ఛీ కుక్క..అనే ముందు ఏం కుక్కా బాగున్నావా అని ఎవరైనా అంటారా? రాత్రుల్లో గూర్ఖాలా కాపలా కాస్తుంది దొంగలొస్తే భౌ..భౌ మంటుంది యజమాని నిద్రపోతుంటే చుట్టూ చక్కర్లు కొడుతుంది ఊరికెళుతుంటే ఏడుస్తుంది ఆకలైతే అన్ని ఇళ్లకూ తిరిగి జాలిగా చూస్తుంది.. చంటి పిల్లలకు చక్కిలిగింతలు పెడుతుంది పోలీసు కేసులను ఛేదిస్తుంది సర్కస్‌లో ఫీట్లు చేస్తుంది చివరకు యజమాని మరణిస్తే సమాధి దగ్గర కూర్చుని రోదిస్తుంది.. మళ్లీ ఆయన కనిపించాలని కాళ్లతో మట్టి తవ్వుతుంది ఇలాంటి కుక్కలను ఛీ అందామా.. శభాష్ అందామా.. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు మీ ప్రియ శునకాలకు వేయిస్తే నిశ్చంతగా ఉండొచ్చు వ్యాధి వస్తుందనే భయం వీడొచ్చు...
సాక్షి, చీరాల అర్బన్: ర్యాబిస్ వ్యాధి సోకితే చికిత్స లేదనేది వాస్తవమే కానీ.. అన్ని కుక్కల వల్ల ర్యాబిస్ వస్తుందనేని అపోహ మాత్రమే. అవగాహన లోపం కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం జూనోసిస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. ర్యాబిస్ వ్యాధి రాబ్‌డో అనే వైరస్ వలన సోకుతుంది. ఈ వైరస్ ఎక్కువగా అడవుల్లో ఉండే క్రూర జంతువులు, గబ్బిలాల్లో ఎటువంటి లక్షణాలు చూపించకుండా ఉంటుంది. ఈ వైరస్ గాలి, నీటి ద్వారా మార్పిడి చెందుతుంది. మృగాలు, గబ్బిలాలు చనిపోవడం, వాటిని కుక్కలు తినడం వలన వాటిలో ఉన్న వైరస్ కుక్కలకు వ్యాప్తి చెందుతుంది.
ఈ వైరస్ ఉన్న కుక్కలు మనుషులను, పశువులపు కరవడం వలన లాలాజలం ద్వారా సంక్రమిస్తుంది. ర్యాబిస్ వ్యాధి వలన ప్రపంచవ్యాప్తంగా 35 వేల మంది మరణిస్తున్నారు. ఈ మరణాలు 60 శాతం భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. ఈ వైరస్ మనుషులకు, పశువులకు వ్యాప్తి చెందడంలో కుక్కలు వారధిగా పనిచేస్తుంటాయి. చనిపోయిన ర్యాబిస్ వ్యాధి సోకిన పశువులను, గబ్బిలాల కళేబరాలను కుక్కలు తినడం వలన ఈ వైరస్ కుక్కలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి వలన కుక్కలు మానసిక స్థితిని కోల్పోయి విచిత్రంగా ప్రవర్తిస్తాయి. ఈ వ్యాధి సోకిన కుక్కలు మనుషులను, పశువులను కరవడం వలన వ్యాధి సోకి వింతగా ప్రవర్తిస్తారు. వ్యాధిని గుర్తించకపోవడం వలన కొన్ని రోజుల్లో జీవులు మరణిస్తాయి. పెంపుడు కుక్కలతో పాటు వాటిని పెంచేవారికి, డాక్టర్లు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి.
ర్యాబిస్ వ్యాధి సోకిన పశువులు, మనుషుల్లో లక్షణాలు
► ర్యాబిస్ వ్యాధి సోకడం వలన పశువుల ప్రవర్తనలో తేడా వస్తుంది. మూలగడం, ఒంటరిగా ఉండడం
► శరీరంపై దురద, కోపం, ఉలికిపాటుకు గురవడం
► అరుపులు ఆవలింతలా వస్తాయి, నీటిని తీసుకోవు, పక్షవాతంలా వచ్చి మరణిస్తాయి. ఇవన్నీ 11రోజుల్లో జరిగిపోతాయి.
మనుషుల్లో...
జ్వరం రావడం, కాళ్ళు పట్టుకుపోవడం, నీరు తాగలేకపోవడం, చూపులో మార్పు రావడం, భయపడిపోవడం, పక్షవాతం వచ్చి శరీరం పనిచేయకుండా పోయి మరణించడం జరుగుతుంది.
నివారణ చర్యలు :
►ఈ వైరస్ సోకకుండా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలి. అలానే కుక్కల్లో పునరుత్పత్తి జరగకుండా ఇంజక్షన్లు చేయాలి.
►ఇంటిలో పెంచుకునే పెంపుడు కుక్కలకు మున్సిపల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాటికి వ్యాక్సినేషన్ చేసినట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి.
►కుక్కలతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురంచి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు కుక్కల వలన కలిగిన వ్యాధులను గురించి వివరించాలి.
►ర్యాబిస్ వ్యాధి సోకి కుక్క, పశువులు మరణిస్తే వాటి కళేబరాలను పూడ్చకుండా దహనం చేయాలి.
అందుబాటులో రేబీస్ వ్యాక్సిన్
► పెంపుడు కుక్కల యజమానులు రేబిస్ వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలి
► జిల్లా పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథ్ ఠాగూర్
ఒంగోలు సబర్బన్ : జిల్లాలోని అన్ని ప్రధాన పశువైద్యశాలల్లో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని జిల్లా పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథ్ ఠాగూర్ తెలిపారు. పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులను జూనోసిస్ వ్యాధులు అంటారన్నారు. మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ప్రధానమైనది రేబిస్ వ్యాధి అని పేర్కొన్నారు. దీంతో పాటు ఆంత్రాక్స్, బ్రూసుల్లో సిస్, లెఫ్టాస్ ఫైరోసిస్ వ్యాధులు కూడా పశువుల నుంచి మనుషులకు సంక్రమిస్తాయన్నారు. అయితే కొన్నింటికి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.
జిల్లాలోని మొత్తం 27 ప్రధాన పశువైద్యశాలల్లో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామన్నారు. శనివారం జూనోసిస్ డే సందర్భంగా అన్ని పశువైద్యశాలల్లో కుక్కలకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. కుక్క పిల్లకు 90 రోజుల వయస్సు వచ్చేటప్పటికి మొదటి విడతగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలన్నారు. మూడు నెలలకు బూస్టర్ డోస్ వేయించుకోవాలని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అదే రోజుకి యాంటీ వ్యాక్సిన్ వేయించాలన్నారు. రెగ్యులర్‌గా వ్యాక్సిన్ వేయించుకుంటే పెంపుడు కుక్కలకు వ్యాధి రాదన్నారు.
అన్ని పశువైద్యశాలలతో పాటు ఒంగోలులోని సంతపేటలో ఉన్న జిల్లా పశువైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న పశువైద్యశాలలో కూడా వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒంగోలు వైద్యశాలకు 800 డోసులు అందించామని వివరించారు. అదే విధంగా జిల్లాలోని ప్రధాన పశువైద్యశాలలకు ఒక్కోదానికి 100 డోసుల వంతున ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
పిచ్చికుక్క కరిచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
► కుక్క కరిచిన వెంటనే గాయాన్ని 4,5సార్లు నీటిని ధారగా పోస్తూ గాయాన్ని శుభ్రంగా కడగాలి.
► టించర్ అయోడిన్‌తో శుభ్రంగా కడగాలి.
► ఈ వైరస్ కుక్క కరిచిన 11 రోజుల నుంచి 6 సంవత్సరాల్లోపు లక్షణాలను ప్రదర్శిస్తుంది.
► ఈ వైరస్ రక్తంలో కలవకుండా నాడీవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
► సంబంధిత వైద్యుల సూచన మేరకు వ్యాక్సినేషన్ చేయించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment