Health assistants
-
కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ల జీవితాల్లో వెలుగులు
పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): వైద్యారోగ్య శాఖలో ఇన్నాళ్లూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబదీ్ధకరించింది. దీంతో వారి జీవితాల్లో, కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో 2006లో 49 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లుగా రూ.5 వేల వేతనానికి విధుల్లో చేరారు. 2012లో మరో 36 మంది వచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం వీరి సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో వీరంతా 20 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో, ఉద్యోగ భద్రత కరువై వెట్టిచాకిరి చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వీరి వేతనాలు కేవలం రూ.25,400 మాత్రమే. దీంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. వేతనాల పెంపు కోసం ఎన్నోసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే న్యాయం 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొద్ది నెలలకే కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ల వేతనాలను భారీ స్థాయిలో పెంచింది. రూ.25,400గా ఉన్న వేతనాన్ని సీఎం జగన్ ఏకంగా రూ.32,460కు పెంచారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా 2014 కంటే ముందు ఉద్యోగంలో చేరిన కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి 10న పాడేరు ఐటీడీఏ పరిధిలో 11 మండలాల్లో పనిచేస్తున్న 85 మందికి రెగ్యులైజేషన్ ఆర్డర్లను అందజేశారు. దీంతో వారంతా సోమవారం ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారుల వద్దకు వెళ్లి వాటిని అందించారు. ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా మారడంతో ఉద్యోగులు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. నెలకు సుమారు రూ.50 వేలు వేతనంగా అందుకోనున్నారు. సీఎం జగన్ వల్లే తమ జీవితాల్లో వెలుగులు నిండాయని, ఆయనకు రుణపడి ఉంటామంటున్నారు. -
‘104’ సమస్యలు
ఆదిలాబాద్: గ్రామీణులకు మెరుగైన వైద్యం అం దించే 104 వాహనాలను మరమ్మతు సమస్యలు వెంటాడుతున్నాయి. 2008లో ప్రారంభించిన వా హనాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడంతో ఒక్కొక్కటిగా మూలనపడుతున్నాయి. జిల్లా అధికారులు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు వెచ్చించి మరమ్మతులు చేయిస్తున్నా.. అంతకుమించి ఖర్చయ్యే పక్షంలో చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు వాహనాలు మూలకుపడ్డాయి. వైద్య పరికరాల సరఫరా కూడా లేకపోవడంతో మూలనపడడానికి కారణమవుతోంది. వాహనాల్లోని సిబ్బందిని కుదించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వీటి వైపు రాకపోవడంతో సరైన వైద్యం అందడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 24 ‘104’ వాహనాలు నిత్యం గ్రామాల్లో విద్య శిబిరాలు నిర్వహిన్నాయి. మొదట్లో ఇవి హెచ్ఏంఆర్ఐ అదీనంలో ఉన్నా తర్వాత ప్రభుత్వం తన అదీనంలోకి తీసుకుంది. జిల్లాల విభజనకు ముందు 17 సీహెచ్ఎన్సీ(కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రీషన్ సెంటర్)లకు అప్పగించింది. జిల్లాల విభజన అనంతరం ఉమ్మడి జిల్లాలో ఏడు ఉప ఆరోగ్య వైద్యాధికారి కార్యాలయాలకు వీటి బాధ్యతలను అప్పగించింది. మొదట్లో ప్రతి వాహనంలో ముగ్గురు ఏఎన్ఎంలు, ఫార్మాసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్, డీఈఓ, డ్రైవర్ చొప్పున విధులు నిర్వర్తించేవారు. వైద్య శిబిరం నిర్వహించే చోట సంబంధిత పీహెచ్సీ వైద్యాధికారి, గ్రామంలోని ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యేవారు. ప్రభుత్వం సిబ్బందిని కుదిస్తూ ప్రతీ వాహనంలో ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్లకే పరిమితం చెసింది. డీఈఓలను క్లస్టర్ కార్యాలయాల్లో నియమించింది. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించే సమయంలో ఆయా పరిధి పీహెచ్సీ వైద్యాధికారి, మొదటి రెండవ ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న చోట వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు కానరావడం లేదు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారుల కొరతతోపాటు సిబ్బందికి పనిభారంతో గైర్హాజరు అవుతున్నారు. దీంతో గ్రామీణులకు సరైన వైద్యం అందడం లేదు. కానరాని వైద్య పరికరాలు. హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించే హెచ్‌బీ ట్యూబ్‌లు, రక్త పరీక్షల కోసం నమూనాలు సేకరించే పిపెట్లు వాటిపై ఉండే గుర్తులు చెదిరి పోవడంతో పరీక్షల సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. పిపెట్లకు పగుళ్లు వచ్చినా గత్యంతరం లేక వాటినే వినియోగిస్తూన్నారు. 15 వాహనాల్లో బరువు తూచే యంత్రాలు పని చేయడం లేదు. చిన్నపిల్లల బరువు చూడడానికి ఏర్పాటు చేసిన బేబీ వేయింగ్ మిషన్లు అటకెక్కాయి. గర్భిణుల ఎత్తు కొలవడం, చిన్నపిల్లల్లో వయస్సుకు తగ్గ ఎదుగుదల ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన హైట్ చార్టులు సుమారు 12 వాహనాల్లో కనిపించడం లేదు. ఉన్న వాహనాల్లో చిరగడంతో పనికి రాకుండా పోయాయి. గర్భిణుల్లో పిండం కదలికల్లో వచ్చే శబ్దాలను అంచనా వేస్తూ ఎదుగుదల తదితర చర్యలను నిర్ధారిస్తూ వైద్యం అందించడానికి ఇచ్చిన ఫీటర్స్కోప్లు మూలనపడ్డాయి. గ్లూకోమీటర్లతో షుగర్ శాతం తెలుసుకోవడం కష్టంగా మారింది. బీపీ మీటర్లు మూలకుపడడంతో పరీక్షల సమయంలో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతుకు నోచుకోక.. వాహనాల్లో బ్యాటరీలు మొరాయిస్తున్నాయి. టీవీల ద్వారా ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించడానికి ప్రతీ వాహనంలో రూ.50 వేల విలువైన టీవీ, డీవీడీలు ఏర్పాటు చేశారు. ఇవి వాహనాల్లో ఉన్నా బ్యాటరీలకు రీచార్జి లేక బ్యాటరీలు మూలనపడడంతో పని చేయడం లేదు. మంచిర్యాల, ఉట్నూర్ ప్రాంతాల్లోని మూడు వాహనాల్లో టీవీలు లేవని తెలిసింది. గతంలో ఓ వాహనంలోని టీవీ కనిపించకపోవడంతో ఏడీసీ స్థాయి అధికారిపై కేసు నమోదైంది. చాలా వాహనాల్లో సైరన్లు మూగబోయాయి. హెడ్లైట్లు తప్పితే వాహనం చుట్టూ ఉండే లైట్లకు మరమ్మతులు లేక వెలగడం లేదు. అత్యవసర సమయంలో వాహనంలో లోపల ఉన్న సిబ్బంది క్యాబీన్లోని డ్రైవర్ ఇతర సిబ్బందితో మాట్లాడటానికి ఉపయోగించే ఇంటర్ కమ్ ఫోన్ సౌకర్యాలు కనుమరుగు అయ్యాయి. వాహనంలో రెండు వైపుల రూ.60 వేలతో ఏర్పాటు చేసిన టెంట్లు పని చేయడం లేదు. కుర్చీలు, టేబుళ్లు విరిగిపోవడంతో వైద్య శిబిరం నిర్వహించే చోట గ్రామస్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. మందుల సరఫరా అంతంతే.. మొదట్లో ప్రతి వాహనంలో వంద రకాల మందులు సరఫరా అయ్యేవి. ఇందుకోసం ప్రభుత్వం నెలకు సుమారు రూ.40 వేలు కేటాయించేది. దీంతో జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీసీ) నుంచి 104లకు చేరేవి. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు దాదాపు 53 రకాల మందులు సరఫరా చేయాల్సి ఉండగా 20 రకాలు కూడా సరఫరా కావడం లేదని తెలిసింది. గ్రామాల్లో ఎక్కువగా ఉపయోగించే షుగర్, బీపీ, అస్తమా మందులు వస్తున్నా ఇతర వ్యాధులకు సంబంధించిన మందులు పూర్తి స్థాయిలో సరఫరా లేదు. దీంతో ప్రైవేట్‌గా కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. -
ఫలించిన పోరాటం
► కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను కొనసాగిస్తూ ఉత్తర్వులు ► రిలే దీక్షలు విరమణ పాడేరు: తమను విధు ల్లోకి తీసుకోవాలంటూ కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు ఐటీడీఏ వద్ద చేపట్టిన రిలే దీక్షలు ఫలించాయి. ఎపిడమిక్ కాలానికి 6 నెలలు పాటు కాంట్రాక్టు ప్రాతి పదికన పనిచేస్తున్న వీరి ని నవంబరు 30న విధుల నుంచి తొలగిం చారు. అయితే తమను కాంట్రాక్టు హెల్త్ అసి స్టెంట్లుగా కొన సాగిం చాలంటూ డిసెంబరు 4వ తేదీ నుంచి ఆందోళన చేపట్టారు. స్పందించి న ఐటీడీఏ పీవో రవిసుభాష్ వీరిని విధుల్లో కొనసాగించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదించా రు. ఈ మేరకు మరో 6 నెలలు కాంట్రాక్ట్ పొడిగిస్తూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిుషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 95 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ల ను విధుల్లోకి తీసు కుంటూ నియామక ఉత్తర్వులు అందజేసినట్టు ఏడీఎంహెచ్‌వో వై.వేంకటేశ్వరరావు తెలిపారు. తమ పోరాటం ఫలించడంతో 12 రోజులుగా ఐటీడీఏ వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలను విరమించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ శర్మ, ఏపీజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పి.అప్పలనర్శ, వైద్య ఉద్యోగుల సంఘం నాయకుడు శెట్టి నాగరాజు కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లతో దీక్షలను విరమింపజేశారు. -
హెల్త్ అసిస్టెంట్ల ఆకలి కేకలు
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రజలకు ఏ చిన్న అనారోగ్యం తలెత్తినా అందుబాటులో ఉండి మందులు ఇచ్చేదిమల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లే. అయితే జిల్లాలో పనిచేస్తున్న 165 మంది హెల్త్ అసిస్టెంట్ల కుటుంబాలు ఏడు నెలలుగా ఆకలితో అలమటిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యమే తమ దుస్థితికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. ప్రజావాణి వంటి కార్యక్రమాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ బడ్జెట్‌ను తమ శాఖలో పనిచేస్తున్న ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులకు కేటాయిస్తున్నారని, ఫలితంగా తాము పస్తులు ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని పేర్కొంటున్నారు. డెరైక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ త్రైమాసిక బడ్జెట్లో తమ వేతనాలకు నిధులు కేటాస్తారని, అవి చాలకపోతే జిల్లా బడ్జెట్లో మిగిలిన నిధుల్ని కేటాయించి ఒక్కొక్కరికి నెలకు రూ.17 వేల చొప్పున జీతం ఇవ్వాల్సి ఉందని, అయినా అమలు కావడం లేదని హెల్త్ అసిసెట్లు విమర్శిస్తున్నారు. మళ్లీ బడ్జెట్ వచ్చే వరకూ తమకు ఆకలి కేకలు తప్పవా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా డీఎం అండ్ హెచ్‌వో సరసిజాక్షిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా బడ్జెట్ లేకపోవటం వల్లనే జిల్లాలోని 165 మంది హెల్త్ అసిస్టెంట్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. అప్పు కూడా పుట్టడంలేదు ఏడు నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోతే కుటుంబం ఎలా గడవాలి. రోజూ ఇంటి నుంచి వచ్చి పని చేస్తున్నామే తప్ప పైసా వేతనం ఇవ్వడం లేదు. మా పిల్లల చదువులు ఫీజుల చెల్లించక అటకెక్కుతున్నాయి. మా స్థితి తెలిసి నిత్యావసరాల వస్తువులను కూడా ఎవరూ కూడా అప్పుగా ఇవ్వడం లేదు. - ఎస్.రమేష్, హెల్త్ అసిస్టెంట్, వడ్లమన్నాడు క్షేత్రస్థాయి వైద్యానికి దెబ్బ గ్రామీణ ప్రాంత ప్రజలకు జ్వరమొస్తే మందుబిళ్ల ఇవ్వాల్పిన బాధ్యత మాదే. మాకే జీతం ఇచ్చే దిక్కు లేకుండా పోతే ఎలా? ఇంటింటికీ వెళ్లి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయించేంది మేమే. ప్రభుత్వ పథకాలను నలుగురిలోకి తీసుకెళ్తున్న మాకే జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందిపెడుతోంది. - సిహెచ్.మహంకాళీరావు, హెల్త్ అసిస్టెంట్, కౌతవరం ఉద్యమం తప్పదు హెల్త్ అసిస్టెంట్లకు జీతాలు చెల్లిం చకుండా కాలం గడిపితే ప్రభుత్వంపై ఉద్యమం తప్పదు. సంక్రాంతి పండుగ జరుపుకోకుండా మా ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు. మాట్లాడితే బడ్జెట్ రావాలంటున్నారు. మాకు కేటాయిం చిన బడ్జెట్‌ను ఏం చేశారు? ఆ బడ్జెట్లో మా వేతనాలు ఎందుకు ఇవ్వలేదు? - కోటా బుజ్జిబాబు, హెల్త్ అసిస్టెంట్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
గుట్టుగా ‘హెల్త్’ పోస్టుల భర్తీ !
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: జిల్లా వైద్యఆరోగ్యశాఖ తాజాగా మరో వివాదానికి కేంద్రబిందువైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులైన హెల్త్ అసిస్టెంట్లకు(మేల్) గుట్టుచప్పుడు కాకుండా నియామక ఉత్తర్వులు అందజేయడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే డీఎంహెచ్ఓ సెలవుపై వెళ్లడంతో కొందరు ఆ ఆరోపణలకు మరింత పదును పెట్టారు. ఈ వ్యవహారంలో భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 52 హెల్త్‌అసిస్టెంట్(మేల్) పోస్టులను గురు, శుక్రవారాల్లో భర్తీ చేశారు. వీరంతా 2002,03 నుంచి ఆ పోస్టుల్లో కొనసాగుతున్న వారే. అవసరానికి మించి పోస్టులు భర్తీ చేశారనే కారణంతో గత ఏడాది జూలై 3న వీరిని ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వందలాది మంది ఉద్యోగాలు కోల్పోవడంతో హైదరాబాద్‌లో ఏడాదిపాటు నిర్విరామంగా రిలేదీక్షలు కొనసాగించారు. ఎట్టకేలకు స్పందించి ప్రభుత్వం వీరిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ఇటీవల అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలకు ఆదేశాలిచ్చింది. అందులో భాగంగా జిల్లాలోనూ డీఎంహెచ్ఓ సుధాకర్ గురువారం 40 మందికి, శుక్రవారం 12 మందికి నియామకఉత్తర్వులిచ్చారు. వీరంతా గతంలో తాము పనిచేస్తున్న స్థానాల్లోనే నియమితులయ్యారు. అయితే వీరికి నియామక ఉత్తర్వులు అందించే క్రమంలో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులంతా సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమ్మెలో ఉండగా గురువారం సాయంత్రానికి ఎక్కువ శాతం మందికి నియామక ఉత్తర్వులు అందజేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నియామక ప్రక్రియ పూర్తవగానే డీఎంహెచ్ఓ 22వ తేదీ వరకు సెలవు పెట్టారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఈ దండకాల వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని కార్యాలయంలో ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్టు ఆరోపిస్తున్నారు.