ఇటీవల రాంనగర్‌లోని సబ్ సెంటర్‌లో పరిశీలన చేసిన రాష్ట్ర బృందం సభ్యులు
ఆదిలాబాద్‌టౌన్: పేదలకు నాణ్యమైన సర్కారు వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తోంది. ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినప్పటికీ ఆశించిన ఫలితాలు ఆచరణలో మాత్రం కానరావడం లేదు. వైద్యాధికారుల నిర్లక్ష్యమో లేక ఏఎన్‌ఎంల అలసత్వమేమో కానీ గర్భిణులు, బాలింతలు,చిన్నారులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని తెలుస్తోంది. గత వారం రోజుల క్రితం సిరిసిల్ల జిల్లాకు చెందిన రెండు బృందాలు జిల్లాలోని పలు సబ్ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ సెంటర్లలోని సౌకర్యాలు, వసతులపై ఆరా తీశారు. కొంతమంది ఏఎన్‌ఎంలకు రక్త పరీక్షలు చేయడం రాదని, గర్భిణులు, బాలింతల వివరాలు పొంతన లేని విధంగా నమోదు చేసినట్లు వారి పరిశీలనలో బయటపడింది. ఈ వివరాలతో కూడిన నివేదికను ఆ బృందాలు డీఎంహెచ్‌ఓతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు సమర్పించారు. వారి తప్పులను సవరించుకునే విధంగా వైద్యశాఖ చర్యలు చేపడుతోంది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
జిల్లాలో తనిఖీ
బృందాల పర్యటన..
జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 126 సబ్ సెంటర్లు ఉండగా, సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆరుగురు సూపర్‌వైజర్ సభ్యులు ప్రభలత, రాజునాయక్, జె.రత్నాకర్‌రావు, రమేష్, సుశీల, యాదగిరి రెండు బృందాలుగా ఏర్పడి అక్టోబర్ 30 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు జిల్లాలోని 32 సబ్ సెంటర్లలో పర్యటించారు. బేల, చప్రాల, భోరజ్, ఆనంద్‌పూర్, బోరిగాం, కోకస్‌మన్నూర్, తర్నం, ముత్నూర్, ఖానాపూర్, లోకారి, పరస్వాడ(బి), కుచ్లాపూర్, భరంపూర్, రాంపూర్, భీంసరి, మావల, కేశవపట్నం, ఘన్‌పూర్, కేస్లాపూర్, యేందా, నాగల్కొండ, కప్పర్ల, అందర్‌బంద్, గిరిగావ్, గుడిహత్నూర్, మన్నూర్, మర్లపల్లి, బోథ్, గిర్నూర్, జాతర్ల, రాంపూర్(కె), లక్కారం సబ్ సెంటర్లను పరిశీలించారు.
వీటిలో గాదిగూడ పీహెచ్‌సీ పరిధిలోని పరస్వాడ, ఝరి పీహెచ్‌సీ పరిధిలోని లోకారి, ఇచ్చోడ పీహెచ్‌సీ పరిధిలోని బోరిగాం, సైద్‌పూర్ పీహెచ్‌సీ పరిధిలోని చప్రాల, బేల పీహెచ్‌సీ పరిధిలోని బేల సబ్‌సెంటర్, అంకోలి పీహెచ్‌సీ పరిధిలోని మావల, నర్సాపూర్ పీహెచ్‌సీ పరిధిలోని కేశవపట్నం, సొనాల పీహెచ్‌సీ పరిధిలోని ఘన్‌పూర్ సబ్‌స్టేషన్‌లో పనిచేసే ఏఎన్‌ఎంల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీరిలో కొంతమందికి హెమోగ్లోబిన్ రక్త పరీక్షలు చేయరాకపోవడం, ఆశ కార్యకర్తలు గర్భిణులను ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడం, అంగన్‌వాడీల రికార్డులకు ఏఎన్‌ఎంల రికార్డులకు బాలింతలు, గర్భిణుల వివరాల పొంతన లేకుండా ఉండడం, వ్యాక్సినేషన్ సరిగా లేకపోవడంతోపాటు వివిధ కారణాలను చూపుతూ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.
వైద్యసేవలు అంతంతే..
జిల్లాలోని సబ్‌సెంటర్లలో విధులు నిర్వర్తించే కొంతమంది ఏఎన్‌ఎంల సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ విషయం రాష్ట్ర తనిఖీ బృందం పరిశీలనలోనే తేటతెల్లమైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పీహెచ్‌సీ పరిధిలోని మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణ లేకపోవడంతో కొంతమంది ఏఎన్‌ఎంలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఆరోగ్య కేంద్రాల ఆవరణలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడం, సమయపాలన పాటించకపోవడం, వారంలో ఒకట్రెండు రోజులు మాత్రమే ఉప కేంద్రాలను తెరవడం, గ్రామాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించకపోవడం, నామమాత్రంగానే విధులు నిర్వహిస్తున్నారనే విషయాలన్ని బృందం సభ్యుల దృష్టికి వచ్చింది.
జాబ్ చార్ట్ ప్రకారం సబ్‌సెంటర్‌కు ఇద్దరు ఏఎన్‌ఎంలు ఉంటే ఒకరు సబ్‌సెంటర్‌లో ఉండాలి, మరొకరు గ్రామాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధులు, తదితర వాటిపై అవగాహన కల్పించాలి. గర్భిణులకు ఐరన్ మాత్రలు అందజేయాలి. మాతా, శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలి. గర్భిణులకు హెమోగ్లోబిన్ రక్త పరీక్షలు చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలి. కుటుంబ నియంత్రణ పాటించేలా చర్యలు తీసుకోవడంతోపాటు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. పీహెచ్‌సీ పరిధిలోని వైద్యులతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయించాలి. ఉదయం నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించాలి. కిషోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, రుతుచక్రం గురించి అవగాహన కల్పించాలి. కానీ జిల్లాలో కొంతమంది ఏఎన్‌ఎంలు ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ఇటీవల సిరిసిల్ల సూపర్‌వైజర్ల బృందం జిల్లాలోని 32 సబ్ సెంటర్లను పరిశీలించింది. ఇందులో నుంచి కొన్ని సెంటర్లలో కొంతమంది ఏఎన్‌ఎంలకు హెచ్‌బీ పరీక్షలు చేయడం రాదనే విషయాన్ని బృందం సభ్యులు నివేదికలో పొందుపర్చారు. గర్భిణులు, బాలింతల వివరాలు వేర్వేరుగా నమోదు చేసిన అంగన్‌వాడీ, ఏఎన్‌ఎంల రికార్డుల్లో వ్యత్యాసం ఉంది. కొంతమంది ఆశ కార్యకర్తలు గర్భిణులను ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదనే విషయాన్ని నివేదికలో తెలిపారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటాం. విధుల్లో ఎవరైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవు. – రాజీవ్‌రాజ్, డీఎంహెచ్‌ఓ, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment