అందుబాటులోకి పెట్ క్రిమటోరియంలు
సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు
రూ. 2500 ఫీజు చెల్లిస్తే చాలు
అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్కలు మృతి చెందితే వాటి అంతిమ సంస్కారాలు ఎలా చేయాలా అని యజమానులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా పెంపుడు శునకాలు, ఇతర పెంపుడు జంతువులను ఖననం చేయడం, దహన సంస్కారాలు చేయడానికో స్థలం లేక నగరజంతు ప్రేమికులు నరకయాతన అనుభవిస్తున్నారు.
అపార్ట్‌మెంట్, విల్లా కల్చర్ వచ్చాక పెంపుడు శునకాలను ఖననం చేసేందుకు మరుభూమి లేక ఇబ్బందులు పడుతున్న కష్టకాలంలో జీహెచ్‌ఎంసీ, పీపుల్ ఫర్ ఎనిమల్స్ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఎవరైనా తమ ఇంట్లో పెంపుడు కుక్క మృతి చెందితే దానికి గౌరవప్రదంగా అంతిమయాత్ర నిర్వహించడం, అంతకుమించి మర్యాదపూర్వకమైన దహన సంస్కారాలు చేయడం అందుబాటులోకి వచ్చిది. ఆ వివరాలు తెలుసుకుందాం.. – బంజారాహిల్స్
నగరంలో జంతు ప్రేమికులు చాలా మందే ఉన్నారు.. వారు అల్లారు ముద్దుగా పెంచుకున్న జంతువులు మృతి చెందితే తీసుకెళ్లి ఎక్కడో పడేయకుండా సంప్రదాయబద్ధంగా శునకాలు, ఇతర జంతువులకు కూడా దహన సంస్కారాలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పీపుల్ ఫర్ ఎనిమల్స్(పీఎఫ్‌ఏ) సంయుక్తంగా డోర్ టూ టూర్ క్రిమేషన్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. పెంపుడు జంతువుల యజమానులకు ఇదొక శుభవార్త అనే చెప్పాలి. ఇంటికే వచ్చి మృతి చెందిన శునకాన్నో, ఇతర పెంపుడు జంతువునో ప్రత్యేకంగా అలంకరించిన అంతిమయాత్ర వాహనంలో వలంటీర్లు సంప్రదాయబద్ధంగా తీసుకెళ్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇందుకోసం పీఎఫ్‌ఏ ప్రత్యేక వాహనాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఫోన్ చేస్తే చాలు ఇంటికే వచ్చి పెట్ మృతదేహాన్ని ఫతుల్లాగూడలోని క్రిమేషన్‌కు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రూ.2,500 దూరాన్ని బట్టి ఫీజుగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫతుల్లాగూడలో మాత్రమే అందుబాటులో ఉన్న పెట్ క్రిమేషన్ త్వరలోనే గాజుల రామారం, గోపన్‌పల్లిలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
డిసెంబర్ 2022 నుంచే..
ఫతుల్లాగూడలో ఈ సౌకర్యం 2022 డిసెంబర్ నుంచే అందుబాటులోకి వచ్చిది. చాలా మంది తమ ఇంట్లో కుక్కలు చనిపోతే ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక కన్నీరు మున్నీరవుతూ బాధపడుతుండటాన్ని గమనించిన పీఎఫ్‌ఏ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వలంటీర్లను కూడా నియమించింది.
డయల్ చేయాల్సిన నంబర్లు..
జంతు ప్రేమికులు తమ ఇళ్లలో పెంపుడు శునకం మృతి చెందితే 73374 50643, 95055 37388 నంబర్‌కు ఫోన్ చేస్తే ప్రత్యేకంగా అలంకరించిన అంతిమయాత్ర వాహనంలో వలంటీర్లు క్రిమేషన్‌కు తీసుకెళ్తారు. దహన సంస్కారాల తర్వాత ఆ బూడిదను ప్రత్యేకంగా ఓ కుండీలో ఉంచి సంబంధిత యజమానులకు అందజేస్తారు. ఆ బూడిదను ఇళ్లలో ఉన్న మొక్కల వద్దకానీ, తమ స్వగ్రామాల్లో కానీ, మరే ఇతర ప్రాంతాల్లో ఉన్న మొక్కలు, చెట్ల వద్ద అయినా పూడ్చిపెడితే సరిపోతుందని సూచిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ త్వరలోనే ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్ జోన్లలో కూడా పెట్ క్రిమటోరియంలను నిర్మించే ప్రతిపాదనకు శ్రీకారం చుట్టింది.
ఒక్క ఫోన్ చేస్తే.. చాలు..
ఎక్కడైనా పెంపుడు జంతువు మృతి చెందిందని యజమానులు ఫోన్ చేయగానే ఆ వలంటీర్లు అక్కడ వాలిపోతారు. క్రిమటోరియంకు ఆ శునకాన్ని తీసుకొచ్చి పూలదండలు వేసి సంప్రదాయబద్ధంగా దహనం చేస్తాం. అనంతరం భస్మాన్ని కుండల్లో భద్రపరిచి యజమానులకు అందిస్తున్నాం. గ్యాస్‌తో నడుస్తున్న ఈ క్రిమటోరియం వల్ల ఎలాంటి కాలుష్యం వెలువడదు. ఎవరికీ ఇబ్బందులు లేని పరిస్థితుల్లో ఈ క్రిమటోరియం నిర్మించడం జరిగింది.
– వాసంతి వాడి, ఫౌండర్ ప్రెసిడెంట్ పీఎఫ్‌ఏ
గ్యాస్‌తో నడిచే క్రిమటోరియం...
ప్రస్తుతం ఫతుల్లాగూడలో అనంతయాత్ర పేరుతో పెట్ క్రిమటోరియంను నిర్వహిస్తున్నాం. త్వరలో మరిన్ని అందుబాటులోకి తీసుకురానున్నాం. ప్రతి నెలా 25 వరకూ శునకాలకు మర్యాదపూర్వకమైన, సంప్రదాయబద్ధ దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాం. మా వద్ద ఇందుకోసం అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాం. 14 మంది డ్రైవర్లు పని చేస్తున్నారు. వలంటీర్లు కూడా అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్‌తో ఈ క్రిమటోరియం నిర్వహిస్తున్నాం. ఇకో ఫ్రెండ్లీ క్రిమటోరియంను నడిపిస్తున్నాం.
– దత్తాత్రేయ జోషి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పీఎఫ్‌ఏ
రూ.80 లక్షలతో మహదేవ్‌పురం పెట్ క్రిమటోరియం..
కూకట్‌పల్లి సమీపంలోని మహదేవ్‌పురం సిక్ బస్తీ దగ్గర రూ.80 లక్షల వ్యయంతో పెట్ క్రిమటోరియం నిర్మించారు. ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఏ ఎన్జీవోకు ఇవ్వాలన్నదానిపై టెండర్ పిలుస్తారు. ఇది అందుబాటులోకి వస్తే చాలా మంది జంతు ప్రేమికులకు తమ ఇంట్లో చనిపోయే పెంపుడు కుక్కల దహన సంస్కారాలు గౌరవ ప్రదమైన వాతావరణంలో నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది.
– డాక్టర్ ఎ.లింగస్వామి, వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్‌ఎంసీ
Comments
Please login to add a commentAdd a comment