సాక్షి, హైదరాబాద్ : గ్రామ సింహాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రోడ్లపై తిరగాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా జనాలపైకి ఎగబడుతున్నాయి. దీంతో కుక్కకాటు బారిన పడేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. నగరాలు, పట్టణాల కంటే గ్రామాల్లోనే కుక్కకాటు బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గ్రామపంచాయతీలకు సరిపడా నిధుల్లేకపోవడంతో కుక్కల నియంత్రణకు శాశ్వత చర్యలు తీసుకునే పరిస్థితి ఉండట్లేదు. దీంతో కుక్కల సంఖ్య పెరుగుతోంది. కుక్కకాటు బాధితులూ పెరుగుతున్నారు.
సకాలంలో వైద్యం అందకపోవడంతో కుక్కకాటు వల్ల రేబిస్ సోకి మరణాలు సంభవిస్తున్నాయి. రేబిస్ కారణంగా ఏటా 500 మంది మరణిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రేబిస్ నియంత్రణ ఔషధాలూ కరువవుతున్నాయి.
గ్రామ పంచాయతీలకే
నగరాలు, పట్టణాల్లో కుక్కల నియంత్రణ అంతా నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల పర్యవేక్షణలో ఉంటోంది. గ్రామాల్లో ఆయా గ్రామపంచాయతీలే ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. గ్రామాల వెలుపల వాటిని వదిలేయడంతోనే సరిపెడుతున్నారు. దీంతో వీధి కుక్కలు మళ్లీ ఊళ్లోకి వస్తున్నాయి. కుక్కల నియంత్రణలో దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడంతో అసలు సమస్యలు పెరుగుతున్నాయి. వీటికి ఆహారం దొరకక అసహనంతో మనుషులపై దాడులు చేస్తున్నాయి. దీంతో కుక్కకాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఏటా 1.7 లక్షల మంది బాధితులు
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏటా సగటున 1.70 లక్షల మంది కుక్కకాటు బారిన పడుతున్నారు. హైదరాబాద్, వరంగల్ మహానగరాల్లో కుక్కకాటు కేసులు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల్లో చేరట్లేదు. ఇక్కడి బాధితులలో ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేసుకుంటుండటంతో అధికారులు అధికారిక గణాంకాల్లో నమోదు చేయట్లేదు. పాత నల్లగొండ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కుక్కకాటు బాధితులు ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment