సాక్షి, హైదరాబాద్: దీపావళి వేడుకల్లో పలు చోట్ల అపశృతులు చోటుచేసుకున్నాయి. బాణసంచా కాలుస్తూ పలువురు గాయపడ్డారు. దీంతో బాధితులంతా సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. ఇప్పటివరకు 40 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చారు. కాగా, గాయాలపాలైన వారికి చికిత్స కోసం సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. వంద బెడ్లు వైద్యాధికారులు ఏర్పాటు చేశారు. 9 మందికి తీవ్ర గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ఈసారి ప్రజల్లో అవగాహన పెరిగిందని.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేసులు తగ్గుతాయని ఆశిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. టపాసుల దుకాణాలతో మార్కెట్లు, కిటకిటలాడాయి. చిన్నాపెద్దా పెద్ద బాణసంచా పేలుస్తూ ఆనందంగా గడిపారు. కాగా, దీపావళి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చడానికి అనుమతినిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు.
అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment