అద్దె భవనాల్లో ‘ఎక్సైజ్‌’ | excise in Rental buildings | Sakshi
Sakshi News home page

అద్దె భవనాల్లో ‘ఎక్సైజ్‌’

Published Fri, Mar 31 2017 5:28 PM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM

అద్దె భవనాల్లో ‘ఎక్సైజ్‌’ - Sakshi

అద్దె భవనాల్లో ‘ఎక్సైజ్‌’

► ఉమ్మడి జిల్లాలో సొంత భవనాలు, వాహనాలు కరువు
► ప్రతి నెల రూ.6 లక్షల  అద్దె చెల్లింపులు
► మద్యం విక్రయాలపై రూ.60 కోట్ల ఆదాయం
► అయినా సౌకర్యాలు కరువు

ఆదిలాబాద్‌: ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎక్సైజ్‌ శాఖ అద్దె భవనాల్లో కొనసాగుతోంది. ఆ శాఖ ఆదాయం నుంచే భవనాలు, వాహనాలకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఎక్సైజ్‌ శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరడమే గానీ.. ఆ శాఖకు పెద్దగా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో 157 మద్యం దుకాణాలు, 22 బార్లు ఉన్నాయి. వీటిలో మద్యం అమ్మకాల ద్వారా ప్రతి నెల రూ.60 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. దీనితోపాటు ఆయా కేసుల్లో పట్టుబడ్డ వాహనాలు, సీజ్‌ చేసిన మద్యం విక్రయాలతో కూడా రూ.కోట్లలో ఆదాయం వస్తోంది.

ఏ విధంగా చూసినా ప్రభుత్వానికి ఏదో ఒక రకంగా ఎక్సైజ్‌శాఖ నుంచి ఆదాయం వస్తూనే ఉంది. ప్రభుత్వం మాత్రం ఆ శాఖపై చిన్న చూపు చూస్తోంది. ఏ ఒక్క స్టేషన్, కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం గమనార్హం. తమ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం వస్తున్నప్పటికీ సరైన వసతులు, భవనాలు కల్పించకపోవడంపై ఆ శాఖలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

రూ.లక్షల్లో అద్దె చెల్లింపు..
ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్‌ పట్టణంలో డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంతోపాటు ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల్లో నాలుగు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాలు, 11 ఎక్సైజ్‌ స్టేషన్‌లు ఆదిలాబాద్, ఇచ్చోడ, భైంసా, నిర్మల్, ఉట్నూర్, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల స్టేషన్‌ అద్దెల్లో కొనసాగుతున్నాయి. ప్రతి నెల ఒక్కో స్టేషన్‌కు రూ.6 వేల నుంచి 10 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. మొత్తం కలిపి సుమారు రూ.లక్ష అద్దె రూపంలో చెల్లించాల్సి వస్తోంది.

వీటితోపాటు అన్ని స్టేషన్లు, డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్లకు కలిపి మొత్తం 20 అద్దె వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనానికి ప్రతి నెల రూ.24 వేలు చొప్పున మొత్తం రూ.4.80 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. మొత్తం భవనాలు, వాహనాల ద్వారా రూ.6 లక్షలను ఎక్సైజ్‌ శాఖ అద్దె రూపంలో చెల్లిస్తోంది. ఒక పక్క గుడుంబాపై దాడులు చేసి నిర్మూలించాలని, కల్తీకల్లు అరికట్టాలని, నాన్‌డ్యూటీపెయిడ్‌ లిక్కర్, దేశీదారును అడ్డుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నా.. క్షేత్రస్థాయిలో సిబ్బందికి అవసరమైన వాహనాలు కేటాయించడంలో శ్రద్ధ చూపడం లేదని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement