హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దేశంలోని ఏడు మెట్రో నగరాల్లోని ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ వాటా 12 శాతంగా ఉంది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ3)లో నగరంలో 12,700 గృహాలు అమ్ముడుపోగా.. 13,900 యూనిట్లు సిద్ధం అయ్యాయి. క్యూ2తో పోలిస్తే విక్రయాలు 16 శాతం క్షీణించగా.. కొత్తగా సిద్ధమైనవి ఒక శాతం పెరిగాయని అనరాక్ తాజా అధ్యయనం వెల్లడించింది.
గృహ విక్రయాల్లో పశ్చిమ హైదరాబాద్ హవా కొనసాగుతోంది. క్యూ3లో అమ్ముడైన ఇళ్లలో 53 శాతం వెస్ట్ జోన్‌లోనే జరిగాయి. ఆ తర్వాత నార్త్‌లో 28 శాతం, సౌత్‌లో 13 శాతం, ఈస్ట్‌లో 4 శాతం, సెంట్రల్ హైదరాబాద్‌లో ఒక శాతం విక్రయాలు జరిగాయి. నగరంలో అపార్ట్‌మెంట్ల చదరపు అడుగు ధర సగటున రూ.7,150లుగా ఉన్నాయి.
లక్ష దాటిన ఇన్వెంటరీ..
హైదరాబాద్‌లో తొలిసారిగా ఇన్వెంటరీ లక్ష యూనిట్లను దాటింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి నగరంలో 1.01 లక్షల గృహాల ఇన్వెంటరీ ఉంది. దేశంలోని ఇన్వెంటరీలో 18 శాతం నగరానిదే. అత్యధికంగా పశ్చిమ హైదరాబాద్‌లో 60 శాతం, నార్త్‌లో 25 శాతం ఇన్వెంటరీ ఉంది.
3–5 శాతం ధరల వృద్ధి..
నగరంలో మూడు నెలల్లో గృహాల అద్దెలు 1–4 శాతం, అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగుకు ధరలు 3–5 శాతం మేర పెరిగాయి. ఆదిభట్లలో చ.అ. ధర సగటు రూ.4,650, ఎల్బీనగర్‌లో రూ.6,800, మియాపూర్‌లో 6,700, కొండాపూర్‌లో రూ.8,600, గచ్చిబౌలీలో రూ.8,900లుగా ఉన్నాయి. ఇక అద్దెలు డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్‌లకు నెలకు ఆయా ప్రాంతాల్లో రూ.14 వేల నుంచి రూ.42 వేలుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!
లగ్జరీ గృహాలే ఎక్కువ..
నగరంలో క్యూ3లో 13,900 యూనిట్లు సిద్ధం కాగా.. లగ్జరీ గృహాలు అత్యధికంగా ఉన్నాయి. రూ.1.5 కోట్లకు పైగా ధర ఉన్న ప్రీమియం ఇళ్ల వాటా 60 శాతంగా ఉంది. విభాగాల వారీగా చూస్తే.. రూ.40–80 లక్షల ధర ఉన్న గృహాల వాటా మూడు శాతం, రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ఉన్న యూనిట్ల వాటా 37%, రూ.1.5–2.5 కోట్ల ధర ఉన్న ఇళ్ల వాటా 40%, రెండున్నర కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 20 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment