rabis
-
గబ్బిలమే కాదు.. కోడి, కుక్క, పిల్లి కూడా ప్రమాదకరమే
నానో టెక్నాలజీలో ఎన్నో ఆవిష్కరణలు కనుగొంటున్న సమయంలో కంటికి కనిపించని అతి చిన్న వైరస్ మానవ మనుగడను ప్రమాదంలో పడేసింది. కరోనా వైరస్ మనిషికి ఎలా సోకిందనే దానిపై అనేక వాదనలు ఉన్నా... ఇప్పటికీ గబ్బిలం నుంచి వచ్చిందని నమ్మేవారే ఎక్కువ. జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకడం ఎప్పటి నుంచి ఉంది , దీన్ని అరికట్టేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెబ్‌డెస్క్: జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న మనిషి ప్రయాణానికి సడెన్ బ్రేక్ వేసి, గట్టి జర్క్ ఇచ్చింది కరోనా వైరస్. గబ్బిలం నుంచి పాంగోలిన్ ద్వారా మనుషులకు సోకిన కరోనా రెండేళ్లుగా జన జీవనాన్ని స్థంభింపచేస్తోంది. ఒక్క గబ్బిలమనే కాదు ఎలుక, కుక్క, పంది, ఆవు, పావురం, కుందేలు ఇలా మన చుట్టూ మనతో పాటు కలిసి బతుకున్న ఎన్నో జంతువులు, పక్షులు, క్రిమి కీటకాల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా మనకు వైరస్, బ్యాక్టీరియా, ఇతర పరాన్న జీవుల వ్యాప్తి జరుగుతుంది. అదే విధంగా మనుషుల నుంచి జంతువులకు వ్యాధులు సంక్రమిస్తున్నాయి. దీని వల్ల ఇరువైపులా కొత్త రకం వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. దీన్నే జూనోసిస్ అంటారు. జూనోసెస్ వ్యాధులు పురాతన కాలం నుంచి జూనోసెస్ వల్ల ఎన్నో వ్యాధులు సోకాయి. ఉదాహరణకు కుక్కల నుంచి రేబిస్, గబ్బిలం నుంచి నిఫా, పశువుల నుంచి మ్యాడ్ కౌ, కోళ్ల నుంచి ఫ్లూ తదితర రోగాలు సంక్రమించాయి. ఇప్పటి వరకు వేల కొద్ది జూనోసిస్ వ్యాధులు సంక్రమించినా... ఎక్కువ ప్రభావం చూపించినవి 156 వరకు ఉన్నాయి. అందులో రేబీస్, ప్లేగు, టీబీ, కలరా, మలేరియా, సాల్మోనెల్లా, స్కాబీస్ వంటివి ఉన్నాయి. వీటిలో చాలా వాటికి టీకాలతో ప్రమాద తీవ్రత తగ్గించగలిగారు. ఇటీవల కాలంలో సార్స్, ఎబోలా, జీకా, నిఫా, సాల్మోనెల్లా, కరోనాలు మానవాళికి ముప్పుగా మారాయి. ఇందులో కరోనా అయితే ఏకంగా ప్యాండమిక్ స్థాయికి చేరుకుంది. లూయి ప్యాక్చర్ గుర్తుగా జూనోసిస్ వ్యాధుల నివారణ, చికిత్స కోసం ఎంతో కాలం శ్రమించగా చివరకు 1885 జులై 6న లూయి ప్యాక్చర్ తొలిసారిగా కుక్క నుంచి సోకిన రేబిస్కి టీకాను కనిపెట్టారు. ఆయన జ్ఞాపకార్థం ప్రతీ ఏడు జులై 6న జూనోసెస్ డేను పాటిస్తున్నారు. ప్రివెంట్ ది ప్యాండెమిక్ కరోనా నేపథ్యంలో ఈ సారి జూనోసెస్ డే పట్ల ప్రపంచం మొత్తం ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా అనేక మంది జీవితాలు అంతమవగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరెందరో జీవితాలు ఇరుకున పడ్డాయి. దీంతో జూనోసెస్ వ్యాధులపై మరింత అవగాహన కల్పించాలనే నినాదం ముక్తకంఠంతో వినిపిస్తోంది. ‘ ప్రివెంట్ ద నెక్ట్స్ ప్యాండెమిక్ : జూనోటిక్ డిసీజెస్ అండ్ హౌ టూ బ్రేక్ ది చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ’ థీమ్‌తో 2021 కి సంబంధించిన జూనోసెస్ డేని నిర్వహిస్తున్నారు. లైవ్స్టాక్పై దృష్టి భూమిపై జనాభా రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో ఆహార అవసరాల కోసం కోళ్లు, మేకలు, పందులు, పశువులు, పక్షులు (లైవ్ స్టాక్)లతో పాటు ఇతర జీవజాలంపై ఆధారపడుతున్నాం. మాంసాహారం కోసం భారీ ఎత్తున లైవ్ స్టాక్ పెంచుతున్నాం. అయితే ఇందుకు తగ్గ జాగ్రత్తలు, మేలైన యాజమాన్య పద్దతులు అమలు చేయడంలో విఫలమవుతున్నాం. ఫలితంగా జంతువుల నుంచి మానవులకు వైరస్, బ్యాక్టరీయాల వ్యాప్తి పెరిగిపోతుంది. దీన్ని అరికట్టేందుకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హెల్త్‌పై ఫోకస్ కరోనా మహమ్మారి ఇచ్చిన చేదు అనుభవంతో లైవ్ స్టాక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందుకు తగ్గట్టుగా వెటర్నిటీ, మెడికల్, ఎన్విరాన్మెంట్ మూడింటిని సమ్మిళతం చేస్తూ సరికొత్త పరిశోధనలు చేయాలని డిసైడ్ అయ్యారు. తద్వారా అనారోగ్య సమస్యలు, ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. -
శునకాలకు..సారీ..!
ఛీ కుక్క..అనే ముందు ఏం కుక్కా బాగున్నావా అని ఎవరైనా అంటారా? రాత్రుల్లో గూర్ఖాలా కాపలా కాస్తుంది దొంగలొస్తే భౌ..భౌ మంటుంది యజమాని నిద్రపోతుంటే చుట్టూ చక్కర్లు కొడుతుంది ఊరికెళుతుంటే ఏడుస్తుంది ఆకలైతే అన్ని ఇళ్లకూ తిరిగి జాలిగా చూస్తుంది.. చంటి పిల్లలకు చక్కిలిగింతలు పెడుతుంది పోలీసు కేసులను ఛేదిస్తుంది సర్కస్‌లో ఫీట్లు చేస్తుంది చివరకు యజమాని మరణిస్తే సమాధి దగ్గర కూర్చుని రోదిస్తుంది.. మళ్లీ ఆయన కనిపించాలని కాళ్లతో మట్టి తవ్వుతుంది ఇలాంటి కుక్కలను ఛీ అందామా.. శభాష్ అందామా.. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు మీ ప్రియ శునకాలకు వేయిస్తే నిశ్చంతగా ఉండొచ్చు వ్యాధి వస్తుందనే భయం వీడొచ్చు... సాక్షి, చీరాల అర్బన్: ర్యాబిస్ వ్యాధి సోకితే చికిత్స లేదనేది వాస్తవమే కానీ.. అన్ని కుక్కల వల్ల ర్యాబిస్ వస్తుందనేని అపోహ మాత్రమే. అవగాహన లోపం కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం జూనోసిస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. ర్యాబిస్ వ్యాధి రాబ్డో అనే వైరస్ వలన సోకుతుంది. ఈ వైరస్ ఎక్కువగా అడవుల్లో ఉండే క్రూర జంతువులు, గబ్బిలాల్లో ఎటువంటి లక్షణాలు చూపించకుండా ఉంటుంది. ఈ వైరస్ గాలి, నీటి ద్వారా మార్పిడి చెందుతుంది. మృగాలు, గబ్బిలాలు చనిపోవడం, వాటిని కుక్కలు తినడం వలన వాటిలో ఉన్న వైరస్ కుక్కలకు వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ ఉన్న కుక్కలు మనుషులను, పశువులపు కరవడం వలన లాలాజలం ద్వారా సంక్రమిస్తుంది. ర్యాబిస్ వ్యాధి వలన ప్రపంచవ్యాప్తంగా 35 వేల మంది మరణిస్తున్నారు. ఈ మరణాలు 60 శాతం భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. ఈ వైరస్ మనుషులకు, పశువులకు వ్యాప్తి చెందడంలో కుక్కలు వారధిగా పనిచేస్తుంటాయి. చనిపోయిన ర్యాబిస్ వ్యాధి సోకిన పశువులను, గబ్బిలాల కళేబరాలను కుక్కలు తినడం వలన ఈ వైరస్ కుక్కలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి వలన కుక్కలు మానసిక స్థితిని కోల్పోయి విచిత్రంగా ప్రవర్తిస్తాయి. ఈ వ్యాధి సోకిన కుక్కలు మనుషులను, పశువులను కరవడం వలన వ్యాధి సోకి వింతగా ప్రవర్తిస్తారు. వ్యాధిని గుర్తించకపోవడం వలన కొన్ని రోజుల్లో జీవులు మరణిస్తాయి. పెంపుడు కుక్కలతో పాటు వాటిని పెంచేవారికి, డాక్టర్లు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ర్యాబిస్ వ్యాధి సోకిన పశువులు, మనుషుల్లో లక్షణాలు ► ర్యాబిస్ వ్యాధి సోకడం వలన పశువుల ప్రవర్తనలో తేడా వస్తుంది. మూలగడం, ఒంటరిగా ఉండడం ► శరీరంపై దురద, కోపం, ఉలికిపాటుకు గురవడం ► అరుపులు ఆవలింతలా వస్తాయి, నీటిని తీసుకోవు, పక్షవాతంలా వచ్చి మరణిస్తాయి. ఇవన్నీ 11రోజుల్లో జరిగిపోతాయి. మనుషుల్లో... జ్వరం రావడం, కాళ్ళు పట్టుకుపోవడం, నీరు తాగలేకపోవడం, చూపులో మార్పు రావడం, భయపడిపోవడం, పక్షవాతం వచ్చి శరీరం పనిచేయకుండా పోయి మరణించడం జరుగుతుంది. నివారణ చర్యలు : ►ఈ వైరస్ సోకకుండా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలి. అలానే కుక్కల్లో పునరుత్పత్తి జరగకుండా ఇంజక్షన్లు చేయాలి. ►ఇంటిలో పెంచుకునే పెంపుడు కుక్కలకు మున్సిపల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాటికి వ్యాక్సినేషన్ చేసినట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి. ►కుక్కలతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురంచి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు కుక్కల వలన కలిగిన వ్యాధులను గురించి వివరించాలి. ►ర్యాబిస్ వ్యాధి సోకి కుక్క, పశువులు మరణిస్తే వాటి కళేబరాలను పూడ్చకుండా దహనం చేయాలి. అందుబాటులో రేబీస్ వ్యాక్సిన్ ► పెంపుడు కుక్కల యజమానులు రేబిస్ వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలి ► జిల్లా పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథ్ ఠాగూర్ ఒంగోలు సబర్బన్ : జిల్లాలోని అన్ని ప్రధాన పశువైద్యశాలల్లో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని జిల్లా పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథ్ ఠాగూర్ తెలిపారు. పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులను జూనోసిస్ వ్యాధులు అంటారన్నారు. మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ప్రధానమైనది రేబిస్ వ్యాధి అని పేర్కొన్నారు. దీంతో పాటు ఆంత్రాక్స్, బ్రూసుల్లో సిస్, లెఫ్టాస్ ఫైరోసిస్ వ్యాధులు కూడా పశువుల నుంచి మనుషులకు సంక్రమిస్తాయన్నారు. అయితే కొన్నింటికి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. జిల్లాలోని మొత్తం 27 ప్రధాన పశువైద్యశాలల్లో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామన్నారు. శనివారం జూనోసిస్ డే సందర్భంగా అన్ని పశువైద్యశాలల్లో కుక్కలకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. కుక్క పిల్లకు 90 రోజుల వయస్సు వచ్చేటప్పటికి మొదటి విడతగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలన్నారు. మూడు నెలలకు బూస్టర్ డోస్ వేయించుకోవాలని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అదే రోజుకి యాంటీ వ్యాక్సిన్ వేయించాలన్నారు. రెగ్యులర్‌గా వ్యాక్సిన్ వేయించుకుంటే పెంపుడు కుక్కలకు వ్యాధి రాదన్నారు. అన్ని పశువైద్యశాలలతో పాటు ఒంగోలులోని సంతపేటలో ఉన్న జిల్లా పశువైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న పశువైద్యశాలలో కూడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒంగోలు వైద్యశాలకు 800 డోసులు అందించామని వివరించారు. అదే విధంగా జిల్లాలోని ప్రధాన పశువైద్యశాలలకు ఒక్కోదానికి 100 డోసుల వంతున ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పిచ్చికుక్క కరిచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► కుక్క కరిచిన వెంటనే గాయాన్ని 4,5సార్లు నీటిని ధారగా పోస్తూ గాయాన్ని శుభ్రంగా కడగాలి. ► టించర్ అయోడిన్‌తో శుభ్రంగా కడగాలి. ► ఈ వైరస్ కుక్క కరిచిన 11 రోజుల నుంచి 6 సంవత్సరాల్లోపు లక్షణాలను ప్రదర్శిస్తుంది. ► ఈ వైరస్ రక్తంలో కలవకుండా నాడీవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ► సంబంధిత వైద్యుల సూచన మేరకు వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. -
భౌబోయ్!
జిల్లాలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో వీధి కుక్కలు చెలరేగిపోతున్నాయి. జనంపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వీటి బెడద మరీ ఎక్కువగా ఉంది. నియంత్రణ చర్యలపై ప్రభుత్వం ఏ మాత్రమూ దృష్టి సారించడం లేదు. పెంపుడు కుక్కలకు కూడా రేబిస్ నివారణ టీకాలు నామమాత్రంగానే వేస్తున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): వీధి కుక్కల నియంత్రణ చర్యలను అర్బన్ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు చేపట్టాల్సి ఉంటుంది. వీటి సంతతి తగ్గించేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు శస్త్ర చికిత్సలు చేయాలి. జిల్లాలో ఇటు అర్బన్ ప్రాంతాల్లోనూ, అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వీధి కుక్కల సంతతి అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతూనే ఉంది. 2012 పశుగణన ప్రకారం జిల్లాలో 65 వేల వీధి కుక్కలు ఉండగా, నేడు వీటి సంఖ్య 1.25 లక్షలకు చేరింది. కృష్ణగిరి మండలం చిట్యాలలో చిన్నారి ఇబ్రహీంను వీధి కుక్కలు కొరికి చంపాయంటే వీటి వల్ల ప్రమాదం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఈ ఘటన తర్వాత కూడా అధికారులు స్పందించలేదు. కర్నూలు నగరపాలక సంస్థలో వీధికుక్కల నియంత్రణకు కొంత ప్రయత్నం జరిగినా తర్వాత గాలికొదిలేశారు. కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, డోన్, నందికొట్కూరు, ఎమ్మిగనూరు తదితర పట్టణ ప్రాంతాల్లో, మేజర్, మైనర్ పంచాయతీల్లో శునకాల బెడద ఎక్కువగా ఉంది. జూనోసిస్ దినోత్సవం రోజునే టీకాలు పశుసంవర్ధక శాఖ ప్రతి ఏటా జూలై 24న జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెంపుడు కుక్కలకు రేబిస్ టీకాలు నామమాత్రంగా వేస్తోంది. వీధి కుక్కల గురించి అసలు పట్టించుకోవడం లేదు. జిల్లాలో వీధి కుక్కలు 1.25 లక్షల వరకు ఉండగా, పెంపుడు కుక్కలు దాదాపు ఎనిమిది వేల వరకు ఉన్నాయి. పెంపుడు కుక్కల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీధికుక్కలను ఏ మాత్రమూ పట్టించుకోకుండా పశుసంవర్ధకశాఖ, మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రజలపైకి వదులుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2020 సంవత్సరానికల్లా భారత దేశాన్ని రేబిస్ రహితంగా తీర్చిదిద్దాలని భారత జంతు సంక్షేమ సంస్థ లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో చర్యలు మాత్రం లేవు. నియంత్రణే ముఖ్యం పెంపుడు కుక్కలతో పాటు వీధికుక్కలకు జనన నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి అవకాశాలున్నాయి. కర్నూలులో 9,600 వీధికుక్కలు ఉండగా.. ఇందులో 25 శాతం వరకు జనన నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఈ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించినప్పటికీ అవి జవాబుదారీతనంతో పనిచేయలేదు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ ఊసే లేదు. ఆపరేషన్ అయిన కుక్కలు దీర్ఘాయుస్సుతో బతకడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కరవడం కూడా చాలా తక్కువ. చెవిని కత్తిరించి వీ ఆకారంలో ఉంటే ఆపరేషన్ అయ్యిందని గుర్తు. పెంపుడు కుక్కలకు కూడా విధిగా జనన నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించాలి. ప్రపంచ ఆరోగ్య సంçస్థ తన నివేదికలో 75 శాతం వీధికుక్కలకు రేబిస్ టీకాలు వేయడం వల్ల ఆ ప్రాంతాన్ని రేబిస్ రహితంగా మార్చవచ్చని సూచించింది. వీటికి మూడు నెలల వయస్సులో తప్పనిసరిగా టీకాలతో పాటు ప్రతి ఏటా బూస్టర్ డోస్ వేయించాలి. అప్పుడే వాటి వల్ల ప్రజలకు ప్రమాదం ఉండదు. ఈ నెల 21న ప్యాపిలి మండలం హుసేనాపురంలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కన్పించిన వారినల్లా కరుస్తూ వెళ్లింది. ఈ క్రమంలో దాదాపు పదిమంది గాయపడ్డారు. ఇదే రోజు గూడూరు మండలం చనుగొండ్ల, మునగాలలో నలుగురు వ్యక్తులు వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు ఇలా చేస్తే కుక్క కాటు నుంచి తప్పించుకోవచ్చు .. - కుక్క దగ్గరికి వస్తే కదలకుండా నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తరాదు. కళ్లలోకి తదేకంగా చూడరాదు. కుక్క పిల్లల దగ్గరికి వెళ్లరాదు. - నిద్రిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పిల్లలకు పాలిస్తున్నప్పుడు ఏ రకంగానూ ఇబ్బంది పెట్టరాదు. - కుక్క దాడి చేసేటప్పుడు ముఖాన్ని పంచె లేదా తువ్వాలు తదితర వాటితో కప్పుకోవాలి. ఏమీ లేకపోతే చొక్కాను పైకి జరుపుకోవాలి. లేదా ముఖాన్ని చేతులతో కప్పుకోండి. ముఖంపై కరిస్తే ఇన్ఫెక్షన్ మెదడుకు త్వరగా సోకుతుంది. దీనివల్ల ప్రాణహాని ఉండే ప్రమాదం ఉంది. - కుక్క కోపంగా దగ్గరికి వస్తే నేల వైపు చూస్తూ దానికి దూరంగా మెల్లగా నడవాలి. నియంత్రణ చర్యలు తీసుకోవాలి వీధి వీధినా కుక్కలు ఉంటున్నాయి. వాటిని దాటుకొని పోవాలంటేనే భయమేస్తోంది. మరోవైపు ఆసుపత్రుల్లో యాంటీ రేబిస్ టీకాలు అందుబాటులో ఉండడం లేదు. వీధి కుక్కల నియంత్రణకు స్థానిక సంస్థలు చొరవ చూపాలి. – కర్రెక్కగారి నాగిరెడ్డి, వెల్దుర్తి రేబిస్ అత్యంత ప్రమాదకరం రేబిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరం. కుక్క కాటు వల్ల ఇది సోకుతుంది. వ్యాక్సిన్ వేయించిన కుక్క కాటు వల్ల ప్రమాదం లేదు. వేయించని కుక్క కాటు అత్యంత ప్రమాదకరం. కావున వెంటనే యాంటీ రేబిస్ టీకా వేయించుకోవాలి. కరిచిన వెంటనే చికిత్స తీసుకుంటే ఫలితం ఉంటుంది. పెంపుడు కుక్కలకు విధిగా వ్యాక్సిన్ వేయించాలి. – డాక్టర్ మల్లికార్జున్, కర్నూలు -
భౌబోయ్ కుక్కలు..!
సాక్షి, హైదరాబాద్ : గ్రామ సింహాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రోడ్లపై తిరగాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా జనాలపైకి ఎగబడుతున్నాయి. దీంతో కుక్కకాటు బారిన పడేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. నగరాలు, పట్టణాల కంటే గ్రామాల్లోనే కుక్కకాటు బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గ్రామపంచాయతీలకు సరిపడా నిధుల్లేకపోవడంతో కుక్కల నియంత్రణకు శాశ్వత చర్యలు తీసుకునే పరిస్థితి ఉండట్లేదు. దీంతో కుక్కల సంఖ్య పెరుగుతోంది. కుక్కకాటు బాధితులూ పెరుగుతున్నారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో కుక్కకాటు వల్ల రేబిస్ సోకి మరణాలు సంభవిస్తున్నాయి. రేబిస్ కారణంగా ఏటా 500 మంది మరణిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రేబిస్ నియంత్రణ ఔషధాలూ కరువవుతున్నాయి. గ్రామ పంచాయతీలకే నగరాలు, పట్టణాల్లో కుక్కల నియంత్రణ అంతా నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల పర్యవేక్షణలో ఉంటోంది. గ్రామాల్లో ఆయా గ్రామపంచాయతీలే ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. గ్రామాల వెలుపల వాటిని వదిలేయడంతోనే సరిపెడుతున్నారు. దీంతో వీధి కుక్కలు మళ్లీ ఊళ్లోకి వస్తున్నాయి. కుక్కల నియంత్రణలో దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడంతో అసలు సమస్యలు పెరుగుతున్నాయి. వీటికి ఆహారం దొరకక అసహనంతో మనుషులపై దాడులు చేస్తున్నాయి. దీంతో కుక్కకాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏటా 1.7 లక్షల మంది బాధితులు ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏటా సగటున 1.70 లక్షల మంది కుక్కకాటు బారిన పడుతున్నారు. హైదరాబాద్, వరంగల్ మహానగరాల్లో కుక్కకాటు కేసులు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల్లో చేరట్లేదు. ఇక్కడి బాధితులలో ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేసుకుంటుండటంతో అధికారులు అధికారిక గణాంకాల్లో నమోదు చేయట్లేదు. పాత నల్లగొండ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కుక్కకాటు బాధితులు ఉన్నట్లు తెలిసింది. -
రేబిస్‌తో ఆరేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్: రేబిస్ వ్యాధికి ఆరేళ్ల బాలుడు బలైపోయాడు. ఒడిశాకు చెందిన బాలుడు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఒడిశాకు చెందిన జోగేందర్, అతని కుటుంబ సభ్యులు ఉపాధి కోసం హయత్‌నగర్‌కు వచ్చి నివాసముంటున్నారు. అయితే, జోగేందర్ కుమారుడు దివాకర్ (6) రెండు నెలల క్రితం ఒడిశాలోని తమ స్వగ్రామంలో కుక్క కాటుకు గురయ్యాడు. నిరక్షరాస్యులైన జోగేందర్ కుటుంబ సభ్యులు ఆ సమయంలో దివాకర్‌కు ఎలాంటి చికిత్సలు చేయించలేదు. అయితే, దివాకర్ వింతగా ప్రవర్తిస్తుండడంతో చికిత్స కోసం బుధవారం తెల్లవారు జామున నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించాడు. కాగా, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో గత 20 రోజుల వ్యవధిలో ముగ్గురు రేబిస్‌తో మృతి చెందడం గమనార్హం. ఏప్రిల్ 17న నిజామాబాద్ జిల్లా సీతారాంపల్లికి చెందిన ఇంద్రమ్మ(43) మృతి చెందగా, అదే నెల 30న మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్‌కు చెందిన యాదయ్య(65) మృతి చెందాడు. (నల్లకుంట)