కుక్క కరిచిన విషయాన్ని దాచి, నెలరోజల్లోనే విలవిల్లాడుతూ.. | 14-Year-Old Boy Dies Of Rabies, Month After Dog Bite In Ghaziabad - Sakshi
Sakshi News home page

హృదయ విదారకం.. కుక్క కరిచిన విషయం దాచి, నొప్పితో విలవిల్లాడుతూ తండ్రి ఒడిలోనే..

Published Thu, Sep 7 2023 10:41 AM | Last Updated on Thu, Sep 7 2023 11:15 AM

14-Yr Old Boy Dies Of Rabies, Month After Dog Bite In Ghaziabad  - Sakshi

ఉత్తర ప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్క క‌రిచిన విష‌యాన్ని ఓ బాలుడు త‌న పేరెంట్స్‌కు చెప్పకపోవడంతో.. నెలన్నర త‌ర్వాత ప్రాణాంతక రేబిస్‌తో (కుక్కకాటు వల్ల వచ్చే రేబిస్‌ వ్యాధి) చనిపోయాడు. తండ్రి భూజాల మీదే చిన్నారి కన్నుమూయడం హృదయ విదారకం. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడిని 8వ తరగతి చదువుతున్న షావేజ్‌గా గుర్తించారు.

వివరాలు.. విజయ్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలోని చరణ్‌ సింగ్‌ కాలనీకి చెందిన షావేజ్‌ ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు.  నెలన్నర కిత్రం అతన్ని పక్కింటి వారికి చెందిన కుక్క కరిచింది. ఈ విషయాన్ని చిన్నారి భయంతో తన తల్లిదండ్రుల దగ్గర చెప్పకుండా దాడిపెట్టాడు. అయితే ఆ కుక్కకు వ్యాక్సిన్‌ చేయించకపోవడంతో బాలుడికి రేబిస్‌ వ్యాధి వ్యాపించింది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి బాలుడి అనారోగ్యానికి గుర‌య్యాడు. అన్నం తినడం మానేసి వింతగా ప్రవర్తించడం, కుక్కలా మొరగడం మొదలు పెట్టాడు.

గమనించిన తల్లిదండ్రులు గట్టిగా మందలించడంతో కొన్ని రోజుల క్రితం కుక్క కరిచిన విషయాన్ని తెలిపాడు. షావేజ్ కుటుంబీకులు అతన్ని ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కానీ అక్కడ చికిత్స చేసేందుకు చేర్చుకోకపోవడంతో బులంద్‌షహర్‌లోని ఆయుర్వేద వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే బాలుడి పరిస్థితి క్షీణించడంతో బులంద్‌షహర్ నుంచి ఘజియాబాద్‌కు బయల్దేరారు.

అంబులెన్స్‌లో ఘజియాబాద్‌కు తీసుకువస్తున్న సమయంలో బాలుడు తన తండ్రి చేతుల్లోనే ప్రాణాలు విడిచాడు. అంబులెన్స్‌లో కొడుకు పరిస్థితిని చూసి కుమిలిపోతున్న తండ్రి, తండ్రి చేతిలో మృత్యువుతో పోరాడుతున్న బాలుడు నొప్పితో మెలికలు తిరుగుతున్న హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు బాలుడి మృతికి కార‌ణ‌మైన కుక్క‌తో పాటు దాని య‌జ‌మానిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని షావాజ్ కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement