ఓ ప్రొఫెషనల్ కిల్లర్ చేయని హత్యకు పోలీసుల నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో స్పైడర్‌మ్యాన్ మాదిరి జంప్ చేసి రైలెక్కుతాడు. ఆ రైల్లో ‘బేసిక్‌గానే బ్యాడ్ జాతకం’ ఉన్న ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. ఇంటి నుంచి చిన్నప్పుడే పారిపోయిన ఆ వ్యక్తి.. తిరిగి కుటుంబాన్ని కలుసుకునే ఎగ్జైట్‌మెంట్లో ఉంటాడు. ఇంతలో బుల్లెట్ ప్రాణం ఆ వ్యక్తి తీసేస్తుంది. దీంతో అసలు పార్థు బదులు ‘అతడు’ బాసర్లపూడికి వెళ్లాల్సి వస్తుంది. ఇదో సినిమా కథ.. కానీ, ఇక్కడ నిజజీవితంలో కొడుకు కాని కొడుకు ఒకడు ఓ కుటుంబాన్ని మోసం చేయాలనుకున్న తీరు గురించి తెలిస్తే.. మీరు కూడా ‘వీడు మాములోడు కాదు.. ఖతర్నాక్’ అనుకోవడం ఖాయం!.
ఊరు: యూపీ ఘజియాబాద్
స్థలం: ఖోడా పోలీస్ స్టేషన్..
తేదీ నవంబర్ 21,
టైం.. సరిగ్గా తెలియదు.
మూడు పదుల వయసులో ఉన్న ఓ వ్యక్తి పీఎస్‌కు వచ్చాడు. తనను చిన్నప్పుడే ఎవరో ఎత్తుకెళ్లారని.. కన్నవాళ్లకు దూరమై ఇన్నాళ్లు నరకయాతన అనుభవించానని.. వాళ్ల కోసం ఎక్కడెక్కడో తిరిగానని.. తన కుటుంబాన్ని ఎలాగైనా వెతికిపెట్టమని పోలీసులను బతిమిలాడాడు. ఆ కన్నీళ్లకు పోలీసులు జాలిపడ్డారు. బట్టలు, చెప్పులు కొనిచ్చి.. తిండి పెట్టి స్టేషన్‌లోనే ఉండనిచ్చారు. ఈలోపు అతనిచ్చిన సమాచారంతో మీడియాలో, సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రయత్నం ఫలించి చివరకు ఓ కుటుంబం అతడి కోసం స్టేషన్‌కు వచ్చింది.
అది 1993 సంవత్సరం..
తేదీ సెప్టెంబర్ 08
సమయం: పిల్లలు బడుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం
స్కూల్ నుంచి షాహిబాబాద్(ఢిల్లీ)లోని ఇంటికి తన సోదరితో బయల్దేరిన ఏడేళ్ల రాజును.. ఎవరో బలవంతంగా తమ వాహనంలో ఎత్తుకెళ్లారు. ఆ చిన్నారి పరుగున వచ్చి అన్నను ఎవరో ఎత్తుకెళ్లారని ఇంట్లో విషయం చెప్పింది. ఆందోళనతో ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఊరంతా జల్లెడ పట్టారు. లాభం లేకపోయింది.
అయితే అటు కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్ లేకపోవడం.. పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కనిపెట్టడంలో విఫలం కావడంతో ఇన్నేళ్లుగా ఆ కేసు ఓ మిస్టరీగానే ఉండిపోయింది.
చివరకు.. ఇన్నేళ్ల తర్వాత తానే ఆ రాజునంటూ ఓ వ్యక్తి వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. తనను రాజస్థాన్‌కు తీసుకెళ్లి హింసించారని, ఓ ఇంట్లో బంధించి పనులు చేయించుకున్నారని, ఆ ఇంట్లో ఓ పాప తనకు ధైర్యం చెబుతూ వచ్చిందని, ఎలాగోలా తప్పించుకుని ఊరు దాటానని, ఇన్నేళ్లు ఏవేవో పనులు చేసుకుంటూ ఎక్కడెక్కడో తిరిగానని.. కన్నీళ్లతో చెప్పాడు రాజు. హనుమాన్ దయవల్లే తాను బతికి బట్టకట్టానని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు.
ఆ మాటలతో చలించిపోయిన వాళ్ల అమ్మ.. అతన్ని అక్కున చేర్చుకుంది. ఇన్నేళ్ల తర్వాత కొడుకు తిరిగి వచ్చాడన్న ఆనందంలో అంతా మునిగిపోయారు. అక్కడి మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ఈ ఎమోషనల్ రీయూనియన్ మీద వరుసబెట్టి కథనాలు ఇచ్చింది. ఇక్కడితో కథ సుఖాంతం అయ్యిందనుకునేరు!.
ఇంటికి చేరుకున్నవాడు తిన్నగా ఉంటే ఫర్వాలేదు. కానీ, ఆస్తుల గురించి, ఇంట్లో దాచిన బంగారం.. డబ్బు గురించి పదే పదే ఆరా తీయడం మొదలుపెట్టాడట. దీంతో వారం తిరగకముందే ఆ కుటుంబం మళ్లీ ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. అనుమానాల నడుమ.. డీఎన్‌ఏ టెస్ట్ నిర్వహిస్తే అతను వాళ్ల కొడుకే కాదని తేలింది. దీంతో పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. తమ స్టైల్ ఇంటరాగేషన్ చేసి నిజాలు కక్కించారు.
రాజస్థాన్‌కు చెందిన రాజు అలియాస్ భీమ్ అలియాస్ ఇంద్రరాజ్ అలియాస్.. చిన్నప్పటి నుంచే దొంగతనం అలవర్చుకున్నాడు. బంధువుల ఇళ్లను సైతం వదల్లేదు. దీంతో వాళ్ల శాపనార్థాలు భరించలేక ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఊరూరా తిరుగుతూ చోరీలు చేస్తూ పోయాడు. ఈ క్రమంలో.. అతనికో ఆలోచన వచ్చింది.
తన ఐడెంటిటీని మార్చుకుంటూ ఊర్లు తిరగసాగాడు. తన తల్లి చనిపోయిందని, తాను అనాథనంటూ పని కావాలంటూ.. ఎమోషనల్ డ్రామాలు ఆడేవాడు. దీంతో కరిగిపోయి వాళ్లు అతన్ని చేరదీసేవారు. అయితే చెప్పాపెట్టకుండా ఏదో ఒక రాత్రి.. ఆ ఇంట్లోని నగదు, బంగారంతో ఉడాయించేవాడు. అలా.. ఇప్పటిదాకా 9 కుటుంబాలను అతను మోసం చేసినట్లు ఘజియాబాద్ పోలీసులు నిర్ధారించారు.
ఈ క్రమంలో.. ఘజియాబాద్‌లో ఓ ధనికుల కుటుంబంలో పిల్లాడు.. చిన్నవయసులోనే ఇంట్లోంచి పారిపోయాడని తెలుసుకున్నాడు. పోలీసులనే ఏమార్చి ఆ ఇంటికి కన్నం వేయాలనుకున్నాడు. కానీ, చివరకు అడ్డంగా దొరికిపోయి ఊచలు లెక్కిస్తున్నాడు ఈ కొడుకు కాని కొడుకు.
गाजियाबाद में 30 साल पहले अगवा हुआ बेटा लौटा था घर, वो निकला धोखेबाज, इस तरह का अपराध कई बार कर चुका है; परिवारों को बताया कि वो उनका लापता परिजन है
#Ghaziabad #Police #GhaziabadPolice #kidnapped #lostrelative @ghaziabadpolice #imposter #Jantv_BM #jantvdigital #jantvreel pic.twitter.com/gcnPLT77lU— JAN TV (@JANTV2012) December 7, 2024
Video Credits: JAN TV
Comments
Please login to add a commentAdd a comment