కుక్కల బీభత్సం.. రోజుకు వెయ్యిమందిని కరుస్తూ.. | Dogs are Biting Thousand People Every day in Delhi | Sakshi
Sakshi News home page

కుక్కల బీభత్సం.. రోజుకు వెయ్యిమందిని కరుస్తూ..

Published Sat, Sep 28 2024 9:55 AM | Last Updated on Sat, Sep 28 2024 10:48 AM

Dogs are Biting Thousand People Every day in Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కుక్కకాటు ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రోజుకు వెయ్యి మందికి పైగా జనం కుక్క కాటుకు గురవుతున్నారు. ఢిల్లీకి చెందిన వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం సఫ్దర్‌జంగ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, హిందూరావు, జీటీబీ, డీడీయూ, లోక్‌నాయక్, ఇతర ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు రేబిస్ వ్యాక్సిన్ కోసం ప్రతి రోజు వెయ్యి మందికి పైగా బాధితులు వస్తున్నారు.

కుక్కకాటు కేసుల్లో 60 శాతం మంది చిన్నారులేనని వైద్యులు చెబుతున్నారు. సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి చెందిన యాంటీ రేబిస్‌ క్లినిక్‌ హెడ్‌ డాక్టర్‌ యోగేశ్‌ గౌతమ్‌ మాట్లాడుతూ ఆస్పత్రిలో రోజూ దాదాపు 500 రేబిస్‌ టీకాలు వేస్తున్నారని తెలిపారు. వీరిలో 200 మంది కొత్త రోగులు కాగా, 300 మంది పాత రోగులు. లోక్ నాయక్ ఆస్పత్రి అత్యవసర విభాగం అధిపతి డాక్టర్ రీతూ సక్సేనా మాట్లాడుతూ తమ ఆస్పత్రికి ప్రతిరోజూ దాదాపు 100 మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు వస్తున్నారని తెలిపారు. సెలవు దినాల్లో వీరి సంఖ్య  మరింతగా పెరుగుతున్నదన్నారు.

సాధారణంగా కుక్క, పిల్లి, నక్క, తోడేలు, గబ్బిలం లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు బాధితుడు తప్పనిసరిగా రేబిస్ టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏదైనా జంతువు కరచిన వెంటనే బాధితునికి మొదటి డోస్ ఇస్తారు. రెండవది మూడు రోజులు, మూడవది ఏడు రోజులు, నాల్గవ డోస్ 28 రోజులకు అందిస్తారు. మొదటి డోస్‌తో పాటు యాంటీ రేబిస్ సీరమ్ (ఏఆర్‌ఎస్‌)ను కూడా బాధితునికి ఇస్తారు.

ఇది కూడా చదవండి: ఒకే ఇంటిలో ఐదు మృతదేహాలు.. ఢిల్లీలో కలకలం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement