సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు వేతనాల కోసం అల్లాడుతున్నారు. మూడు నెలలుగా వేతనాలు అందకపోగా... అంతకు ముందు సమ్మె కాలానికి సంబంధించిన వేతన బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఆర్థికంగా సతమతమవుతున్నారు. అందాల్సిన వేతనాల కోసం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌కు నిత్యం వినతులు వెల్లువెత్తుతున్నాయి. కానీ రాష్ట్ర కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 58,000మంది అంగన్‌వాడీ సిబ్బంది
రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 58,500 మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పనిచేస్తున్నారు. మూడు నెలల కిందటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెలా పదో తేదీ లోపు వేతనాలు అందించేవారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు గౌరవ వేతన రూపంలో రూ.13,650, హెల్పర్లకు 7,800 చొప్పున నెలవారీగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. వీరికి ఏడాదికి రూ.850 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నారు.
బడ్జెట్ లేదంటూ...
ప్రస్తుతం మూడు నెలలుగా టీచర్లు, హెల్పర్లకు వేతనాలు నిలిచిపోయాయి. బడ్జెట్ సమస్యతో వేతనాలు నిలిచిపోయాయంటూ కమిషనరేట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫైలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని, అది పరిష్కారమైతేనే వేతనాలు విడుదలవుతాయని అంటున్నారు. అయితే ఎన్నిరోజుల్లో సమస్యకు పరిష్కారం దక్కుతుందో యంత్రాంగం వద్ద కూడా స్పష్టత లేదు.
ప్రతినెలా ఒకటో తేదీనే చెల్లించాలి
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే గౌరవవేతనం అందించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగా అదేరోజు చెల్లించాలి. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో చాలామంది అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో సమ్మె చేసిన కాలానికి సంబంధించిన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి.
– టేకుమల్ల సమ్మయ్య, తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
అంగన్‌వాడీల వేతన వెతలు!
Published Sun, Feb 18 2024 5:05 AM | Last Updated on Sun, Feb 18 2024 5:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment