సాక్షి, అమరావతి: అడగకుండానే అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే వర్కర్లు, హెల్పర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక వరాలిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి వేతనాలు పెంచారు. పదోన్నతులు కల్పించారు. పదోన్నతుల్లో వయో పరిమితి పెంచుతూ అనేక మందికి అవకాశం కల్పించారు. పాత స్మార్ట్ ఫోన్‌ల స్థానంలో కొత్త స్మార్ట్ ఫోన్‌లు అందించారు. మునుపెన్నడూ లేని విధంగా సెలవులు మంజూరు చేశారు. బీమా కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మేలు చేసి మనసున్న సీఎంగా వైఎస్ జగన్ మన్ననలు అందుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో అంగన్‌వాడీలను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే విపక్షాల కుట్ర చేశాయి. వాస్తవాలను మరుగుపరిచి వారిని రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీలు తమను ఆదుకున్నదెవరో చూడాల్సిన అవసరం ఉంది. అంగన్‌వాడీ కేంద్రాలు, వాటిలో సేవలు అందించే వర్కర్లు, హెల్పర్ల పట్ల గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించింది? ప్రస్తుత ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది? అనే వాస్తవాలు ఒకసారి పరిశీలిస్తే..
బాబు జమానాలో దారుణం..
వేతనాలు పెంచాలని ఆందోళన చేపట్టిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను గుర్రాలతో తొక్కించి, లాఠీలతో కొట్టించి చెదరగొట్టిన చంద్రబాబు నిరంకుశ పాలనను ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ అంగన్‌వాడీల ఆవేదనను, ఆక్రోశాన్ని, కన్నీళ్లను చంద్రబాబు పట్టించుకోలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన కనికరించలేదు. ఎన్నికల ముందు అరకొరగా జీతాలు పెంచి వాటిని అమలు చేయకుండా బకాయిలు పెట్టి వదిలేశారు.
సీఎం జగన్ అమలు చేసిన కార్యక్రమాల్లో కొన్ని..
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాకముందు, అంటే గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ అంగన్‌వాడీ వర్కర్ల జీతం నెలకు రూ. 7 వేలు, హెల్పర్లకు రూ. 4,500 మాత్రమే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి మూడు వారాల్లోనే వారికి జీతాలు పెంచుతూ ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 18 జారీ చేసింది. అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు నెలకు రూ. 11,500కు, హెల్పర్లకు రూ. 7 వేలకు పెంచుతూ 2019 జూన్ 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
► విధి నిర్వహణలో మంచి పనితీరు కనబర్చిన అంగన్‌వాడీ వర్కర్లకు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ. 500 చొప్పున ప్రభుత్వం అదనంగా అందిస్తోంది. ఇందుకోసం ఏడాదికి సుమారు రూ. 27.8 కోట్లు చెల్లిస్తోంది.
► 2013 నుంచి అంగన్‌వాడీలకు పదోన్నతులు లేవు. గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చి 560 గ్రేడ్–2 సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేసింది. ఈ సూపర్‌వైజర్ పోస్టులకు పరీక్షలు రాసే వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచి ఎక్కువ మందికి అవకాశం కల్పించింది.
► అంగన్‌వాడీ వర్కర్లకు స్మార్ట్‌ఫోన్లు కూడా ఇచ్చింది. 56,984 స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు రూ. 85.47 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అదనంగా 1 జీబీ డేటా కూడా ఇస్తోంది.
► రూ. 16 కోట్ల ఖర్చుతో ఒక్కో అంగన్‌వాడీ వర్కర్‌కు, హెల్పర్‌కు 6 చొప్పున యూనిఫాం శారీలు అందించే కార్యక్రమం కొనసాగుతోంది.
► అంగన్‌వాడీ కేంద్రాల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి పర్యవేక్షించడంతో పాటు వర్కర్లు, హెల్పర్లకు వార్షిక సెలవులు, ప్రసూతి సెలవులు, బీమా సౌకర్యం కల్పించి భరోసా ఇస్తున్నారు. పదవి విరమణ సమయంలో ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తోంది.
► నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ నాణ్యంగా కనీస మౌలిక సదుపాయాలను అందించేలా చర్యలు చేపట్టింది.
► 10,932 అంగన్‌వాడీ కేంద్రాలు (సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లోకి రీలొకేట్ అయినవి) మౌలిక సదుపాయాలు, తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరో రూ. 500 కోట్లతో మిగిలిన 45,000 అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ పనుల్లో భాగంగా అంగన్‌వాడీ భవనాలకు రిపేర్లు, కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ ఉపకరణాలు, రంగులు, రక్షిత తాగునీరు, గోడలపై బొమ్మలు తదితర పనులు చేపడుతున్నారు.
► స్మార్ట్ టీవీల ఏర్పాటుతో పాటు పిల్లల్లో నేర్చుకునే విధానాలను మెరుగుపరచడానికి ప్రత్యేక కిట్లు అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని 8.5 లక్షల మంది పిల్లలకు ఈ కిట్లను ప్రభుత్వం ఇస్తోంది. దీంతోపాటు స్పోకెన్ ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. అంగన్‌వాడీ వర్కర్లకు శిక్షణ కార్యక్రమాల ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.
► పిల్లల ఎదుగుదలను పరిశీలించేందుకు రూ. 16.04 కోట్ల ఖర్చుతో 19,236 పరికరాలను అంగన్‌వాడీ స్కూళ్లకు ప్రభుత్వం అందిస్తోంది. గ్రోత్ మానిటరింగ్ పరికరాల కొనుగోలు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది.
► గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు గతంలో మాదిరిగా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా టేక్ హోం రేషన్ పద్ధతిని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
► అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా వైద్య సేవలు కూడా అందుబాటులోకి తెచ్చింది.
అంగన్‌వాడీల్లో మనమే బెస్ట్
–కేవీ ఉషశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, వర్కర్లు, హెల్పర్ల వేతనాల పెంపు వంటి అనేక విషయాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ బెస్ట్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అనేక చర్యలు చేపట్టడంతో అంగన్‌వాడీల వ్యవస్థ నేడు మెరుగ్గా ఉంది. అంగన్‌వాడీలు, ప్రభుత్వ బడుల్లో బలహీనవర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు. ఆ వర్గాలకు చెందిన పిల్లలకు సీఎం వైఎస్ జగన్ తోడుగా నిలబడుతున్నారు. ఆయన పెద్ద మనస్సుతో తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో విప్లవాత్మక మార్పులు సంతరించుకున్నాయి.
Fact Check: అడగకుండానే అంగన్‌వాడీలకు ఎన్నో వరాలు
Published Thu, Jul 13 2023 4:24 AM | Last Updated on Thu, Jul 13 2023 9:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment