immunization
-
పెద్దలకు ఇద్దాం! ఇమ్యూనిటీకాలు
మామూలుగా వ్యాక్సిన్లు అంటే పిల్లలకే అని చాలామంది అనుకుంటుంటారు. అవి పెద్దవాళ్లకూ అవసరమవుతాయి. కోవిడ్ టైమ్‌లో వ్యాక్సిన్‌కు విశేషప్రాచుర్యం వచ్చింది. పెద్దవాళ్లకు ఇచ్చే వ్యాక్సిన్ అంటే అది కోవిడ్ కోసమే కాదు... ఇంకా చాలా రకాల వ్యాధులను నివారించగలిగే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పెద్దవాళ్లకు ఇవ్వాల్సిన కారణం ఏమిటంటే... వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధి నిరోధక వ్యవస్థ మునపటి అంత బలంగా ఉండకపోవచ్చు. దాంతో ఇమ్యూనిటీకి బలం పెంచడం కోసం ఇలా తీసుకోవచ్చు. అలాగే చిన్నప్పుడు తీసుకున్న వ్యాక్సిన్లు క్రమంగా ప్రభావం కోల్పోతూ ఉండవచ్చు. అందుకే వాటిని మరింత బలోపేతం చేసేందుకు 50 ఏళ్ల వయసు దాటిన దగ్గర్నుంచి కొన్ని వ్యాక్సిన్లు తీసుకోవాల్సి ఉంటుంది. వాటి వివరాలివి...సాధారణంగా 19 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసులో కొన్ని రకాల జబ్బులు ఉండి, వాళ్లలో వ్యాధి నిరోధక వ్యవస్థ కాస్త బలహీనంగా (ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్) ఉన్నప్పుడు 65 ఏళ్ల వయసు తర్వాత కొన్ని జబ్బులు వచ్చే ముప్పు ఉంది. పెద్దవాళ్లకు ఇవ్వాల్సిన టీకాలు ఇవ్వడం ద్వారా ఆ ముప్పును దాదాపుగా నివారించవచ్చు. అందుకే ఈ వ్యాక్సిన్లు.పెద్ద వయసు వారు తీసుకోవాల్సిన రకరకాల వ్యాక్సిన్లుడిఫ్తీరియా అండ్ టెటనస్ వ్యాక్సిన్ : ప్రతి చిన్నారికీ తమ చిన్నతనంలో డీటీపీ వ్యాక్సిన్ ఇస్తారు. కానీ 40 ఏళ్ల వయసు వచ్చేనాటికి వాళ్లలో ఆ టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం సగానికి తగ్గుతుంది. అదే 60 ఏళ్ల వయసుకు రాగానే టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టెటనస్ డోస్‌ను 60 దాటిన వారికి మరోసారి ఇవ్వాలి. అది బూస్టర్ డోస్‌లా పనిచేసి టెటనస్ (ధనుర్వాతం) నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే డిఫ్తీరియా వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. చిన్నప్పుడు ఇచ్చే డీపీటీలలో పెర్టుసిస్ (కోరింత దగ్గు) అనే సమస్య పెద్ద వయసులో రాదు కాబట్టి ఈ పెర్టుసిస్ వ్యాక్సిన్ పెద్దలకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నిజానికి ‘టీ–డ్యాప్’ అనే వ్యాక్సిన్ ప్రతి పదేళ్లకు ఒకసారి తీసుకోవడం మంచిది.హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కాలేయాన్ని ప్రభావితం చేసేదే ఈ హెపటైటిస్–ఏ వైరస్. కలుషితాహారం, కలుషితమైన నీటి ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. పెద్దవయసు వారిలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం. దీని నివారణకు ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, ఆర్నెల్లకు మరో విడత కూడా తీసుకోవాలి.హెర్పిస్ జోస్టర్ వ్యాధిహెర్పిస్ జోస్టర్ అనే వైరస్‌తో మొదట చికెన్‌పాక్స్ వచ్చి, అటు పిమ్మట అది హెర్పిస్ జోస్టర్ వ్యాధికి దారితీస్తుంది. దాన్నే షింగిల్స్ అంటారు. జోస్టర్ వైరస్ సోకిన వారిలో పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే నరాలకు సంబంధించిన కాంప్లికేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. హెర్పిస్ జోస్టర్ వైరస్ సోకిన వాళ్లలో 60 ఏళ్లు దాటాక ఈ పోస్ట్ హెర్పిటిక్ న్యూరాల్జియా వచ్చే అవకాశాలు ఎక్కువ. జోస్టర్ వ్యాక్సిన్ అన్నది ఈ హెర్పిస్ జోస్టర్ వ్యాధి నుంచి నివారణ ఇస్తుంది. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల 100 శాతం వ్యాధి రాకుండా ఉంటుందనే గ్యారంటీ లేదు గానీ... వ్యాక్సిన్‌తో బాధితుల జీవన ప్రమాణం మెరుగవుతుందని చెప్పవచ్చు.వ్యారిసెల్లా వ్యాక్సిన్ వ్యారిసెల్లా జోస్టర్ వైరస్ (వీజడ్వీ) అనే ఈ వైరస్ ‘చికెన్‌పాక్స్’ను కలిగిస్తుంది. వ్యారెసెల్లా వ్యాక్సిన్ వృద్ధుల్లో ఈ చికెన్ పాక్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది. అప్పటికే ఏవైనా వ్యాధులతో బాధపడుతున్నవాళ్లకూ, గతంలో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తీవ్రమైన అలర్జీ వచ్చిన వాళ్లకూ, హెచ్ఐవీ వ్యాధి ఉండి, సీడీ4 సెల్స్ కౌంట్స్ 200 లోపు ఉన్నవారికీ, వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేటస్‌లో ఉన్నవారికి, స్టెరాయిడ్స్ మీద ఉన్నవారికి డాక్టర్లు ఈ వ్యాక్సిన్‌ను సిఫార్సు చేయరు. అలాగే క్యాన్సర్ కోసం కీమోథెరపీ తీసుకుంటున్నవారు, గత ఐదు నెలల వ్యవధిలో రక్తమార్పిడి / రక్తంలోని ఏదైనా అంశాన్ని తీసుకున్నవారు కూడా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోకూడదు. గర్భవతులకూ దీన్ని ఇవ్వకూడదు.హెపటైటిస్–బి వ్యాక్సిన్హెపటైటిస్–బి వైరస్ కూడా కాలేయాన్నే ప్రభావితం చేసే మరింత ప్రమాదకరమైన వ్యాధి. హెచ్ఐవీ వ్యాప్తి చెందే మార్గాల్లోనే దీని వ్యాప్తీ జరుగుతుంది. కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసిప్రాణాంతకంగా మార్చే ముప్పు ఉంటుంది. ఇంత ప్రమాదకరమైన వైరస్‌కు అదృష్టవశాత్తూ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దీన్ని మూడు డోసుల్లో ఇవ్వాలి. మొదటిది ఇచ్చిన నెల తర్వాత రెండో డోసూ, అలాగే మొదటిది ఇచ్చిన ఆర్నెల్లకి మూడో డోసు ఇవ్వాలి. యుక్తవయస్కులూ దీన్ని తీసుకోవడం మేలు.ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే ఫ్లూ వ్యాధికి నివారణగా ఇచ్చే వ్యాక్సిన్. జలుబు చేసినప్పుడు కనిపించే లక్షణాలే ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినప్పుడూ కనిపిస్తాయి. అయితే ఇన్ఫ్లుయెంజా నేరుగా హాని చేయకపోవచ్చు. జలుబు తగ్గినట్లే అదీ తగ్గిపోతుంది. కానీ ఒక్కోసారి ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా వచ్చే రెండో దశ దుష్పరిణామాలైన శ్వాసకోశ సమస్యల వంటివి తీవ్రంగా బాధిస్తాయి. పైగా ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎప్పటికప్పుడు తన జన్యుస్వరూపాన్ని మార్చుకుంటుంది. అందుకే జలుబు వైరస్‌కు ఒకే వ్యాక్సిన్ రూపొందించడం కష్టసాధ్యం. అందుకే అరవై ఐదేళ్లు పైబడిన వారు, ఇమ్యూనోకాంప్రమైజ్ స్టేటస్‌లో ఉన్నవాళ్లు (వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు) ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ప్రతి ఏడాదీ తీసుకోవాలి. దీన్ని ప్రతి ఏడాదీ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో తీసుకోవడం మంచిది.సూచన : గుడ్డుతో అలర్జీ ఉన్నవారు దీని బదులు రీకాంబినెంట్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి.టైఫాయిడ్ వ్యాక్సిన్ : అందరూ తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన వ్యాక్సిన్ ఇది. మరీ ముఖ్యంగా ఆహార పరిశ్రమలో పనిచేసేవారూ, వంటలు చేసేవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్. ఆహార తయారీ రంగంలో ఉండేవారికి టైఫాయిడ్ ఉంటే... ఓ క్యారియర్‌గా వారు అనేక మందికి ఈ వ్యాధిని సంక్రమింపజేసే అవకాశం ఉన్నందున వాళ్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నది డాక్టర్ల సిఫార్సు.హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ (హెచ్‌పీవీ వ్యాక్సిన్) ఇది మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌నుంచి నివారణ కల్పిస్తుంది. మహిళలకు 26 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. 15 ఏళ్లు పైబడ్డ అమ్మాయిలు మొదలుకొని మూడు విడతలుగా ఈ వ్యాక్సిన్ ఇస్తారు. మొదటి డోసు ఇచ్చిన నెల తర్వాత రెండో డోసు, ఆర్నెల్ల తర్వాత మూడో డోసు ఇస్తారు. ఇందులో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి రెండు రకాల స్ట్రెయిన్స్ నుంచి, మరొకటి నాలుగు రకాల స్ట్రెయిన్స్ నుంచి రక్షణ ఇస్తుంది. డాక్టర్ సలహా మేరకే అవసరమైన వాటిని వాడాల్సి ఉంటుంది.మరికొన్ని వ్యాక్సిన్లు ఇప్పుడు డెంగ్యూ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందిగానీ దాన్ని కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఇస్తారు. ఇవేగాక జపనీస్ ఎన్కెఫలైటిస్, రేబీస్, పోలియో, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధుల నివారణకూ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి ఎల్లో ఫీవర్ వ్యాధి మన దేశంలో లేదు కాబట్టి అది ఉన్నచోటికి వెళ్లే ప్రయాణికులు అక్కడికి వెళ్లే 15 రోజుల ముందుగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే పశ్చిమాసియా దేశాలకు వెళ్లేవాళ్లు మెనింగోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.నిమోకోకల్ వ్యాక్సిన్: వయసు పైబడిన వారిలో స్ట్రె΄్టోకాకల్ నిమోనియా అనే బ్యాక్టీరియాతో నిమోనియా, మెనింజైటిస్, బ్యాక్టీరిమియా అనే సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.నిమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ 13) : 65 ఏళ్ల వయసు పైబడిన ప్రతివారూ ఈ వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకోవాలి. ఇది తీసుకున్న ఏడాది తర్వాత నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23) తీసుకోవాలి. నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23): ప్రస్తుతం వేర్వేరు నిమోకాకల్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ కారణంగా వచ్చే అనేక రకాల వ్యాధులకు ‘నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్’ తో ప్రయోజనం చేకూరుతుంది. ఇది కేవలం ఒక్క నిమోనియాకు మాత్రమే కాకుండా మెనింజైటిస్, బ్యాక్టీ రిమియా (బ్లడ్ ఇన్ఫెక్షన్) లకు నివారణ ఔషధంగా కూడా పనిచేస్తుంది.అయితే దీనివల్ల నూరు శాతం నివారణ జరగకపోవచ్చు. కాకపోతే చాలా వరకు రక్షణ లభించడంతో పాటు ఒకవేళ టీకా తీసుకుని ఉంటే పైన పేర్కొన్న వ్యాధులు చాలావరకు తగ్గి, కాంప్లికేషన్లు కూడా చాలా వరకు నివారితమవుతాయి. అయితే నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఐదేళ్ల తర్వాత మళ్లీ మరో డోస్ తీసుకోవాలి. అలా ప్రతి ఐదేళ్లకోమారు ఈ వ్యాక్సిన్ తీసుకుంటూ ఉండాలి. -
టీకాలంటే పిల్లలకేనా?.. పెద్దల వ్యాక్సినేషన్‌కు.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల అంటురోగాల నివారణ కోసం పిల్లలకు వ్యాక్సిన్లూ వేయిస్తూ ఉంటాం. అలాగే పెద్దలకూ పలు రకాల జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు ఉంటాయి. కానీ వాటిని తీసుకునేవారు చాలా తక్కువ. ఇలాంటి వ్యాక్సిన్లపై అవగాహన లేకపోవడం ఒక కారణమైతే.. టీకాలు అంటే కేవలం పిల్లలకేననే అభిప్రాయం మరో కారణం. ‘అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇన్ ఇండియా (ఏపీఐ)’, ప్రముఖ పరిశోధన సంస్థ ఇప్పోస్లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. భారతదేశంలో వయో జనుల వ్యాధి నిరోధక టీకాల స్వీకరణ తక్కువగా ఎందుకు ఉందన్న అంశంపై హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 16 నగరాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. 50 ఏళ్లు దాటిన వయోజనులు, వారి సంరక్షకులు, వైద్యులను కలసి సర్వే చేశారు. ఈ సందర్భంగా.. 50 ఏళ్లు, ఆపై వయసున్న వారిలో 71 శాతం మందికి వ్యాక్సినేషన్ గురించి అవగాహన ఉన్నా.. కేవలం 16 శాతం మంది మాత్రమే వయోజన వ్యాక్సిన్లను తీసుకున్నట్టు తేలింది. దీనికి రోగులు, వైద్యులు పలు రకాల కారణాలు చెప్తుండటం గమనార్హం. మార్గదర్శకాలుఏవీ లేక.. వయోజన ఇమ్యునైజేషన్‌కు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడం వల్ల.. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో ఆసక్తి లేదని సర్వేలో పాల్గొన్నవారిలో 90 శాతానికిపైగా వైద్యులు చెప్పారు. తమకంటూ ఉన్న కొన్ని పరిమితుల వల్ల కూడా పెద్దలకు వ్యాక్సినేషన్ గురించి చర్చించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఇక నివారణ కంటే చికిత్సకు రోగులు ప్రాధాన్యత ఇస్తారని భావించడం కూడా ఒక కారణమేనని అంటున్నారు. పెద్దల్లో 69 శాతం మంది, వారి సంరక్షకుల్లో 76 శాతం మంది వయోజన టీకా గురించి వైద్యులను ఎప్పుడూ అడగలేదని.. అవసరమైతే వైద్యులే తమకు సిఫార్సు చేస్తారని భావిస్తున్నామని సర్వేలో వెల్లడించారు. వయోజనులు టీకా తీసుకోవడం పెరగాలంటే.. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం చేపట్టిన తరహాలో అవగాహన చర్యలు చేపడితే ప్రయోజనం ఉంటుందని వయోజనుల్లో 55 శాతం, వారి సంరక్షకుల్లో 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. అపోహలతోనూ దూరం.. వయోజన వ్యాక్సినేషన్ గురించి ఉన్న కొన్ని అపోహలు పెద్దలు టీకాలు తీసుకోకుండా నిరోధిస్తున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. దశలవారీగా వ్యాక్సిన్ డోస్‌లను తీసుకుంటే.. తాము అతిగా టీకా లపై ఆధారపడేలా మారుతామని వయోజనుల్లో 50 శాతానికిపైగా నమ్ముతున్నారని తేలింది. వయోజనుల్లో 58%, వారి సంరక్షకుల్లో 62% మంది రోగాల నుంచి రక్షించుకోవడానికి టీకా కంటే మెరుగైన మార్గాలు ఉన్నాయని భావిస్తున్నారని వెల్లడైంది. ‘షింగిల్స్’పై అవగాహన లేదు పెద్దల్లో వచ్చే ప్రధానమైన, వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధి షింగిల్స్. దీని నివారణ గురించి ప్రజల్లో అవగాహన తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఈ అంశంపై విడిగా సర్వే నిర్వహించారు. పిల్లల్లో చికెన్ఫాక్స్కు కారణమయ్యే వైరస్ వల్ల పెద్దవారిలో షింగిల్స్ వ్యాధి వస్తుంది. చర్మంపై కురుపులతో నొప్పి, బాధాకరమైన పరిస్థితి కొన్ని వారాల నుంచి నెలల పాటు ఉంటుంది. షింగిల్స్‌కు, ఇతర చర్మ సంబంధ సమస్యల మధ్య తేడాను గుర్తించడం కష్టం. దీంతో రోగ నిర్ధారణ ఆలస్యమై చికిత్స ప్రభావం తక్కువగా ఉంటుంది. అధ్యయనంలో పాల్గొన్నవారిలో 72 శాతం మందికి ఈ వ్యాధి గురించి తెలియదు. ఒకవేళ దీనికి గురైనా, మళ్లీ వచ్చే అవకాశం ఉంటుందని.. వ్యాక్సిన్ల ద్వారా దీన్ని నివారించవచ్చని 73శాతం మందికి తెలియదని సర్వేలో తేలింది. హైదరాబాదీల్లో అవగాహన ఉన్నా.. హైదరాబాద్ నగరంలో 50 ఏళ్లు దాటిన వయోజనుల్లో 53% మంది తమకు వ్యాక్సినేషన్ గురించి అవగాహన ఉందని చెప్పారు. కానీ వారిలో కేవలం 4% మందే వయోజన వ్యాక్సిన్లు తీసుకున్నారు. హైదరాబాద్‌లో 67 శాతం మంది కోవిడ్ కాకుండా ఇతర వ్యాధులు టీకాలు వేయాల్సినంత తీవ్రంగా లేవని భావిస్తున్నారు. పెద్దల్లో 67 శాతం, వారి సంరక్షకుల్లో 82% మంది వయోజన వ్యాక్సిన్లు అందుబాటు ధరల్లో లేవని చెప్తున్నారు. ఇక 81శాతం మంది టీకాలు తీసుకోవాలని వైద్యులు చెప్తే విశ్వసిస్తామని చెప్పారు. కానీ తమకు వైద్యులు వ్యాక్సిన్లను సిఫార్సు చేశారని 7 శాతం మందే చెప్పడం గమనార్హం. జాతీయ స్థాయిలో సగటున 16 శాతం వైద్యులు వయోజన వ్యాక్సినేషన్‌ను సిఫార్సు చేస్తున్నట్టు సర్వేలో తేలగా.. దక్షిణాదిలో వారు 10 శాతమే. పెద్దల్లో అవగాహన కల్పించాలి పిల్లల్లో రోగనిరోధకత ఆవశ్యకతను ప్రజలు బాగానే అర్థం చేసుకున్నప్పటికీ పెద్దల్లో అవగాహన లేదు. సందర్భాన్ని బట్టి టెటనస్ టాక్సాయిడ్, యాంటీ–రేబిస్ టీకా వంటివి మినహా పెద్దలు ఇతర వ్యాక్సిన్లను అవసరాలకు తగ్గట్టుగా తీసుకోవడం లేదు. దీనిపై అవగాహన కల్పించాల్సి ఉంది. – బిపిన్ కుమార్ సేథీ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి -
బూస్టర్ డోసు అవసరం లేదు!
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కొంతకాలానికి బూస్టర్ డోసు కూడా తప్పనిసరిగా తీసుకోవాలన్న వాదన ఇటీవల గట్టిగా వినిపిస్తోంది. అయితే, కరోనా మహమ్మారి నియంత్రణకు బూస్టర్ డోసు అవసరమని చెప్పడానికి ఇప్పటిదాకా ఎలాంటి శాస్త్రీయ ఆధారం లభించలేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డాక్టర్ బలరాం భార్గవ సోమవారం చెప్పారు. దేశంలో అర్హులైన వారందరికీ కరోనా టీకా రెండో డోసు పంపిణీని పూర్తి చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచమంతటా అర్హులకు కరోనా వ్యాక్సిన్ అందాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ఇమ్యూనైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా విభాగం(ఎన్టీఏజీఐ) త్వరలో భేటీ కానుంది. బూస్టర్ డోసుపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. బూస్టర్ డోసు అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవలే స్పందించారు. దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా రెండు డోసులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అది నెరవేరాక బూస్టర్ డోసుపై నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దేశ అవసరాలకు సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బూస్టర్ డోసు ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్, నిపుణుల బృందం సూచిస్తే కచ్చితంగా పరిశీలిస్తామని వెల్లడించారు. అధికార వర్గాలు ప్రకటించిన గణాంకాల ప్రకారం.. భారత్‌లో అర్హులైనవారిలో ఇప్పటివరకు 82 శాతం మంది కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. 43 శాతం రెండో డోసు కూడా తీసుకున్నారు. గడువు ముగిసినప్పటికీ 12 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఇంకా రెండో డోసు తీసుకోలేదు. ప్రపంచంలో పరిస్థితేంటి? ‘బూస్టర్’ అంటే! కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్స్ తీసుకుంటే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు మన శరీరంలో వృద్ధి చెందుతాయి. ఇవి వైరస్ నుంచి మన శరీరాన్ని కాపాడతాయి. వ్యాక్సిన్స్ రెండుడోసులు తీసుకొని ఐదారునెలలు గడిచాక వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతుంది. వ్యాక్సిన్ ప్రభావశీలత క్రమేపీ తగ్గుతుంది. అప్పుడేం చేయాలి? అదనంగా మరో డోసు... మూడో డోసు (దీన్నే బూస్టర్ డోసు) తీసుకోవాలి. 60 ఏళ్ల పైబడిన వారు, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారు, స్టెరాయిడ్ల వాడటం మూలంగా రోగనిరోధక తగ్గినవారిని అధిక రిస్కు కలిగిన వారిగా భావించి... పలుదేశాలు మొదట వీరికి బూస్టర్ డోసులను సిఫారసు చేశాయి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మార్కెట్లు తెరుచుకొని వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు యధావిధిగా సాగాలన్నా, ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కాలన్నా... కోవిడ్ నుంచి రక్షణతో జనం స్వేచ్ఛగా విహరించే పరిస్థితినే పలుదేశాలు కోరుకుంటున్నాయి. ఏయే దేశాలు ఇస్తున్నాయంటే... నవంబరు నెలారంభం నాటికే ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు బూస్టర్ డోసులను మొదలుపెట్టేశాయి లేదా ఆరంభించే క్రమంలో ఉన్నాయి. ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ బూస్టర్ డోసులిస్తున్నాయి. ఇజ్రాయెల్, యూకే, ద.కొరియా, టర్కీ, బ్రెజిల్ ఈ జాబితాలో ఉన్నాయి. స్వీడన్, స్పెయిన్ వయోధికులకు మొదలుపెట్టాయి. అమెరికా, కెనడా ఒకట్రెండు రోజుల్లో ఆరంభించనున్నాయి. 12 % బూస్టర్లే అందుబాటులో ఉన్న లెక్కలకు బట్టి చూస్తే ఒక్క నవంబరు 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన డోస్‌లలో 12 శాతం బూస్టర్ డోస్‌లేనట! ప్రతి 100 మంది జనాభాలో అత్యధికులకు బూస్టర్ డోసులు ఇచ్చిన దేశాల జాబితాలో ఇజ్రాయెల్, చిలీ, ఉరుగ్వే ముందున్నాయి. పేద దేశాలకు అన్యాయం చేయొద్దు: డబ్ల్యూహెచ్‌వో బూస్టర్ డోసులు అవసరమనడానికి ఆధారాలు పరిమితంగా, అసంపూర్తిగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంటోంది. ఆధునిక దేశాలు అప్పుడే మూడో డోసులు ఇవ్వడం మొదలపెడితే అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద ఆఫ్రికా దేశాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలకు దారితీస్తుందని డబ్ల్యూహెచ్‌వో డెరెక్టర్ జనరల్ ట్రెడోస్ అథనోమ్ ఘెబ్రెయాసస్ ఈనెల 13న హెచ్చరించారు. కొన్ని దేశాల్లో ప్రతి 100 మందిలో 20లోపు మందికే తొలి డోసు అందిందని, ఆఫ్రికా దేశాల్లోనయితే కేవలం 5 శాతం మందే తొలిడోసును పొందగలిగారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం జనాభాలో 52.6 శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందింది. – నేషనల్ డెస్క్, సాక్షి భారత్‌లో.. మనదేశంలో ఇప్పటిదాకా 115 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. రెండు డోసులు తీసుకున్న వారు 38.11 కోట్లు ఉండగా... 37. 45 కోట్ల మంది ఒక్కడోసు (ఈనెల 17 నాటికి కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుఖ్ మాండవియా చెప్పిన ప్రకారం) తీసుకున్నారు. -
హెచ్ఐవీ బాధితులకు హెపటైటిస్ వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని హెచ్ఐవీ బాధితులందరికీ హెపటైటిస్ వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే హెచ్ఐవీ బాధితులకు హెపటైటిస్–బి వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రస్తుతమున్న హెపటైటిస్ బాధితుల్లోనూ హెచ్ఐవీ సోకిన వారే ఎక్కువగా ఉన్నారని ఆరోగ్య శాఖ పరిశీలనలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల మంది హెచ్ఐవీ బాధితులున్నారు. వీరంతా రాష్ట్రంలోని 45 యాంటీ రిట్రోవైరల్ టెస్టింగ్ (ఏఆర్టీ) సెంటర్లలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సెంటర్లలోనే వీరికి వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలాగే బోధనాస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్ వేస్తారు. ముందుగా వైద్య పరీక్షలు చేసి.. ఆ తర్వాతే వ్యాక్సిన్ వేయాలని ఆదేశాలిచ్చారు. వైద్య పరీక్షలు చేశాక హెపటైటిస్ ఉందని భావిస్తే.. వారిని వెంటనే మోడల్ ట్రీట్మెంట్ సెంటర్లకు పంపించి వైద్యమందిస్తారు. ముందుగా ఏఆర్టీ సెంటర్లలో పనిచేస్తున్న వైద్య అధికారులందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. టెస్టులు, చికిత్సలకు సంబంధించిన సాంకేతిక సహకారాన్ని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అందిస్తుంది. -
వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ ఘంటికలు మోగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 22 మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు ప్రజారోగ్యశాఖ గుర్తించింది. అందులో ఇద్దరు మృతి చెందారు. ముఖ్యంగా విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో వ్యాధి సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో, చిత్తూరు జిల్లా వాసి తమిళనాడులోని వేలూరులో చికిత్స చేయించుకుంటూ మృతి చెందారు. రోజు రోజుకూ వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్టు ప్రజారోగ్యశాఖకు సమాచారమందింది. హెచ్1 ఎన్1గా చెప్పుకునే ఈ వైరస్ చిన్న పిల్లలు, గర్భిణులు, 65 ఏళ్లు దాటిన వారికి ఎక్కువగా సోకుతున్నట్టు ప్రజారోగ్యశాఖ వెల్లడించింది. అంతేగాకుండా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండే కాలేయ, కిడ్నీ, గుండె, రక్తహీనత వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. చలి పెరిగే కొద్దీ వైరస్ మరింతగా విస్తరించే అవకాశమున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి, విశాఖల్లో హై అలర్ట్... రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కువగా చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. తిరుమలలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్న కారణంగా రద్దీ పెరుగుతోందని, ఈ వ్యాధి ఎక్కువగా జనసమర్థ ప్రాంతాలకే సోకుతుందని హెచ్చరించారు. గత ఏడాది ఒక్క చిత్తూరు జిల్లాలోనే 44 మందికి ఈ వ్యాధి సోకింది. విశాఖపట్నంలోనూ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పోయే వారి వల్ల అక్కడ కూడా ఎక్కువగా నమోదవుతున్నట్టు తేలింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం విమానాశ్రయంలో ఇప్పటికే ప్రత్యేక వైద్య పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించినట్టు ప్రజారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తగా ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్లు, ప్రత్యేక వార్డుల ఏర్పాటు, వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు వెళ్లాయి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు – స్వైన్‌ఫ్లూ లక్షణాలను మూడు కేటగిరీలుగా విభజిస్తారు. ఎ కేటగిరీలో తీవ్రస్థాయిలో జలుబు, తుమ్ములు రావడం, ముక్కుల వెంట విపరీతంగా నీళ్లు కారడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, స్వల్పంగా జ్వరం ఉంటాయి. – బి కేటగిరీలో కొద్ది కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు పెరగడంతో దగ్గు ఎక్కువగా ఉంటుంది. స్వల్ప ఆయాసంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. – సి కేటగిరీలో జలుబు తీవ్రమై ఆయాసంతో గుక్కతిప్పుకోలేక పోవడం, ఛాతీలో నొప్పి ఉంటుంది. తీవ్రత పెరిగితే అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. నివారణకు మార్గాలు – తుమ్ములతో కూడిన జలుబు ఉంటే పారాసెటిమాల్ మాత్రలు వేసుకుంటూ... ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. – బి కేటగిరీలో ఉన్న వ్యాధిగ్రస్థులైతే వైద్యుల సలహాతో ఒసాల్టమవీర్ మందులను వేసుకోవాలి. – సి కేటగిరీలో ఉన్న వారు ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స పొందాలి. – వ్యాధి లక్షణాలున్న వారు జనసమర్థ ప్రాంతాల్లో తిరగకూడదు – రోగులు గానీ, వారికి వైద్యమందించే సిబ్బందిగానీ మాస్క్‌లు, గ్లౌజ్‌లు విధిగా ధరించాలి పీహెచ్సీ స్థాయి నుంచి మందులు అందుబాటులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకూ టామీఫ్లూ మాత్రలు, సిరప్స్ అందుబాటులో ఉంచాం. ఇప్పటికే అన్ని జిల్లాల వైద్యాధికారులకు అప్రమత్తంగా ఉండాలని సూచించాం. వ్యాధి సోకిన బాధితుల పరిసర ప్రాంతాలను పరిశీలించాలని చెప్పాం. ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించాం. ప్రమాదకర పరిస్థితులు ఏమీ లేవు. – డా.గీతాప్రసాదిని, అదనపు సంచాలకులు, ప్రజారోగ్యశాఖ -
వ్యాక్సిన్ డ్రాపౌట్స్ లేకుండా చూడండి
విజయవాడ(లబ్బీపేట) : జిల్లాలో ఇమ్యునైజేçషన్ కార్యక్రమం వందశాతం జరగాలని, డ్రాపావుట్స్ ఎవరూ ఉండరాదని గుంటూరు, రాజమండ్రి జోన్ల రీజినల్ డైరెక్టర్ డాక్టర్ డి.షాలినీదేవి అన్నారు. లబ్బీపేటలోని మలేరియా కార్యాలయంలో జిల్లాలోని వైద్యాధికారులు, ఇమ్యునైజేషన్ సిబ్బందితో శనివారం వేర్వేరుగా అవగాహన సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో పుట్టిన వెంటనే వేసే జీరో వ్యాక్సిన్ల నుంచి ప్రతి వ్యాక్సిన్లు చిన్నారులకు సకాలంలో వేయాలన్నారు. హైరిస్క్ ఏరియాల్లో డ్రాపవుట్స్ ఉంటున్నట్లు గతంలో గుర్తించామని, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా సంచార జాతులు, ఇటుక బట్టీలు, నిలవ కూలీలు, క్రషర్స్‌లో ఉండే కుటుంబాలకు చెందిన పిల్లలకు వ్యాక్సిన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారి పుట్టినప్పటి నుంచి క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేసేలా ఆరోగ్య కార్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం తగదని ఆమె సూచించారు. అంతేకాకుండా చిన్నారికి వేసిర టీకాలను ఆ«ధార్ ఆధారంగా ఆన్లైన్ చేయాలన్నారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వారంలో ఆరు రోజులు వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందని, జీరో బేస్ వ్యాక్సిన్‌లుఏడురోజులువేస్తారని డాక్టర్ షాలినీదేవి చెప్పారు. ఇమ్యునైజేషన్‌ను సమర్థంగా ఎలా నిర్వహించాలో పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునేజేషన్ అధికారి డాక్టర్ అమృత, వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి, జిల్లాలోని వైద్యులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.