ఇదే మెనూ.. పెట్టింది తిను | No Quality Food In Anganwadi Centers In Adilabad District | Sakshi
Sakshi News home page

ఇదే మెనూ.. పెట్టింది తిను

Published Sat, Oct 19 2019 8:32 AM | Last Updated on Sat, Oct 19 2019 8:38 AM

No Quality Food In Anganwadi Centers In Adilabad District - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులకు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో సెప్టెంబర్‌ 1 నుంచి నెల చివరి వరకు పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం చేపట్టింది. నెల పాటు అవగాహన కల్పించినా ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలకు పూర్తిస్థాయిలో సరుకులు సరఫరా కాకపోవడంతో పౌష్టికాహారం అందడం లేదు.

ఇటీవల జరిగిన స్టాడింగ్‌ కమిటీ సమావేశంలో సైతం ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా కావడం లేదని లేవనెత్తిన విషయం తెలిసిందే. దీనిని బట్టి చూస్తే ఐసీడీఎస్‌ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఆకుకూరలు, కోడిగుడ్లు, పాలు, పెరుగుతో కూడిన పౌష్టికాహారం అందించాల్సి ఉండగా పప్పు, అన్నం కూడా కొన్ని కేంద్రాల్లో పెట్టడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు అంగన్‌వాడీ కేంద్రాలను శుక్రవారం ‘సాక్షి’ విజిట్‌ చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా కేంద్రాలు సమయానికి తెరువలేదు. తెరిచిన కేంద్రాల్లో పిల్లల సంఖ్య ముగ్గురు, నలుగురే ఉండడం గమనార్హం. 


జిల్లాలోని 18 మండలాల్లో 5 ప్రాజెక్టులు, 51 సెక్టార్లు ఉన్నాయి. మొత్తం 1,256 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 987 ప్రధాన కేంద్రాలు కాగా, 269 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు సుమారు 21,685 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 30,503 మంది, గర్భిణులు, బాలింతలు 10,520 మంది ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రతీరోజు ఒక పూట మధ్యాహ్నం పూర్తిస్థాయి భోజనం వండిపెట్టాలి. కాని జిల్లాలో ఏ కేంద్రంలో కూడా ఇది అమలు కావడం లేదు. ప్రస్తుతం చాలా కేంద్రాల్లో పాలు, నూనె, పప్పుతోపాటు ఇతర సరుకులు లేవు. కొన్ని కేంద్రాల్లో ఉన్నా నిర్వాహకులు వండి పెట్టడం లేదని సాక్షి విజిట్‌లో తేలింది.  

లోపించిన పర్యవేక్షణ
అంగన్‌వాడీ కేంద్రాలపై ఐసీడీఎస్‌ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు చాలా మంది సమయపాలన పాటించడం లేదు. సక్రమంగా కేంద్రాలు తెరవడం లేదు. దీంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు రావడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కేంద్రాలు తెరిచిన వారిలో చాలా మంది భోజనం సక్రమంగా వండి పెట్టలేదు. సరుకులు ఉన్న కేంద్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది.


పర్యవేక్షించాల్సిన కొంత మంది సూపర్‌వైజర్లు కార్యాలయానికే పరిమితం ఆవుతున్నారు. దీంతో కొంతమంది అంగన్‌వాడీ కార్యకర్తలు లబ్ధిదారులకు అందజేయాల్సిన కోడిగుడ్లు, ఇతర సరుకులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. కాని ఏ కేంద్రంలోనూ మెనూ పాటించడం లేదు. ఆకుకూరలు, పెరుగు జాడ లేదు. అలాగే కొన్ని కేంద్రాల్లో పప్పు కూడా లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement