
విశాఖపట్నం వన్‌టౌన్ పోలీసులకు హైకోర్టు ఆదేశం
బెయిల్ మంజూరు చేసిన నరసరావుపేట కోర్టు
ఆదోని పోలీసుల కస్టడీ పిటిషన్ డిస్మిస్
సాక్షి, అమరావతి/నరసరావుపేట టౌన్/కర్నూలు (టౌన్) : సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సినీనటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయనపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని విశాఖపట్నం వన్‌టౌన్ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అలాగే, గుంటూరు పట్టాభిపురం, అల్లూరి జిల్లా పాడేరు, మన్యం జిల్లా పాలకొండ పోలీ స్‌స్టేషన్లలో నమోదైన కేసుల్లో పోసానికి బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35 (3) కింద నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
ఇదే సమయంలో భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ అమలుచేసిన నేపథ్యంలో, తనపై కేసు కొట్టేయాలంటూ పోసాని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఏమాత్రం వర్తించని సెక్షన్ల కింద కేసులు..
సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తదితరులను కించపరుస్తూ సోషల్ మీడియాలో మాట్లాడారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళిపై పట్టాభిపురం, భవానీపురం, పాడేరు, పాలకొండ, విశాఖపట్నం వన్‌టౌన్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులను కొట్టేయాలని కోరుతూ పోసాని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై సోమవారం జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు. పోసాని తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. భవానీపురం పోలీసులు ఇప్పటికే పీటీ వారెంట్‌ను అమలుచేసినందున పోసాని పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యా యమూర్తి జస్టిస్ హరినాథ్.. అదనపు ఏజీ, పీపీ వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ పోసాని క్వాష్ పిటిషన్‌ను కొట్టేశారు. విశాఖ వన్‌టౌన్ పోలీసులు నమోదుచేసిన కేసులో మాత్రం పోసానిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.
పోసానికి బెయిల్ మంజూరు..
పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేస్తూ నరసరావుపేట ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్. ఆశీర్వాదం పాల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇద్దరు జామీన్‌దారులు ఒక్కొక్కరు రూ.10 వేలు పూచీకత్తు చొప్పున సమర్పించేలా ఉత్తర్వులు జారీచేశారు. రాజంపేట సబ్‌జైల్లో ఉన్న పోసానిని ఈనెల 3న పీటి వారెంట్‌పై నరసరావుపేట టూటౌన్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు.
రిమాండ్ అనంతరం గుంటూరు సబ్‌జైలులో ఉన్న ఆయనను పీటి వారెంట్‌పై కర్నూలు పోలీసులు అక్కడ నమోదైన కేసులో తీసుకెళ్లి కోర్టులో హాజరుపర్చారు. ప్రస్తుతం ఆదోని సబ్‌జైల్లో పోసాని ఉన్నారు. ఇక పోసానిపై ఆదోని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను సోమవారం కర్నూలు మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్‌సీఎం) అపర్ణ డిస్మిస్ చేశారు. అలాగే, బెయిల్ పిటిషన్‌పై వాదనలు కూడా ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. మంగళవారం తీర్పు వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment