
ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కుతాయో తెలియక ఆందోళన
చినబాబునే కలవమంటున్న సీఎం చంద్రబాబు
యనమలకు మళ్లీ అవకాశం లేనట్లే
దువ్వారపు రామారావు, అశోక్‌బాబుకు అనుమానమే
బీటీ నాయుడు, జంగా కృష్ణమూర్తిలకు కష్టమే
ధనబలం ఉన్న వారికే ప్రాధాన్యం అంటున్న నేతలు
వర్మ, దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, ప్రభాకర్ చౌదరి ఆశలు
క్యూలో మరికొందరు ఎమ్మెల్యే సీటు దక్కని నేతలు
జనసేన తరఫున ఒక స్థానం నాగబాబుకు ఖరారైందని ప్రచారం
మరో స్థానం కోసం పట్టుబడుతున్న బీజేపీ
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెలలోనే ఎన్నికలు జరగనుండటంతో వాటి కోసం కూటమి పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది. సంఖ్యా బలం ప్రకారం ఈ ఐదు స్థానాలు కూటమి ఖాతాలోకే వెళ్లే పరిస్థితి ఉండడం, సీఎం తనయుడు లోకేశ్ వాటిని ఎవరికివ్వాలో నిర్దేశించే స్థితిలో ఉండడంతో ఆశావహులు తీవ్ర ఆందోళనకు గురవుతూ తెర వెనుక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్థానాల సిట్టింగ్ నేతలైన యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, పి అశోక్‌బాబు, జంగా కృష్ణమూర్తిలకు మళ్లీ అవకాశం దక్కడం కష్టమేనని టీడీపీ నేతలు చెబుతున్నారు.
యనమల రామకృష్ణుడికి దాదాపు తలుపులు మూసుకుపోయాయి. ఆయన కూతురు ఎమ్మెల్యేగా, అల్లుడు ఎంపీగా ఉండడంతోపాటు ఇటీవల అధిష్టానంతో తేడా రావడమే ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. మిగిలిన నలుగురిలో ఏ ఒక్కరికీ మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు తర్వాత మంత్రివర్గం కూర్పు, రాజ్యసభ సభ్యుల నియామకం, నామినేటెడ్ పదవులు, అధికారుల పోస్టింగ్‌లన్నింటినీ సీఎం కుమారుడిగా మంత్రి లోకేశ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. తన కోటరీలో ఉన్న వారికి, ధనబలం ఉన్న వారికి మాత్రమే ఆయన అవకాశం ఇస్తున్నారు. అందుకే పార్టీలో సీనియర్లు తమకు ప్రాధాన్యత దక్కడం లేదని రగిలిపోతున్నారు.
మమ్మల్ని పట్టించుకోండి మహాప్రబో..
ఎన్నికల్లో సీట్లు దక్కించుకోలేని ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రభాకర్ చౌదరి, కర్రి బంగార్రాజు, కేఎస్ జవహర్, హనుమంతరాయ చౌదరి, రమే‹Ùరెడ్డి, అప్పలనాయుడు వంటి నేతలు తమకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని ప్రాధేయ పడుతున్నారు. బుద్దా వెంకన్న, పీతల సుజాత, వర్ల రామయ్య, అశోక్‌బాబు వంటి నేతలు కూడా తమకు ఆ పదవి కేటాయించాలని కోరుతున్నారు. ఇలాంటి ఆశావహుల జాబితా టీడీపీలో చాలా పెద్దగానే ఉంది. వారంతా చంద్రబాబును కలుస్తున్నా, ఆయన చినబాబును కలవాలని చెబుతున్నారు.
పార్టీ కోసం ఎవరు బాగా పని చేశారో, ఎవరి అవసరం పార్టీకి ఉందో సర్వే చేయిస్తున్నామని, దాని ప్రకారం స్థానాలు కేటాయిస్తామని చెబుతున్నారు. దీంతో పార్టీ సీనియర్ నాయకులు, ఆశావహులు లోకేశ్‌ను కలవడం కోసం తెగ పాట్లు పడుతున్నారు. ఎన్నికల సమయంలో పిఠాపురం స్థానాన్ని పవన్ కళ్యాణ్ కోసం వదులుకున్న ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చాక సముచిత ప్రాధాన్యం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో పవన్ కోసం పని చేయించారు.
ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో టీడీపీలో చక్రం తిప్పిన దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పుడు పార్టీలో కరివేపాకులా మారిపోయారు. ఎమ్మెల్సీ ఇచ్చి తన పరువు కాపాడాలని ఆయన చంద్రబాబును, లోకేశ్‌ను వేడుకుంటున్నారు. అయితే అది ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. బుద్దా వెంకన్న వంటి వారైతే జగన్‌ను తిట్టడంలో ఛాంపియన్ అనిపించుకుని ఎమ్మెల్సీ పదవి కొట్టేయాలని ప్రయత్నిస్తున్నా, అది అంతగా ఫలించక పోవచ్చని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. లోకేశ్ మనసులో వేరే వారు ఉన్నారని, ఆయన లెక్కలు వేరని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
నాగబాబుకు పక్కా..
మరోవైపు ఐదు స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేన తరఫున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇవ్వడం ఖాయమని కూటమిలోని ఒక సీనియర్ నేత తెలిపారు. త్వరలో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఇటీవల సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తన అన్న మంత్రివర్గంలోకి వస్తారని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి లాంఛనమేనని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఒక స్థానాన్ని కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ స్థానాల్లో ఇప్పటికే బీజేపీకి ఎక్కువ అవకాశం కల్పించామని, ఈసారికి ఇవ్వలేమని టీడీపీ పైకి చెబుతున్నా, అగ్ర నేతలు జోక్యం చేసుకుంటే ఒకటి బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment