మహబూబ్‌నగర్ క్రైం/గూడూరు: వేర్వేరు జిల్లాల్లో పిచ్చికుక్కల దాడిలో 26 మంది చిన్నారులు గాయపడ్డారు. మహబూబ్‌నగర్ పట్టణంలో గురువారం రాత్రి 7 – 8.30 గంటల ప్రాంతంలో గోల్ మజీద్, పాత పాలమూరు ఏరియాలో ఒక పిచ్చికుక్క చిన్నారులను వెంటాడి కరుస్తూ గాయపరిచింది. గాయపడిన 24 మంది చిన్నారులకు జనరల్ ఆస్పత్రిలో టీటీ ఏఆర్‌వీ టీకాలు ఇచ్చారు.
ఇందులో ఐదుగురు చిన్నారులకు గాయాలు ఎక్కువ కావడంతో.. వారిని ఆస్పత్రిలో చేర్పించుకుని పరిశీలనలో ఉంచినట్లు ఆర్‌ఎంవో డాక్టర్ జరీనా తెలిపారు. చిన్నారులను గురువారం రాత్రి జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పరామర్శించారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యాధికారులను ఆదేశించారు. కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు.
మహబూబాబాద్ జిల్లాలో.. : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురానికి చెందిన మహేశ్ కూతురు స్మైలీ, కారం సుమన్ కుమారుడు అచ్చితానంద.. గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా, పిచ్చికుక్క వీరిద్దరిపై దాడికి పాల్పడింది. కుటుంబసభ్యులు చిన్నారులను కుక్క బారి నుంచి కాపాడారు. గాయపడిన చిన్నారులను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment