సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్కకాటు నమోదవుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫలితంగా అరగంటకో మరణం సంభివిస్తున్నట్లు తేలింది. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్తంగా పరిశోధన నిర్వహించాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజేఎంఆర్) ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించింది.
100 కోట్లు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుక్కల సంఖ్య.
70 కోట్లు: వివిధ దేశాల్లో వీధికుక్కల సంఖ్య.
ప్రపంచంలో వీధికుక్కలు లేని మొదటి దేశం నెదర్లాండ్స్
2030: రేబిస్ మరణాలను పూర్తిగా నియంత్రించేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్న గడువు.
ఏటా సుమారు 20 వేల మంది మృతి
♦ ఐసీఎంఆర్–ఎయిమ్స్ అధ్యయనం ప్రకారం దేశంలో కుక్కకాట్లు, ఇతరత్రా జంతువుల కాటు కారణంగా సంభవించే రేబిస్‌తో ఏటా 18 వేల నుంచి 20 వేల మంది వరకు మృత్యువాతపడుతున్నారు. దేశంలో నమో దవుతున్న రేబిస్ మరణాల్లో 93% కుక్కకాటు ద్వారానే సంభవిస్తున్నా యి. అందులో 63% వీధికుక్కల ద్వారానే చోటుచేసుకుంటున్నాయి. పట్టణాల్లో 60%, గ్రామాల్లో 64% వీధికుక్కల ద్వారా రేబిస్ వ్యాప్తి చెందుతోంది.
దేశంలో కోటిన్నర వీధికుక్కలు...
♦ భారత్‌లో 2 కోట్ల కుక్కలు ఉండగా అందులో వీధికుక్కల సంఖ్య 1.53 కోట్లుగా ఉంది. వీధికుక్కలు పెరగడానికి ప్రధాన కారణం... వ్యర్థాలను తీసుకెళ్లే పద్ధతి సక్రమంగా లేకపోవడమేనని ఐసీఎంఆర్ అధ్యయనం పేర్కొంది. అందువల్లే వ్యర్థాలు ఉన్న దగ్గర వీధికుక్కల సంతతి పెరుగుతోందని విశ్లేషించింది.
ఆస్పత్రుల ప్రాంగణాల్లో తిష్ట...
దేశంలో ఎన్నో ఆసుపత్రులు కుక్కలకు ఆవాస కేంద్రాలుగా ఉంటున్నాయి. రోగులు పడేసే ఆహార వ్యర్థాలను తింటూ అక్కడే తిష్ట వేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. తిండి దొరకనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహణ సరిగ్గాలేని శవాగారాల్లోకి చొరబడి శవాలను సైతం పీక్కుతింటున్నాయి.
3 రకాల శునకాలు..
♦ మనుషుల మీద ఆధారపడే దాన్ని బట్టి కుక్కలను ఇంట్లో పెంచుకొనేవి, సామాజిక అవసరాలకు ఉపయోగించేవి, వీధికుక్కలుగా విభజించారు. అయితే ప్రధానంగా వీధికుక్కలతోనే సమస్యలు వస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కుక్కల సంతతి నియంత్రణకు సరైన ప్రణాళికలు రచించకపోవడం, జంతు హక్కుల కార్యకర్తల కార్యకలాపాల వల్ల కుక్కకాట్లు అధికమవుతున్నాయి.
కుక్కల నియంత్రణ ఇలా...
♦ దేశవ్యాప్తంగా ఏకకాలంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ కష్టసాధ్యమైనందున నోటి ద్వారా వేసే టీకాలను అభివృద్ధి చేసి కుక్కలకు ఆహారంలో కలిపి అందించాలి. దీనివల్ల వాటి జాతిని వీలైనంత మేర కట్టడి చేయవచ్చు.
♦ వీధికుక్కల కట్టడికి మున్సిపాలిటీ, వెటర్నరీ,
ఎన్జీవోలు, కుక్కల సంరక్షణ కేంద్రాలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలి.
♦ వీధికుక్కల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలను చైతన్యపరచాలి.
Comments
Please login to add a commentAdd a comment