మహిళను వీధి కుక్కలు తినడంపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు
పరిష్కార మార్గం కనుగొనకుంటే ఎలా అని సర్కార్‌ను నిలదీత
స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కాదు.. నియంత్రణకు ఏం చర్యలు చేపట్టారో చెప్పాలి
జీహెచ్‌ఎంసీకి పలు మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కలు ఇంట్లోకి వెళ్లి మహిళను చంపి.. అవయవాలు తినడం అత్యంత దారుణమైన ఘటన అని హైకోర్టు పేర్కొంది. ఇలా మహిళలు, చిన్నారులను కుక్కలు చంపుతున్నా పరిష్కార మార్గం కనుగొనకుంటే ఎలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ‘స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కాదు.. దాడుల నియంత్రణకు ఏం చర్యలు చేపట్టారో చెప్పాలి’అని ఆదేశించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంలో వాదనలు కాదని, పరిష్కారం కావాలని న్యాయవాదులకు సూచించింది.
ఆ దిశగా అందరి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని సర్కారుకు స్పష్టం చేసింది. వీధి కుక్కలకు పునరావాస కేంద్రాలు, ప్రజల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని చెప్పింది. జూన్ 28న పటాన్‌చెరు ఇస్నాపూర్‌లో వీధి కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు విశాల్ మృతి చెందాడు. ఈ దారుణంపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. గతంలో ఇదే అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లకు దీనిని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
ఈ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వృద్ధురాలిని కుక్కలు పీక్కుతిన్న వైనం, చిన్నారులపై కుక్కల దాడిపై పత్రికల్లో వచ్చిన కథనాలు కోర్టులో ప్రస్తావనకు వచ్చాయి.
పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేశాం..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. యానిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబీస్ ప్రోగ్రామ్‌ను సమర్థవంతంగా అమలు చేయడం కోసం కమిటీ ఏర్పాటు చేశామని, ఈ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుందని వివరించారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ పనిచేస్తోందన్నారు. జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా నిర్వహిస్తోందన్నారు. కాగా, గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశాల అమలుపై జీహెచ్‌ఎంసీ నివేదిక అందజేసింది.
పెంపుడు కుక్కలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వాటి యజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించింది. కాగా, వీధి కుక్కలను షెల్టర్లకు తరలించి వాటికి అక్కడే అన్ని సదుపాయాలు కల్పించాలని న్యాయవాది వేణుమాధవ్ కోరారు. జీహెచ్‌ఎంసీ నివేదికను పరిశీలించిన సీజే పలు సూచనలు చేశారు. జంతు సంక్షేమ బోర్డు తరఫున న్యాయవాదిగా డీఎస్‌జీ గాడి ప్రవీణ్‌కుమార్‌ను చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
ధర్మాసనం సూచనలు..
⇒ వీధి కుక్కలపై ఫిర్యాదులకు నగరవాసుల కోసం ప్రత్యేకంగా ఓ హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలి.
⇒ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ, రాష్ట్రంలోని వివిధ జంతు సంక్షేమ
సంస్థలను సంప్రదించి దాడుల నియంత్రణకు సూచనలు స్వీకరించాలి.
⇒ ఏబీసీ నిబంధనల ప్రకారం జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థలు తగినన్ని షెల్టర్లు, పశు వైద్యశాలలు, కుక్కల తరలింపు వ్యాన్‌లు, మొబైల్ వ్యాన్లు, సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏబీసీ కేంద్రాలు నెలకొల్పి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
⇒ ఏబీసీ కేంద్రాల్లో కుక్కలకు వ్యాక్సినేషన్ చేయించాలి. వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు జంతు సంక్షేమ సంస్థలు
ముందుకొస్తే ఆ ఖర్చులు ప్రభుత్వం భరించాలి.
⇒ ఏబీసీ కమిటీ నెలకోసారి భేటీ కావాలి. నిబంధనలు పాటించకుంటే కమిటీలను రద్దు చేయాలి.
⇒ ఐదేళ్ల పాటు 10 కుక్కలను దత్తత తీసుకునేలా జంతు ప్రేమికులను ప్రోత్సహించాలి.
⇒ కుక్కలు కరిస్తే ఏం చేయాలో ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
⇒ హైదరాబాద్ సిటీకి దూరంగా వీధి కుక్కలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment