సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కల్‌గూడ 3వ అంగన్‌వాడీ కేంద్రానికి తాళం వేయడంతో బయటే ఎదురుచూస్తున్న మహిళలు, చిన్నారులు
ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కల్‌గూడ 3వ అంగన్‌వాడీ కేంద్రానికి గత ఎనిమిది నెలల నుంచి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని రెండు రోజుల క్రితం అంగన్‌వాడీ కేంద్రానికి తాళం వేశారు. కేంద్రానికి తాళం వేసి ఉండడంతో వచ్చిన గర్భిణులు, బాలింతలు బయటనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. భవనం అద్దె చెల్లించకపోతే కేంద్రానికి తాళం వేస్తామని పలుమార్లు యజమాని చెప్పడం జరిగింది. గత ఎనిమిది నెలల నుంచి అద్దె బిల్లులు నిలిపివేయడంతో సోమవారం వారు కేంద్రానికి తాళం వేశారు. బుధవారం కూడా అంగన్‌వాడీ కేంద్రం తెరుచుకోలేదు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే కేంద్రం తెరిచేదని ఇంటి యజమాని స్పష్టం చేసినట్లు ఆ కేంద్రం అంగన్‌వాడీ టీచర్ సాజిదఖానం తెలిపారు.
గత వారం రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ కేంద్రానికి సైతం ఎనిమిది నెలల అద్దె బకాయి ఉండడంతో ఆ భవన యజమానికి తాళం వేశారు. బేల మండల కేంద్రంలో అద్దె ఇంట్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రానికి అద్దె చెల్లించకపోవడంతో గత నెలరోజుల క్రితం ఆ కేంద్రానికి యజమాని తాళం వేశారు. భవనం అద్దెకు సంబంధించిన నిధులు విడుదల అయినప్పటికీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఈ కేంద్రానికి తాళం పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం జరుగుతున్నాయి.
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె ఇండ్లల్లో అవస్థల నడుమ కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అద్దె భవనాల బిల్లుల చెల్లింపులో ఆలస్యం చేస్తుండడంతో జిల్లాలోని కొన్ని కేంద్రాలకు తాళాలు పడ్డాయి. ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కల్‌గూడ అంగన్‌వాడీ కేంద్రం-3కి సంబం ధించి ఎనిమిది నెలల అద్దె బకాయి పడడంతో ఇంటి యజమానికి రెండు రోజుల క్రితం కేంద్రానికి తాళం వేశాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో జరుగుతూనే ఉన్నా అధికారులు మాత్రం స్పందించం లేదు. ప్రభుత్వం బిల్లులు విడుదల చేసినప్పటికీ కొంతమంది అధికారులు మాత్రం వాటిని సంబంధిత కేంద్రాలకు చెల్లించకుండా ‘మామూలు’గా వ్యవహరిస్తుండడంతో ఈ దుస్థితి నెలకొందనే ఆరోపణలు ఉన్నాయి.
అద్దె ఇండ్లల్లో అవస్థలెన్నో...
జిల్లాలో మొత్తం 1256 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 992 మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు, 264 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆదిలాబాద్ అర్బన్‌లో 302 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 40 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 150 సెంటర్లు అద్దె ఇండ్లల్లో కొనసాగుతున్నాయి. 39 అంగన్‌వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లో, 67 గ్రామపంచాయతీ, ఇతర సంఘ భవనాల్లో నడుస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న 122 కేంద్రాల్లో ఒక్కదానికి కూడా సొంత భవనం లేకపోవడం గమనార్హం.
- బోథ్ ప్రాజెక్టు పరిధిలో 287 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 70కి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 86 కేంద్రాలు అద్దె ఇండ్లల్లో కొనసాగుతున్నాయి. 105 కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లో, 26 కేంద్రాలు గ్రామపంచాయతీ, ఇతర భవనాల్లో నడుస్తున్నాయి.
- జైనథ్ ప్రాజెక్టు పరిధిలో 261 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 57 సెంటర్లకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 95 కేంద్రాలు అద్దె గదుల్లో, 60 కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లో, 49 కేంద్రాలు ఇతర భవనాల్లో కొనసాగుతున్నాయి.
- నార్నూర్ ప్రాజెక్టు పరిధిలో 154 కేంద్రాలు ఉండగా, 32 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 75 కేంద్రాలు అద్దె భవనాల్లో, 23 కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లో, 24 కేంద్రాల్లో ఇతర భవనాల్లో నడుస్తున్నాయి.
- ఉట్నూర్ ప్రాజెక్టు పరిధిలో 252 కేంద్రాలు ఉండగా, 76 సొంత భవనాలు ఉన్నాయి. 78 కేంద్రాలు అద్దె ఇండ్లల్లో, 60 కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లో, 38 ఇతర భవనాల్లో నడుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1256 కేంద్రాల్లో కేవలం 275 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి.
అరకొర వసతుల మధ్య..
అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం వెరసి ఏళ్ల తరబడి అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలకు నోచుకోకపోవడంతో ఇబ్బందిగా మారింది. అద్దె భవనాల్లో అంతంత మాత్రంగానే సౌకర్యాలు ఉన్నాయి. చాలా కేంద్రాలకు కనీసం గాలి, వెలుతురు సరిగా లేదు. చీకటి గదుల్లోనే కేంద్రాలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలోని కేంద్రాలకు రూ.3వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు రూ.750 చొప్పున అద్దె చెల్లిస్తోంది. భవనాలకు అద్దె చెల్లింపు విషయంలో కూడా నెలనెలా సక్రమంగా అందించిన సందర్భాలు లేవు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 500-600 అడుగుల విస్తీర్ణంలో మూడు గదులు, తాగునీరు, ఫ్యాన్, మరుగుదొడ్లు, ఆట స్థలం ఉండాలి. అన్ని వసతులు ఉన్న మున్సిపాలిటీ పరిధిలోని భవనాలకు రూ.3వేలు, గ్రామాల్లోని భవనాలకు రూ.750 అద్దె చెల్లించాలి. అయితే చాలా అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనసాగడం లేదు. పట్టణంలో ఒకటిరెండు గదుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఒక గదిలోనే కేంద్రాలు కొనసాగుతున్నాయి. చిన్నారులను ఒక గదిలో ఇరుకుగా కూర్చోబెట్టడం, వంటగది, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఫ్యాన్, కరెంట్ సదుపాయం కూడా సరిగా లేకపోవడంతో చిన్నారులతో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు కూడా అవస్థలకు గురవుతున్నారు.
అద్దె చెల్లింపులో నిర్లక్ష్యం..
అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రైవేట్ భవనాలకు సకాలంలో అద్దె చెల్లించడం లేదు. నెలల తరబడి ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. యజమానుల ఒత్తిడితో కొంత మంది అంగన్‌వాడీలు తమ వేతనం నుంచి చెల్లిస్తున్నారు. అయితే 2017 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు కొన్ని కేంద్రాలకు బిల్లులు చెల్లించకపోవడంతో యజమానులు కేంద్రాలకు తాళం వేస్తున్నట్లు తెలుస్తోంది. గతనెల రోజుల క్రితం సెప్టెంబర్ 2017 నుంచి 2018 మార్చి వరకు బిల్లులను విడుదల చేసింది. కొంతమంది సీడీపీఓలు మాత్రమే కేంద్రాలకు బిల్లులు చెల్లించారు. మిగతా వారు చెల్లించకపోవడంతో ఆ కేంద్రాల అంగన్‌వాడీలకు ఇబ్బందులు తప్పడంలేదు. అయితే 2018 మార్చి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు ఇంటి యజమానుల అకౌంట్‌లోనే డబ్బులు జమ చేయనుండడంతో ఈ సమస్య తీరనుందని తెలుస్తోంది.
పెండింగ్ బిల్లులు విడుదల చేశాం
2017 సెప్టెంబర్ నుంచి 2018 ఫిబ్రవరి వరకు పెండింగ్‌లో ఉన్న అద్దె భవనాల బిల్లులు విడుదలయ్యాయి. సంబంధిత సీడీపీఓలు డీడీలు తీసి అంగన్‌వాడీ టీచర్లకు చెల్లిస్తున్నారు. ఇప్పటికే చాలా కేంద్రాలకు బిల్లులు అందజేశాం. రెండుమూడు రోజుల్లో మిగతా వాటికి కూడా అందజేస్తాం. ఇక ఈ ఏడాది మార్చి నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇంటి యజమాని ఖాతాలో నేరుగా జమ చేయనున్నాం. జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు సొంత భవన నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఏజెన్సీ ప్రాంతంలో 23, మైదాన ప్రాంతంలో 66 భవనాలకు మాత్రమే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. - మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి
Comments
Please login to add a commentAdd a comment