అమెరికా అధ్యక్షపీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిరోహించనున్నారు. ఇప్పటికే తన వద్ద పనిచేసే మంత్రులను నియమిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆరోగ్య, ప్రజా సేవల మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు. అయితే ఇందుకు సెనెట్‌లో ఆమోదం లభించాల్సి ఉంటుంది. అమెరికాకు అత్యధికంగా భారత ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ తరుణంలో కెనెడీ నియామకం పట్ల భారత కంపెనీలు కొంత ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
‘ప్రజారోగ్యం విషయంలో మందుల కంపెనీల మోసాలు, తప్పుడు సమాచారం తదితరాలతో అమెరికన్లు చాలాకాలంగా నలిగిపోయారు. కెనెడీ వీటికి అడ్డుకట్ట వేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యంగా మారుస్తారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆహార భద్రత, వైద్య పరిశోధన, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కీలక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు.
2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 7.55 బిలియన్ డాలర్లు (రూ.62,615 కోట్లు) విలువ చేసే ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. యాంటిసెరా, వ్యాక్సిన్‌లు, టాక్సిన్‌లు, గ్రంథులు.. వంటి వాటిని ఎగుమతి చేస్తున్నారు. అమెరికాకు ఎగుమతి చేసే దేశీయ కంపెనీల్లో ప్రధానంగా సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, లుపిన్ లిమిటెడ్.. వంటి కంపెనీలున్నాయి. వీటితోపాటు ప్రధానంగా కరోనా సమయం నుంచి ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా దేశీయంగా తయారైన కొవాక్సిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు అమెరికాకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. ఆరోగ్య మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేకిగా ఉన్న కెనెడీ నియామకం ఫార్మా కంపెనీల్లో కొంత ఆందోళన కలిగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రియల్టీ జోరు!
‘మేక్ అమెరికా హెల్దీ అగైన్’ నినాదానికి కెనెడీ పూర్తిగా న్యాయం చేస్తారని ట్రంప్ విశ్వాసం వెలిబుచ్చారు. తన రెండో విడత పాలనలో ప్రజారోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కెనెడీకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ట్రంప్ పదేపదే చెప్పుకొచ్చారు. టీకాలు తదితరాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికి ఏకంగా ఆరోగ్య శాఖ అప్పగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, నిబంధనల ప్రకారం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ ఎఫ్‌డీఏ) ధ్రువపరిచిన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతికి ఎలాంటి ఢోకా లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment