విశాఖ జీవీఎంసీ 24వ వార్డు రేసపువానిపాలెం అంగన్‌వాడీ కేంద్రానికి గేటు వేసిన యూనియన్ నాయకులతో ఆయా దేవిక వాగ్వాదం
సీతమ్మధార (విశాఖ ఉత్తర): ‘నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లను. నాకు జీతం కావాలి. నా ఉద్యోగం నేను చేసుకుంటాను’ అని విశాఖపట్నంలోని రేసపువానిపాలెం అంగన్‌వాడీ కేంద్రం ఆయా దేవిక తేల్చి చెప్పింది. సహచరులు సమ్మె చేస్తున్నా కూడా ప్రజలకు అత్యవసర సేవలు ఆగకూడదన్న ఉద్దేశంతో అంగన్‌వాడీ కేంద్రాన్ని తెరిచి విధుల్లో చేరింది. సమ్మె కారణంగా జీవీఎంసీ 24వ వార్డు రేసపువానిపాలెం అంగన్‌వాడీ సెంటర్‌ను మూసివేయాల్సి వచ్చింది.
ఆ కేంద్రంలోని ఆయా దేవిక శుక్రవారం అంగన్‌వాడీ కేంద్రాన్ని తెరిచి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్న సమయంలో కొందరు యూనియన్ నాయకులు ఆమెను అడ్డుకుని అంగన్‌వాడీ కేంద్రానికి తాళం వేశారు. మళ్లీ కేంద్రాన్ని తెరిస్తే ఆయాకు మద్దతుగా ఉన్న కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఇంటిని 500 మంది అంగన్‌వాడీలతో కలిసి ముట్టడిస్తామని ఆమెను యూనియన్ నేతలు హెచ్చరించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లనని చెప్పిన ఆయా దేవిక ధైర్యంగా శనివారం కూడా అంగన్‌వాడీ కేంద్రాన్ని తెరిచి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేసి తన విధులను యథావిధిగా నిర్వర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment