అంగన్‌వాడీలకు అడిగినవన్నీ.. | Positive attitude of YSRCP government towards Anganwadi | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు అడిగినవన్నీ..

Published Fri, Dec 22 2023 5:30 AM | Last Updated on Fri, Dec 22 2023 5:25 PM

Positive attitude of YSRCP government towards Anganwadi - Sakshi

సాక్షి, అమరావతి :  బడుగు బలహీనవర్గాలకు మేలుచేసే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, వాటిలో సేవలందిస్తున్న వర్కర్లు, ఆయాలపట్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తొలి నుంచీ సానుకూల వైఖరితోనే వ్యవహరిస్తోంది. ఆ కేంద్రాలను ఆధునీకరించడంతోపాటు అంగన్‌వాడీలకు మెరుగైన జీతాలిచ్చింది కూడా సీఎం జగన్‌ ప్రభుత్వమే. చంద్రబాబు జమానాకంటే సీఎం జగన్‌ పాలనలోనే వీరి వేతనాలు పెరిగాయి. ఎలాగంటే.. 2014 నుంచి 2016 వరకు ఈ వర్కర్లకు కేవలం రూ.4,200 మాత్రమే గౌరవ వేతనం ఇచ్చిన చంద్రబాబు 2016లో కంటితుడుపు చర్యగా రూ.ఏడు వేలకు పెంచారు. అప్పటి నుంచి రెండేళ్ల మూడు నెలలపాటు అదే అరకొర జీతంతో సరిపెట్టారు.

2018లో తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా అంగన్‌వాడీలకు గౌరవ వేతనం పెంచుతానని ప్రతిపక్ష హోదాలో వైఎస్‌ జగన్‌ ప్రకటించడంతో అప్పుడుగానీ చంద్రబాబుకు వారి జీతాలు గురించి గుర్తురాలేదు. దీంతో ఎన్నికలకు ఆర్నెల్ల ముందు హడావుడిగా వేతనాలు పెంచినట్లు మోసపూర్తింగా జీవో ఇచ్చారు కానీ, అమలు చేయలేదు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్‌ జగన్‌ తెలంగాణా కంటే అధికంగా ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7వేలు చొప్పున పెంచి అందిస్తున్నారు. టీడీపీ హయాంలో అరకొర జీతాలతో అవస్థలుపడిన అంగన్‌వాడీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇలా వేతనాలు పెంచి నాలుగున్నరేళ్లుగా ఆ మొత్తాన్ని అందిస్తోంది.  

నీతిఆయోగ్‌ ప్రశంసలు.. 
గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వంలోనే అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సగటు వేతనం భారీగా పెరిగింది. అంతేకాదు.. అంగన్‌వాడీల నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ టాప్‌ అని నీతిఆయోగ్‌ ప్రశంసించింది. అంగన్‌వాడీ వర్కర్లకు అత్యధిక వేతనాలిస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ ఆరవ స్థానంలోను, హెల్పర్ల వేతనాల్లో నాల్గవ స్థానంలో ఉండటం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే.. సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోనే అంగన్‌వాడీలకు అసలైన మేలు జరిగింది.  

అత్యాధునికంగా అంగన్‌వాడీ కేంద్రాలు.. 
అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణకు వైఎ­స్సా­ర్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది.  
♦ నాడు–నేడు ద్వారా అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. వీటికి అవసరమైన వస్తువులు, స్టేషనరీకి 48,770 మెయిన్‌ కేంద్రాలకు రూ.500 చొప్పున.., 6,837 మినీ కేంద్రాలకు రూ.250 చొప్పున మొత్తం 55,607 కేంద్రాలకు రూ.7.81కోట్లు మంజూరు చేసింది.  
♦ సొంత భవనాల నిర్వహణ, చిన్నపాటి మరమ్మతులకు 21,206 కేంద్రాలకు (ఒక్కొక్క దానికి రూ.3వేలు చొప్పున) మొత్తం రూ.6.36 కోట్లు విడుదల చేసింది.  
♦ అద్దె భవనాల్లో ఉన్న గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని 16,575, పట్టణాల్లోని 6,705 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.66.54 కోట్ల అద్దె బకాయిలు చెల్లించింది.  
♦ అవకాశం ఉన్న మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా మారుస్తోంది. 

అంగన్‌వాడీల మేలు కోరిన ప్రభుత్వం.. 
వేతనాల పెంపే కాదు.. అంగన్‌వాడీలు అడిగిన డిమాండ్లను సైతం సీఎం వైఎస్‌ జగన్‌ పెద్ద మనస్సుతో ఆమోదించి అమలుచేస్తున్నారు. అంగన్‌వాడీల మేలు కోరి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా (ఈ నెల 20న) మరికొన్ని ఉత్తర్వులు జారీచేసింది. అవేమిటంటే.. 
♦అంగన్‌వాడీ సహాయకులను కార్యకర్తలుగా నియమించేందుకు వయో పరిమితిని 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు పెంచుతూ జీఓఎంఎస్‌–44 జారీచేసింది.  
♦ సెక్టార్, యూనిట్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు టీఏ, డీఏలు ఇవ్వాలన్న అంగన్‌వాడీల కోరికపై సానుకూలంగా స్పందించి మెమో నెంబర్‌.2303564/2023 జారీచేసింది.  
♦    అంగన్‌వాడీ వర్కర్లకు నెలకు ఒకసారి, హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి టీఏ, డీఏలు చెల్లించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.  
♦ వీటితోపాటు అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల ఉద్యోగ వి­రమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. 
♦ అంగన్‌వాడీ వర్కర్లు, మినీ వర్కర్ల సర్వీసు విరమణ తర్వాత వన్‌టైం బెనిఫిట్‌ రూ.50 వేలను రూ.1 లక్షకు పెంచింది.  
♦ సహాయకుల సర్విసు విరమణ తర్వాత వన్‌టైం బె­నిఫిట్‌ రూ.20వేల నుంచి రూ.40 వేలకు పెంచింది. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్రతి ఒక్కరికీ యూనిఫారం (ఆరు చీరలు చొప్పున) అందించేందుకు రూ.16 కోట్లను ఖర్చుచేసింది.  వారి విధులు సజావుగా నిర్వహించడానికి, మంచి సేవలు అందించడానికి ఈ ప్రభుత్వం రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్‌ఫోన్లు కొని, అం­దించింది. డేటా ఛార్జీలను ప్రభుత్వమే భరి­స్తూ అదనంగా ఏడాదికి రూ.12కోట్లు చెల్లిస్తోంది.  
♦ ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు జీవిత బీమా వర్తింపజేస్తోంది. ప్రమాద బీమాగా రూ.2 లక్షల వరకూ చెల్లిస్తోంది.  
♦ అంగన్‌వాడీల ద్వారా నాణ్యమైన సరుకుల పంపిణీని పర్యవేక్షించేందుకు దాదాపు 500 మంది సూపర్‌వైజర్లను కూడా నియమించింది.  
♦ గర్భవతులు, బాలింతలు, పిల్లలకు గతంలోలా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా టేక్‌హోం రేషన్‌ పద్ధతిని  అమల్లోకి తెచ్చింది. దీనివల్ల వారికి పనిభారం తగ్గింది. 2023 నుంచి డ్రై రేషన్‌ అందిస్తోంది.  
♦ మంచి పనితీరు కనబర్చిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 ఇస్తోంది. ఇలా ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా చెల్లిస్తోంది. 

రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి పదోన్నతులు..
ఇక అంగన్‌వాడీలకు 2013 నుంచి పదో­న్నతులు ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వంలో దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలి­సారిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ప్రమో­షన్లు ఇచ్చింది. మరోవైపు.. 560 గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌ పోస్టులను భర్తీచేసింది. ఇదే సందర్భంలో ఈ సూపర్‌వైజర్‌ పోస్టులకు పరీక్షలు రాసే వారి వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది.

తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వయో పరిమితి పెంపు చాలా ఉప­యోగపడింది. ప్రభుత్వం అమలు­చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి రూ.1,313 కోట్లు అందించింది. ఇక నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ రైతుభరోసా, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వారికి కూడా వర్తింపజేయడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement