కిల్లర్‌ డాగ్స్‌! | Stray Dog Attack Cases Rising In Telangana | Sakshi
Sakshi News home page

కిల్లర్‌ డాగ్స్‌!

Published Tue, Sep 10 2024 1:08 AM | Last Updated on Tue, Sep 10 2024 1:08 AM

Stray Dog Attack Cases Rising In Telangana

రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న కుక్కకాట్లు.. బలవుతున్న చిన్నారులు

కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు.. మనిషి కుక్కను కరిస్తేనే వార్త.. 

వీధికుక్కల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం

2018 నుంచి 2023 వరకు ఆరేళ్లలో రాష్ట్రంలో 13.21 లక్షల కుక్కకాట్లు

రాష్ట్రంలో 20 లక్షల వరకు కుక్కలు.. అందులో 10 లక్షల దాకా హైదరాబాద్‌లోనే!

అభద్రత, ఆహారం దొరక్కపోవడం, వాతావరణ మార్పులే కారణమంటున్న నిపుణులు

ప్రసహనంగా మారిన కుక్కల స్టెరిలైజేషన్‌.. నిధుల్లో సగం పక్కదారే!

..: ఇది జర్నలిజంలో ఓ పాత పాఠం :..
జర్నలిస్టుల సంగతి ఎలా ఉన్నా.. ప్రభుత్వాలు మాత్రం దీన్ని సీరియస్‌గానే తీసుకున్నట్లు ఉన్నాయి. అందుకే మనిషిని కుక్క కరవడం కాదు.. చంపేస్తున్నా.. పెద్దగా పట్టనట్లే ఉంటున్నాయి.

ఫలితం..
ఓ విహాన్‌.. ఓ పూలమ్మ,.. ఓ రామలక్ష్మి.. పేరేదైతేనేం.. ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తరచూ పదుల సంఖ్యలో ప్రజలు కుక్క
కాట్ల బారిన పడుతూనే ఉన్నారు. ఏళ్లుగా ఉన్న సమస్య ఇది.. ఎవరూ సీరియస్‌గా తీసుకోని విషయమిది. మరేం చేద్దాం?
ఇప్పటికైనా పట్టించుకుందామా? పట్టనట్లే ఉందామా?

 హైదరాబాద్‌లోని మియాపూర్‌ మక్తాకు చెందిన ఆరేళ్ల బాలుడు సాత్విక్‌పై రెండు నెలల క్రితం వీధికుక్కలు దాడి చేసి చంపేశాయి. నెల రోజుల క్రితం ఇబ్రహీంపట్నం రాయపోల్‌లో నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. నిలోఫర్‌లో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయాడు. గత పదిహేను రోజుల్లో నాలుగు కుక్కకాటు ఘటనల్లో పదుల సంఖ్యలో చిన్నారులు, పెద్దవాళ్లు గాయపడ్డారు. 

రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం బట్టోనితాళ్లలో 20 రోజుల కింద పిట్ల రామలక్ష్మి (80) అనే వృద్ధురాలిపై వీధికుక్కలు దాడి చేసి పీక్కుతిన్నాయి.

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన భరత్, వెంకటలక్ష్మి దంపతులు హైదరాబాద్‌ జవహర్‌నగర్‌ పరిధిలోని ఆదర్శనగర్‌కు మూడు నెలల క్రితం వలస వచ్చారు. వారి 18 నెలల కుమారుడు విహాన్‌ను ఇటీవల కుక్కలు దాడి చేసి చంపేశాయి.

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్లకు చెందిన జంగం నర్సయ్య బర్ల కాపరిగా, ఆయన భార్య పూలమ్మ (50) గ్రామ పంచాయతీ నర్సరీలో కూలీ పని చేసేవారు. వారి ఏకైక కుమార్తె వివాహం కావడంతో.. భార్యాభర్త ఇద్దరే ఉండేవారు. జూలై 5న పూలమ్మ నర్సరీలో పని ముగించుకుని తిరిగొస్తుండగా కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. దీనితో తాను ఒంటరిని అయిపోయానంటూ నర్సయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

.. ఈ ఘటనలే కాదు.. చెప్పుకుంటూపోతే మరెన్నో.. వీధి వీధినా, గ్రామం, పట్టణం తేడా లేకుండా ఎన్నో వందల కుటుంబాల్లో విషాదం నింపుతున్న కుక్కల దాడి ఘటనలెన్నో. అవి మనుషులకు మంచి స్నేహితులంటూ మనం చెప్పుకొనే శునకాలే.. ఇంటి ముందో, వీధిలోనో కలియదిరుగుతూ కనిపించేవే. కానీ కొన్నేళ్లుగా కుక్కల దాడి ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్నారులను, వయసు మళ్లినవారిపై దాడిచేసి పొట్టనపెట్టుకుంటూ కన్నీళ్లు నింపుతున్నాయి.   - సాక్షి, హైదరాబాద్‌

ఆహార కొరత.. విపరీతంగా సంతానోత్పత్తి
వీధికుక్కలు రెచ్చిపోవడానికి ప్రధాన కారణం ఆహార కొరత అని వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు. ఖాళీ ప్రదేశాలు తగ్గిపోవడం, వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు. కుక్కలు పెద్ద శబ్దాలు, ఎక్కువ వెలుగు ఉండే లైట్ల వల్ల ఆవేశపడతాయని.. ఇలాంటి సమయాల్లోనే అవి అతిగా దాడులు చేస్తుంటాయని వివరిస్తున్నారు. సాధారణంగా కుక్కలు మాంసాహారాన్ని ఇష్టపడతాయి. కానీ ఇప్పుడు వాటికి శాఖాహారం కూడా దొరకని పరిస్థితి రావడంతో రెచ్చిపోతున్నాయి.

అందువల్ల కుక్కలకు షెల్డర్‌ హోమ్‌లు, ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేసి, వాటికి సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కొంత ప్రయత్నం జరిగినా ఫలితం మాత్రం శూన్యం. జీహెచ్‌ఎంసీ పరిధిలో నాలుగు లక్షలకుపైగా వీధి కుక్కలు ఉన్నాయని కార్పొరేషన్‌ వెటర్నరీ విభాగం చెబుతోంది. కానీ వాస్తవంగా 10 లక్షలకుపైగానే వీధి కుక్కలు ఉన్నట్టు అంచనా. వీటిలో మూడో వంతు కుక్కలకు కూడా స్టెరిలైజేషన్, వాక్సినేషన్‌ జరగలేదని సమాచారం.

నామ్‌ కే వాస్తేగా కార్యాచరణ
కుక్కకాట్లతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై ఇటీవల హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. కానీ ఆ హడావుడి నాలుగైదు రోజుల్లోనే ముగిసిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పశు జనన నియంత్రణ కేంద్రాలు ఉండగా.. మిగతా జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ అడుగు ముందుకు పడలేదు.

2030 నాటికి రేబిస్‌ నిర్మూలన సాధ్యమెట్లా?
దేశంలో 2030 నాటికి రేబిస్‌ను నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే శునకాల నియంత్రణ చర్యలు వేగవంతం చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్‌ టీకాలను విరివిగా అందుబాటులో ఉంచాలి. కానీ కేంద్రం సరిగా నిధులు కేటాయించడం లేదు. రాష్ట్రాలూ పట్టించుకోవడం లేదు. కుక్కకాట్లతో రేబిస్‌ సోకడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 59 వేల మంది చనిపోతుంటే.. అందులో 20 వేలకుపైగా (36 శాతం) మరణాలు మనదేశంలోనే నమోదవుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఒక్క జంట నుంచి ఏడేళ్లలో 4 వేల కుక్కలు
 కుక్కల జీవిత కాలం 8 నుంచి 12 ఏళ్లు
 8 నెలల వయసు నుంచే వాటికి సంతానోత్పత్తి సామర్థ్యం ఉంటుంది
 వీటి గర్భధారణ సమయం 60–62 రోజులే ఏటా రెండు సార్లు పిల్లలను కంటాయి. ప్రతిసారి 4 నుంచి 8 పిల్లలను పెడతాయి
 ఒక శునకాల జంట, వాటి పిల్లలు, వీటన్నింటికీ పుట్టే పిల్లలు ఇలా.. ఏడాదిలోనే 40 వరకు అవుతాయి. మొత్తంగా ఒక్క జంట నుంచి ఏడేళ్లలో సుమారు 4 వేల వరకు అయ్యే అవకాశం ఉంటుంది

కాకి లెక్కలేనా..?
జీహెచ్‌ఎంసీలో ఏటా 50, 60 వేల వీధికుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్స (స్టెరిలైజేషన్‌) జరుగుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. ఈ శస్త్రచికిత్సలు, రేబిస్‌ వ్యాధి సోకకుండా వ్యాక్సినేషన్, సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చుల కోసం ఏటా రూ.12 కోట్లకుపైగానే వ్యయం చేస్తున్నారు. కానీ వీధికుక్కల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా.. అంతకంతకూ పెరిగిపోతోంది. నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది. మున్సిపల్‌ కార్పొరేషన్లు ఒక్కో కుక్క స్టెరిలైజేషన్‌ కోసం రూ.1,700 చొప్పున ఖర్చు చేస్తున్నా.. చేసే ఆపరేషన్లకు, చూపే లెక్కలకు తేడా ఉంటోందన్న ఆరోపణలు ఉన్నాయి.

గోవా ఎలా కంట్రోల్‌ చేయగలిగింది?
కుక్కకాట్ల విషయంలో గోవా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఆ రాష్ట్రంలో గత మూడేళ్లలో ఒక్క కుక్కకాటు మరణం కూడా నమోదు కాలేదు. నిర్ణీత కాలవ్యవధిలో కుక్కలకు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. శునకాల దాడినుంచి స్వీయరక్షణ విధివిధానాలను విద్యార్థులకు, మహిళలకు తెలియజెప్పడం వంటి అంశాలు గోవాలో సత్ఫలితాలిస్తున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్‌ నగరాల్లోనూ కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు పొందాయి.

ఆ రాష్ట్రాల్లో బాధితులకు పరిహారం
కుక్కకాటు ఘటనలకు రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని గత సంవత్సరం హరియాణా– పంజాబ్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. కుక్క కాటు కేసుల్లో ఒక్కో పంటి గాటుకు 10వేల రూపాయల చొప్పున బాధి తులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కుక్కకాటు ఘటనలో 0.2 సెంటీమీటర్లు, ఆపైన కోత పడితే బాధితులకు రూ.20 వేలు చెల్లించా లని.. ప్రాణనష్టం జరిగితే రూ.5 లక్షలు పరిహారంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. కర్ణాటకలో కుక్కకాటు కేసులను సమీక్షించడానికి, కుక్కకాటుకు గురైన వ్యక్తులకు పరిహారం అందించడానికి అక్కడి పట్టణాభివృద్ధి శాఖ పట్టణ, స్థానిక సంస్థలతో కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీల ద్వారా 48 గంటల్లో బాధితులకు పరిహారాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి పరిహారం లేదు.

పిల్లలు పలవుతున్నా ప్రభుత్వం స్పందించల్లేదు
మాది సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం గోవిందాపూర్‌. ఇటీవల రెండు పిచ్చి కుక్కలు ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి. నా బిడ్డ ప్రావీణ్య కూడా తీవ్రంగా గాయపడింది. కుక్కల దాడిలో పిల్లలు బలవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలి. – సాగర్‌రెడ్డి, ప్రావీణ్య తండ్రి

కొత్త ప్రదేశాల్లో వదిలేయడంతో సమస్యలు
వీధికుక్కల స్టెరిలైజేషన్‌ విషయంలో మున్సిపల్‌ అధికారులు పొరపాట్లు చేస్తున్నారు. స్టెరిలైజేషన్‌ కోసం తీసుకువెళ్లిన కుక్కలను తిరిగి అదే ప్రాంతంలో వదలకుండా కొత్త ప్రదేశాల్లో విడిచిపెడుతున్నారు. అక్కడి కుక్కలు కొత్తవాటిని రానీయకపోవడం, మనుషులూ కొత్తవారు కావడంతో అభద్రతకు లోనవుతాయి. దీనికితోడు కుక్కలు అతి చల్లదనం, వర్షాలు, వేడిని తట్టుకోలేవు. చిత్రంగా ప్రవర్తిస్తూ దారినపోయే వారిపై దాడులకు దిగుతాయి. కుక్కలకు సకాలంలో స్టెరిలైజేషన్‌ చేయాలి. షెల్టర్లు ఏర్పాటు చేసి తరలించాలి.  – అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రాంసింగ్‌ లఖావత్, వెటర్నరీ యూనివర్సిటీ

రేబిస్‌ సోకే ప్రమాదం.. జాగ్రత్త.
కుక్కకాటుతో రేబిస్‌ సోకే ప్రమాదం ఉంటుంది. కుక్క కరిస్తే వెంటనే గాయాన్ని పది, పదిహేను నిమిషాల పాటు నీటితో శుభ్రం చేయాలి. యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. రేబిస్‌ సోకితే తొలిదశలో జ్వరం, తలనొప్పి, వాంతులు వస్తాయి. తర్వాత పిచ్చిగా ప్రవర్తించడం, మనుషులను గుర్తించèలేక పోవడం, నోట్లోంచి నురగ, గొంతు పట్టేయడం, ఊపిరి ఆడకపోవడం వంటివి కనిపి స్తాయి. చివరిగా కోమాలోకి వెళ్లి ప్రాణాలు పోయే ప్రమాదమూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.   – డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, డీఎంహెచ్‌ఓ, రంగారెడ్డి

రెచి్చపోయిన పిచ్చి కుక్కలు
29 మందికి గాయాలు బాధితుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు  
నందిపేట్‌ /మాచారెడ్డి/ మంగపేట: నిజామాబాద్, కామారెడ్డి, ములుగు జిల్లా మంగపేటలో సోమవా రం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి సుమారు 29 మందిని గాయపర్చాయి. బాధితులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నందిపేట మండల కేంద్రంలోని బంగారు సాయిరెడ్డి ఫ్యాక్టరీ దగ్గర గల రామ్‌రెడ్డి వెల్డింగ్‌ షాప్‌ నుంచి మెయిన్‌ రోడ్డు వెంబడి లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్, చాకలి ఐలమ్మ, ఆనంది హాస్పిటల్, వ్యాన్ల అడ్డ, నట్రాజ్‌ టాకీస్‌ కాంప్లెక్స్‌ ప్రాంతాల వరకు ఓ పిచి్చకుక్క పదిమందిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. లిటిల్‌ ఫ్లవర్‌ స్కూలు విద్యారి్థ, ఆనంద్‌ హాస్పిటల్‌ ఆయమ్మ లసుంబాయిపై కూడా కుక్క దాడి చేసి తొడ, చేతి కండరాలను పీకేసింది.

మాచారెడ్డి మండలంలోని ఘన్‌పూర్‌ (ఎం)లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పిచ్చి కుక్క పది మందిని గాయ పర్చింది. అక్షిత అనే బాలికపై, ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధుడు పోచయ్యతో పాటు యాకూబ్, చైతన్య, హార్యన్, రంజిత్‌ తదితరులపై కుక్క దాడి చేసి గాయపర్చింది. ఆగ్రహించిన గ్రామస్తులు కుక్కను చంపేశారు. అలాగే ములుగు జిల్లా మంగపేటలోనూ ఓ పిచ్చి కుక్క పలువురిపై దాడిచేసింది. గంపోనిగూడెం, పొదుమూరు, మంగపేటలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలిని, రోడ్డుపై నున్న ఎర్రావుల సమ్మయ్య, కొప్పుల లాలయ్య, దాదాని, ఎండి సైదా, మైతున్‌బి, ఎండి గోరెతోపాటు మరో ముగ్గురిపై పిచ్చి కుక్క దాడిచేసింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురికి స్పల్ప గాయాలయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement