ఒక్కటుంటే ఒట్టు..!
• సొంత భవనాలు లేని ఆబ్కారీ శాఖ
• ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే సాగుతున్న పాలన
• ఏడాది నుంచి సాగుతున్న స్థలసేకరణ
• ఓ కొలిక్కిరాని ప్రక్రియ
• ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆబ్కారీ పోలీసు స్టేషన్లు – 16
• మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నవి – 05
ఆబ్కారీ శాఖకు సొంత భవనాలు కలగా మారాయి. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కచోట కూడా భవనం లేకపోవడం గమనార్హం. ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్యే పాలన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం తెస్తున్న శాఖలో ప్రభుత్వం వసతుల కల్పనకు చొరవ చూపకపోవడం శాపంగా మారింది.
మహబూబ్‌నగర్ క్రైం :
జిల్లా అబ్కారీ శాఖ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వసతులు లేక ఏళ్ల నుంచి సిబ్బంది ఇబ్బందులు మధ్యేవిధులు నిర్వహిస్తున్నారు. నిందితులకు సరైన పోలీస్ స్టేషన్స్ లేకపోవడంతో వారిని వ్యక్తిగత పూచీకత్తుపై పంపించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈశాఖలో గత పదేళ్లలో 15రెట్ల ఆదాయం పెరిగింది. రెండు మూడేళ్లుగా మద్యం అమ్మకాల్లో అవిభాజ్య మహబూబ్‌నగర్ జిల్లా రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంది. అయినా అద్దె భవనాలు, అరకొర సిబ్బందే దిక్కవుతోంది. జిల్లాలు విడికపోకముందు నుంచే ఆబ్కారీ శాఖ పరిపాలనా సౌలభ్యం కోసం మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్ మూడు డివిజన్లుగా ఉండేది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16ఆబ్కారీ పోలీసు స్టేషన్లున్నాయి.
ప్రస్తుతం జిల్లాలో 5పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటితో పాటు ఒక పాటు ఒక డీసీ, ఈఎస్, ఏఈసీ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో అధికారులుండే భవనాలు కూడా అద్దె భవనాలలోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో రెండు జిల్లాలో అబ్కారీ శాఖలో అధిక మొత్తంలో ఆదాయం ఇచ్చే అబ్కారీ శాఖ సిబ్బందికి.. ఉన్నత అధికారులకు కనీస వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్ల నుంచి సరైన వసతులు లేక సిబ్బంది అద్దె భవనాల్లో విధులు నిర్వహిస్తున్నారు. సొంత భవనాల నిర్మాణానికి కొంతకాలం నుంచి ఉన్నతాధికారులు సైతం సుముఖంగా ఉండటంతో స్టేషన్‌ల నిర్మాణానికి అవసరం అయిన స్థలాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరారు. ఇప్పటివరకు ఈ పక్రియ పూర్తి కాలేదు.
నూతనంగా ఒకటి ఆవిర్భావం
గతంలో ఆత్మకూర్‌లో ఉన్న ఆబ్కారీ స్టేషన్ స్థానంలో కొత్తగా మక్తలో నిర్మాణం చేయాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అవసరం అయిన ప్రతిపాదనలు ఉన్నత అధికారులకు పంపిచారు.
అద్దె భవనాల్లో అవస్థలు
ఉమ్మడి జిల్లాలోని ఎక్సైజ్ శాఖకు ఒక్క పోలీస్ స్టేషన్‌కు కూడా సొంత భవనం లేదు. ప్రస్తుతం అన్నీ అద్దె భవనల్లోనే కొనసాగుతున్నాయి. వసతులు సరిగ్గా లేకపోయినా సిబ్బంది, ఉన్నదాంట్లో సర్దుకొని పనిచేస్తూ వెళ్తున్నారు. జిల్లాలో ఒక ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలతో పాటు మూడు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ల కార్యాలయాలు 16ఎక్సైజ్ పోలీస్ స్టేషన్స్ అన్నికూడా అద్దె భనవల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి ప్రతి నెలా రూ.లక్షా 50వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు.
ఈ భనవాలు పోలీసు స్టేషన్‌ల నిర్వహణకు అనువుగా లేవు. కనీసం సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి, నిందితులను రిమాండ్‌కు తరలించే సమయంలో పోలీస్ స్టేషన్‌లో ఉంచడానికి కూడా వసతులు లేవు. దీంతో కొన్నిచోట్ల నిందితులను వ్యక్తి గతపూచీకత్తుపై రాత్రి వెళ్లి, ఉదయం తిరిగి వచ్చేలా వివరాలు నమోదు చేసుకొని పంపించేస్తున్నారు. సీజ్ చేసిన వాహనాలను నిలిపేందుకు కూడా స్థలం లేదు. 1996జనాభా లెక్కల ప్రకారం ప్రతి స్టేషన్‌కు 2000చదరపు అడుగుల స్థలానికి అనుమతి ఇచ్చారు.
మరింత కఠినం
జిల్లా నాలుగు ఎక్సైజ్ చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది పరిస్ధితి మరీ దయనీయంగా ఉంది. కనీసం కూర్చోవడానికి గది కూడా ఉండదు. తాత్కాలికంగా టెంట్ వేసుకుని ఎండలో విధులు నిర్వహిస్తున్నారు. రాత్రివేళ నిద్రపోవడానికి కూడా సరైన వసతులు లేవు. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న టెంట్‌లో నేలపై పడుకుంటున్నారు. ఒక్కోపారి విషపురుగుల కాటుకు గురవుతున్నారు. వసతులు లేని కారణంగా ఇక్కడ పని చేసేందుకు సిబ్బంది ఆసక్తి చూపడంలేదు.
భారీ ఆదాయం
జిల్లా అబ్కారీ శాఖ నుంచి ప్రతి ఏడాది రూ.500కోట్ల నుంచి రూ.800కోట్ల వరకు ప్రభుత్వనికి ఆదాయం సమకూరుతోంది. రెవెన్యూతో పాటు అదనంగా లైసెన్స్‌ల రూపంలో ఫీజులు కూడా చేరుతున్నాయి. ఏటా ఆబ్కారీ శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్నా ఆ శాఖ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా వెచ్చించడం లేదన్నా ఆరోపణలున్నాయి.
భూములు గుర్తించడం లేదు
ఆబ్కారీ శాఖ కోసం భూములు ఇవ్వాలని గతంలో పనిచేసిన ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ కలెక్టర్‌కు లేఖ రాశారు. దీనిపై అప్పటి కలెక్టర్ టి.కె శ్రీదేవి స్పందించి వెంటనే స్ధలాలు ఎక్సైజ్ పోలీసులకు చూపించాలని ఆర్డీఓలు, తహసీల్దార్‌లకు ఆదేశాలు ఇచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో స్థలాల గుర్తింపు ప్రక్రియ వేగవంతం కావడంలేదు. జిల్లాలో ఆత్మకూర్, జడ్చర్ల మినహ మిగితా పోలీస్ స్టేషన్‌లకు ఇప్పటి వరకు స్థలం చూపించలేదు. జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్స్‌కు, ఈఎస్ కార్యాలయానికి, డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి స్ధలం ఇవ్వలేదు. జిల్లాలో పనిచేస్తున్న ఎక్సైజ్ ఉన్నత అధికారులు సైతం వారి ఉన్నతాధికారుల వద్ద పోలీసు స్టేషన్‌ల నిర్మాణాల కోసం ధైర్యం చేసి డబ్బులు అడగటంలేదు. స్ధలసేకరణ పూర్తి అయితే ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులు విడుదల చేయించుకునే అవకాశం ఉంది.