కూటమి ప్రభుత్వ కుట్రతో .. యువ శక్తి నిర్వీర్యం | Higher education is out of reach for children from poor families due to fee reimbursement arrears | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వ కుట్రతో .. యువ శక్తి నిర్వీర్యం

Published Tue, Mar 11 2025 5:21 AM | Last Updated on Tue, Mar 11 2025 5:21 AM

Higher education is out of reach for children from poor families due to fee reimbursement arrears

విద్యార్థి సంక్షేమాన్ని పక్కనపెట్టేందుకు కుయుక్తులు  

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలతో పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య దూరం

జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ పోయే.. నిరుద్యోగ భృతీ రాకపోయె..

16,347 పోస్టులతో డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం అభాసుపాలు

గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు 

9 నెలలు కావొస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్‌పై సందిగ్ధతే

ఏపీపీఎస్సీ ద్వారా ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వని కూటమి సర్కారు

గత ప్రభుత్వంలోని 21 నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించడంలోనూ కుతంత్రాలే

వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చిన వైద్య కళాశాలలు ప్రైవేటుపరం

రెండేళ్లలో సుమారు 2500 ఎంబీబీఎస్‌ సీట్లు కోల్పోతున్న దుస్థితి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులపై మీనమేషాలు లెక్కిస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. యాజమాన్యం తరగతి గది నుంచి ఎప్పుడు బయటకు గెంటేస్తుందోనన్న అవమాన భారంతోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నారు. కళ్ల ముందే బిడ్డలు పడుతున్న అవస్థలు చూడలేక పేదింటి తల్లిదండ్రులు ఇళ్లు, పొలాలు, పుస్తెలు తాకట్టు పెట్టిమరీ అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్న దుర్భర పరిస్థితి కనిపిస్తోంది. 

వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలోని చివరి రెండు త్రైమాసికాలకు కలిపి రూ.1,400 కోట్లు, వసతి దీవెన కింద రూ.1,100 కోట్లను జూన్‌లో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.  మళ్లీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ నిధులు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమయ్యేవి. కానీ, కూటమి అధికారంలోకి వచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన ఖర్చులను నిలిపివేసింది. పాత విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలు, ఈ విద్యా సంవత్సంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి రూ.3,500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయి పెట్టింది. 

కూటమి సర్కారు ఏర్పడిన ఈ 9 నెలల్లో మొక్కుబడి ప్రకటనలు మినహా విద్యార్థులకు ఒరగబెట్టిందేమీ లేదు. దీనికితోడు గత విద్యా సంవత్సరంలోని వసతి దీవెన చెల్లింపులు రూ.1,100 కోట్లకు మంగళం పాడింది. విద్యార్థులకు మొత్తం రూ.4600 కోట్లు బకాయిపడింది. అయితే, వైఎస్సార్‌సీపీ ‘యువత పోరుబాట’ ప్రకటనతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక త్రైమాసికంలో రూ.700 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు పాక్షిక చెల్లింపులు మాత్రమే జరిగాయి. 

చాలావరకు నిధులు ఇంకా కళాశాలల ఖాతాల్లో జమకాకపోవడం గమనార్హం. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదువుతున్నవారికి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు ప్రగల్భాలు పలికారు. వారిని నమ్మి ప్రైవేటు కళాశాలల్లో చేరినవారి నెత్తిన పిడుగుపడినట్లయింది. పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌ ఇలా.. ఉన్నత విద్యను సొంత డబ్బు పెట్టి చదువుకోలేనివారు తీవ్ర సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు.

ఇవ్వాల్సింది.. ఇచ్చేది.. అంతా మాయే!
ఉన్నత విద్యలో భాగంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు చెల్లించాలి. వసతి దీవెనగా ఏప్రిల్‌లో మరో రూ.1,100 కోట్లు  ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక విద్యా సంవత్సరంలో రూ.3,900 కోట్లు అందించాలి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం  విడుదల చేసింది మాత్రం రూ.700 కోట్లే. అందులోనూ పూర్తి సొమ్ములు కళాశాలలకు చేరలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు వచ్చే స్కాలర్‌షిప్‌లు మాత్రమే జమయ్యాయి. 

ఇక 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం రూ.3,200 కోట్లు బకాయిలు పెట్టింది. వచ్చే విద్యా సంవత్సరానికి మరో రూ.3,900 కోట్లను కలుపుకొని మొత్తం రూ.7,100 కోట్లు చెల్లించాలి. తాజా బడ్జెట్‌లో మాత్రం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే కూటమి చెప్పిన పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ హామీ బూటకంగా తేలిపోయింది. 

పాత బకాయిలూ ఇచ్చిన వైఎస్‌ జగన్‌
2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌ విద్యార్థులను రాజకీయాలకు అతీతంగా చదివించింది. 2017–19 మధ్య టీడీపీ ప్రభుత్వం 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు బకాయిలు పెడితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేశారు. మొత్తం రూ.18,663.44 కోట్లను అందజేశారు.

తొలి సంతకానికి విలువేది?
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న కొలువులు ఊడబీకి వలంటీర్లను నడిరోడ్డుపైకి లాగేశారు. రూ.10 వేలు వేతనం ఇస్తామని ఎన్నికల్లో హామీలు గుప్పించి పీఠం ఎక్కిన తర్వాత 2.60 లక్షల మంది వలంటీర్ల జీవితాలను గాలికి వదిలేశారు. 

మరోవైపు తొలి సంతకం అంటూ సీఎం చంద్రబాబు ఊదరగొట్టిన డీఎస్సీకి 9 నెలలైనా నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నిరుద్యోగులను నిలువునా ముంచారు. సుమారు 16,347 పోస్టులను ప్రకటించి.. డిసెంబరు నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సైతం రద్దు చేశారు. 

జనవరి వెళ్లిపోయే.. జాబ్‌ కేలండర్‌ పోయే!
‘ప్రతి సంవత్సరం జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు టైము రాసుకో.. జగన్‌లాగా పారిపోయే బ్యాచ్‌ కాదు నేను’..2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో మంత్రి నారా లోకేష్‌ చెప్పిన మాటలు ఇవి. కానీ, ఎన్నికలై, ప్రభుత్వం ఏర్పడ్డాక జాబ్‌ కేలండర్‌ ఊసే మర్చిపోయారు. లోకేష్‌ మాత్రమే కాదు.. చంద్రబాబు సైతం ఇదే హామీని పదేపదే ఇచ్చారు. జనవరి 1 వెళ్లిపోయింది, ఫిబ్రవరి దాటేసింది, మార్చి కూడా అయిపోతోంది..! కానీ జాబ్‌ కేలండర్‌ ప్రకటన లేదు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తవుతున్నా ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు.   

వైద్య కళాశాలలపై ప్రైవేటు కత్తి
వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చిన కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ పేదింటి బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 700 సీట్లు కోల్పోగా, వచ్చే ఏడాది అదనంగా వచ్చే సీట్లతో కలిపి మొత్తం 2500 సీట్లను కోల్పోవాల్సి వస్తోంది. 

అత్యంత పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ! 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫి కేషన్లు ఇచ్చి పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించింది. ప్రతి నోటిఫికేషన్‌కు షెడ్యూల్‌లో ప్రకటించిన తేదీల్లోనే పరీక్షలు జరిపింది. రెండుసార్లు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేపట్టి 1.34 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. 

2019కి ముందు టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం కోర్టు కేసులతో పాటు అన్ని వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేసింది. ప్రస్తుతం పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు చేస్తున్న ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రతి నెల సగటున రూ.15 వేల చొప్పున ఖర్చు చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. 

ఉద్యోగం రాలేదు.. భృతి ఇవ్వలేదు!
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు.. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌ లలో నిరుద్యోగుల సంక్షేమానికి పైసా కూడా విదల్చలేదు. ఏపీలో గత ఏడాది 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. 

ఇంటికి ఒకరిని గుర్తించినా నెలకు రూ.3 వేల చొప్పున రూ.4,800 కోట్లు, ఏడాదికి రూ.57,600 కోట్లు కేటాయించాల్సి ఉండగా మొండిచెయ్యి చూపింది. 2025–26 బడ్జెట్‌కు వచ్చేసరికి కుటుంబాల సంఖ్య 1.70 కోట్లకు చేరింది. ఈ లెక్కన నెలకు రూ.5,100 కోట్లు ఏడాదికి రూ.61,200 కోట్లు అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement