నానో టెక్నాలజీలో ఎన్నో ఆవిష్కరణలు కనుగొంటున్న సమయంలో కంటికి కనిపించని అతి చిన్న వైరస్ మానవ మనుగడను ప్రమాదంలో పడేసింది. కరోనా వైరస్ మనిషికి ఎలా సోకిందనే దానిపై అనేక వాదనలు ఉన్నా... ఇప్పటికీ గబ్బిలం నుంచి వచ్చిందని నమ్మేవారే ఎక్కువ. జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకడం ఎప్పటి నుంచి ఉంది , దీన్ని అరికట్టేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వెబ్‌డెస్క్: జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న మనిషి ప్రయాణానికి సడెన్ బ్రేక్ వేసి, గట్టి జర్క్ ఇచ్చింది కరోనా వైరస్. గబ్బిలం నుంచి పాంగోలిన్ ద్వారా మనుషులకు సోకిన కరోనా రెండేళ్లుగా జన జీవనాన్ని స్థంభింపచేస్తోంది. ఒక్క గబ్బిలమనే కాదు ఎలుక, కుక్క, పంది, ఆవు, పావురం, కుందేలు ఇలా మన చుట్టూ మనతో పాటు కలిసి బతుకున్న ఎన్నో జంతువులు, పక్షులు, క్రిమి కీటకాల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా మనకు వైరస్, బ్యాక్టీరియా, ఇతర పరాన్న జీవుల వ్యాప్తి జరుగుతుంది. అదే విధంగా మనుషుల నుంచి జంతువులకు వ్యాధులు సంక్రమిస్తున్నాయి. దీని వల్ల ఇరువైపులా కొత్త రకం వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. దీన్నే జూనోసిస్ అంటారు.
జూనోసెస్ వ్యాధులు
పురాతన కాలం నుంచి జూనోసెస్ వల్ల ఎన్నో వ్యాధులు సోకాయి. ఉదాహరణకు కుక్కల నుంచి రేబిస్, గబ్బిలం నుంచి నిఫా, పశువుల నుంచి మ్యాడ్ కౌ, కోళ్ల నుంచి ఫ్లూ తదితర రోగాలు సంక్రమించాయి. ఇప్పటి వరకు వేల కొద్ది జూనోసిస్ వ్యాధులు సంక్రమించినా... ఎక్కువ ప్రభావం చూపించినవి 156 వరకు ఉన్నాయి. అందులో రేబీస్, ప్లేగు, టీబీ, కలరా, మలేరియా, సాల్మోనెల్లా, స్కాబీస్ వంటివి ఉన్నాయి. వీటిలో చాలా వాటికి టీకాలతో ప్రమాద తీవ్రత తగ్గించగలిగారు. ఇటీవల కాలంలో సార్స్, ఎబోలా, జీకా, నిఫా, సాల్మోనెల్లా, కరోనాలు మానవాళికి ముప్పుగా మారాయి. ఇందులో కరోనా అయితే ఏకంగా ప్యాండమిక్ స్థాయికి చేరుకుంది.
లూయి ప్యాక్చర్ గుర్తుగా
జూనోసిస్ వ్యాధుల నివారణ, చికిత్స కోసం ఎంతో కాలం శ్రమించగా చివరకు 1885 జులై 6న లూయి ప్యాక్చర్ తొలిసారిగా కుక్క నుంచి సోకిన రేబిస్‌కి టీకాను కనిపెట్టారు. ఆయన జ్ఞాపకార్థం ప్రతీ ఏడు జులై 6న జూనోసెస్ డేను పాటిస్తున్నారు.
ప్రివెంట్ ది ప్యాండెమిక్
కరోనా నేపథ్యంలో ఈ సారి జూనోసెస్ డే పట్ల ప్రపంచం మొత్తం ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా అనేక మంది జీవితాలు అంతమవగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరెందరో జీవితాలు ఇరుకున పడ్డాయి. దీంతో జూనోసెస్ వ్యాధులపై మరింత అవగాహన కల్పించాలనే నినాదం ముక్తకంఠంతో వినిపిస్తోంది. ‘ ప్రివెంట్ ద నెక్ట్స్ ప్యాండెమిక్ : జూనోటిక్ డిసీజెస్ అండ్ హౌ టూ బ్రేక్ ది చైన్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ ’ థీమ్‌తో 2021 కి సంబంధించిన జూనోసెస్ డేని నిర్వహిస్తున్నారు.
లైవ్‌స్టాక్‌పై దృష్టి
భూమిపై జనాభా రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో ఆహార అవసరాల కోసం కోళ్లు, మేకలు, పందులు, పశువులు, పక్షులు (లైవ్ స్టాక్)లతో పాటు ఇతర జీవజాలంపై ఆధారపడుతున్నాం. మాంసాహారం కోసం భారీ ఎత్తున లైవ్ స్టాక్ పెంచుతున్నాం. అయితే ఇందుకు తగ్గ జాగ్రత్తలు, మేలైన యాజమాన్య పద్దతులు అమలు చేయడంలో విఫలమవుతున్నాం. ఫలితంగా జంతువుల నుంచి మానవులకు వైరస్, బ్యాక్టరీయాల వ్యాప్తి పెరిగిపోతుంది. దీన్ని అరికట్టేందుకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
హెల్త్‌పై ఫోకస్
కరోనా మహమ్మారి ఇచ్చిన చేదు అనుభవంతో లైవ్ స్టాక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందుకు తగ్గట్టుగా వెటర్నిటీ, మెడికల్, ఎన్విరాన్‌మెంట్ మూడింటిని సమ్మిళతం చేస్తూ సరికొత్త పరిశోధనలు చేయాలని డిసైడ్ అయ్యారు. తద్వారా అనారోగ్య సమస్యలు, ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని అభిప్రాయం క్రమంగా బలపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment