104 వాహనాలు, 104 వాహనంకు సైడ్ అద్దాలు పగిలి పోవడంతో ప్రచార అట్టలు పెట్టిన దృశ్యం
ఆదిలాబాద్: గ్రామీణులకు మెరుగైన వైద్యం అం దించే 104 వాహనాలను మరమ్మతు సమస్యలు వెంటాడుతున్నాయి. 2008లో ప్రారంభించిన వా హనాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడంతో ఒక్కొక్కటిగా మూలనపడుతున్నాయి. జిల్లా అధికారులు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు వెచ్చించి మరమ్మతులు చేయిస్తున్నా.. అంతకుమించి ఖర్చయ్యే పక్షంలో చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు వాహనాలు మూలకుపడ్డాయి. వైద్య పరికరాల సరఫరా కూడా లేకపోవడంతో మూలనపడడానికి కారణమవుతోంది. వాహనాల్లోని సిబ్బందిని కుదించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వీటి వైపు రాకపోవడంతో సరైన వైద్యం అందడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 24 ‘104’ వాహనాలు నిత్యం గ్రామాల్లో విద్య శిబిరాలు నిర్వహిన్నాయి. మొదట్లో ఇవి హెచ్‌ఏంఆర్‌ఐ అదీనంలో ఉన్నా తర్వాత ప్రభుత్వం తన అదీనంలోకి తీసుకుంది. జిల్లాల విభజనకు ముందు 17 సీహెచ్‌ఎన్‌సీ(కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రీషన్ సెంటర్)లకు అప్పగించింది. జిల్లాల విభజన అనంతరం ఉమ్మడి జిల్లాలో ఏడు ఉప ఆరోగ్య వైద్యాధికారి కార్యాలయాలకు వీటి బాధ్యతలను అప్పగించింది.
మొదట్లో ప్రతి వాహనంలో ముగ్గురు ఏఎన్‌ఎంలు, ఫార్మాసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్, డీఈఓ, డ్రైవర్ చొప్పున విధులు నిర్వర్తించేవారు. వైద్య శిబిరం నిర్వహించే చోట సంబంధిత పీహెచ్‌సీ వైద్యాధికారి, గ్రామంలోని ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు హాజరయ్యేవారు. ప్రభుత్వం సిబ్బందిని కుదిస్తూ ప్రతీ వాహనంలో ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్‌లకే పరిమితం చెసింది. డీఈఓలను క్లస్టర్ కార్యాలయాల్లో నియమించింది. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించే సమయంలో ఆయా పరిధి పీహెచ్‌సీ వైద్యాధికారి, మొదటి రెండవ ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న చోట వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు కానరావడం లేదు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారుల కొరతతోపాటు సిబ్బందికి పనిభారంతో గైర్హాజరు అవుతున్నారు. దీంతో గ్రామీణులకు సరైన వైద్యం అందడం లేదు.
కానరాని వైద్య పరికరాలు.
హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించే హెచ్‌బీ ట్యూబ్‌లు, రక్త పరీక్షల కోసం నమూనాలు సేకరించే పిపెట్‌లు వాటిపై ఉండే గుర్తులు చెదిరి పోవడంతో పరీక్షల సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. పిపెట్‌లకు పగుళ్లు వచ్చినా గత్యంతరం లేక వాటినే వినియోగిస్తూన్నారు. 15 వాహనాల్లో బరువు తూచే యంత్రాలు పని చేయడం లేదు. చిన్నపిల్లల బరువు చూడడానికి ఏర్పాటు చేసిన బేబీ వేయింగ్ మిషన్లు అటకెక్కాయి. గర్భిణుల ఎత్తు కొలవడం, చిన్నపిల్లల్లో వయస్సుకు తగ్గ ఎదుగుదల ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన హైట్ చార్టులు సుమారు 12 వాహనాల్లో కనిపించడం లేదు. ఉన్న వాహనాల్లో చిరగడంతో పనికి రాకుండా పోయాయి. గర్భిణుల్లో పిండం కదలికల్లో వచ్చే శబ్దాలను అంచనా వేస్తూ ఎదుగుదల తదితర చర్యలను నిర్ధారిస్తూ వైద్యం అందించడానికి ఇచ్చిన ఫీటర్‌స్కోప్‌లు మూలనపడ్డాయి. గ్లూకోమీటర్లతో షుగర్ శాతం తెలుసుకోవడం కష్టంగా మారింది. బీపీ మీటర్లు మూలకుపడడంతో పరీక్షల సమయంలో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
మరమ్మతుకు నోచుకోక..
వాహనాల్లో బ్యాటరీలు మొరాయిస్తున్నాయి. టీవీల ద్వారా ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించడానికి ప్రతీ వాహనంలో రూ.50 వేల విలువైన టీవీ, డీవీడీలు ఏర్పాటు చేశారు. ఇవి వాహనాల్లో ఉన్నా బ్యాటరీలకు రీచార్జి లేక బ్యాటరీలు మూలనపడడంతో పని చేయడం లేదు. మంచిర్యాల, ఉట్నూర్ ప్రాంతాల్లోని మూడు వాహనాల్లో టీవీలు లేవని తెలిసింది. గతంలో ఓ వాహనంలోని టీవీ కనిపించకపోవడంతో ఏడీసీ స్థాయి అధికారిపై కేసు నమోదైంది. చాలా వాహనాల్లో సైరన్లు మూగబోయాయి. హెడ్‌లైట్లు తప్పితే వాహనం చుట్టూ ఉండే లైట్లకు మరమ్మతులు లేక వెలగడం లేదు. అత్యవసర సమయంలో వాహనంలో లోపల ఉన్న సిబ్బంది క్యాబీన్‌లోని డ్రైవర్ ఇతర సిబ్బందితో మాట్లాడటానికి ఉపయోగించే ఇంటర్ కమ్ ఫోన్ సౌకర్యాలు కనుమరుగు అయ్యాయి. వాహనంలో రెండు వైపుల రూ.60 వేలతో ఏర్పాటు చేసిన టెంట్లు పని చేయడం లేదు. కుర్చీలు, టేబుళ్లు విరిగిపోవడంతో వైద్య శిబిరం నిర్వహించే చోట గ్రామస్తులను ఆశ్రయించాల్సి వస్తోంది.
మందుల సరఫరా అంతంతే..
మొదట్లో ప్రతి వాహనంలో వంద రకాల మందులు సరఫరా అయ్యేవి. ఇందుకోసం ప్రభుత్వం నెలకు సుమారు రూ.40 వేలు కేటాయించేది. దీంతో జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీసీ) నుంచి 104లకు చేరేవి. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు దాదాపు 53 రకాల మందులు సరఫరా చేయాల్సి ఉండగా 20 రకాలు కూడా సరఫరా కావడం లేదని తెలిసింది. గ్రామాల్లో ఎక్కువగా ఉపయోగించే షుగర్, బీపీ, అస్తమా మందులు వస్తున్నా ఇతర వ్యాధులకు సంబంధించిన మందులు పూర్తి స్థాయిలో సరఫరా లేదు. దీంతో ప్రైవేట్‌గా కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment