ఎక్సైజ్‌ మామూళ్ల ప్లాన్‌ | Corruption In Excise Department Adilabad | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ మామూళ్ల ప్లాన్‌

Published Mon, Sep 10 2018 10:56 AM | Last Updated on Thu, Jul 11 2019 8:44 PM

Corruption In Excise Department Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఎక్సైజ్‌ వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ పక్కదారి పట్టింది. ఆ శాఖ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ కార్యాచరణ ఒక రీతిలో ఉంటే ఆ శాఖ అధికారులు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. కార్యాచరణలో ఉన్న అంశాల ఆధారంగా మద్యం వ్యాపారులను హడలెత్తిస్తున్నారు. ఇది అక్రమ లిక్కర్‌ వ్యాపారాన్ని అరికట్టేందుకైతే ఆ డిపార్ట్‌మెంట్‌ ఆశించిన ప్రయోజనం చేకూరేది. కానీ ‘మామూళ్ల’ కోసం దాన్ని కొందరు అధికారులు తమకు అనుకూలంగా మలుచుకోవడంతో లక్ష్యం పక్కదారి పట్టింది. ఓ అధికారి సిబ్బందిపై ఒత్తిడితెచ్చి మరీ బలవంతపు వసూళ్లకు పాల్పడుతుండడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయమైంది. కేసులు బనాయిస్తామని హెచ్చరిస్తుండడంతో లిక్కర్‌ వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు.
 
నెల వారీగా వసూళ్లు..
ఎక్సైజ్‌ శాఖలో అధికారులకు ఏడాదికోసారి మామూళ్లు సమర్పించడం సాధారణంగా జరిగే వ్యవహారమే. దీంట్లో అటు లిక్కర్‌ వ్యాపారులకు, ఇటు ఎక్సైజ్‌ అధికారుల మధ్య ఒక రహస్య ఒప్పంద ప్రాతిపదికన జరుగుతుంది. లైసెన్స్‌ రెన్యూవల్‌ సమయాల్లో ఉన్నతాధికారులకు ఈ అమ్యమ్యాలను ఇస్తుంటారు. అయితే కొద్ది నెలల కిందట ఇక్కడికి బదిలీపై వచ్చిన అధికారి మామూళ్ల తంతును పూర్తిగా మార్చేశారు. నెలనెలా మామూళ్లు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో లోపాలు చూపెట్టి కేసులు బనాయిస్తామని హెచ్చరించడంతో మద్యం వ్యాపారులు జంకుతున్నారు.

కొంతమంది సిబ్బందిని వసూళ్లు చేసుకురావాలని ఒత్తిడి చేస్తుండడంతో వారు హైరానా పడుతున్నారు. అక్రమ వసూళ్లపై శాఖ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ సీరియస్‌గా ఉండడంతో తామెక్కడ ఇరుక్కుపోతామోననే భయం వెంటాడుతున్నా అధికారి ఆజ్ఞలతో కక్కలేక, మింగలేక వసూళ్లకు సిబ్బంది సాహసిస్తున్నారు. తాను ఇక్కడికి రాకముందు ఇంకో అధికారి పనిచేసిన కాలానికి సంబంధించి కూడా లెక్కగట్టి మరీ వసూలు రాబట్టారు. ఆ సమయంలో ఆ అధికారికి మామూళ్లు ముట్టలేదన్న విషయం తెలుసుకుని ఈ ఆఫీసర్‌ ఆ రుక్కాన్ని కూడా వదలలేదు. లక్షల రూపాయల్లో వసూలు చేశారు. ఈ వసూళ్లు పూర్తికావడంతో మరోదానిపై ఆయన దృష్టి పెట్టారు.

నెలకు రూ.5 వేలు మామూళ్లు..
ఆ అధికారి తాను ఇక్కడికి వచ్చిన కాలం నుంచి నెలనెలా లెక్కేసుకుని షాపుకింత అని లెక్కలు వేసి దానికి అనుగుణంగా సిబ్బందితో వసూలుకు పురమాయిస్తున్నాడు. ఒక్కో షాపు నుంచి నెలకు రూ.5 వేల చొప్పున మామూళ్లు గుంజుతుండడం చర్చనీయమైంది. ఈ లెక్కన ఏడు నెలల కాలానికి సంబంధించి ఒక్కో షాపు నుంచి రూ.35 వేల చొప్పున ఒప్పందం చేసుకొని ఓ విడతలో రూ.20 వేల చొప్పున తీసుకున్నారు. మరో విడతకు సంబంధించి ఒక్కో షాపు నుంచి రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండగా మళ్లీ దాన్ని పెంచి రూ. 20 వేలు చొప్పున ఇవ్వమని చెప్పడంతో హైరానా పడుతున్నారు. బార్ల నుంచి కూడా పెద్ద మొత్తం వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

మామూళ్లకు హద్దు లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక మద్యం వ్యాపారులు పరేషాన్‌ అవుతున్నారు. ఇలా ఆదిలాబాద్‌ పట్టణంలోనే ఏడు వైన్స్‌లు ఉండగా, ఈ లెక్కన లక్షల రూపాయలు ఎక్సైజ్‌ అధికారులకు ఈ ఏడు నెలల కాలంలోనే ముట్టజెప్పాల్సి వచ్చింది. ప్రధానంగా ఆగస్టు 11 నుంచి ఎక్సైజ్‌ వంద రోజుల కార్యాచరణ మొదలైంది. నవంబర్‌ 28 వరకు కొనసాగనుంది. పాత నేరస్తులు అక్రమ మద్యం దందా కొనసాగించకుండా బైండోవర్లు చేయాలి. గుడుంబా నల్లబెల్లం విక్రయించకుండా చర్యలు చేపట్టాలి. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయాలి. మహారాష్ట్ర నుంచి అక్రమంగా రవాణా అవుతున్న దేశీదారును అరికట్టాలి. సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. కల్తీ మద్యం విక్రయించకుండా వైన్, బార్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించాలి. కార్యాచరణ ముసుగులో అధికారులు మామూళ్లకు తెగబడుతుండడం ఇప్పుడు శాఖలో చర్చనీయంగా మారింది.

అధికారి రూటే.. సఫరేటు
గతంలో వేరే జిల్లాలో పనిచేసిన ఈ ఆఫీసర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శాఖ పరంగా సరెండర్‌ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లాలో ఆఫీసర్‌గా తాత్కాలికంగా కొనసాగారు. ఇక్కడ పనిచేస్తున్న ఓ అధికారిని ఆ జిల్లాకు బదిలీ చేయడంతో ఈయన ఈ జిల్లాకు రావడం జరిగింది. అతడి తీరుతో శాఖలో హడల్‌ నెలకొంది. ప్రధానంగా వారంలో రెండుమూడు రోజులు మాత్రమే డ్యూటీ చేస్తారనే ప్రచారం ఉంది. మిగిలిన రోజుల్లో ఇక్కడున్నంత సేపు మామూళ్ల వసూళ్లపైనే దృష్టి సారిస్తారు. తనకు సహకరించని సిబ్బందికి మెమో ఇస్తానని హెచ్చరికలు వారిని ఆందోళన కలిగిస్తున్నాయి. సిబ్బందిపై పరుష పదజాలం వాడుతారన్న ప్రచారం ఉంది. మహిళ సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దీనిపై విచారణ కోసం షీ టీమ్‌ వచ్చి వెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు.

ఈ వ్యవహారం లో లోపలే సమిసిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత శాఖ పరంగా ఇతర జిల్లాల నుంచి ఇద్దరిని ఔట్‌సోర్సింగ్‌పై నియమించేందుకు ప్రయత్నాలు చేయగా, దానిపై శాఖ ఉన్నతాధికారుల వరకు సమాచారం వెళ్లడంతో తర్వాత నియామకానికి వెనుకంజ వేసినట్లు చెబుతున్నారు. ఈ అధికారి విషయం ఇంటెలిజెన్స్‌ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏసీబీ నిఘా పెట్టినట్లు సమాచారం. ఒకవైపు అక్రమ వసూళ్లపై శాఖ డైరెక్టర్‌ సీరియస్‌గా ఉండగా, మరోపక్క ఇంత బాహాటంగా వసూళ్లకు తెర తీయడం పట్ల విస్మయం వ్యక్తమవుతుంది. కాగా పనిష్మెంట్‌పై అధికారులను ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు పంపిస్తుండటంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులే ఇలా వ్యవహరిస్తే సిబ్బంది ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు.  

విచారణ చేస్తాం..
అక్రమ వసూళ్ల విషయం నా దృష్టికి రాలేదు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. నేను ఇటీవలే బాధ్యతలు తీసుకున్నాను. ఆరోపణలపై దృష్టి సారిస్తాం. సదరు అధికారిపై విచారణ చేపడతాం. 
– డేవిడ్‌ రవికాంత్, డిప్యూటీ కమిషనర్‌  ఎక్సైజ్‌ శాఖ, ఆదిలాబాద్‌ డివిజన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement