
ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయని సీఎం
లోకేశ్‌కు నచ్చకపోవడమే కారణం
ఇక ఆయన రాజకీయ పయనం ముగిసినట్లేనంటున్న నేతలు
అవమానకరంగా రాజకీయాల నుంచి తప్పించారంటూ సీనియర్ నేత అంతర్మథనం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు రాజకీయాల నుంచి అవమానకరంగా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సమకాలీకుడు, ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కునేందుకు స్పీకర్‌గా అన్ని విధాలా సహకరించిన సహచరుడు.. యనమలను పట్టించుకోకుండా చంద్రబాబు చివరి దశలో వదిలేశారనే చర్చ నడుస్తోంది. ఈ నెలాఖరుతో యనమల ఎమ్మెల్సీ పదవికి గడువు ముగియనుండగా, ఆయన సభ్యత్వాన్ని రెన్యువల్ చేయలేదు.
ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే ఆయన పాల్గొంటున్న చివరి సమావేశాలుగా చెబుతున్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్‌తో పొసగకపోవడం, ఆయన కోటరీని వ్యతిరేకించడం వల్లే యనమలను పూర్తిగా పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది. మున్ముందు రాజకీయంగా ఆయనకు ఎటువంటి పదవులు ఇచ్చే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయన రిటైర్ అయినట్లేనని స్పష్టం చేస్తున్నాయి.
పార్టీ కోసం సుదీర్ఘకాలం పని చేసిన వ్యక్తికి ఇంత అవమానకరంగా రాజకీయ ముగింపు ఉంటుందని ఎవరూ ఊహించలేదంటున్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయకపోవడంపై యనమల స్పందించకపోయినా తనను కావాలని అవమానించినట్లు సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది.
కూతురు, అల్లుడికి పదవులు ఉన్నాయనే కారణంతో పక్కకు..
టీడీపీలో ప్రస్తుతం లోకేశ్ మాటే శాసనంగా నడుస్తుండడంతో ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల పేరును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన కుమార్తె తుని ఎమ్మెల్యేగా, అల్లుడు ఏలూరు ఎంపీగా ఉండడంతో ఇక ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు సైతం భావించినట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా లేకపోయినా చంద్రబాబు ఆయన్ను ఎమ్మెల్సీగా చేసి ఆర్థిక మంత్రి పదవి ఇచ్చారు.
అప్పట్లో తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరినా ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటానని మంత్రి పదవి ఇచ్చారు. 2019లో టీడీపీ ఓడిపోవడంతో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. అయితే అంతకుముందు నుంచే పార్టీలో లోకేశ్ పెత్తనం పెరిగిపోవడం, దాన్ని యనమల వంటి పలువురు సీనియర్లు వ్యతిరేకించడంతో చినబాబు ఆగ్రహానికి గురై, వారి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉండడంతో యనమలకు పూర్తిగా చెక్ పెట్టి రాజకీయాల నుంచే అనివార్యంగా రిటైర్‌మెంట్ ఇప్పించారనే చర్చ జరుగుతోంది.
పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే ఇటీవల ఆయన కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఏకంగా చంద్రబాబుకు లేఖ రాశారు. కాకినాడ పోర్టు యజమానిగా ఉన్న కేవీ రావు పేదల భూములు తీసుకుని అక్రమంగా సంపాదించారని, అలాంటి వారిని వెనకేసుకురావడం ఏమిటని ప్రశ్నిoచారు. యనమల స్థాయి నాయకుడు ఏకంగా సీఎంని ప్రశ్నిస్తూ లేఖ రాయడం కలకలం రేపింది.
అయితే చంద్రబాబు తన మార్కు రాజకీయంతో పార్టీలోనే యనమల వ్యతిరేకుల్ని, సోషల్ మీడియాను ప్రోత్సహించి ఆయనపై ఎదురుదాడి చేయించడంతోపాటు అసభ్యంగా తిట్లు కూడా తిట్టించారు. అప్పటి నుంచి టీడీపీకి, యనమలకు మధ్య దూరం ఇంకా పెరిగిపోయింది.
వాడుకుని వదిలేయడం బాబుకు అలవాటే
ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లోనూ యనమలకు కనీస ప్రాధాన్యం లభించడంలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మండలిలో లోకేశ్ ఉన్నప్పుడు ఆయన చూస్తుండగా యనమల దగ్గరికి వెళ్లి మాట్లాడేందుకు సైతం టీడీపీ సభ్యులు జంకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా అవసరానికి వాడుకుని ఆ తర్వాత పూచికపుల్లలా తీసిపడేయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటైన విద్యే. కాబట్టి యనమలకు అదే తరహా ట్రీట్‌మెంట్ లభించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment