ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని హెచ్‌ఐవీ బాధితులందరికీ హెపటైటిస్ వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే హెచ్‌ఐవీ బాధితులకు హెపటైటిస్–బి వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రస్తుతమున్న హెపటైటిస్ బాధితుల్లోనూ హెచ్‌ఐవీ సోకిన వారే ఎక్కువగా ఉన్నారని ఆరోగ్య శాఖ పరిశీలనలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులున్నారు. వీరంతా రాష్ట్రంలోని 45 యాంటీ రిట్రోవైరల్ టెస్టింగ్ (ఏఆర్‌టీ) సెంటర్లలో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ సెంటర్లలోనే వీరికి వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలాగే బోధనాస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్ వేస్తారు. ముందుగా వైద్య పరీక్షలు చేసి.. ఆ తర్వాతే వ్యాక్సిన్ వేయాలని ఆదేశాలిచ్చారు. వైద్య పరీక్షలు చేశాక హెపటైటిస్ ఉందని భావిస్తే.. వారిని వెంటనే మోడల్ ట్రీట్‌మెంట్ సెంటర్లకు పంపించి వైద్యమందిస్తారు. ముందుగా ఏఆర్‌టీ సెంటర్లలో పనిచేస్తున్న వైద్య అధికారులందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. టెస్టులు, చికిత్సలకు సంబంధించిన సాంకేతిక సహకారాన్ని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment