
హైదరాబాద్, సాక్షి: చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుక్క తరమడంతో మూడో అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవీ ప్రైడ్ హోటల్లో ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం రాత్రి వరకు బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తపడటం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘కుటుంబ సభ్యులతో నగరానికి వచ్చిన తెనాలికి చెందిన ఉదయ్(23) రామచంపురం అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే.. ఆదివారం తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు చందానగర్‌లోని వీవీ ప్రైడ్ హోటల్లో రూమ్ తీసుకున్నాడు. స్నేహితులతో కలిసి హోటల్లోని మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే అక్కడే ఉన్న ఓ వారిని తరిమింది. దీంతో భయాందోళనకు గురై హోటల్ మూడో అంతస్తు బాల్కనీలోని కిటికీ నుంచి కిందకు దూకాడు.
తీవ్ర గాయాల పాలైన ఉదయ్‌ను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఉదయ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు.. గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. సీసీటీవీ కెమెరాలలో ప్రమాదం దృశ్యాలు రికార్డు అయ్యాయి. అసలు హోటల్ మూడో అంతస్తులోకి కుక్క ఎలా వచ్చింది? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేసు నమోదు చేసుకుని చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
