మినుములూరు పీహెచ్‌సీలో వైద్యాధికారికి జాయినింగ్ ఆర్డర్ ఇస్తున్న హెల్త్ అసిస్టెంట్
ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబదీ్ధకరించిన ప్రభుత్వం
నెలకు వేతనం రూ.50 వేలు ∙మార్చి 10న జాయినింగ్ ఆర్డర్స్ అందజేత
వాటిని వైద్యాధికారులకు అందించి విధుల్లో చేరిన ఉద్యోగులు
సీఎం వైఎస్ జగన్‌కు హెల్త్ అసిస్టెంట్ల కృతజ్ఞతలు
పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): వైద్యారోగ్య శాఖలో ఇన్నాళ్లూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబదీ్ధకరించింది. దీంతో వారి జీవితాల్లో, కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో 2006లో 49 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లుగా రూ.5 వేల వేతనానికి విధుల్లో చేరారు.
2012లో మరో 36 మంది వచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం వీరి సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో వీరంతా 20 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో, ఉద్యోగ భద్రత కరువై వెట్టిచాకిరి చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వీరి వేతనాలు కేవలం రూ.25,400 మాత్రమే. దీంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. వేతనాల పెంపు కోసం ఎన్నోసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే న్యాయం
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కొద్ది నెలలకే కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ల వేతనాలను భారీ స్థాయిలో పెంచింది. రూ.25,400గా ఉన్న వేతనాన్ని సీఎం జగన్ ఏకంగా రూ.32,460కు పెంచారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా 2014 కంటే ముందు ఉద్యోగంలో చేరిన కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి 10న పాడేరు ఐటీడీఏ పరిధిలో 11 మండలాల్లో పనిచేస్తున్న 85 మందికి రెగ్యులైజేషన్ ఆర్డర్లను అందజేశారు. దీంతో వారంతా సోమవారం ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారుల వద్దకు వెళ్లి వాటిని అందించారు. ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా మారడంతో ఉద్యోగులు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. నెలకు సుమారు రూ.50 వేలు వేతనంగా అందుకోనున్నారు. సీఎం జగన్ వల్లే తమ జీవితాల్లో వెలుగులు నిండాయని, ఆయనకు రుణపడి ఉంటామంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment