దేశవ్యాప్తంగా పెరుగుతున్న కుక్క కాట్లు
గత ఏడాది 30,43,339 కుక్క కాటు కేసులు నమోదు 286 మంది మృతి
కేంద్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: శునకాలు చెలరేగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం 8,300 మందికి పైగా ప్రజలు కుక్క కాట్ల బారినపడుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2023లో దేశంలో 30,43,339 కుక్కు కాటు కేసులు నమోదయ్యాయి. ఇందులో 286 మంది మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో వీధి కుక్కల కాట్లు, రేబిస్ నివారణకు జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమం అమలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నివేదిక ప్రకారం.. 2023లో కుక్కు కాటు కేసుల కోసం 46,54,398 యాంటీ రేబిస్ షాట్‌లను చికిత్సగా అందించినట్టు తెలిపింది.
అత్యవసర మందుల జాబితాలో వ్యాక్సిన్, సీరమ్
అత్యవసర, ముఖ్యమైన మందుల జాబితాలో యాంటీ రాబిస్ వ్యాక్సిన్, యాంటీ రేబిస్ సీరమ్‌ను చేర్చినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కుక్క కాటు కేసులను నియంత్రించేందుకు కుక్కల జనాభా నిర్వహణ కీలకమైన విధుల్లో ఒకటని పేర్కొంది. దీని కోసం యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమాన్ని, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం నిధుల మంజూరు చేయడంతోపాటు రేబిస్ టీకాల కోసం సాయం అందిస్తున్నట్టు తెలిపింది.
2030 నాటికి రేబిస్ నిర్మూలన దిశగా..
కుక్క కాట్ల నివారణ, రేబిస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జాతీయ కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. 2030 నాటికి రేబిస్ నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపింది. దశల వారీగా రేబిస్ రహిత నగరాల కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొంది. 15 రాష్ట్రాల్లో రేబిస్ నివారణ కోసం టైర్–1, టైర్–2 నగరాలను లక్ష్యంగా చేసుకుని కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
తొలి దశలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పుదుచ్ఛేరి, అస్సాం రాష్ట్రాల్లో రేబిస్ హెల్ప్‌లైన్ 15400 ప్రారంభించినట్టు, ఇతర రాష్ట్రాల్లో దశల వారీగా ప్రారంభించేందుకు ప్రణాళికలు ఉన్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమం అమల్లో భాగంగా రాష్ట్రాలు, జిల్లా స్థాయిల్లో మానవ శక్తిని పెంచడం, రేబిస్ పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రాఫిలాక్సిస్ కోసం వ్యయంతో కూడిన ఇంట్రాడెర్మల్ రేబిస్ వ్యాక్సిన్లను ప్రచారం చేయడం, రేబిస్ డయాగ్నస్టిక్స్ బలోపేతం చేయడం, జంతువుల కాటు రాబిస్ కేసులపై నిఘాను బలోపేతం చేయడం, అవగాహన కలి్పంచడం, కార్యాచరణ పరిశోధన వంటి చర్యలను చేపట్టినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.
జాతీయ రేబిస్ నివారణ, నియంత్రణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఆరోగ్య సంరక్షణ సిబ్బంది సామర్థ్యాన్ని పెంచడంతోపాటు రేబిస్ వ్యాక్సిన్లు, రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ సేకరణ, రేబిస్ నివారణకు అవగాహన కల్పన కోసం బడ్జెట్ ద్వారా నేషనల్ రేబిస్ కంట్రోల్ కార్యక్రమం అమలు కోసం రాష్ట్రాలు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment