శాకాహారానికే జై! | Vegans are steadily increasing in the country | Sakshi
Sakshi News home page

Vegans: దేశంలో క్రమంగా పెరుగుతున్న వీగన్స్‌

Published Thu, Jan 9 2025 5:07 AM | Last Updated on Thu, Jan 9 2025 7:38 PM

Vegans are steadily increasing in the country

లక్షలాది మంది శాకాహారులున్నట్లు ఐసీఎంఆర్‌–2021 అధ్యయనం అంచనా 

మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లతో వీగనిజమ్‌ను అందిపుచ్చుకుంటున్న వైనం 

23 నుంచి 37 శాతం వెజిటేరియన్లు ఉన్నట్లు పలు ప్రభుత్వ సర్వేల వెల్లడి 

ప్రముఖ నగరాల్లో పెరుగుతున్న శాకాహార రెస్టారెంట్లు, హోటళ్లు 

అత్యధికంగా రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్, బిహార్, యూపీల్లో వెజిటేరియన్లు

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) 2021లో చేసిన అధ్యయనం ప్రకారం భారత్‌లో లక్షలాది మంది శాకాహారులు ఉన్నారని అంచనా. అయితే ఏటా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. వీగన్‌ డైట్‌ గురించి గూగుల్‌ ట్రెండ్‌లు, ఆన్‌లైన్‌ శోధన డేటాను బట్టి చూస్తే గత దశాబ్ద కాలంలో దేశంలో శాకాహారంపై ప్రజల్లో ఆసక్తి గణనీయంగా పెరిగినట్టు స్పష్టమవుతోంది.  

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో ఇటీవలి కాలంలో ఆహార అలవాట్లు, ప్రాధాన్యాల్లో స్పష్టమైన మార్పులు కన్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శాకాహారంవైపు మొగ్గు విషయంలో వస్తున్న మార్పులు, ట్రెండ్‌లను ‘వీగనిజమ్‌’ను దేశ ప్రజలు వేగంగా అందిపుచ్చుకుంటున్నట్టు వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు వెజిటేరియన్‌ ఫుడ్‌ను ప్రముఖుల జీవనశైలి అలవాటుగా పరిగణించేవారు. కానీ ఈ ఆహారపు అలవాటు విషయంలో క్రమంగా సాంస్కృతికంగా మార్పులు వస్తున్నట్టు తెలుస్తోంది. 

ఆయా అంశాల ప్రాతిపదికన చూస్తే వెజిటేరియనిజమ్‌ వైపు మొగ్గు పెరుగుతున్నట్టుగా పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇండియాలో వీగనిజమ్‌ అనే కొత్త ఉద్యమం ప్రారంభమైనట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలోనే భారత్‌ను ‘ప్రపంచ శాకాహార రాజధాని’గా ఇతర దేశాలకు చెందిన వారు కీర్తించినా.. పలు ప్రభుత్వ సర్వేలు, అధ్యయనాల ప్రకారం చూస్తే 23 నుంచి 37 శాతం మంది దాకా వెజిటేరియన్లు ఉన్నారనే ప్రచారం జరిగింది. 

కొంత కాలం కిందట అమెరికాకు చెందిన బాలమురళి నటరాజ్, ఇండియాకు చెందిన సూరజ్‌ జాకబ్‌ నిర్వహించిన సర్వే ప్రకారం వీరి సంఖ్య 20 శాతం దాకా ఉండొచ్చునని అంచనా వేశారు. హైదరాబాద్‌ మొదలుకుని ముంబై, బెంగళూరు, పుణే, గోవా వంటి చోట్ల పూర్తిస్థాయి శాకాహార రెస్టారెంట్లు, హోటళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలోని చిన్న చిన్న పట్టణాల్లో కూడా శాకాహార ఉత్పత్తులు అందుబాటులోకి రావడంతో ప్రజలు వెజిటేరియన్‌ ఫుడ్‌ వైపు మొగ్గుచూపుతున్నట్టు స్పష్టం అవుతోందంటున్నారు. 

తాజా సర్వేలు, పరిశీలనలను బట్టి చూస్తే.. 
» రాజస్తాన్‌లో అత్యధికంగా శాకాహారం తీసుకునే ప్రజలున్నారు. ముఖ్యంగా జైపూర్, ఉదయ్‌పూర్‌ వంటి పట్టణ ప్రాంతాల్లో వీరు అధికం. తరతరాలుగా సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమంటున్నారు. 
» గుజరాత్‌లో అత్యధిక శాతం వెజిటేరియన్లు ఉన్నారు. ముఖ్యంగా జైనుల్లో మతపరమైన విశ్వాసాలు, శాకాహార జీవనశైలి కారణమని అంచనా. 
» మహారాష్ట్రలో గణనీయమైన సంఖ్యలో శాకాహారుల జనాభా ఉంది. ముంబై, పుణే వంటి నగరాల్లో వీరి సంఖ్య అధికం. ఇక్కడి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దాదా­పు ఒకేవిధమైన ఆహార పద్ధతులు పాటిస్తున్నారు. 

» హరియాణాలో కూడా తగినంత సంఖ్యలో వెజిటేరియన్లు ఉన్నారు. ఇక్కడి జనాభాలో ఎక్కువ మంది శాకాహారులే. ఈ రాష్ట్రంలోని గ్రామీణ వ్యవసాయ జీవనశైలి దీనికి కారణం. 
»  పంజాబ్‌ ప్రత్యేకమైన శాకాహార వంటలకు ప్రసిద్ధి. దా ల్, రోటీ, సబ్జీ వంటివి విరివిగా లభిస్తాయి. ఇక్కడ సి­క్కు­ల జనాభా అధికంగా ఉండటం కూడా ఓ కారణం. 
» బిహార్‌లోనూ హిందూయిజం, జైనిజంల విధానాలు, పద్ధతుల పాటింపు. పట్టణాలు, గ్రామాల్లో రోజువారీ ఆహారంలో అధికశాతం శాకాహారమే. 
» యూపీలో పెద్దసంఖ్యలో శాకాహారులున్నారు. రాష్ట్ర సంస్కృతి, ఆచారాల్లో శాకాహారం అనేది అంతర్భాగంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికులు వెజిటేరియన్లుగా ఉన్నారు.

భారత్‌లో శాకాహారం వైపు మొగ్గు ఎందుకంటే? 
» ఎక్కువ మంది ప్రజల్లో మొక్కల ఆధారిత, ఆకుపచ్చ కూరలతో కూడిన ఆహార అలవాట్ల వల్ల ఆరోగ్యపర ప్రయోజనాల పట్ల అవగాహన పెరుగుదల. 
» జంతువుల సంక్షేమంపై దృష్టి పెరగడంతో పాటు వాటికి హాని చేకూర్చకూడదనే విలువల పట్ల ప్రజల్లో చైతన్యం పెరగడం. 
» క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, భారత అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ సునీల్‌ ఛెత్రి, సినీతారలు అమితాబ్‌ బచ్చన్, అక్షయ్‌కుమార్, షాహిద్‌కపూర్, అనుష్క శర్మ, ఆలియా భట్, మలైకా అరోరా, భూమి ఫడ్నేకర్‌ వంటి సెలబ్రిటీలు వెజిటేరియన్లుగా మారిన ప్రభావం వారి అభిమానులపై బాగానే పడినట్టు వెల్లడైంది. 
» ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘ద గేమ్‌ చేంజర్స్‌’వంటి డాక్యుమెంటరీలు శాకాహారంపై అవగాహన, చైతన్యం పెరిగేందుకు దోహదపడ్డాయి. 

» సూపర్‌మార్కెట్లు, రెస్టారెంట్లతో పాటు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌పైనా వెజిటేరియన్‌ ఉత్పత్తులు విరి­విగా అందుబాటులోకి రావడం కూడా కారణం. 
» భారత్‌లో ప్లాంట్‌ బేస్డ్‌ ఫుడ్‌ ఇండస్ట్రీ అనేక రెట్లు పెరిగి 2022లో 1.3 బిలియన్ల మార్కెట్‌ వాల్యూను చేరుకుంది. 
» 2010 నుంచి చూసినట్లయితే ఇండియాలో ‘వీగన్‌ డైట్‌’పై ఆన్‌లైన్‌ సెర్చ్‌ డేటా రెండింతలు పెరుగుదల. 
» యూ గవ్‌ సర్వే ప్రకారం శాకాహార డైట్‌వైపు మొగ్గు చూపేందుకు 59 శాతం మంది సంసిద్ధత వ్యక్తం చేసినట్టు వెల్లడి. 
» వివిధ ఆహార ఉత్పత్తుల్లో జంతువుల నుంచి సేకరించిన దినుసులు లేవని తాము సేఫ్టీ స్టాండర్డ్స్‌ పాటిస్తున్నామని పలు సంస్థలు తమ ఫుడ్‌ లేబుళ్లపై స్పష్టం చేస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement