rental buildings
-
భారత్‌లోనే అతిపెద్ద డీల్!.. నెలకు రూ.40.81 లక్షల రెంట్
భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరాల్లో భూములు, భవనాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సంపాదించిన డబ్బులో సగం రెంట్ కట్టుకోవడానికే సరిపోతోందని కొందరు భాదపడుతున్నారు. ఈ తరుణంలో గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ ఐఎంసీ ట్రేడింగ్ అనుబంధ సంస్థ ఐఎంసీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ భారీ డీల్ కుదుర్చుకుంది.ఐఎంసీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఒక ఆఫీస్ కాంప్లెక్స్ లీజుకు తీసుకుంది. ఇందులో కంపెనీ ఒక్కో చదరపు అడుగుకు రూ. 700 చొప్పున లీజుకు తీసుకుంది. ఈ భవనం మేకర్ మ్యాక్సిటీ 4 నార్త్ అవెన్యూ భవనంలోని 4వ అంతస్తులో ఉంది. లీజు వ్యవధి జూన్ 16న ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన లావేదేవీలు జూన్ 5న పూర్తయ్యాయి.కంపెనీ రూ.40.81 లక్షల నెలవారీ అద్దెతో 5 నెలల పాటు స్థలాన్ని లీజుకు తీసుకుంది. ముంబైలో అద్దె రేట్లు ప్రాంతాన్ని బట్టి చదరపు అడుగులకు రూ. 100 నుంచి రూ. 500 మధ్య ఉంటాయి. అయితే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) అనేది ముంబై వ్యాపార కేంద్రాలకు చాలా ముఖ్యమైనది కావడంతో ఇక్కడ ధరలు భారీగా ఉంటాయి. ఇప్పటి వరకు చదరపు అడుగు అద్దె రూ. 700 చెల్లిస్తున్న కంపెనీల జాబితాలో ఐఎంసీ సెక్యూరిటీస్ మొదటి సంస్థ. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఇదే అతిపెద్ద డీల్ అని తెలుస్తోంది.గతంలో కూడా ఐఎంసీ సెక్యూరిటీస్ సంస్థ 2022 ఏప్రిల్‌లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఒక చదరపు అడుగును రూ. 421 చొప్పున లీజుకు తీసుకుంది. అంతకు ముందు 2021 ఏప్రిల్‌లో చదరపు అడుగు రూ. 405 ధరతో లీజుకు తీసుకుంది. ముంబైలో 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో చదరపు అడుగు అద్దె రూ. 130 నుంచి రూ. 136 మధ్య ఉండేది. -
అసంపూర్తిగా అంగన్వాడీ భవనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అనేక అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాలు లేక అరకొర వసతులు, అద్దె భవనాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో కొన్ని అద్దె భవనాల్లో, మరికొన్ని ప్రాథమిక పాఠశాలల్లో, కొన్ని శాశ్వత భవనాల్లో నడుస్తున్నాయి. అయితే ఆశించిన మేర సొంత భవనాలు లేక ఐసీడీఎస్ లక్ష్యం నీరుగారుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. సొంత భవనాలు, అదిరిపోయే హంగులతో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా అంగన్వాడీ కేంద్రాలు ఉండాలని ఉండాలని ఆ శాఖ నిర్ణయించినప్పటికి అమలుకు నోచుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, బడ్జెట్‌లోపం వెరసి అంగన్వాడీలు సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాయి. నిధులు రావు.. పనులు కావు సిరిసిల్ల జిల్లాలో రెండు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద 587 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వేములవాడ పరిధిలో 40 భవనాలు ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయా యి. వీటిని ప్రారంభించి రెండేళ్లయినా నిర్మా ణాలు పూర్తి కాలేదని పలువురు వాపోతున్నారు. సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్, హుస్నాబాద్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,150 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో సొంతభవనా ల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు 298 ఉండగా, 422 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 368 అంగన్వాడీ కేంద్రాలు, 430 కేంద్రాలను అద్దె లేకుండా జీపీలు, కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లో తరచూ సమస్యలు తలెత్తుతుండడంతో అంగన్వాడీలు నడపలేకపోతున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అంగన్వాడీ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఎంజీ నరేగా, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (ఆర్ఐడీఎఫ్), ఏపీఐపీల ద్వారా నిధులు కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా పరిషత్ ఫండ్ నుంచి 15 శాతం, మండల పరిషత్ ఫండ్ నుంచి 15 శాతం తీర్మానాలు చేసి పరిమిత బిల్డింగ్‌లకు కేటాయిస్తుంటారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో రాష్ట్ర పరిధిలోని పంచాయతీరాజ్ ఏఈలు నిర్మాణ పనులు చేపడతారు. కొన్ని సందర్భాల్లో నిధులు విడుదలైనప్పటికీ అధికారుల అలసత్వం, నిధుల దుర్వినియోగంతో భవన నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకపోవడంతో కొన్ని మధ్యలోనే ఆగిపోతున్నాయని పలువురు అధికారులు చెబుతున్నారు. కాగా, అంగన్వాడీ కేంద్రాలకు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. -
అద్దె అవస్థలెన్నో..!
ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కల్గూడ 3వ అంగన్వాడీ కేంద్రానికి గత ఎనిమిది నెలల నుంచి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని రెండు రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రానికి తాళం వేశారు. కేంద్రానికి తాళం వేసి ఉండడంతో వచ్చిన గర్భిణులు, బాలింతలు బయటనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. భవనం అద్దె చెల్లించకపోతే కేంద్రానికి తాళం వేస్తామని పలుమార్లు యజమాని చెప్పడం జరిగింది. గత ఎనిమిది నెలల నుంచి అద్దె బిల్లులు నిలిపివేయడంతో సోమవారం వారు కేంద్రానికి తాళం వేశారు. బుధవారం కూడా అంగన్వాడీ కేంద్రం తెరుచుకోలేదు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే కేంద్రం తెరిచేదని ఇంటి యజమాని స్పష్టం చేసినట్లు ఆ కేంద్రం అంగన్వాడీ టీచర్ సాజిదఖానం తెలిపారు. గత వారం రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ అంగన్వాడీ కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ కేంద్రానికి సైతం ఎనిమిది నెలల అద్దె బకాయి ఉండడంతో ఆ భవన యజమానికి తాళం వేశారు. బేల మండల కేంద్రంలో అద్దె ఇంట్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రానికి అద్దె చెల్లించకపోవడంతో గత నెలరోజుల క్రితం ఆ కేంద్రానికి యజమాని తాళం వేశారు. భవనం అద్దెకు సంబంధించిన నిధులు విడుదల అయినప్పటికీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఈ కేంద్రానికి తాళం పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం జరుగుతున్నాయి. సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలు అద్దె ఇండ్లల్లో అవస్థల నడుమ కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అద్దె భవనాల బిల్లుల చెల్లింపులో ఆలస్యం చేస్తుండడంతో జిల్లాలోని కొన్ని కేంద్రాలకు తాళాలు పడ్డాయి. ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కల్గూడ అంగన్వాడీ కేంద్రం-3కి సంబం ధించి ఎనిమిది నెలల అద్దె బకాయి పడడంతో ఇంటి యజమానికి రెండు రోజుల క్రితం కేంద్రానికి తాళం వేశాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో జరుగుతూనే ఉన్నా అధికారులు మాత్రం స్పందించం లేదు. ప్రభుత్వం బిల్లులు విడుదల చేసినప్పటికీ కొంతమంది అధికారులు మాత్రం వాటిని సంబంధిత కేంద్రాలకు చెల్లించకుండా ‘మామూలు’గా వ్యవహరిస్తుండడంతో ఈ దుస్థితి నెలకొందనే ఆరోపణలు ఉన్నాయి. అద్దె ఇండ్లల్లో అవస్థలెన్నో... జిల్లాలో మొత్తం 1256 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 992 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 264 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆదిలాబాద్ అర్బన్‌లో 302 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, 40 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 150 సెంటర్లు అద్దె ఇండ్లల్లో కొనసాగుతున్నాయి. 39 అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లో, 67 గ్రామపంచాయతీ, ఇతర సంఘ భవనాల్లో నడుస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న 122 కేంద్రాల్లో ఒక్కదానికి కూడా సొంత భవనం లేకపోవడం గమనార్హం. బోథ్ ప్రాజెక్టు పరిధిలో 287 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 70కి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 86 కేంద్రాలు అద్దె ఇండ్లల్లో కొనసాగుతున్నాయి. 105 కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లో, 26 కేంద్రాలు గ్రామపంచాయతీ, ఇతర భవనాల్లో నడుస్తున్నాయి. జైనథ్ ప్రాజెక్టు పరిధిలో 261 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 57 సెంటర్లకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 95 కేంద్రాలు అద్దె గదుల్లో, 60 కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లో, 49 కేంద్రాలు ఇతర భవనాల్లో కొనసాగుతున్నాయి. నార్నూర్ ప్రాజెక్టు పరిధిలో 154 కేంద్రాలు ఉండగా, 32 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 75 కేంద్రాలు అద్దె భవనాల్లో, 23 కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లో, 24 కేంద్రాల్లో ఇతర భవనాల్లో నడుస్తున్నాయి. ఉట్నూర్ ప్రాజెక్టు పరిధిలో 252 కేంద్రాలు ఉండగా, 76 సొంత భవనాలు ఉన్నాయి. 78 కేంద్రాలు అద్దె ఇండ్లల్లో, 60 కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లో, 38 ఇతర భవనాల్లో నడుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1256 కేంద్రాల్లో కేవలం 275 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. అరకొర వసతుల మధ్య.. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం వెరసి ఏళ్ల తరబడి అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలకు నోచుకోకపోవడంతో ఇబ్బందిగా మారింది. అద్దె భవనాల్లో అంతంత మాత్రంగానే సౌకర్యాలు ఉన్నాయి. చాలా కేంద్రాలకు కనీసం గాలి, వెలుతురు సరిగా లేదు. చీకటి గదుల్లోనే కేంద్రాలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలోని కేంద్రాలకు రూ.3వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు రూ.750 చొప్పున అద్దె చెల్లిస్తోంది. భవనాలకు అద్దె చెల్లింపు విషయంలో కూడా నెలనెలా సక్రమంగా అందించిన సందర్భాలు లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 500-600 అడుగుల విస్తీర్ణంలో మూడు గదులు, తాగునీరు, ఫ్యాన్, మరుగుదొడ్లు, ఆట స్థలం ఉండాలి. అన్ని వసతులు ఉన్న మున్సిపాలిటీ పరిధిలోని భవనాలకు రూ.3వేలు, గ్రామాల్లోని భవనాలకు రూ.750 అద్దె చెల్లించాలి. అయితే చాలా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనసాగడం లేదు. పట్టణంలో ఒకటిరెండు గదుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఒక గదిలోనే కేంద్రాలు కొనసాగుతున్నాయి. చిన్నారులను ఒక గదిలో ఇరుకుగా కూర్చోబెట్టడం, వంటగది, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఫ్యాన్, కరెంట్ సదుపాయం కూడా సరిగా లేకపోవడంతో చిన్నారులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు కూడా అవస్థలకు గురవుతున్నారు. అద్దె చెల్లింపులో నిర్లక్ష్యం.. అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రైవేట్ భవనాలకు సకాలంలో అద్దె చెల్లించడం లేదు. నెలల తరబడి ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. యజమానుల ఒత్తిడితో కొంత మంది అంగన్వాడీలు తమ వేతనం నుంచి చెల్లిస్తున్నారు. అయితే 2017 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు కొన్ని కేంద్రాలకు బిల్లులు చెల్లించకపోవడంతో యజమానులు కేంద్రాలకు తాళం వేస్తున్నట్లు తెలుస్తోంది. గతనెల రోజుల క్రితం సెప్టెంబర్ 2017 నుంచి 2018 మార్చి వరకు బిల్లులను విడుదల చేసింది. కొంతమంది సీడీపీఓలు మాత్రమే కేంద్రాలకు బిల్లులు చెల్లించారు. మిగతా వారు చెల్లించకపోవడంతో ఆ కేంద్రాల అంగన్వాడీలకు ఇబ్బందులు తప్పడంలేదు. అయితే 2018 మార్చి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు ఇంటి యజమానుల అకౌంట్లోనే డబ్బులు జమ చేయనుండడంతో ఈ సమస్య తీరనుందని తెలుస్తోంది. పెండింగ్ బిల్లులు విడుదల చేశాం 2017 సెప్టెంబర్ నుంచి 2018 ఫిబ్రవరి వరకు పెండింగ్‌లో ఉన్న అద్దె భవనాల బిల్లులు విడుదలయ్యాయి. సంబంధిత సీడీపీఓలు డీడీలు తీసి అంగన్వాడీ టీచర్లకు చెల్లిస్తున్నారు. ఇప్పటికే చాలా కేంద్రాలకు బిల్లులు అందజేశాం. రెండుమూడు రోజుల్లో మిగతా వాటికి కూడా అందజేస్తాం. ఇక ఈ ఏడాది మార్చి నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇంటి యజమాని ఖాతాలో నేరుగా జమ చేయనున్నాం. జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు సొంత భవన నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఏజెన్సీ ప్రాంతంలో 23, మైదాన ప్రాంతంలో 66 భవనాలకు మాత్రమే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. - మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి -
కిరాయిదారులపై కన్నేయనందుకు... యజమానికి జైలు..!
సాక్షి, సిటీబ్యూరో: 2007 ఆగస్టు... హబ్సిగూడలోని బంజారా నిలయంలో మకాం వేసిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో పేలుళ్లకు పాల్పడి ఉడాయించారు. 2013 ఫిబ్రవరి... మరోసారి సిటీని టార్గెట్ చేసిన ఐఎం టెర్రరిస్టులు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని అద్దె ఇంట్లో షెల్టర్ తీసుకున్నారు. అదును చూసుకుని దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబులు పేల్చారు. 2013 డిసెంబర్... ముంబైకి చెందిన మోడల్‌ను ఈవెంట్ పేరుతో సిటీకి రప్పించిన కొందరు దుండగులు నిజాంపేటలోని అద్దె ఇంటికి తీసుకెళ్లి బంధించారు. ఆపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ మూడు సందర్భాల్లోనూ పోలీసులు టెనెంట్స్ (ఆయా ఇళ్లల్లో అద్దెకు ఉన్న వారు) వివరాలు సేకరించేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. కేవలం ఇవే కాదు... అద్దెకు దిగిన ముష్కరులు చేసిన నేరాలు, ఘాతుకాలకు సిటీలో కొదవే లేదు. దీంతో టెనెంట్స్ వాచ్ పక్కాగా అమలు చేయాలని, కిరాయిదారుల పూర్తి వివరాలు సేకరించడంతో పాటు పోలీసులకూ సమాచారం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఇప్పటికీ దీనిపై స్పష్టమైన విధానం అమలులోకి రాలేదు. దేశ రాజధానిలోనూ.. దేశ రాజధాని ఢిల్లీకి వలసల బెడద ఎక్కువ. ఉద్యోగం, చదువు, వైద్యం తదితర అవసరాల నిమిత్తం నిత్యం వేలాదిమంది అక్కడికి వెళ్తుంటారు. వీరంతా ఎక్కువగా అద్దె ఇళ్లల్లోనే నివసిస్తుంటారు. దీనిని అసాంఘిక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఉద్యోగాల ముసుగులో అద్దె ఇళ్లల్లో తిష్టవేసిన ముష్కరులు పేలుళ్లకు పాల్పడటం నుంచి ఇంటి యజమానులనే దోచుకోవడం, హత్యలు వంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఆయా సందర్బాల్లో పోలీసులు నిందితుల ఆచూకీ కనిపెట్టేందుకు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తోంది. అద్దెకు దిగి, నేరాలు చేసిన వారి వివరాలు యజమానుల వద్ద లేకపోవడంతో ఇప్పటికీ అనేక కేసులు కొలిక్కిరాలేదు. ఢిల్లీ పోలీసు సీరియస్.. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కొన్నేళ్ల క్రితమే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇళ్లను అద్దెకు ఇచ్చే యజమానులు కచ్చితంగా కిరాయిదారులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి, వాటిని స్థానిక పోలీసుస్టేషన్లో అందించాలని, పోలీసుల ద్దారా అద్దెకున్న వారిని వెరిఫై చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విచారణ నామమాత్రంగా కాకుండా అదనపు పోలీసు కమిషనర్ స్థాయి అధికారిచే చేయించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇళ్ల యజమానులు వీటిని పక్కాగా అమలు చేస్తున్నారా? లేదా? అనేది సరిచూసే బాధ్యతను బీట్ కానిస్టేబుళ్లకు అప్పగించారు. నిత్యం గస్తీ నిర్వహించే వీరు ఎవరైనా ఇంటి యజమానులు ఈ ఉత్తర్వులను ఉల్లంఘించారా? అనే అంశాన్ని పక్కాగా పరిశీలిస్తుంటారు. అడ్డంగా బుక్కైన నిరంజన్... తూర్పు ఢిల్లీలోని పాండవ్నగర్కు చెందిన నిరంజన్ మిశ్రా తన ఇంటిని నాలుగేళ్ల క్రితం కొందరికి అద్దెకు ఇచ్చారు. అప్పటి నుంచి వారి వివరాలు సేకరించడం, స్థానిక పోలీసుస్టేషన్లో అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. నెల రోజుల క్రితం పెట్రోలింగ్ విధుల్లో ఉన్న హెడ్–కానిస్టేబుల్ రాజ్‌కుమార్ దీనిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిరంజన్‌పై ఐపీసీలోని సెక్షన్ 188 (ప్రభుత్వ అధికారి ఆదేశాలను బేఖాతరు చేయడం) సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గత గురువారం నిరంజన్ను దోషిగా తేలుస్తూ నెల రోజుల జైలు శిక్ష విధించారు. ఈ నేపథ్యంలోనే నిరంజన్ చర్య క్షమించరానిదని వ్యాఖ్యానించారు. ఇకపై ప్రతి యజమాని కిరాయిదార్ల వివరాలు సేకరించడం తప్పనిసరని స్పష్టం చేశారు. నగరంలో అమలుకు దూరమే... సిటీలోనూ ఈ విధానం అమలు చేయాలని 2007 నుంచి పోలీసులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. నేరాల కోసం వస్తున్న ముష్కరులకు షెల్టర్ దొరక్కుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అమలులోకి రాలేదు. ఒకప్పుడు ప్రత్యేకంగా ‘టెనెంట్స్ వాచ్ ఫామ్’ దరఖాస్తులను రూపొందించి ఠాణాల వారీగా అందుబాటులో ఉంచేవారు. అప్పట్లో ఇంటి యజమానులు పోలీస్టేషన్‌కు వెళ్ళి వీటిని అందించాల్సి వచ్చేది. దీంతో అనేక మంది ఆసక్తి చూపడం లేదని భావించి పోలీసు అధికారిక యాప్ ‘హాక్ ఐ’లో లింకు ఇచ్చినా ఫలితం లేదు. ‘ఢిల్లీ తీర్పు’తో అయినా పోలీసులు తమ విధానాలు మార్చుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. టెనెంట్స్ వెరిఫికేషన్ విధానం కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే ప్రజా భద్రతా చట్టంలో సవరణలు చేసి ఈ అంశాన్ని చేర్చాలని కోరుతున్నారు. -
అద్దె భవనాల్లో కార్యాలయాలు
బోధన్‌టౌన్ : పట్టణంలోని వివిధ కాలనీల్లో అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతుండటంతో అడ్రస్ దొరకక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనాల్లో అధికారులు సైతం అరకొర వసతులతో అవస్థలు పడుతున్నారు. అద్దె భవనాలకు ప్రతినెల రూ.3 నుంచి రూ.4 వేల అద్దె చెల్లిస్తున్నారు. పట్టణంలోని రాకాసీపేట్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. గతంలో ఐసీడీఎస్, తూనికలు కొలతలు కొనసాగాయి. డివిజనల్ లేబర్ అధికారి కార్యాలయంలో గతంలో శక్కర్‌నగర్ చౌరస్తాలో ఉండేది. ప్రస్తుతం ఐసీడీఎస్ కార్యాలయంలో శక్కర్‌నగర్‌లోని కమ్యూనిటీ భవనంలోకి మార్చారు. లేబర్ అధికారి కార్యాయలాన్ని రాకాసీపేట్‌కు మార్చారు. తూనికలు కొలతల కార్యాలయం సరస్వతి నగర్ కాలనీకి మార్చారు. దీంతో కార్యాలయ అడ్రస్‌లు దొరకక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనాల్లో ఎక్సైజ్, తూనికలు కొలతలు, లేబర్, డివిజనల్ సహకార అధికారి కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో ఐసీడీఎస్, బీసీ సంక్షేమ, డివిజనల్ సహకార అధికారి శాఖ కార్యాలయాలు కమ్యూనిటీ భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ కార్యాలయాలకు సొంత భవనాలు లేక పోవడంతలో ఇళ్ల మధ్య ఉండడంతో ప్రజలు కార్యాలయాలు తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లేబర్ అధికారి కార్యాలయం అడ్రస్ దొరకదు పట్టణంలోని లేబర్ అధికారి కార్యాలయం శక్కర్‌నగర్ ప్రధాన రహదారి పక్కన ఉండేది. కార్యాలయం అడ్రస్ ఎవరిని అడిగినా చెప్పేవారు. లేబర్ డివిజనల్ అధికారి కార్యాలయానికి శాశ్వత భవనం లేకపోవడంతో రాకాసీపేట్‌లోని ఓ ఇంటిలో ఏర్పాటు చేశారు. అడ్రస్ తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలి. –ఖలీమ్, పట్టణ వాసి కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాలి ప్రభుత్వ కార్యాలయాలకు పనులకోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే వద్ద ఉండేలా చూడాలి. అద్దె భవనాలు కాకుండ శాశ్వత భవనాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – బి. మల్లేశ్, కార్మిక సంఘం నాయకుడు -
అద్దె భవనాలు కావలెను!
- 119 గురుకులాలకు లభించిన భవనాలు 55 మాత్రమే - ప్రారంభానికి ముంచుకొస్తున్న ముహూర్తం - తల పట్టుకుంటున్న బీసీ సంక్షేమాధికారులు సాక్షి, హైదరాబాద్: బీసీ గురుకులాలకు అద్దె భవనాలు లభించడంలేదు. మరోవైపు గురుకులాల ప్రారంభానికి ముహూర్తం ముంచుకొస్తోంది. 2017–18 విద్యాసంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా జ్యోతిభా పూలే వెనుకబడిన తరగతులు గురుకుల విద్యాసంస్థల సొసైటీ ద్వారా 119 గురుకుల పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటుకు భవనాలను గుర్తించే పనిలో పడ్డారు. జూన్ 12 నాటికి కొత్తగా ప్రారంభించే గురుకుల పాఠశాలలకు సకల వసతులు సిద్ధం చేయాలి. కనీసం రెండు నెలల ముందు భవనాలు లభిస్తే వాటికి సంబంధించి మరమ్మతులు, వసతుల కల్పనకు వీలుంటుంది. కానీ, కేవలం 55 భవనాలు మాత్రమే అద్దెకు లభించాయి. తాజాగా ప్రారంభించే గురుకులాల్లో 5,6,7 తరగతులు మాత్రమే ప్రారంభించనున్నారు. ఒక్కో తరగతికి రెండు సెక్షన్ల చొప్పున, ప్రతి సెక్షన్లో 40 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనుంది. మొత్తంగా మూడు తరగతుల్లో 240 మంది విద్యార్థుల కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనం అవసరం. 12 తరగతి గదులు, 12 డార్మెటరీలు, చాలినన్ని టాయిలెట్లు, స్నానపుగదులు, కిచెన్‌రూమ్, డైనింగ్ హాల్, లైబ్రరీ, ప్రిన్సిపాల్ చాంబర్, కార్యాలయ గది, స్టాఫ్ రూమ్, ఆటస్థలం ఇలా అన్ని సౌకర్యాలున్న భవనాల్లోనే వీటిని ఏర్పాటు చేయాలని నిబంధనలు విధించింది. అయితే, ఇంత కఠిన నిబంధనలతో కూడిన భవనాలు గ్రామీణ ప్రాంతాల్లో లభించడం కష్టమని అధికారులు అంటున్నారు. అక్కడలా.. ఇక్కడిలా...: గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు కాస్త దగ్గరగా ఉన్న భవనాలపై అధికారులు దృష్టి పెట్టారు. 20 వేల చదరపు అడుగులు ఒకే బిల్డింగ్‌లో కాకుండా రెండు లేదా మూడు భవనాలు ఉండేలా చూస్తున్నారు. ఈ మేరకు దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో భవనాలు లభించాయి.గ్రామీణ నియోజకవర్గాల్లో మాత్రం అద్దె భవనాల లభ్యత ఆశాజనకంగా లేదు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో అద్దెలు విపరీతంగా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చదరపు అడుగుకు రూ.3 చొప్పున మాత్రమే చెల్లించనుంది. కానీ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఈ ధరలకు అద్దె ఇళ్లు దొరకడంలేదు. -
అద్దె భవనాల్లో ‘ఎక్సైజ్’
► ఉమ్మడి జిల్లాలో సొంత భవనాలు, వాహనాలు కరువు ► ప్రతి నెల రూ.6 లక్షల అద్దె చెల్లింపులు ► మద్యం విక్రయాలపై రూ.60 కోట్ల ఆదాయం ► అయినా సౌకర్యాలు కరువు ఆదిలాబాద్: ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎక్సైజ్ శాఖ అద్దె భవనాల్లో కొనసాగుతోంది. ఆ శాఖ ఆదాయం నుంచే భవనాలు, వాహనాలకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరడమే గానీ.. ఆ శాఖకు పెద్దగా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో 157 మద్యం దుకాణాలు, 22 బార్లు ఉన్నాయి. వీటిలో మద్యం అమ్మకాల ద్వారా ప్రతి నెల రూ.60 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. దీనితోపాటు ఆయా కేసుల్లో పట్టుబడ్డ వాహనాలు, సీజ్ చేసిన మద్యం విక్రయాలతో కూడా రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. ఏ విధంగా చూసినా ప్రభుత్వానికి ఏదో ఒక రకంగా ఎక్సైజ్‌శాఖ నుంచి ఆదాయం వస్తూనే ఉంది. ప్రభుత్వం మాత్రం ఆ శాఖపై చిన్న చూపు చూస్తోంది. ఏ ఒక్క స్టేషన్, కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం గమనార్హం. తమ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం వస్తున్నప్పటికీ సరైన వసతులు, భవనాలు కల్పించకపోవడంపై ఆ శాఖలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రూ.లక్షల్లో అద్దె చెల్లింపు.. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ పట్టణంలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయంతోపాటు ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల్లో నాలుగు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలు, 11 ఎక్సైజ్ స్టేషన్లు ఆదిలాబాద్, ఇచ్చోడ, భైంసా, నిర్మల్, ఉట్నూర్, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల స్టేషన్ అద్దెల్లో కొనసాగుతున్నాయి. ప్రతి నెల ఒక్కో స్టేషన్‌కు రూ.6 వేల నుంచి 10 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. మొత్తం కలిపి సుమారు రూ.లక్ష అద్దె రూపంలో చెల్లించాల్సి వస్తోంది. వీటితోపాటు అన్ని స్టేషన్లు, డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్లకు కలిపి మొత్తం 20 అద్దె వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనానికి ప్రతి నెల రూ.24 వేలు చొప్పున మొత్తం రూ.4.80 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. మొత్తం భవనాలు, వాహనాల ద్వారా రూ.6 లక్షలను ఎక్సైజ్ శాఖ అద్దె రూపంలో చెల్లిస్తోంది. ఒక పక్క గుడుంబాపై దాడులు చేసి నిర్మూలించాలని, కల్తీకల్లు అరికట్టాలని, నాన్‌డ్యూటీపెయిడ్ లిక్కర్, దేశీదారును అడ్డుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నా.. క్షేత్రస్థాయిలో సిబ్బందికి అవసరమైన వాహనాలు కేటాయించడంలో శ్రద్ధ చూపడం లేదని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
అద్దె భవనాల్లో ఇంకెన్నాళ్లు?
► ఏళ్లుగా అద్దె భవనాల్లోనే అంగన్ వాడీ కేంద్రాలు ► మౌలిక వసతులు లేక ఇబ్బందులు ► పట్టించుకోని అధికారులు ఇల్లంతకుంట : మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులందరికి చదువుపై ఆసక్తిని పెంపొందించడంతోపాటు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్ వాడీ కేంద్రాలు అవస్థల నడుమ కొనసాగుతున్నాయి. మండలంలో 66 అంగన్ వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 30 సొంత భవనాలుండగా 14 కేంద్రాలు అద్దె ఇళ్లలో కొనసాగుతున్నాయి. 22 ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. అద్దె భవనంలో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కొన్ని గ్రామాల్లో పురాతన ఇళ్లలో కేంద్రాలు కొనసాగిస్తుండడంతో చిన్నపాటి వర్షం కురిసినా ఊరుస్తున్నాయి. రేపాక, అనంతగిరి, వల్లంపట్ల, ఓబులాపూర్, ఇల్లంతకుంట గ్రామాల్లోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల పరిస్థితి దయనీయంగా తయారైంది. అంగన్ వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ప్రతీరోజు భోజనంతోపాటు పౌష్టికాహాన్ని అందిస్తున్నారు. అద్దె భవనాల్లో కేంద్రాలు కొనసాగించడం ఇబ్బందికరంగా మారిందని అంగన్ వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. వసతులు సక్రమంగా లేకపోవడంతో పిల్లలను పంపేందుకు వారి తల్లిదండ్రులు భయపడుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. మౌలిక వసతులు కరువు కేంద్రాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలతోపాటు మంచినీటి సదుపాయాలు లేవు. దీంతో కార్యకర్తలు, ఆయాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో చోటు నుంచి నీళ్లు తీసుకొచ్చి కేంద్రాల్లో ప్రతీరోజు వంట చేయాల్సిన పరిస్థితి తయారైంది. ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని ప్రజలు, అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. -
అద్దె కేంద్రాలు
ఇబ్బందుల్లో అంగవాడీ కేంద్రాలు చిన్నారులకు తప్పని తిప్పలు ప్రతి నెలా అద్దె రాక అంగన్వాడీల అవస్థలు జిల్లాలో 969కి 499 కేంద్రాలు అద్దె భవనాల్లోనే సొంత భవనాల్లో కొనసాగుతున్నవి 220 మాత్రమే పిల్లలు తక్కువుంటే వచ్చే విద్యా సంవత్సరంలో సమీప కేంద్రాల్లో విలీనం! మంచిర్యాల టౌన్ : అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం ఓ వైపు ప్రకటిస్తోంది. కానీ వాస్తవంలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. మంచిర్యాల జిల్లాలో పలు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో ఎన్నో ఏళ్లుగా అద్దె భవనాల్లో నిర్వహించాల్సి వస్తోంది. ఇరుకు గదుల్లో ఇబ్బందుల మధ్య చిన్నారులు చదువు సాగించాల్సి వస్తోంది. అరకొర వసతులతో అద్దె భవనాలు సాగుతున్నాయి. పలు కేంద్రాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం మాటేమోగానీ ఎంతకాలం కొనసాగుతాయనే ప్రశ్న తలెత్తక మానదు. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల పరిధిలో 969 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 896 ప్రధానమైనవి కాగా, 73 మినీ కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ఇందులో 220 కేంద్రాలకు స్వంత భవనాలు ఉండగా, 250 వరకు ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన 499 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. సగానికి పైగా కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతుండడం ఐసీడీఎస్ దుస్థితిని తెలియజేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేదని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా మార్చే ప్రక్రియ మొదలు కావడం అనుమానమే. జిల్లాలో ఐదు ప్రాజెక్టులు గతంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖగా ఉన్న శాఖను జిల్లాల పునర్విభజన తరువాత వికలాంగ, వృద్ధుల సక్షేమ శాఖతో కలిపి విలీనం చేశారు. దీంతో ప్రస్తుతం ఇది స్త్రీ, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖగా పేరు మార్చి సేవలు అందిస్తోంది. జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా.. ఐదు ప్రాజెక్టులున్నాయి. మంచిర్యాల ప్రాజెక్టు పరిధిలో 243, చెన్నూరులో 248, లక్సెట్టిపేట్‌లో 200, బెల్లంపల్లిలో 165, తాండూరులో 107 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో ఆరేళ్ల పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, వన్డే ఫుల్‌మీల్, పూర్వ ప్రాథమిక విద్యాబోధన, వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియ, ఆరోగ్య పరీక్షలు మొదలైన సేవలందిస్తారు. బాల్య వివాహాలు అరికట్టడం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, వికలాంగులు సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు వారికి న్యాయపరమైన సహకారం అందించడం అంగన్వాడీ కార్యకర్తల విధి. ప్రస్తుతం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు 5,080 మంది, బాలింతలు 5,869, ఆరేళ్లలోపు చిన్నారులు 29,715 మంది ఉన్నారు. వీరికి అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించడం, పిల్లలకు చదువుపై ఆసక్తిని కలిగించడం, ఆటవస్తువులతో ఆడించడం అంగన్వాడీలకు కష్టంగా మారింది. అద్దె భవనాలతో అవస్థలు... జిల్లాలోని 969 అంగన్వాడీ కేంద్రాల్లో 499 కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 220 స్వంత భవనాల్లో కొనసాగగా, అద్దె భవనాల్లోని కేంద్రాలకు ప్రతి నెలా అద్దెను చెల్లించడం లేదు. దీంతో అంగన్వా డీ కార్యకర్తలు అద్దె కోసం ఇంటి యజమానుల నుంచి ప్రతి నెలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ఈజీఎస్ నుం చి నిధులను మంజూరు చేసినా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంలో జాప్యం జరుగుతోంది. రెండు మూడు నెలలకు ఒకసారి అద్దెను ప్రభుత్వం అందించడంతో అంగన్వాడీ కార్యకర్తలు వారి వేతనాల్లోంచి అద్దె చెల్లిం చి, ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఐసీడీఎస్ ద్వారా అందె అద్దె సైతం తక్కువగా ఉండడం, పట్టణ ప్రాంతాల్లో అద్దె ఎక్కువగా ఉండడంతో, తక్కువ అద్దెకు లభిస్తున్న ఇరుకైన చిన్న గదులు, శిథిలావస్థలో ఉన్న వాటిలోనే అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. చిన్నారులకు ప్రతిరోజూ పోషకాహారంతోపాటు ఆటపాటలతో కూడిన పూర్వప్రాథమిక విద్య అందించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు ఇరుకైన అద్దె భవనాల్లో అందించడం కష్టంగా మారింది. ఆటలకు చిన్నారులు దూరం అంగన్వాడీ కేంద్రాల్లో గది లోపల, ఆరుబయట ఆటలను ఆడించాల్సి ఉంటుంది. ఇందుకు గాను చిన్నారుల కోసం ప్రతి ఏడాది అన్ని కేంద్రాలకు క్రీడా సామగ్రిని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. గదిలోపల ప్లకార్డులు, చెక్కబొమ్మలు, పుష్పాలు, కథల పుస్తకాలు, వస్తువులు, రంగులను గుర్తించడం, అట్టముక్కలతో వాటిని తయారు చేయడం వంటివి పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. ఇక చిన్నారులకు శారీరక ఉల్లాసానికి ఆరుబయట ఆటలు ఆడేందుకు జారుడు బిల్ల, ఊయల, చెక్కబల్లలపై కూర్చుని ఆడుకునే వస్తువులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అద్దె భవనాలు ఇరుకుగా ఉండి, ఆరుబయట సరైన స్థలం లేక చిన్నారులకు ఆటలు ఆడుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. -
ఒక్కటుంటే ఒట్టు..!
• సొంత భవనాలు లేని ఆబ్కారీ శాఖ • ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే సాగుతున్న పాలన • ఏడాది నుంచి సాగుతున్న స్థలసేకరణ • ఓ కొలిక్కిరాని ప్రక్రియ • ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆబ్కారీ పోలీసు స్టేషన్లు – 16 • మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నవి – 05 ఆబ్కారీ శాఖకు సొంత భవనాలు కలగా మారాయి. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కచోట కూడా భవనం లేకపోవడం గమనార్హం. ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్యే పాలన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం తెస్తున్న శాఖలో ప్రభుత్వం వసతుల కల్పనకు చొరవ చూపకపోవడం శాపంగా మారింది. మహబూబ్‌నగర్ క్రైం : జిల్లా అబ్కారీ శాఖ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వసతులు లేక ఏళ్ల నుంచి సిబ్బంది ఇబ్బందులు మధ్యేవిధులు నిర్వహిస్తున్నారు. నిందితులకు సరైన పోలీస్ స్టేషన్స్ లేకపోవడంతో వారిని వ్యక్తిగత పూచీకత్తుపై పంపించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈశాఖలో గత పదేళ్లలో 15రెట్ల ఆదాయం పెరిగింది. రెండు మూడేళ్లుగా మద్యం అమ్మకాల్లో అవిభాజ్య మహబూబ్‌నగర్ జిల్లా రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంది. అయినా అద్దె భవనాలు, అరకొర సిబ్బందే దిక్కవుతోంది. జిల్లాలు విడికపోకముందు నుంచే ఆబ్కారీ శాఖ పరిపాలనా సౌలభ్యం కోసం మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్ మూడు డివిజన్లుగా ఉండేది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16ఆబ్కారీ పోలీసు స్టేషన్లున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 5పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటితో పాటు ఒక పాటు ఒక డీసీ, ఈఎస్, ఏఈసీ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో అధికారులుండే భవనాలు కూడా అద్దె భవనాలలోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో రెండు జిల్లాలో అబ్కారీ శాఖలో అధిక మొత్తంలో ఆదాయం ఇచ్చే అబ్కారీ శాఖ సిబ్బందికి.. ఉన్నత అధికారులకు కనీస వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్ల నుంచి సరైన వసతులు లేక సిబ్బంది అద్దె భవనాల్లో విధులు నిర్వహిస్తున్నారు. సొంత భవనాల నిర్మాణానికి కొంతకాలం నుంచి ఉన్నతాధికారులు సైతం సుముఖంగా ఉండటంతో స్టేషన్ల నిర్మాణానికి అవసరం అయిన స్థలాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరారు. ఇప్పటివరకు ఈ పక్రియ పూర్తి కాలేదు. నూతనంగా ఒకటి ఆవిర్భావం గతంలో ఆత్మకూర్‌లో ఉన్న ఆబ్కారీ స్టేషన్ స్థానంలో కొత్తగా మక్తలో నిర్మాణం చేయాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అవసరం అయిన ప్రతిపాదనలు ఉన్నత అధికారులకు పంపిచారు. అద్దె భవనాల్లో అవస్థలు ఉమ్మడి జిల్లాలోని ఎక్సైజ్ శాఖకు ఒక్క పోలీస్ స్టేషన్‌కు కూడా సొంత భవనం లేదు. ప్రస్తుతం అన్నీ అద్దె భవనల్లోనే కొనసాగుతున్నాయి. వసతులు సరిగ్గా లేకపోయినా సిబ్బంది, ఉన్నదాంట్లో సర్దుకొని పనిచేస్తూ వెళ్తున్నారు. జిల్లాలో ఒక ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలతో పాటు మూడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ల కార్యాలయాలు 16ఎక్సైజ్ పోలీస్ స్టేషన్స్ అన్నికూడా అద్దె భనవల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి ప్రతి నెలా రూ.లక్షా 50వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఈ భనవాలు పోలీసు స్టేషన్ల నిర్వహణకు అనువుగా లేవు. కనీసం సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి, నిందితులను రిమాండ్‌కు తరలించే సమయంలో పోలీస్ స్టేషన్లో ఉంచడానికి కూడా వసతులు లేవు. దీంతో కొన్నిచోట్ల నిందితులను వ్యక్తి గతపూచీకత్తుపై రాత్రి వెళ్లి, ఉదయం తిరిగి వచ్చేలా వివరాలు నమోదు చేసుకొని పంపించేస్తున్నారు. సీజ్ చేసిన వాహనాలను నిలిపేందుకు కూడా స్థలం లేదు. 1996జనాభా లెక్కల ప్రకారం ప్రతి స్టేషన్‌కు 2000చదరపు అడుగుల స్థలానికి అనుమతి ఇచ్చారు. మరింత కఠినం జిల్లా నాలుగు ఎక్సైజ్ చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది పరిస్ధితి మరీ దయనీయంగా ఉంది. కనీసం కూర్చోవడానికి గది కూడా ఉండదు. తాత్కాలికంగా టెంట్ వేసుకుని ఎండలో విధులు నిర్వహిస్తున్నారు. రాత్రివేళ నిద్రపోవడానికి కూడా సరైన వసతులు లేవు. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న టెంట్లో నేలపై పడుకుంటున్నారు. ఒక్కోపారి విషపురుగుల కాటుకు గురవుతున్నారు. వసతులు లేని కారణంగా ఇక్కడ పని చేసేందుకు సిబ్బంది ఆసక్తి చూపడంలేదు. భారీ ఆదాయం జిల్లా అబ్కారీ శాఖ నుంచి ప్రతి ఏడాది రూ.500కోట్ల నుంచి రూ.800కోట్ల వరకు ప్రభుత్వనికి ఆదాయం సమకూరుతోంది. రెవెన్యూతో పాటు అదనంగా లైసెన్స్‌ల రూపంలో ఫీజులు కూడా చేరుతున్నాయి. ఏటా ఆబ్కారీ శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్నా ఆ శాఖ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా వెచ్చించడం లేదన్నా ఆరోపణలున్నాయి. భూములు గుర్తించడం లేదు ఆబ్కారీ శాఖ కోసం భూములు ఇవ్వాలని గతంలో పనిచేసిన ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ కలెక్టర్‌కు లేఖ రాశారు. దీనిపై అప్పటి కలెక్టర్ టి.కె శ్రీదేవి స్పందించి వెంటనే స్ధలాలు ఎక్సైజ్ పోలీసులకు చూపించాలని ఆర్డీఓలు, తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో స్థలాల గుర్తింపు ప్రక్రియ వేగవంతం కావడంలేదు. జిల్లాలో ఆత్మకూర్, జడ్చర్ల మినహ మిగితా పోలీస్ స్టేషన్లకు ఇప్పటి వరకు స్థలం చూపించలేదు. జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్స్‌కు, ఈఎస్ కార్యాలయానికి, డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి స్ధలం ఇవ్వలేదు. జిల్లాలో పనిచేస్తున్న ఎక్సైజ్ ఉన్నత అధికారులు సైతం వారి ఉన్నతాధికారుల వద్ద పోలీసు స్టేషన్ల నిర్మాణాల కోసం ధైర్యం చేసి డబ్బులు అడగటంలేదు. స్ధలసేకరణ పూర్తి అయితే ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులు విడుదల చేయించుకునే అవకాశం ఉంది. -
ఇరుకు గదుల్లో బాల్యం
సగానికిపైగా అంగన్వాడి కేంద్రాలు అద్దె కొంపల్లోనే ఏళ్ల తరబడి నిర్మాణం పూర్తికాని 309 భవనాలు వాటిని పట్టించుకోకుండా కొత్తగా 691 భవనాలు మంజూరు 225 చోట్లే అందుబాటులో స్థలాలు అంచనా వ్యయం రూ.12.50 లక్షలు.. ఇచ్చింది ఏడు లక్షలు ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులు ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి లోపం.. శాఖల మధ్య కొరవడిన సమన్వయం అంగన్వాడీ చిన్నారులకు శాపంగా మారింది. అద్దె కొంపలు.. ఇరుకు గదులు.. శిథిల భవనాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది. ఆర్భాటంగా శంకుస్థాపనలు చేయడం.. ఆనక నిధులు చాల్లేదని మధ్యలోనే అర్ధతరంగా నిలిపేయడం పరిపాటిగా మారింది. గత అనుభవాలను పట్టించుకోకుండా జిల్లా యంత్రాంగం మరోమారు అరకొర నిధులతో అంగన్వాడీ భవనాలు నిర్మిం చేందుకు సిద్ధమవుతోంది. విశాఖపట్నం: ముఖ్యంగా ఉపాధి హామీ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల తీరు వల్ల వందలాది అంగన్వాడీ భవనాలు పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయి ఎందుకూ కొరగాకుండా తయారయ్యాయి. జిల్లాలో 4952 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 3587 మెయిన్, 1365 మినీకేంద్రాలున్నాయి. మెయిన్ కేంద్రాల్లో 1071 సెంటర్లకు సొంత భవనాలు ఉన్నాయి. 592 కేంద్రాలు ఎలాంటి అద్దె లేని ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. మరో 1924 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. ఇక మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఏ ఒక్క దానికి సొంత భవనం లేదు. వీటిలో చాలా కేంద్రాలు పూరిపాకల్లో నెట్టుకొస్తున్నారు. ఏళ్ల తరబడి మొండిగోడలకే పరిమితం ఆర్ఐడీఎఫ్, ఏపీఐపీ, అప్గ్రేడేషన్ల వంటి పథకాల కింద గతంలో 981 భవనాలు మంజూరు కాగా వాటిలో 387 మాత్రమే పూర్తయ్యాయి. 285 భవనాల పనులు కనీసం ప్రారంభానికి కూడా నోచుకోలేదు. 309 భవనాల నిర్మాణాలను అర్ధంతరంగా నిలిపేశారు. అప్పట్లో ఒక్కో భవనం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణాలు చేపట్టగా, నిధుల లేమితో మధ్యలో నిలిచిపోయి ఏళ్ల తరబడి మొండిగోడలకే పరిమితమయ్యాయి. వీటిని పూర్తిచేసేందుకు ఐసీడీఎస్ అధికారులు ఎంతగా ఒత్తిడి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతోంది. నిధుల లేమి.. స్థలాల కొరత తాజాగా జిల్లాకు కొత్తగా 691 భవనాలు మంజూరు కాగా.. వాటిలో 346 భవనాల నిర్మాణానికి నిధులు కూడా మంజూరయ్యాయి. ఓ పక్క స్థలాల కొరత.. మరో పక్క నిధుల కొరతే వీటికి శాపంగా మారింది. కనీసం నాలుగు సెంట్లు కూడా లేకుండా భవనాలు నిర్మించే అవకాశం లేదు. కొత్తగా మంజూరైన భవనాల కోసం స్థలాలు చూపించాల్సిందిగా పంచాయతీ కార్యదర్శులను కోరినా ప్రయోజనం లేకుండా ఉంది. కేవలం 225 కేంద్రాలకు మాత్రమే చాలినంత స్థలం అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. మిగిలిన చోట్ల స్థలాల కొరత పీడిస్తోంది. మరో పక్క కనీసం రూ.12 లక్షలు అంచనా వ్యయంతో చేపడితే కానీ ఈ భవనాల నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి లేదు. కానీ ఉపాధి హామీ కాంపొనెంట్ నిధుల నుంచి రూ.5 లక్షలు, ఐసీడీఎస్ నుంచి రూ.2 లక్షల చొప్పున కేటాయిస్తున్నారు. ఈ నిధులు ఏ మూలకూ సరిపోవని అధికారులు చెబుతున్నారు. మరో రూ.3 లక్షలు జెడ్పీ నుంచి సపోర్టు ఇవ్వాల్సిందిగా కోరినప్పటికీ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకు కేటాయిస్తుండడంతో జెడ్పీ కూడా నిధుల కొరతతో ఇబ్బందిపడుతోంది. దీంతో ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది. దీంతో ఎన్ఆర్ఐల ద్వారా విరాళాలు సమీకరించి కనీసం రూ.10 లక్షలతోనైనా భవన నిర్మాణం చేపట్టాలని ఐసీడీఎస్ అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరులో ఈ విధంగా ఓ ఎన్ఆర్ఐ సంస్థ అంగన్వాడీ భవనాల నిర్మాణానికి అదనపు ఆర్థిక సాయం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఆ సంస్థ ద్వారా జిల్లాలో అర్ధంతరంగా నిలిచిన భవనాలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు కూడా అవసరమైన ఆర్థికసాయం కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
అవస్థల హాస్టల్
ఇరుకు గదులే శరణ్యం 104మంది బాలికలకు ఐదే బాత్రూమ్లు పట్టించుకోని బీసీ సంక్షేమ శాఖ ఎంవీపీ కాలనీ: బీసీ బాలికల వసతిగృహాన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. మొత్తం 104 మంది విద్యార్థినులకు ఐదే బాత్రూంలున్నాయి. వీరందరి వసతికి ఐదు గదులే ఉన్నాయి. నెలకు రూ.17 వేలు అద్దె చెల్లిస్తున్నారు. ప్రభుత్వం చదరపు అడుగుకు కేవలం రూ.7 మాత్రమే కేటాయించడంతో అద్దె భవనాలు దొరకని దుస్థితి నెలకొంది. ఈ వసతిగృహంలో వందమందికిగాను 104 మంది విద్యార్థినులు ఉంటున్నారు. వీరు నగరంలోని ఏఎస్‌రాజా, వీఎంసీ మహిళావిద్యాపీఠ్, డాక్టర్ వీఎస్ కృష్ణా, బుల్లయ్య, ప్రభుత్వ మహిళా కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి కోర్సులు చదువుతున్నారు. ఇక్కడ కేవలం ఐదు బాత్రూమ్లు మాత్రమే వుండడంతో కళాశాలలకు సకాలంలో చేరుకోలేకపోతున్నామని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. గదులు కూడా ఇరుగ్గా ఉండడంతో చదువుకోవడానికి అవస్థలు పడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ప్రభుత్వ వసతి గృహాలలో సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం, పోలీసులు లాఠీలకు పని చెప్పడం తెలిసిందే. అయినప్పటికీ బీసీ సంక్షేమశాఖ అధికారులు హాస్టల్ సమస్యలు పరిష్కరించిన పాపాన పోవడం లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అద్దెలు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో భవన యజమానులు ఖాళీ చేయమంటున్నారని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. హాస్టల్లో చదువుకునే వాతావరణం లేకపోవడంతో మార్కులు తక్కువగా వస్తున్నాయని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. సొంత ఊరు, తల్లిదండ్రులకు దూరంగా వచ్చి అవస్థలు పడుతున్నామని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో గదిలో 21 మంది పడుకోవలసిన పరిస్ధితి నెలకొంది. దుస్తులు, బ్యాగులు ఉంచడానికి స్థలం లేక ఒక చిన్న గదిలో విద్యార్థినుల దుస్తులు ఉంచడంతో అక్కడ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అండగా ఉంటున్నామని చెబుతోంది. ఇక్కడ హాస్టల్స్‌లో ఆ పరిస్థితి లేకపోవడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా బీసీ సంక్షేమశాఖ అధికారులు స్పందించి సొంత భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
అద్దె భవనాల్లో ఐటీఐ
- సొంత భవనాలు సమకూరేదెన్నటికో? - 2013లో స్థలం కేటాయింపు - 4.60 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదన కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ కళాశాల ఏర్పాటై 18 ఏళ్లయినా సొంత భవనాలు సమకూరలేదు. 1997 నుంచి 2001 వరకు ఆర్ట్స్ కళాశాల సమీపంలో అద్దె భవనాల్లో సాగించారు. ఆ తరువాత బాలాజీ నగర్‌లోని ఐటీఐ వద్ద గల డీఎల్టీ సీ ఐటీఐలోని భవనాల్లోకి తరలించారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. అవి కూడా బాగా దెబ్బతిని అంత సౌకర్యంగా ఉండటం లేదని పలువురు విద్యార్థులు తెలిపారు. 2013లో స్థలం కేటాయింపు: ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ కోసం 2013లో ప్రభుత్వం 4 ఎకరాల 97 సెంట్ల స్థ లాన్ని రిమ్స్ సమీపంలో కేటాయిం చిం ది. అందులో భవనాలను, కార్యాలయా న్ని నిర్మించేందుకు అప్పట్లో 4,60 కోట్ల తో ప్రతిపాదనలు కూడా పంపారు. కానీ అప్పటి నుంచి నేటి వరకు ఆ ఊసే లేదు. మళ్లీ ఏడాది క్రితం ఏపీడబ్లూ డీసీ వాళ్లకు మళ్లీ కూడా ప్రతిప్రాదనలు పంపారు. కానీ స్పందనమాత్రం లేదు. సొంత నిధులు ఉన్నా: ప్రభుత్వ మైనార్టీ ఐటీఐకి దాదాపుగా రెండున్నర కోట్లు నిధులు ఉన్నట్లు తెలిసింది. సంబంధిత నిధులను కూడా కళాశాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంది. కానీ దీనిని గురించి ప్రభుత్వమే పట్టింకకోకపొతే వారు కూడా మిన్నకుండి పోయినట్లు తెలిసింది. కోర్సుల వివరాలు: ప్రభుత్వ మైనార్టీ కళాశాలలో ఐదు రకాల కోర్సులు ఉన్నాయి. ఎలక్ట్రికల్, పిట్టర్, మోటర్‌మోకానిక్‌కు సంబంధించిన కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులకు రెండేళ్ల కాలపరిమితి ఉండగా డీజల్‌మోకానికల్, కంప్యూటర్ అపరేటర్‌కు మాత్రం ఏడాది మాత్రమే కోర్సుకు కాల పరిమితి. ఈ కళాశాలలో 136 మంది విద్యార్థులు చేరే సౌలభ్యం ఉంది. కానీ అప్పట్లో సమైకాంధ్ర ఉద్యమం వల్ల విద్యార్థులు అడ్మిషన్లు తక్కువగా జరిగినట్లు తెలిసింది. ఈ ప్రభుత్వమైనా స్పందించాలి: మైనార్టీ ఐటీఐ భవనాల నిర్మాణం విషయంలో ఇప్పటి ప్రభుత్వమైనా స్పందిం చాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. స్థలం కేటాయించి కూడా ఏడాదినన్నర కాలం కావస్తుందన్నారు. సంబంధిత విషయంలో అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఉద్యోగావకాశాలు: ప్రస్తుతం టెక్నికల్‌కు సంబంధించి మం చి డిమాండ్ ఉంది. ప్రైవేటు కంపెనీల్లో ఐటీఐ అభ్యర్థులకు మంచి ఆదరణ ఉం ది. దీనికి తోడు కళాశాల వారే క్యాంపస్ ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవలే బెంగుళూరుకు చెందిన ఓ కంపెనీ వారు క్యాంపస్ ఇంట ర్వ్యూను నిర్వహించి పలువురికి ఉద్యోగావకాశాలను కల్పించింది. కనుక ప్రతి ఒక్కరూ సంబంధిత విషయాన్ని గమనించి ఐటీఐలో చేరితే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. -
అంగన్వాడీ కేంద్రాలకు అద్దె కష్టాలు
మూడు నెలలుగా అందని రూ.12 కోట్ల బకాయిలు కేంద్రాలను ఖాళీ చేయమంటున్న భవనాల యజమానులు లబోదిబోమంటున్న కార్యకర్తలు హైదరాబాద్: నిన్నటిదాకా వేతనాలు అందక నానా అవస్థలు పడిన అంగన్వాడీ కార్యకర్తల (వర్కర్ల)కు తాజాగా అద్దె కష్టాలు మొదలయ్యాయి. అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలన్నింటికీ గత మూడు నెలలుగా సర్కారు అద్దె చెల్లించకపోవడంతో, ఆయా కేంద్రాలను ఖాళీ చేయాలంటూ భవనాల యజమానులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో అద్దె సొమ్ము రాక, భవన యజమానులకు సర్దిచెప్పలేక కార్యకర్తలు సతమతమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో యజమానుల ఒత్తిడి తట్టుకోలేక కార్యకర్తలే తమ వేతనాలను అద్దె బకాయిలకు జమ చేస్తున్నారు. మున్ముందు ఇదే కొనసాగితే ఏం చేయాలని వాపోతున్నారు. మూడొంతులు అద్దె భవనాలే సొంత భవనాలు లేకపోవడంతో సగానికి పైగా అంగన్వాడీ కేంద్రాలకు ఇక్కట్లు తప్పడం లేదు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,334 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 31,606 ప్రధాన కేంద్రాలు కాగా. మరో 3,728 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. మొత్తం 8,512 కేంద్రాలకే (24 శాతం) సొంత భవనాలు ఉండగా న్నాయి. మిగిలిన 76 శాతం కేంద్రాలకు అద్దె భవనాలే దిక్కయ్యాయి. 7,326 కేంద్రాలు వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన భవనాల్లో (తాత్కాలిక షెల్టర్) నడుస్తుండగా, 19,496 కేంద్రాలకు మాత్రం ప్రైవేటు భవనాలే దిక్కయ్యాయి. ఆయా ప్రాంతాలను బట్టి ఒక్కో కేంద్రానికి కనిష్టంగా రూ.750, గరిష్టంగా రూ.5,000 వరకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. వీటికి నెలకు సుమారుగా రూ.4 కోట్లు అద్దె ఉండగా, గత మూడు నెలల నుంచి చెల్లించకపోవడంతో బకాయిలు రూ.12 కోట్లకు చేరినట్లు తెలిసింది. నేరుగా యజమానులకే చెల్లిస్తాం అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్న భవనాల యజమానులకే నేరుగా అద్దె చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ విభాగం ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భవనాల యజమానులకు సంబంధించిన బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డుల వివరాలను సేకరిస్తున్నందునే అద్దె చెల్లింపులో జాప్యం జరిగినట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇదిలాఉంటే.. భవనాలను అద్దెకు ఇచ్చిన యజమానులు తమ బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారని కొందరు కార్యకర్తలు వాపోతున్నారు. సర్కారు ఇవ్వకున్నా ఇప్పటివరకు తామే అద్దె చెల్లించినందున, గత మూడు నెలల బకాయిలను నేరుగా తమకే ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.