సాక్షి, అమరావతి: వయో వృద్ధులు, మహిళలకు టెలీ మెడిసిన్ సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జూలై 19వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 1,10,12,570 మంది వయో వృద్ధులు టెలిమెడిసిన్ సేవలు పొందగా ఆంధ్రప్రదేశ్‌లో 34.17 లక్షల మందికి ప్రయోజనం చేకూరినట్లు ఇటీవల పార్లమెంట్‌కు తెలిపింది.
దేశవ్యాప్తంగా పోలిస్తే 31.04 శాతం వయో వృద్ధులకు ఏపీలో సేవలు అందాయి. మహిళలకు టెలిమెడిసిన్ సేవలందించడంలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దేశంలో 5,22,15,224 మంది మహిళలకు టెలిమెడిసిన్ సేవలు అందగా ఆంధ్రప్రదేశ్‌లోనే 1.37 కోట్ల మంది మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా పోలిస్తే ఏపీలో 26.41 శాతం మంది మహిళలు టెలి మెడిసిన్ సేవలు పొందారు. ఆంధ్రప్రదేశ్ మినహా మరే రాష్ట్రంలోనూ కోటి మందికి పైగా మహిళలకు టెలిమెడిసిన్ సేవలు అందలేదు. పశ్చిమ బెంగాల్‌లో 85.16 లక్షల మంది మహిళలు, తమిళనాడులో 62.94 లక్షల మంది మహిళలకు టెలిమెడిసిన్ సేవలను వినియోగించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
21,236 స్పోక్స్ హబ్‌లు
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం టెలి మెడిసిన్ ద్వారా స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటులోకి తెచ్చింది. టెలిమెడిసిన్ సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు, జిల్లా అస్పత్రుల్లో ప్రత్యేక హబ్‌లను ఏర్పాటు చేసింది. వీటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైఎస్సార్ పట్టణ ఆరోగ్య హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లతో అనుసంధానం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా హెల్త్ వెల్‌నెస్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టెలిమెడిసిన్ సేవలకు సంబంధించి 21,236 స్పోక్స్ హబ్‌లను ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్టులు ఉంటారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, విలేజ్ క్లినిక్స్‌కు వచ్చిన రోగులకు స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలు అవసరమైతే టెలిమెడిసిన్ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదిస్తారు.
హబ్ నుంచి వైద్యులు ఆడియో, వీడియో కాల్ రూపంలో రోగులతో మాట్లాడి తగిన ఎలాంటి మందులు వాడాలో సూచిస్తారు. ఆ మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్‌తో ఇంటి నుంచే వైద్య సేవలను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్ లేని వారితో పాటు వాటిని వినియోగించలేని వారి కోసం ఇంటి వద్దే ఈ–సంజీవని ఓపీ డిపార్ట్‌మెంట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం 42 వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది.
వీటిని హబ్ ల కు అనుసంధానించారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోని వారు కూడా టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలను పొందగలుగుతున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున అందిస్తున్న టెలిమెడిసిన్ సేవలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అవగాహన కల్పించడంతో అత్యధికంగా వృద్ధులు, మహిళలకు టెలి మెడిసిన్ సేవలు అందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment