ల జర్మన్ షెపడ్ జాతికి చెందిన భాగీ అనే డాగ్‌తో పాటు రాకీ అనే మూడు నెలల రాట్‌విల్లర్ కుక్కపిల్ల కూడా ఉంది. - ఎంబడి శ్రీజ, మావల, ఆదిలాబాద్ అమ్మకు కూతురు.. మాకు చెల్లిలా.. మంచిర్యాలఅగ్రికల్చర్: 25 రోజుల ‘చాక్లెట్ ల్యాబ్రెడ్’ కుక్కపిల్లను తెచ్చి పెంచుకుంటున్నాం. దానికి ‘సూ్నపి’ అని పేరుపెట్టి ముద్దుగా పిలుచుకుంటున్నాం. మా అమ్మకు కూతురిగా మాకు చెల్లెలుగా భావించి ప్రేమగా చూసుకుంటున్నాం. ఉదయం టిఫిన్, రెండు పూటలా అన్నం, రెండు గుడ్లు, పాలు, వారానికి ఒకసారి మాంసం పెడుతున్నాం. ఏడాదికోసారి వ్యాక్సిన్ వేయిస్తున్నాం. వీటికి వేటాడే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. పోలీసులు ఎక్కువగా ల్యాబ్రెడ్ డాగ్స్ వాడుతారు. – బండారి రుద్రతేజ, ఐబీచౌరస్తా, మంచిర్యాల కుటుంబ సభ్యుల్లో ఒకరిలా.. మంచిర్యాలఅగ్రికల్చర్: మా ఇంట్లో ఐదేళ్లుగా ‘రోష్’ సందడి చేస్తోంది. జమ్మూ నుంచి తీసుకువచ్చిన ‘రాట్ విల్లర్’ జాతికి చెందిన ఈ శునకంపై మాకుటుంబ సభ్యులందరికీ ఎనలేని ప్రేమ. 2016 లో ఐదునెలల వయస్సు ఉన్నప్పుడు తీసుకువచ్చాం. రోష్‌కు మూడు పూటలా భోజనం, పాలు, మాంసం, గుడ్లు అందిస్తున్నాం. రోజూ స్నానం చేయిస్తాం. జాగింగ్‌కు తీసుకెళ్తాం. ఏటా ఆగస్టులో రెబీస్ టీకా వేయిస్తున్నాం. – వేముల లక్ష్మి, రాజేశం, గౌతమినగర్, మంచిర్యాల టీకాలు తప్పనిసరి.. భైంసాటౌన్: కుక్కలు, పిల్లులు వంటి జంతువులను చాలా మంది పెంచుకుంటారు. అయితే ఈ జంతువులు కరిచినప్పుడు తప్పనిసరిగా యాంటీ రేబీస్ టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ప్రాణాపాయ పరిస్థితులు నెలకొనే ప్రమాదముంది. పశు వైద్యాధికారుల వద్దకు తీసుకెళ్లి పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలి. పందులు, దోమల ద్వారా మెదడువాపు వ్యాధి, కుక్క కాటుతో రేబిస్ వ్యాధి సంక్రమిస్తుంది. కుక్క కాటు వేస్తే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి, చికిత్స తీసుకోవాలి. – రమేశ్ కుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి నేరాల ఛేదనలో కింగ్‌లు జిల్లాలో నేరాలు, ఘోరాలు జరిగినప్పుడు కేసులను ఛేదించడంలో పోలీసు జాగీలాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో 9 పోలీసు డాగ్‌లు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం ఏడింటిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. రోమ రిటైర్మెంట్ కాగా రూమి రెస్ట్ తీసుకుంటుంది. ప్రస్తుతం తార, రాజ, డైన, చెర్రీ, దీప, గోల్డీ, చిన్న రోమా ఉన్నాయి. వీటిలో తార, రాజ, చెర్రీ, దీప, గోల్డీ వీటిని మర్డర్ కేసుల చేదనకు, డైనాను దొంగతనాలు జరిగినప్పుడు, చిన్న రోమాను మత్తు పదార్థాలు, నార్గోటిక్ను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నారు. ఒక్కో జాగిలానికి ప్రభుత్వం నెలకు రూ.5150 చెల్లిస్తోంది. వీటి సంరక్షణ చూసేందుకు 11 మంది సిబ్బంది కూడా ఉన్నారు. చిన్న రోమా 2021 ఫిబ్రవరిలో మత్తుపదార్థ నిల్వలను పసిగట్టడంతో డీజీపీ మహేందర్‌రెడ్డి, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జి పసుపు రమేశ్‌కు గోల్డ్ మెడల్ అందజేశారు. ఇటీవల డీజీపీ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంటున్న రోమా -
గబ్బిలమే కాదు.. కోడి, కుక్క, పిల్లి కూడా ప్రమాదకరమే
నానో టెక్నాలజీలో ఎన్నో ఆవిష్కరణలు కనుగొంటున్న సమయంలో కంటికి కనిపించని అతి చిన్న వైరస్ మానవ మనుగడను ప్రమాదంలో పడేసింది. కరోనా వైరస్ మనిషికి ఎలా సోకిందనే దానిపై అనేక వాదనలు ఉన్నా... ఇప్పటికీ గబ్బిలం నుంచి వచ్చిందని నమ్మేవారే ఎక్కువ. జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకడం ఎప్పటి నుంచి ఉంది , దీన్ని అరికట్టేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెబ్‌డెస్క్: జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న మనిషి ప్రయాణానికి సడెన్ బ్రేక్ వేసి, గట్టి జర్క్ ఇచ్చింది కరోనా వైరస్. గబ్బిలం నుంచి పాంగోలిన్ ద్వారా మనుషులకు సోకిన కరోనా రెండేళ్లుగా జన జీవనాన్ని స్థంభింపచేస్తోంది. ఒక్క గబ్బిలమనే కాదు ఎలుక, కుక్క, పంది, ఆవు, పావురం, కుందేలు ఇలా మన చుట్టూ మనతో పాటు కలిసి బతుకున్న ఎన్నో జంతువులు, పక్షులు, క్రిమి కీటకాల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా మనకు వైరస్, బ్యాక్టీరియా, ఇతర పరాన్న జీవుల వ్యాప్తి జరుగుతుంది. అదే విధంగా మనుషుల నుంచి జంతువులకు వ్యాధులు సంక్రమిస్తున్నాయి. దీని వల్ల ఇరువైపులా కొత్త రకం వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. దీన్నే జూనోసిస్ అంటారు. జూనోసెస్ వ్యాధులు పురాతన కాలం నుంచి జూనోసెస్ వల్ల ఎన్నో వ్యాధులు సోకాయి. ఉదాహరణకు కుక్కల నుంచి రేబిస్, గబ్బిలం నుంచి నిఫా, పశువుల నుంచి మ్యాడ్ కౌ, కోళ్ల నుంచి ఫ్లూ తదితర రోగాలు సంక్రమించాయి. ఇప్పటి వరకు వేల కొద్ది జూనోసిస్ వ్యాధులు సంక్రమించినా... ఎక్కువ ప్రభావం చూపించినవి 156 వరకు ఉన్నాయి. అందులో రేబీస్, ప్లేగు, టీబీ, కలరా, మలేరియా, సాల్మోనెల్లా, స్కాబీస్ వంటివి ఉన్నాయి. వీటిలో చాలా వాటికి టీకాలతో ప్రమాద తీవ్రత తగ్గించగలిగారు. ఇటీవల కాలంలో సార్స్, ఎబోలా, జీకా, నిఫా, సాల్మోనెల్లా, కరోనాలు మానవాళికి ముప్పుగా మారాయి. ఇందులో కరోనా అయితే ఏకంగా ప్యాండమిక్ స్థాయికి చేరుకుంది. లూయి ప్యాక్చర్ గుర్తుగా జూనోసిస్ వ్యాధుల నివారణ, చికిత్స కోసం ఎంతో కాలం శ్రమించగా చివరకు 1885 జులై 6న లూయి ప్యాక్చర్ తొలిసారిగా కుక్క నుంచి సోకిన రేబిస్కి టీకాను కనిపెట్టారు. ఆయన జ్ఞాపకార్థం ప్రతీ ఏడు జులై 6న జూనోసెస్ డేను పాటిస్తున్నారు. ప్రివెంట్ ది ప్యాండెమిక్ కరోనా నేపథ్యంలో ఈ సారి జూనోసెస్ డే పట్ల ప్రపంచం మొత్తం ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా అనేక మంది జీవితాలు అంతమవగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరెందరో జీవితాలు ఇరుకున పడ్డాయి. దీంతో జూనోసెస్ వ్యాధులపై మరింత అవగాహన కల్పించాలనే నినాదం ముక్తకంఠంతో వినిపిస్తోంది. ‘ ప్రివెంట్ ద నెక్ట్స్ ప్యాండెమిక్ : జూనోటిక్ డిసీజెస్ అండ్ హౌ టూ బ్రేక్ ది చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ’ థీమ్‌తో 2021 కి సంబంధించిన జూనోసెస్ డేని నిర్వహిస్తున్నారు. లైవ్స్టాక్పై దృష్టి భూమిపై జనాభా రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో ఆహార అవసరాల కోసం కోళ్లు, మేకలు, పందులు, పశువులు, పక్షులు (లైవ్ స్టాక్)లతో పాటు ఇతర జీవజాలంపై ఆధారపడుతున్నాం. మాంసాహారం కోసం భారీ ఎత్తున లైవ్ స్టాక్ పెంచుతున్నాం. అయితే ఇందుకు తగ్గ జాగ్రత్తలు, మేలైన యాజమాన్య పద్దతులు అమలు చేయడంలో విఫలమవుతున్నాం. ఫలితంగా జంతువుల నుంచి మానవులకు వైరస్, బ్యాక్టరీయాల వ్యాప్తి పెరిగిపోతుంది. దీన్ని అరికట్టేందుకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హెల్త్‌పై ఫోకస్ కరోనా మహమ్మారి ఇచ్చిన చేదు అనుభవంతో లైవ్ స్టాక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందుకు తగ్గట్టుగా వెటర్నిటీ, మెడికల్, ఎన్విరాన్మెంట్ మూడింటిని సమ్మిళతం చేస్తూ సరికొత్త పరిశోధనలు చేయాలని డిసైడ్ అయ్యారు. తద్వారా అనారోగ్య సమస్యలు, ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. -
పెంపుడు జంతువులతో జర జాగ్రత్త..!
సాక్షి, ఖమ్మం: పిచ్చికుక్క కాటుకు రేబిస్ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకాను జూలై 6న కనుగొన్నారు. ఆ రోజును ప్రపంచ వ్యాప్తంగా ‘జూనోసిస్ డే’ను జరుపుకుంటారు. పశువులు, జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు సంక్రమించే వ్యాధులను జోనోటిక్’ వ్యాధులు అంటారు. ఈ వ్యా«ధులు ప్రమాదకరమైనవి. మరణాలు కూడా సంభవిస్తాయి. 1885 జూలై 6న లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటు వ్యాధి (రేబిస్) నివారణకు రేబిస్ టీకాలను కుక్క కాటుకు గురైన జోసెఫ్ మీస్టర్ అనే బాలుడిపై ప్రయోగించి విజయం సాధించారు. అప్పటి నుంచి పెంపుడు జంతువులకు రాబిస్ వ్యాధి సోకకుండా యాంటీరాబిస్ టీకాను ఇస్తారు. జోనోటిక్ వ్యాధి కారణంగా మరో 200 వ్యాధులు సంక్రమిస్తాయి. మానవుడు పాలు, మాంసం, కోసం పెంపుడు జంతువులను, కోళ్లను పెంచుతుంటారు. మానసిక ఉల్లాసం కోసం కుక్కలను పెంచుతున్నారు. పెంపుడు జంతువులు, కోళ్ల పెంపకం వలన కూడా మానవుడు అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. ప్రపంచంలో ప్రతి ఏటా దాదాపు 20 వేల మందికి పైగా రేబిస్ వ్యాధి వలన మరణిస్తున్నారు. 3 మిలియన్ల మంది పిచ్చికుక్కల కాటున పడి రేబిస్ వ్యాధి టీకాలు చేయించుకుంటున్నారు. 1995లో ప్రపంచంలో రేబిస్ వ్యాధి కారణంగా దాదాపు 70 వేల మంది మరణించారు. వీరిలో 35 వేల మంది భారతీయలు ఉన్నారు. పొలం పనులు చేసే రైతులు, తోళ్ల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, వ్యాధులు సోకి చనిపోయిన జంతువుల మాంసాన్ని తినేవాళ్లు, పెంపుడు కుక్కలతో సన్నిహితంగా మెలిగే వారు జోనోటిక్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. జోనోటిక్ వ్యాధుల రకాలు, వాటి నివారణపై ఖమ్మం పశువ్యాధి నిర్దారణ ప్రయోగశాల సహాయ సంచాలకులు డాక్టర్ అరుణ వివరించారు. జోనోటిక్ వ్యాధి 7 రకాలు ► బ్యాక్టీరియా: ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్ లెప్టోస్పైరోసిస్, క్షయ ► వైరస్: రేబిస్, బర్డ్‌ఫ్లూ, మెదడు వాపు, సార్స్, మేడ్‌కౌడిసీజ్ ► ప్రొటోజోవా: టాక్సోప్లాస్మోడియా, లీష్మెనీయాసిస్ ► రెకెట్చియా: టిక్, టైఫస్, క్యూఫీవర్ ► హెల్నింథ్స్: ఎకైనోకోకోసిస్, టీనియాసిస్ ► ఎక్టోపారసైట్స్: స్కేజిస్ పిచ్చికుక్క కాటు వ్యాధి (రేబిస్): పిచ్చికుక్క కాటు ద్వారా వ్యాప్తి చెందే అతి భయంకరమైన వ్యాధి రేబిస్. పిచ్చికుక్కల లాలాజలంలో వ్యాధికారకం ‘రేబిస్’ వైరస్ ఉంటుంది. మనుషుల శరీరంపై ఉన్న పుండును నాకినా లాలాజలం ద్వారా వ్యాధి సోకుతుంది. కుక్క కరిచిన వారం నుంచి 10 రోజుల లోపుగా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ♦ మనుషుల్లో ఈ వ్యాధిని హైడ్రోఫోబియా అంటారు. ♦ ఈ వ్యాధి సోకిన మనిషి గుటక వేయలేడు. ♦ దాహం వేస్తున్నా నీళ్లు తాగలేరు. నివారణ: కుక్క కరిచిన వెంటనే ఆ భాగాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. డాక్టర్‌ను సంప్రదించి తగు చికిత్స చేయించుకోవాలి. పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేయించాలి. బర్డ్‌ప్లూ వ్యాధి బర్డ్‌ఫ్లూ లేదా ఇన్‌ప్లూయాంజా వ్యాధి కోళ్లను, ఇతర పక్షులను ఆశిస్తుంది. ఇది వైరస్ వలన కలిగే వ్యాధి. ఈ వైరస్‌లో 144 ఉపరకాలున్నాయి. ఇది కోళ్లు, పక్షుల నుంచి మానవాళికి సంభవిస్తుంది. 1997లో ఖండాతర వ్యాధిగా రూపొంది చాలా దేశాల్లో కోట్లాది కోళ్లు మరణించాయి. ఈ వ్యాధి సోకిన కోళ్లు, పక్షులు అకస్మాత్తుగా మరణిస్తాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జలుబు, గొంతునొప్పి, దగ్గు, కండ్ల కలకలతో మొదలై ఊపిరితిత్తుల్లో రక్తం చేరి మరణానికి దారి తీస్తుంది. మెదడు వాపు ఇది వైరస్ వలన కలిగే వ్యాధి. వ్యాధి కారక వైరస్ క్రిములు పందుల నుంచి దోమకాటు ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఇళ్ల దగ్గర పందుల సంచారం లేకుండా చూసుకోవాలి. దోమల నివారణ చర్యలు చేపట్టి ఈ వ్యాధిని అరికట్టుకోవాలి. ఆంత్రాక్స్ దోమ వ్యాధి ఈ వ్యాధి బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. జంతువులు, మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఇది చాలా ప్రమాదకరమైనది. వ్యాధి సోకిన పశువుల పొట్ట ఉబ్బి అకస్మాత్తుగా చనిపోతాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జ్వరం, న్యూమోనియా వస్తుంది. బ్రూసెల్లోసిస్ ఈ వ్యాధి పశువుల్లో బ్రూసెల్లా అబార్టస్ బూసెల్లా మెలిటెన్సిస్ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఈ వ్యాధి అన్ని జాతుల పశువులకు, మనుషులకు సోకుతుంది. వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వచ్చి ఈసుకుపోతాయి. మగ పశువుల్లో తాత్కాలికంగా లేదా శాశ్వితంగా వ్యందత్వం ఏర్పడుతుంది. జోనోటిక్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ⇒∙జోనోటిక్ వ్యాధులన్నీ పశువులకు సోకకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ⇒ వీధి కుక్కలకు యాంటీరేబిస్ టీకాలు వేయించి లైసెన్సులు ఇవ్వాలి. ⇒ పెంపుడు జంతువులతో, కోళ్లతో సన్నిహింతగా మెలిగే వాళ్లు జోనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. -
శుచి-శుభ్రతే ముఖ్యం.. ఏం చేయాలి?
రేపు జూనోసిస్ డే పాడి-పంట: మనుషుల నుంచి పశువులకు, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే స్వభావం ఉన్న వ్యాధుల్ని జూనోటిక్ వ్యాధులు అంటారు. ఈ రకంగా సుమారు 200 వ్యాధులు సంక్రమిస్తాయని అంచనా. వీటి బారిన పడితే ప్రాణాలు కూడా పోవచ్చు. కాబట్టి వీటిపై ప్రజలకు సరైన అవగాహన ఉండడం మంచిది. 1885 జూలై 6న లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త తొలిసారిగా యాంటీ రేబిస్ టీకాను ఉపయోగించి, పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు. అందుకే ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీని ‘జూనోసిస్ డే’గా పాటిస్తున్నారు. ఎలా వ్యాపిస్తాయి? గాలి, నీరు, ఆహారం, కలుషితమైన పశు ఉత్పత్తుల ద్వారా జూనోటిక్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఇవి వైరస్, బాక్టీరియా, పరాన్నజీవుల ద్వారా కూడా వ్యాపించి మనుషుల ప్రాణాలు హరిస్తాయి. వైరస్ కారణంగా సంక్రమించే వ్యాధుల్లో అత్యంత ప్రాణాంతకమైనది రేబిస్. పిచ్చికుక్క కాటు వల్ల సోకే ఈ వ్యాధి కారణంగా ఏటా మన దేశంలో 20-30 వేల మంది చనిపోతున్నారు. అలాగే మెదడువాపు (జపనీస్ ఎన్సెఫలైటిస్) వ్యాధి కారణంగా ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. విచ్చలవిడిగా తిరిగే పందుల శరీరంపై దోమలు కాటేయడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇక బాక్టీరియా ద్వారా బ్రూసెల్లోసిస్, సాల్మోసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, దొమ్మ, గ్లాండర్స్ వ్యాధులు సంక్రమిస్తాయి. పరాన్నజీవుల కారణంగా అంకైలోస్టోమియాసిస్, హైడాటిడోసిస్, అలర్జీ, గజ్జి, అమీబియాసిస్, బాలాంటిడియాసిస్, టాక్సోప్లాస్మా వ్యాధులు సోకుతాయి. వీరికి జాగ్రత్తలు అవసరం కుక్కలతో సన్నిహితంగా మెలిగే వారికి రేబిస్, హైడాటిడోసిస్ వ్యాధులు వస్తాయి. కొమ్ములు, చర్మం, ఎముకలతో సంబంధం ఉండే పరిశ్రమల్లో పనిచేసే వారికి, కసాయి వారికి దొమ్మ వ్యాధి సోకుతుంది. డెయిరీ ఫారాల్లో పనిచేసే సిబ్బందికి, పశు వైద్యులకు బ్రూసెల్లోసిస్ రావచ్చు. కలుషితమైన పాలను ఉపయోగించే వారికి క్షయ, పౌల్ట్రీ ఫారాల్లో పనిచేసే వారికి సిట్టకోసిస్, ఎలుకలు ఎక్కువగా సంచరించే ధాన్యం గోదాముల్లో తిరిగే వారికి లెప్టోస్పైరోసిస్ సోకే ప్రమాదం ఉంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు టీబీ, సాల్మోనెల్లోసిస్, లిస్టిరియోసిస్ వంటి జూనోటిక్ వ్యాధులు త్వరగా సోకే అవకాశం ఉంది. కాబట్టి వీరందరూ ఆయా వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధులు సోకుతాయి పశువుల కారణంగా మశూచి, బ్రూసెల్లోసిస్, దొమ్మ, టీబీ, రేబిస్, మ్యాడ్ కౌ, గాలికుంటు, పాశ్చరెల్లోసిస్ వ్యాధులు వ్యాపిస్తాయి. మేకల ద్వారా మశూచి, అస్పర్జిల్లస్, రింగ్వార్మ్, తలసేమియా, లిస్టిరియోసిస్ సోకుతాయి. గుర్రాల కారణంగా మెదడువాపు, దొమ్మ, టీబీ, బ్రూసెల్లోసిస్, రింగ్వార్మ్, గ్లాండర్స్ వ్యాధులు వస్తాయి. పందులు టీబీ, రేబిస్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, మెదడువాపు, ఇన్ఫ్లుయంజా వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. కుక్కల ద్వారా రేబిస్, బ్రూసెల్లోసిస్, లిస్టిరియోసిస్, లెప్టోస్పైరోసిస్, హైడాటిడోసిస్, ప్లేగు, లైష్మేనియాసిస్ వ్యాధులు వస్తాయి. ఎలుకలు ప్లేగు, లెప్టోస్పైరోసిస్, మెదడువాపు, క్యూఫీవర్ వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. కోతుల కారణంగా డెంగ్యూ, అమీబియాసిస్, ఫైలేరియాసిస్, రేబిస్, సాల్మోనెల్లోసిస్, మీజిల్స్, కైసనూర్ ఫారెస్ట్ వ్యాధులు వస్తాయి. కుందేళ్ల ద్వారా తలసేమియా, గజ్జి, లిస్టిరియోసిస్, టాక్సోఫ్లాస్మోసిస్, స్మాటిడ్ ఫీవర్ వ్యాధులు వస్తాయి. పక్షులు సాల్మోనెల్లోసిస్, లిస్టిరియోసిస్, టాక్సోఫ్లాస్మోసిస్, మెదడువాపు, ప్లేగు, సిట్టకోసిస్, అస్పర్జిల్లోసిస్ వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. ఇప్పటికే పలు దేశాలు జూనోటిక్ వ్యాధుల నిర్మూలనకు నడుం బిగించాయి. ఆ దిశగా కొన్ని దేశాలు విజయం సాధించాయి కూడా. కాబట్టి జూనోటిక్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించడానికి పశు సంవర్ధక, ఆరోగ్య, పంచాయితీ, మున్సిపల్ శాఖలు జూలై 6వ తేదీన (ఆదివారం) వివిధ కార్యక్రమాలు చేపట్టాలి. పల్స్‌పోలియో, హెపటైటిస్, ఎయిడ్స్ వంటి వ్యాధులపై ప్రజలను చైతన్యపరుస్తున్న లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలు రేబిస్ విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. నివారణ ఇలా... మన దేశంలో సోకే జూనోటిక్ వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది రేబిస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం 75% కంటే ఎక్కువ కుక్కలకు రేబిస్ నిరోధక టీకాలు వేస్తే తప్ప ఈ వ్యాధిని నిర్మూలించలేము. కాబట్టి ప్రజలందరూ జూనోసిస్ డే రోజున పెంపుడు కుక్కలకు విధిగా టీకాలు వేయించాలి. టీకాలు వేయించని ఊరకుక్కల్ని నిర్మూలించాలి. కుక్కలతో సన్నిహితంగా ఉండేవారు, పశు వైద్యులు కూడా ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేయించుకోవడం మంచిది. పశువులు, కుక్కలకు క్రమం తప్పకుండా అంతర పరాన్నజీవుల నిర్మూలన మందుల్ని తాగిస్తే వాటి ద్వారా సంక్రమించే వ్యాధుల్ని నివారించవచ్చు. పందుల్ని గ్రామానికి దూరంగా, పరిశుభ్రమైన వాతావరణంలో పోషిస్తే మెదడువాపు వ్యాధి బారి నుంచి రక్షణ పొందవచ్చు. శుచి, శుభ్రత పాటిస్తే జూనోటిక్ వ్యాధులు దరిచేరవు. పాలు, మాంసం, గుడ్లు మొదలైన పశు ఉత్పత్తుల్ని విధిగా ఉడికించి తీసుకోవాలి. పరిసరాలు, పశువుల పాకల్ని ఎప్పటికప్పుడు క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి. చనిపోయిన పశు కళేబరాలను లోతైన గోతిలో పాతిపెట్టాలి. -డాక్టర్ సిహెచ్.రమేష్ హైదరాబాద్