curreption
-
ఆర్టీఏ చెక్‌పోస్టులో అక్రమ వసూళ్లు
కర్నూలు: పంచలింగాల వద్ద ఉన్న అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్‌పోస్టులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తేల్చారు. ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, కృష్ణయ్య, వంశీనాథ్, ఎస్ఐ సుబ్బరాయుడు, హెడ్ కానిస్టేబుల్ దొరబాబుతో పాటు మరో 15 మంది సిబ్బంది ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉండి సోమవారం సాయంత్రం వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. విధులు నిర్వహిస్తున్న మోటర్ వాహనాల తనిఖీ అధికారి (ఎంవీఐ) జె.సునీల్‌కుమార్ వద్ద అనధికారికంగా ఉన్న రూ.2,02,890 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని వాహనదారుల నుంచి అక్రమంగా వసూలు చేసినట్లు గుర్తించారు. సునీల్ కుమార్‌ను పలు విధాలుగా ప్రశ్నించి సమాధానం రాబట్టారు. సమీప గ్రామాలకు చెందిన ఐదుగురు ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు. ప్రైవేటు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని ఎంత కాలంగా పనిచేస్తున్నారు? పని చేసినందుకు రోజుకు ఎంత జీతం చెల్లిస్తున్నారు? తదితర విషయాలపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన టోల్‌ఫ్రీ 14400కు ఒక బాధితుడు చెక్‌పోస్టులో జరుగుతున్న అక్రమ వసూళ్లపై గత నెలలో ఫిర్యాదు చేశాడు. అలాగే వాహనదారుల నుంచి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అనుమతితో సోదాలు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. నగదు రహిత విధానం అమలులో ఉన్నప్పటికీ వసూళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై నుంచి ఈ చెక్‌పోస్టులో నగదు రహిత విధానాన్ని అమలులోకి తెచ్చింది. చెక్‌పోస్టులో చెల్లించాల్సిన బార్డర్ ట్యాక్స్, టెంపర్వరీ పర్మిట్ ఫీజు, వలంటరీ ట్యాక్స్, అపరాధ రుసుం తదితర రకాల చెల్లింపులు పూర్తిగా నగదు రహిత విధానంలోనే చెల్లించాల్సి ఉంది. అయితే ఆ విధానానికి స్వస్తి చెప్పి అధికారులు నగదు రూపంలో వసూలు చేస్తుండటంతో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన టోల్‌ఫ్రీ నెంబర్‌కు 14400కు జిల్లా నుంచి తరచూ ఫిర్యాదులు వెళ్తున్నాయని డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు. ఐదేళ్లలో మూడవసారి... ప్రభుత్వం ఎంతగా నియంత్రిస్తున్నప్పటికీ రవాణా శాఖలో వసూళ్ల పర్వం ఆగడం లేదు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరిగే వాహనాలపై చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సిన అధికారులే సొంత జేబులు నింపుకుంటున్నట్లు ఏసీబీ తనిఖీల్లో బయటపడింది. గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న ఒక లారీ నుంచి రూ.500 మామూళ్లు తీసుకుని వదిలేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దాని సామర్థ్యం 35 టన్నులకు గాను 61 టన్నుల లోడ్‌తో వెళ్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. 26 టన్నులు ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం రూ.500 మామూలు తీసుకుని వదిలేసినట్లు అధికారులు గుర్తించారు. అధిక లోడ్‌కు ప్రభుత్వానికి రూ.78 వేలు ఆదాయం వస్తున్నప్పటికీ కేవలం రూ.500 తీసుకుని వదిలేసినట్లు అధికారులు గుర్తించారు. చెక్‌పోస్టులో జరుగుతున్న అక్రమ వసూళ్లపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ చెక్‌పోస్టుపై గత ఐదేళ్ల కాలంలో మూడుసార్లు ఏసీబీ తనిఖీలు జరిగాయి. ప్రైవేటు వ్యక్తులతో పాటు ఎంవీఐ డ్రైవర్, హోంగార్డు కూడా వసూళ్ల దందాకు సహకరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించి నివేదిక రూపొందించారు. విద్యాశాఖకు చెందిన ఇద్దరు అధికారులతో పాటు డీటీసీ శ్రీధర్‌ను కూడా అక్కడికి పిలిపించి వారి సమక్షంలో (మధ్యవర్తులు) పంచనామా నిర్వహించారు. -
చంద్రబాబు అవినీతి ప్రస్థానం
‘‘ఎక్కడి నీచు లెక్కడి హీనులెంతటి తులువలు / ఎంతటి భ్రష్టు లెచ్చటి దుష్టు లెక్కడి నష్టజాతకులీ నాయకులు / నా తెలుగు జాతికి శాపంగా దాపురించారో’’ అంటారు మహారథి. ఈ మాట అక్షరాలా మన నారా చంద్రబాబు నాయుడికి వర్తిస్తుంది. మధిర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీమజిలీ కథల్లో పాఠకులను భయపెట్టే ఒక మహావట వృక్షం ఉంటుంది. అంతకంటే భయంకరమైన అవినీతి వృక్షం తెలుగు జాతికి సంక్రమించింది. ఒకే పెరడులో పెరిగి శాఖోపశాఖలుగా విస్తరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఎదగనీయకుండా వ్యవస్థల్ని కూడా భయపెడుతున్న ఈ ‘నారా’ అవినీతి వృక్షం మూలాల్లోకి వెళ్లి ఒక్కసారి పరిశీలిద్దాం. చంద్రబాబుకు నారావారి పల్లెలో ఒక చిన్న పూరిల్లు, రెండెకరాల పొలం మాత్రమే ఉంది. అనుకోకుండా 1978లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయి ‘ఇందిరా కాంగ్రెస్’ ఏర్పడింది. అప్పుడున్న పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ఎవ్వరడిగినా టిక్కెట్ ఇచ్చింది. ఆ విధంగా ‘నారా’వారు టిక్కెట్ సంపాదించి ఆమె ప్రభంజనంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. అప్పుడతని నెల జీతం 350 రూపాయలు. పాకాల నారాయణస్వామి, గల్లా రాజగోపాల్ నాయుడు ఆర్థిక సాయం అందించడంతో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అయితే రాజకీయాల్లో సీనియారిటీ, సిన్సియారిటీ పనికి రాదనుకున్నాడు. మంత్రి కావా లనే ఆశతో అన్ని అడ్డదారులు తొక్కటం ప్రారంభించాడు. అమాయకుడైన అంజయ్యగారి అల్లుణ్ణి, పట్టు కొని, అతనిని ప్రలోభపెట్టి చేసి 1980లో మంత్రి పదవి కొట్టేశాడని ఆ రోజుల్లోనే ఒక కాంగ్రెస్ నాయ కుడు ఆక్షేపించాడు. మంత్రిగా అతని జీతం 2,500 రూపాయలు. అదే విధానంలో సంజయ్ గాంధీతో పరిచయం పెంచుకున్నాడు. ఇక మంత్రి పదవి చేపట్టిన దగ్గర్నుండి అతని అవినీతి యాత్ర ప్రారంభమైంది. తిరుపతిలో 1970– 80లలోనే విష్ణుప్రియ హోటల్ కొన్నాడు. ఆ తరువాత భువనేశ్వరి కార్బైడ్ ఫ్యాక్టరీని ప్రారంభించాడు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవ్వడంతో ఆ రోజుల్లో సినిమావాళ్ళ దగ్గర కూడా డబ్బులు కాజేసేవాడని స్వయంగా దాసరి నారాయణ రావుగారు నాతో చెప్పారు. ఆ పరిచ యాలతోనే 1981లో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో అతని వివాహం జరిగింది. ‘ఇంత డబ్బు నీకెక్కడిది?’ 1982 ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినపుడు ఇతడు కాంగ్రెస్‌లోనే ఉండి ఎన్టీఆర్‌ను ఓడిస్తానని ప్రగల్భాలు పలికాడు. తెలుగుదేశం పార్టీ 200 సీట్లతో గెలవటంతో అప్పటికప్పుడు పార్టీలో చేరతానని వచ్చేశాడు. అప్పటికే అతని మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నందువల్ల ఎన్టీఆర్ తిరస్కరించారు. అప్పుడు గర్భిణిగా ఉన్న భువనేశ్వరిని ముందుపెట్టి ఎన్టీఆర్ మీద ఒత్తిడి తెచ్చి పార్టీలో చొర బడ్డాడు. కార్యకర్తగా చేరిన చంద్రబాబు నంబర్ 2 పొజిషన్ కోసం అప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న నాయకులందరినీ ఏదో ఒక వంకతో బయ టకు పంపేశాడు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జానారెడ్డి, ఉపేంద్ర, కె.ఇ. కృష్ణ మూర్తి, వసంత నాగేశ్వరరావు... వీరంతా ఎన్టీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రులుగా మెలిగినవారు. బయటకు వెళ్లాక చంద్ర బాబు నీచ రాజకీయాన్ని గురించి తీవ్రంగా విమర్శ చేయటం గమనించదగిన అంశం. అప్పటినుండి పార్టీలో ‘ఏకులా వచ్చి మేకులా’ తయార య్యాడు. ఎన్టీఆర్‌కు రాజకీయ అవగాహన లేకపోవటంతో పార్టీ బాధ్యతనంతా అతనికి అప్పజెప్పటంతో పార్టీ వ్యవహారాలే కాక ప్రభుత్వంలో కూడా రాజ్యాంగేతర శక్తిగా తయారయ్యాడు. దానికి తోడు ఎన్టీఆర్ అతనిమీద ఉంచిన అపారమైన విశ్వాసంతో ఎవరు తనను కలిసినా ‘బాబును కలవండి’ అని చెప్పటంతో పార్టీలో, ప్రభు త్వంలో అతనికి హద్దు లేకుండా పోయింది. జూబ్లీహిల్స్‌లో 1,200 గజాలు కొని మంచి భవనం కట్టించాడు. ఆ గృహ ప్రవేశానికి ఎన్టీఆర్ గారిని కూడా ఆహ్వానించాడు. ఆ భవనం చూసి ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్ ‘ఇంత డబ్బు నీకెక్కడిది? ఎలా కట్టించావు?’ అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు. ఇంటా బయటా చర్చ చంద్రబాబు అవినీతి మీద ‘ఈనాడు’ పేపరు ప్రభుత్వాన్ని అనేకసార్లు హెచ్చరించింది. బ్లాటింగ్ పురుషోత్తం (మద్రాసు) వద్ద రెండున్నర కోట్లు ముడుపులు తీసుకున్న విషయం పార్టీలో, బయటా పెద్ద చర్చనీయాంశమైంది. అప్పటికి నష్టాల్లో నడుస్తున్న ‘విష్ణుప్రియ’ హోటల్‌ను సి.ఎం. బలరామిరెడ్డికి బలవంతంగా అంటకట్టి, కుదుర్చు కున్న ఒప్పందం ప్రకారం అతనిని కడప జడ్పీ ఛైర్మన్ గా చేశాడు. అదే విధంగా మూతపడివున్న భువనేశ్వరి కార్బైడ్ ఫ్యాక్టరీని రేణుకా చౌదరికి అంటగట్టి ఎన్టీఆర్‌ను బలవంతంగా ఒప్పించి రెండవసారి రాజ్యసభకు పంపించాడు. 1988లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం సాలీనా వ్యవసాయంపై వచ్చే ఆదాయం 36,000 రూపాయలుగా చూపించాడు. వ్యవసాయ భూమి తప్ప తనకు వేరే ఆస్తిపాస్తులుగానీ, ఆదాయ మార్గాలుగానీ లేవని వెల్లడించాడు. అప్పుడు భార్య భువ నేశ్వరి ఆస్తి సుమారు 400 గ్రాముల బంగారం, 50,000 రూపాయల నగదు. తరువాత ఏ పదవిలో లేడు గనుక సంపాదించే అవకాశమే లేదు. 1989 ఎన్నికల్లో తన ఆదాయం 2,16,000, అగ్రికల్చర్ ఆదాయం 36,000గా చూపించాడు. 1992లో 14 కోట్ల 75 లక్షల పెట్టుబడి అంచనాలతో ‘హెరిటేజ్ గ్రూపు’ సంస్థను స్థాపించటం జరిగింది. దాని పెట్టుబడులకు కూడా పార్టీలో అసెంబ్లీ టిక్కెట్లు ఇప్పిస్తానని పార్టీ మనుషుల చేత లక్షల రూపాయల షేర్లు కొనిపించాడు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు లక్షల రూపాయల ముడుపులు తీసుకొని కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు అప్పజెప్పా డని నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి బహిరంగంగానే విమర్శించాడు. నెల్లూరు జిల్లా బాలాయపల్లెలో 600 ఎకరాల్లో టేకు మొక్కలు నాటి వాటిని సొంతం చేసుకోవటమే కాకుండా, యానాం చుట్టుపక్కల బినామీ పేర్లతో కొన్ని వందల ఎకరాలు కొన్నాడని పార్టీ వాళ్ళే ఒకరికొకరు చెప్పుకున్న విషయం. ఇక హెరిటేజ్ పబ్లిక్ ఇష్యూలలో ఆరున్నర కోట్ల రూపాయలు సమీకరించాడు. ఈ పరిశ్రమలో తనకు 76 లక్షల 15 వేల రూపాయల విలువ గల వాటాలున్నట్టు, భార్య భువనేశ్వరికి ఒక కోటి 21 లక్షల 31 వేల రూపాయల విలువైన వాటాలున్నట్టు, లోకేష్ పేర 3 లక్షల 15 వేల రూపాయల వాటాలు న్నట్టు 1994లో ప్రకటించాడు. అప్పటికే జూబ్లీహిల్స్‌లో ఒక భవనం, పంజాగుట్టలో ఒక భవనం ఉన్న విషయం గమనించాలి. ఏ పదవీ లేకుండా 1992 నాటికే అతని కుటుంబ ఆస్తులు పెరిగాయన్నది స్పష్టంగా తెలుస్తున్నది. వెన్నుపోటు తర్వాత లేని హద్దు 1995 ఆగస్టు నెలలో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పదవి నుండి దించేసి సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి అతని ఆస్తులు ఆకాశమే హద్దుగా పెరిగి పోవటం, దేశంలోనే నంబర్‌వన్ స్థాయి అవినీతి పరునిగా విమర్శలు రావడం జరిగింది. తెహల్కా డాట్‌కామ్ మొదలు అనేకమంది రాజకీయ నాయకులు, మీడియా అతని అవినీతిని ప్రశ్నించటం జరిగింది. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యిన దగ్గర్నుండి పారదర్శకత, నిజాయితీ గురించి ఎక్కువగా ఉపన్యాసాలివ్వడం ప్రారంభించాడు. శాసనసభలో ఎథిక్స్ కమిటీ ఏర్పాటుకు దోహద కారులైన తోటి శాసన సభ్యుల వలే తను కూడా తన ఆస్తిపాస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రతి సంవత్సరం ప్రకటించడం మొదలు పెట్టాడు. అతని ప్రకటన ప్రకారం చంద్ర బాబు కుటుంబ ఆస్తుల విలువ 30 కోట్ల వరకు చేరింది. ఆ ప్రకటనలో నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం ‘నిందలి గ్రామం’లో తన పేర 26.43 ఎకరాలు, భార్యకు 10.23 ఎకరాలు, కుమారునికి 9.32 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు ప్రకటించాడు. వివిధ కంపెనీలలో కుమారుడికి ఒక కోటి 67 లక్షల 15 వేల రూపాయల విలువగల వాటాలు, భార్య భువనేశ్వరి పేరున మొత్తం 3 కోట్ల 4 లక్షల 1 వేయి రూపాయల విలువ గలిగిన వాటాలు, తనకు ఒక కోటి 40 లక్షల 15 వేల 65 రూపాయల విలువ కలిగిన వాటాలు ఉన్నట్లు చెప్పాడు. భవనాలు, వాహనాలు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు మొదలైన వివరాలు కూడా వెల్లడి చేశాడు. వాటి విలువను తక్కువగా చూపించడం గమనార్హం. 1994లో ప్రకటించిన హెరిటేజ్ డైరీ ప్రాస్పెక్టస్‌లో కూడా తనకు వేరే కంపెనీలతో లావాదేవీలు గానీ ఇత రత్రా ఆదాయ వనరులు గానీ లేనట్లు ప్రకటించి, కంపెనీల రిజి స్ట్రార్ సమక్షంలో అంతకుముందు తాను ఆర్థికపర, క్రిమినల్ నేరారోపణ లను ఎదుర్కొనలేదని పేర్కొన్నాడు. మరి 1988లో సాలీనా తన గరిష్ఠ ఆదాయం లక్షన్నర రూపాయలే అని చెప్పిన పెద్ద మనిషికి ఒక్క సారిగా ఇన్ని ఆస్తులు అకస్మాత్తుగా ఎలా పెరిగాయి? ఆనాటి ప్రశ్నకు ఈరోజు సీఐడీ కేసుల ద్వారా సమాధానం లభించింది. ఆస్తులు ఎలా పెరిగాయో సంజాయిషీ ఇవ్వాలి! చంద్రబాబు పేర్కొన్న ఆస్తిపాస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా అప్పటి పీసీసీ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర రెడ్డిగారు డిమాండ్ చేయటం జరిగింది. అతడిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించాల్సిందిగా 1999 జూన్ 5న రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పలువురు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర గవర్నర్‌కు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు. నిజానికి 90 మంది శాసన సభ్యులకు నాయకుడైన రాజశేఖర రెడ్డి గారి విజ్ఞాపనకు గవర్నరు ప్రతిస్పందించటం కనీస ధర్మం. అప్పటికే ప్రతి వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడ య్యాడు. గవర్నర్ మారు మాట్లాడలేదు. గత్యంతరం లేని పరిస్థితిలో 1999 జూలై 12వ తేదీన హైకోర్టును ఆశ్రయించి ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసేందుకు చట్టప్రకారం అవసరమైన అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ను ఆదేశించాలని కోరారు. అందుకు హైకోర్టు 1999 నవంబర్ 2వ తేదీన ఒక సుదీర్ఘ తీర్పులో తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ దర ఖాస్తును కొట్టేసింది. గవర్నర్ గారి పదవీ బాధ్యతల నిర్వహణ మీద సమీక్ష జరిపే అధికారం రాజ్యాంగం ప్రకారం కోర్టులకు ఉండదని ఆ జడ్జిమెంట్ సారాంశం. హైకోర్టు తీర్పు మీద (నేడు టీడీపీ పార్టీలో ఉన్న) కన్నా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ‘ఆమోస్’ గార్లు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోమని ఆ కేసు కొట్టేసింది. దాని మీద వారు హైకోర్టులో ఏ కేసు వేసినప్పటికీ తమకు న్యాయం జరగట్లేదనీ, చంద్రబాబుకు అనుకూలంగా తీర్పులొస్తున్నాయనీ నివేదించినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం వినిపించుకోలేదు. అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు ఈ కేసును వాదిస్తూ, రాష్ట్ర హైకోర్టు మీద చంద్రబాబు నాయుడి ప్రభావం పనిచేస్తున్నదంటూ బ్రిటన్‌లోని ‘ససెక్స్’ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ జేమ్స్ మైనర్ ఇచ్చిన రిపోర్టును ప్రస్తావించినా బెంచ్ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ -
పోలీసుల.. చేతివాటం!
లాక్డౌన్ ఎందరినో ఇబ్బంది పెడుతూ.. మరెందరికో ఉపాధి లేకుండా చేసింది. ఇతర శాఖల సిబ్బందితోపాటు పోలీస్ యంత్రాంగం పూర్తిగా రోడ్లపైనే రేయింబవళ్లు డ్యూటీలు చేసి శభాష్ అనిపించుకుంది. కానీ, కొందరు పోలీసులు మాత్రం సొమ్ము చేసుకోవడంలో బిజీగా గడిపారు. లాక్డౌన్ సమయంలో జిల్లావ్యాప్తంగా మద్యం షాపులు మూసివేశారు. దీంతో తెరవెనుక దందాకు తెరలేసింది. ఇలా.. మద్యం అక్రమ వ్యాపారమే కొందరు పోలీస్ అధికారుల జేబుల నింపింది. తిమ్మిని బమ్మిని చేసేలా.. కేసులను తారుమారు చేసి నిందితులకు సహకరించేలా చేసింది..! సాక్షిప్రతినిధి, నల్లగొండ : లక్షల రూపాయలు పోసి తెచ్చుకున్న పోస్టింగ్.. పెట్టిన ఖర్చులను రాబట్టుకునేందుకు చట్టానికి తూట్లు పొడిచేలా కొందరు పోలీస్ అధికారులను ప్రేరేపిస్తోంది. ఫలితంగా కేసులు తారుమారు అవుతున్నాయి. సదరు అధికారుల జేబులు నిండుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పోలీస్ అధికారుల పోస్టింగులకు ధరలు నిర్ణయించారు. సీఐ పోస్టింగ్ కావాలంటే రూ.5లక్షలు, ఎస్సై పోస్టింగ్‌కు అయితే రూ.3లక్షల రేటు పలుకుతోంది. ఉన్నతాధికారులు ఏ మాత్రం అవకాశం ఇవ్వని ఒకటీ రెండు చోట్ల మినహాయిస్తే.. మిగిలినవన్నీ పొలిటికల్ పోస్టింగులే అని సమాచారం. దీని ప్రభావం సవ్యంగా సాగాల్సిన ‘పోలీసింగ్’పై పడుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలాచోట్ల ‘బ్యాక్ డోర్ బిజినెస్’ జరిగింది. అటు ఎక్సైజ్, ఇటు పోలీసులు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫలితంగా ఎవరి స్థాయిలో వారికి మామూళ్లు ముట్టాయన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇదో రకం దందా కాగా, మరికొన్ని చోట్ల ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి మద్యం అక్రమంగా తరలించి వ్యాపారం చేశారు. ఈ క్రమంలో పలు చోట్ల పోలీసులకు దొరికిపోయిన వారూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో పోలీసులు స్వయంగా దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం కూడా చేసుకున్నారు. వీటన్నింటికి భిన్నంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలో చోటు చేసుకున్న మద్యం అక్రమ తరలింపు వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇదీ... సంఘటన ! గత నెల 28వ తేదీన హాలియా పోలీస్ స్టేషన్లో మద్యం అక్రమ వ్యాపారానికి సంబంధించి కేసు (ఎఫ్ఐఆర్ నం:95/2020) నమోదు అయ్యింది. హాలియా పట్టణానికి చెందిన ఏసురాజు, మార్క్, చందు, వేణు, కోటేశ్, కనగల్ మండలానికి చెందిన కిరణ్‌కుమార్, నవీన్‌కుమార్ అనే ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదైంది. వీరు మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను స్థానిక పోలీసులు అధికారికంగానే ప్రకటించారు. ఎంత మద్యం స్వాధీనం చేసుకున్నారో వివరాలు కూడా వెల్లడించారు. ఆఫీసర్స్ చాయిస్ క్వార్టర్ బాటిళ్లు – 65, ఐబీ క్వార్టర్ బాటిళ్లు–25, మెక్‌డోవెల్ 90ఎంఎల్ బాటిళ్లు – 50, కెఎఫ్ బీర్లు–24 బాటిళ్లతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు, స్పష్టంగానే వివరాలు ప్రకటించారు. ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశాం అక్రమ మద్యం కేసు వ్యవçహారంలో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశాం. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించిన వారిలో హాలియా పట్టణానికి చెందిన ఐదుగురు వ్యక్తులతోపాటు కనగల్ మండలానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి అక్రమంగా మద్యం కారులో తరలిస్తుండగా పట్టుకున్నాం. వీరందరిని విచారించగా అందులో ఓ వ్యక్తి విద్యార్థిగా ఉన్నందున వార్నింగ్ ఇచ్చి వదిలి వేశాం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారో తేలాల్సి ఉంది.– శివకుమార్, ఎస్ఐ, హాలియా ఏం జరిగింది..? ఈ కేసులో పోలీసుల స్వాధీనమైన రెండు వాహనాల్లో ఒకటి ఇంకా రిజిస్టర్ కానీ కొత్త కారు. అందులో రూ.8.25ల నగదు ఉన్నట్లు తెలియడంతో ఓ ఐడి పార్టీ కానిస్టేబుల్, కనగల్ మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి మధ్యవర్తిగా బేరసారాలు నడిచాయని విశ్వసనీయ సమాచారం. ఈ నగదును రిలీజ్ చేయడం, కారును వదిలేయడం, కేసులో ఒక వ్యక్తి పేరును పక్కన పెట్టేందుకు డీల్ కుదిరినట్లు సమాచారం. ఇందులో ముందుగా రూ.50వేలు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇక, ఈ కేసును తారుమారు చేసేందుకు కూడా కనీసం రూ.1.50లక్షలు మరో అధికారికి ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో బయట పడి రచ్చ జరగడంతో సదరు అధికారి రూ.50వేలు ఓ ప్రజాప్రతినిధి సంబంధీకుల చేతిలో పెట్టి పాప పరిహారం చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కనగల్ ప్రాంతం నుంచి హాలియాకు మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు మొదట ప్రకటించిన వివరాలకు, రెండు మూడు రోజుల తర్వాత ఇచ్చిన వివరణకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఇప్పుడు ఒక కారు, రెండు బైక్‌లను మాత్రమే స్వాధీనం చేసుకున్నామని చెబుతున్నారు. మరో వైపు తొలుత కేసు నమోదైన వారిలో ఒక వ్యక్తిని, ఆ వ్యక్తికి చెందిన కొత్త కారును తప్పించిన విషయాన్ని దాటవేస్తున్నారు. మొత్తంగా ఈ చిన్న కేసులోనే రూ.2లక్షల దాకా చేతులు మారినట్లు చెబుతున్నారు. ఇందులో నుంచి రూ.50వేలు ఓ ప్రజాప్రతినిధికి చేరడం విచిత్రమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
వచ్చేసింది.. ఓట్ల పండుగ
పేరు చెప్పడానికీ సిగ్గుపడే దశ నుంచి... ఓటు మా హక్కు అని మహిళలు గొంతెత్తే వరకూ... నా ఒక్క ఓటేయకపోతే పోయేదేముందిలే అనుకునే దగ్గర్నుంచి... బాధ్యతగా చేసుకున్న మిలినియల్స్ వరకూ.. గల్లీ గల్లీ తిరిగి కరపత్రాలు పంచి ప్రచారం చేసే స్థాయి నుంచి... కాక రేపే ఫేస్బుక్ పోస్టు ఒక్కటి చాలని అనుకునే వరకు... గెలిచింది ఎవరో తెలిసేందుకు రోజులు పట్టే కాలం నుంచి.. గంటల్లో విజేతలను నిర్ణయించే దశ వరకూ... ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం.. మన భారతీయంలో వింతలు విశేషాలు.. అన్నీ ఇన్నీ కావు! సామాన్యుడు.. దేవుడయ్యే సమయం దగ్గరకొచ్చింది! ఎడమచేతి చూపుడువేలిపై సిరా గుర్తు పడే రోజు వచ్చేస్తోంది! ఏడు దశాబ్దాల ఎన్నికల పండుగ ప్రజాస్వామ్య ప్రస్థానం సాగింది ఇలా... అభ్యర్థికో బాక్స్ నుంచి ఈవీఎంల వరకు మన ఎన్నికల ప్రక్రియ అభ్యర్థికో బాక్స్ నుంచి బ్యాలెట్ పత్రం దిశగా వెళుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వరకు చేరుకుంది. తొలి ఎన్నికల్లో ప్రతీ అభ్యర్థికి వేర్వేరు రంగుల్లో ఉన్న ఒక్కో బ్యాలెట్ బాక్స్‌ని కేటాయించారు. ఆ బాక్స్‌పై వారి పేరు, ఎన్నికల గుర్తుని పెయింట్ చేశారు. ప్రతీ పోలింగ్ బూత్‌లో బరిలో ఉన్న అభ్యర్థులు ఒక్కొక్కరికీ ఒక బ్యాలెట్ బాక్స్ అన్నమాట. నచ్చిన అభ్యర్థి బ్యాలెట్ బాక్స్‌లో ఓటరు బ్యాలెట్ పేపర్‌ను వేస్తే సరిపోతుంది. అప్పట్లో ఈ బ్యాలెట్ బాక్స్‌లను గోద్రేజ్ కంపెనీ బొంబాయిలోని విఖ్రోలి ప్రాంతంలో తయారు చేసింది. 1957 ఎన్నికల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించారు. మూడవ సార్వత్రిక ఎన్నికల (1962)లో బరిలో ఉన్న అభ్యర్థులు, గుర్తులను ఒకే బ్యాలెట్ పేపర్‌పై ముద్రించారు. ఇరవైఏళ్లపాటు ఇదే పద్ధతి కొనసాగగా.. 1982లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) వాడారు. అయితే అప్పట్లో పరూరు నియోజకవర్గంలోని 50 పోలింగ్ స్టేషన్లకే వీటిని పరిమితం చేశారు. 1998లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 16 స్థానాల్లో వీటిని మరోసారి పరీక్షించారు. ఇవన్నీ మంచి ఫలితాలు ఇవ్వడంతో 2004లో తొలిసారి మొత్తం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈవీఎంల వాడకం మొదలుపెట్టారు. అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో ఓటింగ్ ప్రక్రియను మరింత పారదర్శకం చేసేందుకు 2010లో ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీప్యాట్)లను ప్రవేశపెట్టారు. ఈవీఎంల వాడకంతో ఓటింగ్ ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా, ఫలితాల ప్రకటన కూడా వేగవంతమైంది. పోలింగ్ కేంద్రాల్లో జరిగే రిగ్గింగ్, ఆక్రమణ వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమైంది. తక్కువ బరువు ఉండటం వల్ల ఈవీఎల రవాణ కూడా సులభం. ఒక్కో ఈవీఎం ఖరీదు ఐదారు వేలు ఉంటుంది. పదిహేనేళ్ల పాటు పని చేస్తుంది. ఇన్ని లాభాలున్నా.. ఈవీఎంలలో లోపాలున్నాయన్న ఆరోపణలు రావడం సాధారణమైపోయింది. కాలినడక, పడవల్లో, ఏనుగులపై ప్రయాణాలు ఒకప్పుడు ప్రయాణ సాధనాలు అంతగా లేవు. సరైన రహదారి సౌకర్యాలు ఉండేవి కావు. కొండ ప్రాంతాల్లోనూ, నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, ఎడారుల్లోనూ, సముద్రం మధ్య ద్వీపాల్లోనూ ఓటింగ్ నిర్వహణ దుర్లభంగా ఉండేది. ఎన్నికల కమిషన్ సభ్యులు నానా పాట్లు పడేవారు. ఎన్నికల సామగ్రి మోసుకుంటూ మైళ్లకి మైళ్లు నడిచే పరిస్థితి. ఇఅదీ ప్రజాస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం. హిందూమహాసముద్రం ద్వీపాల్లో ఎన్నికల కోసం ఏకంగా నేవీ అధికారుల సాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని చేర్చడానికి హెలికాప్టర్ సాయం తీసుకునే వారు. ఇప్పుడు ప్రయాణ సాధనాలు మెరుగు పడినప్పటికీ అటవీ ప్రాంత పోలింగ్ స్టేషన్లకి వెళ్లాలంటే కాలినడకే మార్గం. ఇక ప్రత్యేక వాహనాలు, రైళ్లు, హెలికాప్టర్లు, బోట్లలో కూడా సిబ్బందని తరలిస్తారు. కొన్నిసార్లు పోలింగ్ స్టేషన్ చేరుకోవడానికి ఏనుగులు వాడిన సందర్భాలూ లేకపోలేదు. రాజస్థాన్ వంటి ఎడారుల్లో ఒంటెలే సాధనం. దేశం మొత్తమ్మీద దాదాపుగా 80 వేల పోలింగ్ కేంద్రాల వద్ద మోబైల్ఫోన్ సౌకర్యం కూడా లేదు. ఇంకో ఇరవై వేల పోలింగ్ స్టేషన్లు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కడున్నాడు! ఒక్క ఓటు. ఒకే ఒక్క ఓటు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది కూడా ఎంతో కీలకం. అందుకే ఎన్నికల సంఘం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మరీ గుజరాత్లో దట్టమైన గిర్ అడవుల్లోకి కాలినడకన వెళుతుంది. ఆ ఒక్కడి కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అతని పేరు మహంత్ భరత్‌దాస్ దర్శన్ దాస్. ఆలయపూజారి. ఆయన ప్రతీ ఏడాది తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇందుకోసం ఎన్నికల సిబ్బంది గిర్ అడవుల్లోని బనేజ్కు ఏకంగా 35 కి.మీ. ప్రయాణం చెయ్యాలి. ఆ ప్రయాణంలో వారిని సింహాలు భయపెడతాయి. అడవి జంతువులు ఎదురవుతాయి. అయినా ప్రాణాలకు తెగించి మరీ ఆ ఒక్క ఓటు నమోదు కోసమే అధికారులు వెళతారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏ పౌరుడు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 2 కి.మీ.దూరానికి మించి ప్రయాణించకూడదు. అందుకే తాము భరత్‌దాస్ దగ్గరకి వెళతామని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఆ ప్రాంతంలో ఫోన్లు పని చెయ్యవు. టీవీ రాదు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. అయినప్పటికీ దర్శన్‌దాస్ శివుడిపై అపారమైన భక్తితో ఆ ప్రాంతంలోనే చాలా ఏళ్లుగా ఉంటున్నారు. చూడడానికి కాస్త ఆధునికంగానే కనిపిస్తారు. 60 ఏళ్లు దాటిన దర్శన్ దాస్ నల్ల కళ్లద్దాలు,తెల్ల గడ్డం, తలకి టోపీతో అందరినీ ఆకర్షిస్తుంటారు. ఆయనపై నమ్మకంతో ఆ అడవిలో వెళ్లేవారికి ఆధ్యాత్మిక బోధనలు చేస్తారు. పౌర సమాజానికి దూరంగా విసిరేసి ఉన్నప్పటికీ ఆయనకు ఓటు విలువ గురించి బాగా తెలుసు. ‘‘నా ఓటు ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. వాజపేయి సర్కార్ కేవలం ఒక్క ఓటు తేడాతో కుప్పకూలిపోయింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని ఎన్నికల సిబ్బంది ఇంత దూరం వస్తున్నందుకు వారిని ఎంతో గౌరవిస్తాను. నా ఓటు ఎంత విలువైనదో తెలుసుకొని గర్విస్తాను‘‘ అని అంటారు. ఒక్క వ్యక్తి కోసం పోలింగ్ బూల్ ఏర్పాటు చేస్తున్న సంగతి వెలుగులోకి వచ్చాక ఎందరో జర్నలిస్టులు గిర్ అడవుల్లోకి వెళ్లి భరత్దాస్తో మాట్లాడారు. అతని ప్రత్యేకతను ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. శభాష్ శరణ్.. ఆయనకు ఓటంటే బాధ్యత శ్యామ్ శరణ్ నేగి. ఆయన వయసు 102 సంవత్సరాలు. మన దేశంలో అతి పెద్ద వయసున్న ఓటరు ఆయనే. స్వాతంత్య్ర సమర సంగ్రామంలో పాల్గొన్న నేగికు ఓటు అంటే హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. అందుకే ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్న ఏకైక ఓటరుగా ఆయన రికార్డులకెక్కారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కల్పా అనే చిన్న గ్రామంలో ఉంటారు. కిన్నెర కైలాస్ పర్వత శ్రేణుల్లో ఉండే ఆ గ్రామంలో నిత్యం మంచు కురుస్తూనే ఉంటుంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయరు. మొదటి ఓటు తనే వేయాలనుకుంటారు. దీనికి గ్రామస్తులు కూడా సహకరిస్తారు. పొద్దున్నే ఇంకా ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూత్ తెరవక ముందే ఉన్ని కోటు వేసుకొని ఆయన వస్తారు. గ్రామస్తులందరూ కూడా ఆయనకు గౌరవాన్ని ఇచ్చి దారి విడిచిపెడతారు. 1951–52లో జరిగే మొదటి ఎన్నికల్లో కూడా నేగి తొలి ఓటును వేసి ప్రజాస్వామ్య భారతంలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తిగా చరిత్రపుటల్లో నిలిచిపోయారు. అప్పట్నుంచి వేగి ప్రతీసారి ఎన్నికల్లో తన ఓటు హక్కుని వినియోగించుకుంటూనే ఉన్నారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న వ్యక్తిగా మహాత్మగాంధీ సిద్ధాంతాలను ఆయన బాగా ఒంట బట్టించుకున్నారు. నూలు ఒడికి ఖాదీ వస్త్రాలు ధరించేవారు. ఒకప్పుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పలేనంత ఇష్టం ఉండేది. దేశానికి స్వాతంత్య్రం సాధించిన పార్టీగా ఆయనకు కాంగ్రెస్ పట్ల దేశభక్తి పొంగిపొర్లేది. కానీ కాలంతోపాటు ఆయన అభిప్రాయాలూ మారిపోయాయి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అత్యంత ఇష్టమైన నాయకుడు. ‘‘ఇప్పుడున్నది ఒకప్పటి కాంగ్రెస్ కాదు. ఎన్నో కుంభకోణాలకు పాల్పడింది. ఇప్పుడున్న నేతల్లో మోదీనే అభిమానిస్తాను. అవినీతిని అంతమొందించడానికి ఆయన తనకు చేతనైంది చేస్తున్నారు‘‘ అంటూ ప్రశంసిస్తారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఓటేసేందుకు ఆయన అత్యంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తొలి అడుగు.. సుకుమార్ సేన్ చుట్టూ చీకటి. ముందున్న దారి కనిపించదు. అడుగు ఎలా వెయ్యాలో తెలీదు. కానీ వెయ్యాలి. ఎవరో ఒకరు ముందుగా నడవాలి. అలా నడిచి మన ఎన్నికల వ్యవస్థని ఒక గాడిలో పెట్టింది మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్‌సేన్. ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసీఎస్) అధికారిగా, న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన దేశంలో ఎన్నికల ప్రక్రియకు తొలిసారిగా వేసిన బాట మరువలేనిది. ఎన్నికల నిర్వహణకు ముందు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల జాబితా రూపకల్పనలో సుకుమార్ సేన్ బృందానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఓటర్లలో 70 శాతం నిరక్షరాస్యులు కావడం, మహిళా ఓటర్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో ఓటర్ల జాబితా రూపొందించడమే కష్టసాధ్యమైంది. దీంతో చాలా మంది ఓటు హక్కు పొందలేకపోయారు. 17 కోట్ల మంది ఓట్లతో తొలి జాబితా రూపొందింది. ఎన్నికల్లో బూత్‌ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బ్యాక్స్‌లు రూపొందించడం వంటివన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేసి సుకుమార్ సేన్ బృందం విజయవంతమైంది. తొలి ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 25, 1951 నుంచి 1952 మార్చి 27 వరకు మొత్తం నాలుగు నెలల పాటు జరిగింది. ఒకసారి వేటు వేసిన వాళ్లు మళ్లీ ఓటు వెయ్యకుండా చూపుడు వేలి మీద ఇంకు గుర్తు వేయడం తొలి ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. నేపాల్, ఇండోనేసియా, సూడాన్ వంటి దేశాలు భారత్ ఎన్నికల నిర్వహణను దగ్గరుండి పరిశీలించడానికి తమ ప్రతినిధుల్ని పంపించాయి. విదేశీ మీడియా కూడా భారత్‌లో తొలి ఎన్నికల నిర్వహణను శెభాష్ అంటూ ప్రశంసించింది. సూడాన్ దేశం కూడా తమ తొలి ఎన్నికల నిర్వహణ బాధ్యతను సుకుమార్ సేన్ చేతుల్లోనే పెట్టింది. కానీ ఆయనకు రావల్సిన గుర్తింపు రాలేదని రామచంద్రగుహ వంటి చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. భారతరత్న పురస్కారం ఇవ్వదగిన వ్యక్తిని చరిత్ర మరచిపోయిందన్నది ఆయన అభిప్రాయం. ఎన్నికల సిత్రాలు అనామకుడి చేతిలో ఓడిన అంబేడ్కర్... రాజ్యాంగ నిర్మాత, భారత తొలి న్యాయశాఖా మంత్రి, తరతరాలుగా అణచివేతకు గురవుతోన్న అట్టడుగు వర్గాలైన దళిత, ఆదివాసీలకు ప్రత్యేక నియోజవకర్గాలకోసం అహరహం కృషిచేసి రిజర్వుడు నియోజకవర్గాలను తీసుకువచ్చిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజకీయవేత్త. అయినప్పటికీ ఒక అనామకుడి చేతిలో, అది కూడా రిజర్వుడు నియోజకవర్గంనుంచి ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీఆర్ అంబేడ్కర్ బొంబాయి(నార్త్ సెంట్రల్) రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఆల్ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తరఫున పోటీ చేసి ఓ అనామకుడి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ వ్యక్తి పేరు నారాయణ్ నడోబా కజ్రోల్కర్. నడోబా కజ్రోల్కర్కి 1,38,137 ఓట్లు వస్తే, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌కి 1,23,576 ఓట్లు వచ్చాయి. ఆ తరువాత అంబేడ్కర్ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. మళ్ళీ 1954లో భన్దారా లోక్‌సభ ఉప ఎన్నికలో ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బోర్కర్ చేతిలో మళ్ళీ ఓటమిపాలయ్యారు. జేబీ కృపలానీ – సుచేతా కృపలానీ... అతను ఓడినా ఆమె గెలిచారు... బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని సాధించుకునే సమయానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆచార్య జేబీ కృపలానీ ఉన్నారు. పూర్తి పేరు జీవత్రామ్ భగవాన్‌దాస్ కృపలానీ. స్వాతంత్య్రానికి పూర్వమూ, స్వాతంత్య్రానంతరమూ భారత రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మన్మోహినీ సెహెగల్ ని ఢిల్లీలో ఆచార్యకృపలానీ భార్య సుచేతా కృపలానీ ఓడించారు. 1957లోనే పోలింగ్ బూత్‌ల ఆక్రమణ.... పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకొని పోలైన ఓట్లను «ధ్వంసం చేయడం, తాము గెలవమనుకున్న చోట్ల బ్యాలెట్ బాక్స్‌లను ఎత్తుకెళ్ళడం, లేదా బ్యాలెట్ బాక్సుల్లో ఇంకుపోసి ఓట్లు చెల్లకుండా చేయడం లాంటి దుశ్చర్యలు 1957 సార్వత్రిక ఎన్నికల నుంచి ప్రారంభం అయ్యాయి. బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లాలోని రచియాహిలోని మటిహాని అసెంబ్లీ నియోజకవర్గంలో 1957లో జరిగిన ఎన్నికల్లో తొలి పోలింగ్ బూత్‌ల ఆక్రమణ జరిగింది. పోటీ చేసే అభ్యర్థులూ, పార్టీల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగి, పోటీ పెరిగిపోవడంతో 1970–80 వ దశకం చివర్లో బూత్‌ల ఆక్రమణ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పార్టీలు బూత్‌లను ఆక్రమించుకోవడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం మొదలయ్యింది. పోలింగ్ బూత్‌ల ఆక్రమణని సైతం శిక్షార్హమైన నేరంగా పరిగణించి, బూత్‌ల ఆక్రమణ జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలు రద్దు చేయడం, లేదా అక్కడ ఎన్నికలు వాయిదా వేసేలా ప్రజాప్రాతినిధ్య(1951) చట్టానికి 1989లో మార్పులు చేసారు. 13 రోజుల ప్రధాని... గుల్జారీలాల్ నందా మొత్తం రెండు సార్లు ప్రధాని అయ్యారు. అయితే రెండు సందర్భాల్లోనూ 13 రోజులు, 13 రోజులే ప్రధాని పదవిలో ఉండడం ఒక విశేషం అయితే, రెండు సార్లూ పదవిలో ఉన్న ప్రధానమంత్రులు మరణించడంతో ఈయనకు ఆ అవకాశం లభించింది. ఒకటి జవహర్ లాల్ నెహ్రూ మరణం అయితే, మరొకరు లాల్‌బహదూర్ శాస్త్రి మరణంతో గుల్జారీలాల్కి ఈ అవకాశం దక్కింది. రెండుసార్లూ కలుపుకొని మొత్తం 26 రోజులు పాటు గుల్జారీలాల్ నందా ప్రధానిగా పనిచేశారు. రెండవ లోక్‌సభ(ఏప్రిల్ 2, 1962 – మార్చి 3 1967)నుంచి 1964, మే 27 జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. మే 27, 1964 జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత తొలిసారి గుల్జారీలాల్ తాత్కాలిక ప్రధాని అయ్యారు. మే 27 నుంచి జూన్ 9, 1964న లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్ ప్రధానిగా ఉన్నారు. రెండవసారి 1966 జనవరి 11న లాల్‌బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత మళ్ళీ 13 రోజుల పాటు గుల్జారీలాల్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. శాస్త్రి మరణానంతరం ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న ఇందిరాగాంధీ 1966 జనవరి 24న ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్ ప్రధానిగా కొనసాగారు. ఆపరేషన్ దుర్యోధన... 2005, డిసెంబర్ 12 న స్టార్ టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన స్టింగ్ ఆపరేషన్, ఆపరేషన్ దుర్యోధనతో 11 మంది పార్లమెంటు సభ్యులు స్వయంగా డబ్బులు తీసుకుంటున్న విజువల్స్ బయటపెట్టారు. దీనిపై పార్లమెంటులో దుమారం రేగడంతో రాజ్యసభలోని ఎథిక్స్ కమిటీ, లోక్ సభ ప్రత్యేక కమిటీ విచారణలో వీరిని దోషులుగా నిర్ధారించడంతో 10 మంది లోక్ సభ సభ్యులూ, ఒక రాజ్య సభ సభ్యుడిని ఆయా సభల నుంచి తొలగించారు. -
ఎక్సైజ్ మామూళ్ల ప్లాన్
సాక్షి, ఆదిలాబాద్: ఎక్సైజ్ వంద రోజుల యాక్షన్ ప్లాన్ పక్కదారి పట్టింది. ఆ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కార్యాచరణ ఒక రీతిలో ఉంటే ఆ శాఖ అధికారులు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. కార్యాచరణలో ఉన్న అంశాల ఆధారంగా మద్యం వ్యాపారులను హడలెత్తిస్తున్నారు. ఇది అక్రమ లిక్కర్ వ్యాపారాన్ని అరికట్టేందుకైతే ఆ డిపార్ట్మెంట్ ఆశించిన ప్రయోజనం చేకూరేది. కానీ ‘మామూళ్ల’ కోసం దాన్ని కొందరు అధికారులు తమకు అనుకూలంగా మలుచుకోవడంతో లక్ష్యం పక్కదారి పట్టింది. ఓ అధికారి సిబ్బందిపై ఒత్తిడితెచ్చి మరీ బలవంతపు వసూళ్లకు పాల్పడుతుండడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయమైంది. కేసులు బనాయిస్తామని హెచ్చరిస్తుండడంతో లిక్కర్ వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. నెల వారీగా వసూళ్లు.. ఎక్సైజ్ శాఖలో అధికారులకు ఏడాదికోసారి మామూళ్లు సమర్పించడం సాధారణంగా జరిగే వ్యవహారమే. దీంట్లో అటు లిక్కర్ వ్యాపారులకు, ఇటు ఎక్సైజ్ అధికారుల మధ్య ఒక రహస్య ఒప్పంద ప్రాతిపదికన జరుగుతుంది. లైసెన్స్ రెన్యూవల్ సమయాల్లో ఉన్నతాధికారులకు ఈ అమ్యమ్యాలను ఇస్తుంటారు. అయితే కొద్ది నెలల కిందట ఇక్కడికి బదిలీపై వచ్చిన అధికారి మామూళ్ల తంతును పూర్తిగా మార్చేశారు. నెలనెలా మామూళ్లు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో లోపాలు చూపెట్టి కేసులు బనాయిస్తామని హెచ్చరించడంతో మద్యం వ్యాపారులు జంకుతున్నారు. కొంతమంది సిబ్బందిని వసూళ్లు చేసుకురావాలని ఒత్తిడి చేస్తుండడంతో వారు హైరానా పడుతున్నారు. అక్రమ వసూళ్లపై శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సీరియస్‌గా ఉండడంతో తామెక్కడ ఇరుక్కుపోతామోననే భయం వెంటాడుతున్నా అధికారి ఆజ్ఞలతో కక్కలేక, మింగలేక వసూళ్లకు సిబ్బంది సాహసిస్తున్నారు. తాను ఇక్కడికి రాకముందు ఇంకో అధికారి పనిచేసిన కాలానికి సంబంధించి కూడా లెక్కగట్టి మరీ వసూలు రాబట్టారు. ఆ సమయంలో ఆ అధికారికి మామూళ్లు ముట్టలేదన్న విషయం తెలుసుకుని ఈ ఆఫీసర్ ఆ రుక్కాన్ని కూడా వదలలేదు. లక్షల రూపాయల్లో వసూలు చేశారు. ఈ వసూళ్లు పూర్తికావడంతో మరోదానిపై ఆయన దృష్టి పెట్టారు. నెలకు రూ.5 వేలు మామూళ్లు.. ఆ అధికారి తాను ఇక్కడికి వచ్చిన కాలం నుంచి నెలనెలా లెక్కేసుకుని షాపుకింత అని లెక్కలు వేసి దానికి అనుగుణంగా సిబ్బందితో వసూలుకు పురమాయిస్తున్నాడు. ఒక్కో షాపు నుంచి నెలకు రూ.5 వేల చొప్పున మామూళ్లు గుంజుతుండడం చర్చనీయమైంది. ఈ లెక్కన ఏడు నెలల కాలానికి సంబంధించి ఒక్కో షాపు నుంచి రూ.35 వేల చొప్పున ఒప్పందం చేసుకొని ఓ విడతలో రూ.20 వేల చొప్పున తీసుకున్నారు. మరో విడతకు సంబంధించి ఒక్కో షాపు నుంచి రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండగా మళ్లీ దాన్ని పెంచి రూ. 20 వేలు చొప్పున ఇవ్వమని చెప్పడంతో హైరానా పడుతున్నారు. బార్ల నుంచి కూడా పెద్ద మొత్తం వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మామూళ్లకు హద్దు లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక మద్యం వ్యాపారులు పరేషాన్ అవుతున్నారు. ఇలా ఆదిలాబాద్ పట్టణంలోనే ఏడు వైన్స్‌లు ఉండగా, ఈ లెక్కన లక్షల రూపాయలు ఎక్సైజ్ అధికారులకు ఈ ఏడు నెలల కాలంలోనే ముట్టజెప్పాల్సి వచ్చింది. ప్రధానంగా ఆగస్టు 11 నుంచి ఎక్సైజ్ వంద రోజుల కార్యాచరణ మొదలైంది. నవంబర్ 28 వరకు కొనసాగనుంది. పాత నేరస్తులు అక్రమ మద్యం దందా కొనసాగించకుండా బైండోవర్లు చేయాలి. గుడుంబా నల్లబెల్లం విక్రయించకుండా చర్యలు చేపట్టాలి. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయాలి. మహారాష్ట్ర నుంచి అక్రమంగా రవాణా అవుతున్న దేశీదారును అరికట్టాలి. సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. కల్తీ మద్యం విక్రయించకుండా వైన్, బార్ షాపుల్లో తనిఖీలు నిర్వహించాలి. కార్యాచరణ ముసుగులో అధికారులు మామూళ్లకు తెగబడుతుండడం ఇప్పుడు శాఖలో చర్చనీయంగా మారింది. అధికారి రూటే.. సఫరేటు గతంలో వేరే జిల్లాలో పనిచేసిన ఈ ఆఫీసర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శాఖ పరంగా సరెండర్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లాలో ఆఫీసర్‌గా తాత్కాలికంగా కొనసాగారు. ఇక్కడ పనిచేస్తున్న ఓ అధికారిని ఆ జిల్లాకు బదిలీ చేయడంతో ఈయన ఈ జిల్లాకు రావడం జరిగింది. అతడి తీరుతో శాఖలో హడల్ నెలకొంది. ప్రధానంగా వారంలో రెండుమూడు రోజులు మాత్రమే డ్యూటీ చేస్తారనే ప్రచారం ఉంది. మిగిలిన రోజుల్లో ఇక్కడున్నంత సేపు మామూళ్ల వసూళ్లపైనే దృష్టి సారిస్తారు. తనకు సహకరించని సిబ్బందికి మెమో ఇస్తానని హెచ్చరికలు వారిని ఆందోళన కలిగిస్తున్నాయి. సిబ్బందిపై పరుష పదజాలం వాడుతారన్న ప్రచారం ఉంది. మహిళ సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దీనిపై విచారణ కోసం షీ టీమ్ వచ్చి వెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. ఈ వ్యవహారం లో లోపలే సమిసిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత శాఖ పరంగా ఇతర జిల్లాల నుంచి ఇద్దరిని ఔట్‌సోర్సింగ్‌పై నియమించేందుకు ప్రయత్నాలు చేయగా, దానిపై శాఖ ఉన్నతాధికారుల వరకు సమాచారం వెళ్లడంతో తర్వాత నియామకానికి వెనుకంజ వేసినట్లు చెబుతున్నారు. ఈ అధికారి విషయం ఇంటెలిజెన్స్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏసీబీ నిఘా పెట్టినట్లు సమాచారం. ఒకవైపు అక్రమ వసూళ్లపై శాఖ డైరెక్టర్ సీరియస్‌గా ఉండగా, మరోపక్క ఇంత బాహాటంగా వసూళ్లకు తెర తీయడం పట్ల విస్మయం వ్యక్తమవుతుంది. కాగా పనిష్మెంట్పై అధికారులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పంపిస్తుండటంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులే ఇలా వ్యవహరిస్తే సిబ్బంది ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. విచారణ చేస్తాం.. అక్రమ వసూళ్ల విషయం నా దృష్టికి రాలేదు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. నేను ఇటీవలే బాధ్యతలు తీసుకున్నాను. ఆరోపణలపై దృష్టి సారిస్తాం. సదరు అధికారిపై విచారణ చేపడతాం. – డేవిడ్ రవికాంత్, డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ శాఖ, ఆదిలాబాద్ డివిజన్ -
ఎంతమాట..ఎంతమాట..!
రాయగడ: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ గిరిధర్‌గొమాంగో సతీమణి హేమగొమాంగో అధికార బీజేడీ పార్టీలో ఉంటూ అదే పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆమె బీజేడీలో ఉన్నప్పటికీ పార్టీలో ఆమెకు ఎటువంటి ప్రాధాన్యం ఇంతవరకు కల్పించలేదు. హేమగొమాం గో ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో విఫలం కాగా పార్టీలో కూడా ఆమె స్థితిని నిలబెట్టుకోలేక పోయారు. పార్టీ కార్యకర్తలు కూడా నేటివరకు ఆమెకు దూరంగా ఉండేవారు. ఈ సమయంలో హేమగొమాంగో తన మద్దతు దారులతో కలిసి గుణుపురంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీజేడీ పార్టీని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ అవినీతి పాలనపై దుమ్మెత్తి పోశారు. ఈ ఘటన హఠాత్తుగా జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అవినీతి మయమైన పాలన సమావేశంలో హేమగొమాంగో మాట్లాడుతూ బీజేడీ ముఖ్యమంత్రి పాలన అవినీతి మయంగా మారిందని పార్టీ కి సంబంధించి విభిన్న అభివృద్ధి పనులు కోరుతూ ఇచ్చే వినతిపత్రాలు బుట్ట దాఖలవుతున్నాయని ఆరోపించారు. సీఎం నవీన్‌పట్నాయక్ తన మాట¯లను వినిపించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి లభించడం లేదని, పేరుకే ముఖ్యమంత్రి అయినా కార్యక్రమాలను ఐఏఎస్ అధికారి పాండ్యన్ చూస్తున్నారని, పాండ్యన్‌కు భారీగా డబ్బు ముట్టజెప్పనిదే పనులు జరగడం లేదని తీవ్రస్థాయిలో ఆరోపించారు. అధికార బీజేడీ పార్టీ రాయగడ జిల్లా నాయకుడు భగీరథి మండంగి హత్య కేసు, టికిరిలో ఉపాధ్యాయురాలు ఈతిశ్రీప్రధాన్ హత్యకేసు, కుందులిలో ఆశ్రమ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి, ఆత్మహత్య కేసులో నేటికీ బాధితుల కుటుంబాలకు న్యాయం జరగలేదని విమర్శించారు. పెరిగిపోయిన దాదాగిరి బీజేడీ పార్టీ అవినీతి కూపంలా తయారైందని, పద్మపూర్‌లో ప్రజలు తాగునీటికి అనేక ఇబ్బందులు పడుతున్నా ఏ సమస్యను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం బీజేడీలో దాదాగిరి, గుండాగిరి పెరిగిపోయింది. బీజేడీని వ్యతిరేకించే వారిని హత్య చేయడం, లేదా తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌లు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించి గద్దె దించాలని, రాయగడ జిల్లాలో బీజేడీ వ్యతిరేక పోరాటాలకు తనకు మద్దతుదారులు, ప్రజలు సహకరించాలని కోరారు. అయితే ప్రస్తుతం రాయగడ జిల్లాలో ఉల్క కుటుంబాల రాజకీయాలకు గొమాంగోల రాజకీయాలకు తెరపడింది. ప్రజల మద్దతు కానీ ఏ పార్టీ మద్దతు కానీ వారికి లేదు. ఇప్పటికే తెరమరుగైన వారు ఎన్నికల ముందుల ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేడీ పార్టీలో ఆమె పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. -
అవినీతిని చూస్తూ ఊరుకోం
రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్రం అడుగులు వేస్తే కచ్చితంగా ప్రశ్నిస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వారికి మంత్రి పదవులు కట్టబెడుతున్నది తెలుగదేశం పార్టీయేనని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే అవినీతిపై యుద్ధం
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలోని దొడ్డబళ్లాపుర తాలూకాకు చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఓ ప్రజాప్రతినిధిపై పోరాటానికి దిగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దొడ్డబళ్లాపుర జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి అవినీతికి పాల్పడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె తూర్పారబడుతున్నారు. తాలూకాలోని నెలమంగలలో ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా పనిచేస్తున్న శివకుమారి కొన్నిరోజుల క్రితం ప్రాథమిక విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి, తాలూకాలో ఎమ్మెల్యే దౌర్జన్యాలు ఇవీ అంటూ సవివరంగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు. ఇది ఎమ్మెల్యేకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తన అనుచరుల ద్వారా సదరు టీచర్‌ను హెచ్చరించారు. అయినా, వెనకడుగు వెయ్యని శివకుమారి పోస్టుల యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. దీంతో ఎమ్మెల్యే నేరుగా ఆమె సోదరుడు రాజుకు ఫోన్‌చేసి బెదిరించినట్లు సమాచారం. ఎమ్మెల్యేపై పోరాటం ఆపను ఈ నేపథ్యంలో శివకుమారి మీడియాతో మాట్లాడుతూ.. తన ఉద్యోగానికి రాజీనామా చేశానని, ఎమ్మెల్యేపై తన పోరాటాన్ని ఆపబోనని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కానీ, తాను పోటీచేయడం కానీ చేస్తానని చెప్పారు. కాగా, శివకుమారి అధికార కాంగ్రెస్‌కు మద్దతుగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు. -
నోట్లకట్టలు పొర్లాయి
► స్వర్ణముఖి, చల్లకాలువ పొర్లుకట్టల అభివృద్ధి పనుల్లో అవినీతి ► 2009లో తొలుత రూ.54 కోట్లతో అంచనాలు ► 19 శాతం లెస్తో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ► అధిక మొత్తంతో అంచనాలు వేశారనే ఆరోపణలతో టెండర్లు రద్దు ► 2013లో రూ.45 కోట్ల అంచనాతో టెండర్లకు ఆహ్వానం ► రూ.40.30 కోట్లకు టెండర్లు ఖరారు ► 24 నెలల్లో పూర్తికావాల్సిన పనులు ► 90 శాతం కూడా పూర్తికాని వైనం వాకాడు(గూడూరు) : వాకాడు, కోట మండలాల్లో జలయజ్ఞం పేరుతో జరుగుతున్న స్వర్ణముఖి, చల్లకాలువల పొర్లుకట్టల పటిష్టం పనుల్లో నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయి. ఇందులో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున నిధులు బొక్కేశారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన జలయజ్ఞం పథకాన్ని ఆయన మరణానంతరం దోపీడీ పనులకు ఉపయోగించారనడానికి ఇదో ఉదాహరణ. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వైపు నుంచి నాయుడుపేట, పెళ్లకూరు, కోట, వాకాడు మండలాల మీదుగా స్వర్ణముఖినది ప్రవహించి పామంజి, గోవిందుపల్లి మధ్యలో కలుస్తుంది. ఈ నదికి, ఉపనది అయిన చల్లకాలువకు వరదలు రావడం తక్కువే. తెలుగుగంగ నీరు విడుదల చేస్తేనే స్వర్ణముఖినదికి నీరు చేరుతుంది. దశాబ్దన్నర కాలంగా ఇవి నిండుగా ప్రవహించిన దాఖలాలు లేవు. పదేళ్లుగా వర్షాభావం ఉండటంతో వీటికి వరద ప్రమాదమేమీ లేదు. అయితే 2000–01లో భారీ వరదలు వచ్చినప్పుడు చల్లకాలవ, స్వర్ణముఖి నది వరద నీటితో పొంగి ప్రవహించాయి. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఒత్తిడితో 2009లో అధికారులు పొర్లుకట్టల అభివృద్ధికి భారీ నిధులతో అంచనాలు తయారుచేశారు. 16 కి. మీ చల్లకాలువ పొర్లు కట్టల అభివృద్ధికి ఇరువైపులా రూ.54 కోట్లతో అంచనాలు తయారు చేశారు. దీనికి సంబంధించి కోట మండలం గూడలి నుంచి గోవిందుపల్లిపాళెం వరకు ఎడమ వైపు పొర్లు కట్టలకు రూ.28 కోట్లు, కుడివైపు పొర్లుకట్టలకు రూ.26 కోట్లు అంచనాలు నిర్ణయించి నిధులు మంజూరు చేశారు. ఇరిగేషన్ అధికారులు టెండర్లు పిలవగా నెల్లూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్ 19 శాతం లెస్తో పనులను దక్కించుకున్నారు. పనులు ప్రారంభానికి ముందే అంచనాల్లో అక్రమాలు జరిగాయని, ఇంజినీర్లు ఇష్టారాజ్యంగా అంచనాల వ్యయం అధికంగా వేసినట్లు ఫిర్యాదులు రావడంతో అప్పట్లో పనులు నిలిపివేశారు. ఐతే నీటి పారుదల శాఖ అధికారులు తిరిగి అంచనాలు సవరించి రూ.54 కోట్లకు బదులుగా రూ.9 కోట్లు వ్యయం తగ్గించి రూ.45 కోట్లకు ఖరారు చేశా రు. దీనికి సంబంధించి 2013లో టెండర్లు పిలిచి మళ్ళీ పాత కాంట్రాక్టర్లకే పనులు అప్పగించారు. కానీ సదరు కాంట్రాక్టరు టెండర్లో లెస్ వేసిన కారణంగా రూ.40.30 కోట్లకు పొర్టుకట్టల పనులు దక్కించుకున్నారు. ఈ పనులు 24 నెలల్లో పూర్తి కావాల్సి ఉంది. ఐతే ఇప్పటి వరకు 90 శాతం పనులు మాత్రమే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పూర్తి స్థాయి పనులు నిర్వహించినట్లు అధికారులు గొప్పలు చెప్పుకోవడం గమనార్హం. కానీ పొర్లుకట్టల పనులు పూర్తికాక ముందే ఎక్కడ మట్టి అక్కడే జారిపోతోంది. కొన్ని చోట్ల పొర్లు కట్టలకు సైడు ఎర్త్ అంటే అక్కడ మట్టి అక్కడే తీసి వేసి పనులు నాసిరకంగా చేపట్టారు. అంతే కాకుండా కాంట్రాక్టర్‌కు భారీగా లబ్ధి చేకూర్చేం దుకు పొర్లు కట్టలకు దాదాపు మీటరు ఎత్తు తగ్గించినట్టు తెలిసింది. దీంతో సంబంధిత కాం ట్రాక్టర్‌కు కోట్ల రూపాయల ఆదాయం లభించిన ట్లు తెలిసింది. ఒప్పందం ప్రకారం పొర్లుకట్ట ఎత్తు 5.50 మీటర్లు ఉండాలి. కింది భాగం 22 మీటర్లుండాలి. కానీ ప్రస్తుతం ఎత్తు 4.5 మీటర్లు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి సంబంధిత కాంట్రాక్టర్ ‘లెస్’ ను కారణంగా చూపి అనుమతి తీసుకున్నట్లు తెలిసింది. ఒక మీటరు ఎత్తు తగ్గడం వలన నిర్మాణ వ్యయం బాగా తగ్గే అవకాశం ఉంది. ఐతే గతంలో ఒక ఎఈ ఆధ్వర్యంలో పొర్లుకట్టల అంచనాలు తారుమారు చేసినట్లు తెలిసింది. పొర్లుకట్టల పనుల్లోనూ భారీగా అవినీతి అదేవిధంగా స్వర్ణముఖి పొర్లుకట్టల పనుల్లోనూ భారీగా అవినీతి అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పొర్లుకట్టల పనులకు కూడా సమీపంలోని మట్టినే ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే చేపట్టిన పొర్లు కట్టల మట్టి జారిపోయింది. పలు చోట్ల గండ్లు పడినట్లుగా కనబడుతున్నాయి. వాస్తవంగా పొర్లుకట్టల పటిష్టం పనుల్లో ప్రతి అరమీటరుకు 20 టన్నులు గల రోడ్ రోలర్‌తో రోలింగ్ చేసి పటిష్టం చేయాల్సి ఉంది. కాని పొర్లుకట్టల పనుల్లో ఒకేసారి రోలింగ్ చేపట్టినట్లు తెలిసింది. చల్లకాలువ, స్వర్ణముఖి పొర్లుకట్టల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. పొర్లుకట్టల పనులన్నీ నాసిరకంగా జరుగుతున్నాయని, పనుల్లో జరుగుతున్న అవినీతిపై ప్రజాప్రతినిధులు గళమెత్తడంతో ఇరిగేషన్ ఉన్నతాధికారులు కోట జలవనరుల శాఖ ఏఈని బదిలీ చేశారు. అయితే మొత్తం పనుల తీరును సమీక్షించి ప్రజాధనాన్ని సద్వినియోగమయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సి ఉంది. -
చీకటి పనులు
రొళ్ల మండలం రత్నగిరి మెగా వాటర్‌షెడ్ పరిధిలోని గుడ్డగుర్కి సమీపంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడి పొలంలో ఐదు రోజుల క్రితం జేసీబీతో తీసిన ఫారంపాండ్ ఇది. వాస్తవానికి ఇక్కడ సేద్యపు కుంట తీయకుండానే బిల్లులు స్వాహా చేశారు. ‘సాక్షి’లో కథనాలు ప్రచురించడంతో హడావుడిగా ఫారంపాండ్ తవ్వారు. అనంతపురం టౌన్ / రొళ్ల : పరిగెత్తే నీటిని నడిపించడం.. నడిచే నీటిని నిలబెట్టడం.. ఇదీ వాటర్‌షెడ్ పథకం ఉద్దేశ్యం. అవసరం లేకపోయి నా చెక్‌డ్యాంలు నిర్మించడం..బాగున్నా మరమ్మతులు చేయడం.. పనులు చేయకుండా బిల్లులు చేసుకోవడం.. ఇదీ టీడీపీ నేతల తీరు. రొళ్ల మండలం రత్నగిరి మెగా వాటర్‌షెడ్ పరిధిలో కోట్లు కొల్లగొట్టిన తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో దడ మొదలైంది. ప్రాజెక్టు పరిధిలోని రత్నగిరి, కాకి, దొడ్డేరి, గుడ్డగుర్కి పంచాయతీలో ఏడున్నరేళ్లలో రూ.11 కోట్ల విలువైన పనులు జరిగితే కేవలం 2016లో మాత్రమే రూ.5.88 కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డుల్లో చూపారు. ఫారంపాండ్లు, కొత్త చెక్‌డ్యాం లు, పాత చెక్‌డ్యాంల మరమ్మతు పేరుతో ‘ఫోర్డ్’ స్వచ్ఛంద సం స్థ ప్రతినిధులు దోచుకున్నారు. ఆయా పంచాయతీల్లోని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తమ పొలాలు, గ్రామాల్లోని వంకల్లో పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేశారు. సా మాజిక తనిఖీల్లో అక్రమాలు వెలుగుచూసినా కేవలం రూ.79 లక్షలు మాత్రమే అవినీతి జరిగిందని తేల్చారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ జరిగిన అక్రమాలపై 10వ తేదీన అవి‘నీటి’ ప్రవాహం.. 11న గుంతగుంతలో గూడుపుఠానీ.. 12న పైపై పూత నిధుల మేత... 18వ తేదీన ‘సమయం లేదు ‘తమ్ముడూ’.. దొరికినంత దోచుడు’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలు కలకలం సృష్టిం చాయి. వాటర్‌షెడ్ కమిటీ ముసుగులో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పనులు చేపట్టడం.. అసలు పనులే చేయకుం డా బిల్లులు చేసుకున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే ఫోర్డ్ ప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పూర్తిస్థాయి విచారణ జరిగితే క్షేత్రస్థాయిలో పనులు లేని విష యం తెలిసిపోతుందని టీడీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. దీంతో వారం రోజులుగా ఫారంపాండ్స్, చెక్‌డ్యాం ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. పోనీ వీటిని నాణ్యత గా చేస్తున్నారా అంటే అదీ లేదు. ఉన్నాయంటే.. ఉన్నాయన్నట్టు కడుతున్నారు. పైగా ఇక్కడ జరిగిన పనులకు సం బంధించి ఎం–బుక్కులు, ఇతరత్రా రికార్డులు స్వాధీనం చేసుకోవడంలో డ్వామా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇటీవల ప్రాజెక్ట్ కార్యాలయంలో వాటర్‌షెడ్ అసిస్టెంట్లు రికార్డులన్నీ సరి చేశారు. ఈ క్రమంలోనే ఎక్కడెక్కడ పనులు చేసినట్లు బిల్లులు తీసుకున్నారో చూసి వాటి వివరాలను తెలుగుదేశం పార్టీ నేతలకు తెలియజేసినట్లు సమాచారం. దీంతో వారు ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు, నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రత్నగిరి పంచాయతీలోని అలుపనపల్లికి చెందిన టీడీపీ నాయకులు మూడ్రోజులుగా ఆరు చెక్‌డ్యాం నిర్మాణాలను రాత్రి వేళ చేపడుతున్నారు. కాకి పంచాయతీలోని ఓ నాయకుడు సైతం రెండు చెక్‌డ్యాంలు, మూడు ఫారంపాండ్లను తవ్విస్తున్నారు. -
మామూళ్ల మత్తు
ఈ షాపులు మూయరే...! - రాత్రి 10 గంటలు దాటినా నడుస్తున్న వైన్‌షాపులు - కన్నెత్తి చూడని ఎక్సైజ్ సిబ్బంది - ఆదాయం పెంచాలని ప్రభుత్వం నుంచీ ఒత్తిళ్లు - జిల్లాలో అమలుకు నోచుకోని నిబంధనలు - దాడులు వద్దని పై నుంచే ఆదేశాలు? సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇది కర్నూలు నగరంలోని ఓ వైన్ షాపు. రాత్రి పది గంటల పది నిమిషాలు అయినప్పటికీ ఇది మూతపడలేదు. యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారు. ఇది రోజు వారీగా జరిగే తంతే. అయినప్పటికీ ఎక్పైజ్ అధికారులు కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల పరిస్థితీ ఇంతే. వాస్తవానికి ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే షాపులు తెరచి ఉంచుకోవాలి. ఇదీ వైన్‌షాపులను మంజూరు చేసిన సమయంలో ఎక్సైజ్ అధికారులు విధించిన నిబంధన. అయితే, జిల్లాలో ఎక్కడా ఈ నిబంధన అమలు కావడం లేదు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఎక్సైజ్ అధికారులు మాత్రం అటువైపు కనీసం కన్నెత్తి చూడరు. నెలవారీగా మామూళ్లు అందుతుండటమే ఇందుకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎలాగైనా ఆదాయం పెంచాల్సిందేనంటూ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్లు కూడా అధికారులు పట్టించుకోక పోవడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెలనెలా ఇస్తున్నాం.. పట్టించుకోవద్దు ఎక్సైజ్ అధికారులకు కనీసం ఏ మాత్రం బెదరకుండా మద్యం దుకాణాల యాజమాన్యాలు బరితెగించడానికి ప్రధాన కారణం నెలవారీ మాముళ్లే. ప్రతి షాపు నుంచి ఎక్సైజ్ సిబ్బందికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ అందుతోంది. గరిష్ట చిల్లర ధర(ఎంఆర్పీ) కంటే అధిక ధరకు విక్రయించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు ఎప్పుడు వ్యాపారం చేసుకున్నా పట్టించుకోకుండా ఉండేందుకే ఈ మాముళ్లు ఇస్తున్నామని మద్యం సిండికేట్లు బహిరంగంగానే పేర్కొంటున్నారు. నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నందున తామేమి చేసినా పట్టించుకోవద్దని ఎక్సైజ్ సిబ్బందిని కోరుతున్నాయి. అంతేకాకుండా మద్యం దుకాణం ముందే మందు బాటిల్ తాగేసినా కూడా ఎక్సైజ్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఎలాంటి పర్మిట్ రూం అనుమతి లేకపోయినప్పటికీ కిమ్మనకుండా ఉంటున్నారు. తెగిస్తున్న బెల్టు...! జిల్లావ్యాప్తంగా బెల్టు షాపుల జోరు రోజురోజుకీ పెరుగుతోంది. ఒక్కో గ్రామంలో ఏకంగా 10 నుంచి 15 వరకూ బెల్టు దుకాణాలు నడుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అయితే, ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో ఎక్కడా ఎక్సైజ్ సిబ్బంది దాడులు చేయడం లేదు. ఎక్కడ కూడా బెల్టు దుకాణాన్ని గుర్తించిన సంఘటనలూ లేవు. బెల్టు షాపులు ఏర్పాటు చేసుకున్నందుకు కూడా ఎక్సైజ్ సిబ్బందికి మామూళ్లు ఇస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా ఆదాయం పెంచాలంటూ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కూడా యథేచ్ఛగా వ్యాపారం చేసుకునేందుకు ఎక్సైజ్ సిబ్బంది అవకాశం ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా నోట్ల రద్దు నేపథ్యంలో రవాణా, వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఆదాయంపై మాత్రం పెద్దగా ప్రభావం పడలేదు. దీంతో ఎలాగైనా ఎక్సైజ్ ద్వారా భారీగా ఆదాయం రాబట్టుకోవాలనేది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగా ఎక్కడా దాడులు జరపకుండా పై నుంచే ఆదేశాలు ఉన్నాయని కూడా ఎక్సైజ్ సిబ్బందే పేర్కొంటున్నారు. -
నగదు రహితంతో అవినీతి అంతం
కర్నూలు(అర్బన్): అవినీతి నిర్మూలనకు నగదు రహిత లావాదేవీలు సహకరిస్తాయని 28 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ బీవీ మధుసూదనన్ అన్నారు. శనివారం స్థానిక ఉస్మానియా కళాశాలలో ఎన్సీసీ ఆధ్వర్యంలో జరిగిన ‘ ఈ – లావాదేవీలు – నగదు రహిత కొనుగోళ్లు’ అంశంపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో హాజరైన ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత పాత్ర ప్రధానమైనదని, అభివృద్ధి అంశాల్లో ఎస్సీసీ విద్యార్థులు పాలుపంచుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎస్బీఐ పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచ్ మేనేజర్ ఎంఏఎస్ హరిబాబు, బ్రాంచ్ మేనేజర్ డి.లక్ష్మినరసింహులు, అసిస్టెంట్ మేనేజర్ ఏ విజయకుమార్ సెల్‌ఫోన్ ద్వారా లావాదేవీలను ఏ విధంగా చేయవచ్చో, బ్యాంకు సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చో అవగాహన కల్పించారు. ఈ- చెల్లింపులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించడం వల్ల వినియోగదారులకు సమయం ఆదా అవుతుందన్నారు. ప్రతి కొనుగోలుకు జవాబుదారితనం పెరుగుతుందని, దేశ ఆదాయం పెరగడమే గాకుండా దేశాభివృద్ధికి తోడ్పడిన వారమవుతామన్నారు. సమావేశంలో ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరసిలార్ మహమ్మద్, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ సయ్యద్ సమీఉద్దీన్, ఎన్సీసీ అధికారి మండీ అన్వర్‌హుసేన్ పాల్గొన్నారు. -
ఒట్టి హడావుడే
- తూతూ మంత్రంగా జన్మభూమి గ్రామసభలు - కోడుమూరు మండలంలో సభను బహిష్కరించిన టీడీపీ నేతలు కర్నూలు(అగ్రికల్చర్): జన్మభూమి కార్యక్రమం జిల్లాలో నిరసనలు, అసంతృప్తుల మధ్య సాగుతోంది. సభల్లో జన్మభూమి గ్రామ కమిటీ సభ్యుల హడావుడి తప్ప ఇతరత్రా ఏమీ కనిపించడం లేదు. పింఛన్ రావాలన్నా, రేషన్ కార్డు ఇవ్వాలన్నా జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదం తప్పనిసరి కావడంతో వీరికి ప్రాధాన్యం ఏర్పడింది. వీరిని ప్రసన్నం చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయనే అభిప్రాయం ఉండడంతో వీరు అడ్డుగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. నాలుగు రోజులుగా జరిగిన జన్మభూమి కార్యక్రమం 510 నివాస ప్రాంతాల్లో ముగిసింది. కోడుమూరు మండలం అమడగుండ్లలో అధికార తెలుగుదేశం నేతలే జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకోవడం గమనార్హం. అధికార పార్టీకి చెందిన తమకే ఎంపీడీఓ, ఇతర అధికారులు తగిన గుర్తింపు ఇవ్వడం లేదంటూ గ్రామ నాయకులు మాదన్న, సుంకన్న తదితరులు అధికారులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. వీరి తీరు కారణంగా జన్మభూమి కార్యక్రమం అర్ధాంతరంగా ముగిసింది. గ్రామ సభల్లో అధికారులు, ఉద్యోగుల హడావుడి ఎక్కువగా ఉండగా ప్రజలు తక్కువగా ఉన్నారు. ఆదోని, అళ్లగడ్డ, డోన్, పత్తికొండ, నంద్యాల తదితర మండలాల్లో గ్రామ సభలు తూతూ మంత్రంగా జరుగుతున్నట్లు సమాచారం. టీడీపీ నేతల హంగామ అధికంగా ఉండడంతో ప్రభుత్వ కార్యక్రమం పార్టీ కార్యక్రమంగా మారిందన్న విమర్శలున్నాయి. -
శ్రీశైలం సీఐపై వేటు?
– అవినీతి ఆరోపణలపై ఎస్పీ సీరియస్ కర్నూలు: శ్రీశైలం సీఐ విజయకృష్ణపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది. కర్నూలు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి రెండు మాసాల క్రితం ఈయన శ్రీశైలానికి బదిలీపై వెళ్లారు. తక్కువ వ్యవధిలోనే తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. శ్రీశైలంలో భారీ మొత్తంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో తనకు వాటా ఇవ్వాలంటూ ఏకంగా ఆలయ అధికారితో బేరసారాలు చేసినట్లు సమాచారం. ఆలయ ఉన్నతాధికారి ఇదే విషయాన్ని ఎస్పీ ఆకె రవికృష్ణకు ఫిర్యాదు చేయడంతో ఫోన్లో తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. ఇదే విషయంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో విచారణ చేయించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు ప్రాథమికంగా నిర్థారణ కావడంతో ఆయనను మౌఖిక ఆదేశాలతో విధుల నుంచి తప్పించినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా బందోబస్తు విధులకు కర్నూలుకు వచ్చిన ఆయనను ప్రస్తుతం ఏపీఎస్పీ రెండవ పటాలంలో నిర్వహిస్తున్న ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల వద్ద విధులకు నియమించారు. ఆ కార్యక్రమం పూర్తి కాగానే శాఖాపరమైన చర్యలు తప్పవని పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. ఈయన గతంలో ఆదోని సబ్ డివిజన్లో విధులు నిర్వహించే సమయంలోనూ ఓ కేసులో నిందితున్ని తప్పించి, పోలీసు విచారణలో బయటపడటంతో శాఖాపరమైన చర్యలకు గురైన సంగతి తెలిసిందే. ఎస్పీ ఆకె రవికృష్ణను ఈ విషయంపై వివరణ కోరగా ఆరోపణలపై విచారణ కొనసాగుతుందన్నారు. ఎవరిపై అలాంటి ఆరోపణలు వచ్చినా శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. కాసులకు కక్కుర్తి పడి అడ్డగోలుగా వ్యవహరించిన వారిపై పోలీసు అధికారుల చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. వసూళ్ల పరంపర మాత్రం తగ్గని పరిస్థితి. సంవత్సర కాలంలో ఎనిమిది మంది సీఐలు, పది మంది ఎస్ఐలు, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, 14 మంది కానిస్టేబుళ్లు శాఖా పరమైన చర్యలకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీశైలం సీఐ విజయకృష్ణపై ఆరోపణల అంశం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. -
ఏసీబీ అదుపులో డీఎంహెచ్ఓ
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఓ జిల్లా అధికారిణిపై రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లోని ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో డీఎంహెచ్ఓ పోస్టు మరోసారి వివాదాలకు వేదికగా మారింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణిగా డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి గత మే నెలలో నియమితులయ్యారు. అప్పట్లో విజయనగరం డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న ఆమెను అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌లో భాగంగా కర్నూలుకు బదిలీ చేశారు. అప్పటికే విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో డీఎంహెచ్‌ఓగా పనిచేసిన సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ విషయమై విచారణ చేసేందుకు అప్పట్లో ఆమెను బదిలీ చేశారు. కాగా కర్నూలు వచ్చిన ఆరు నెలల అనంతరం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం చర్చకు దారితీసింది. బుధవారం ఉదయమే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో కర్నూలు ఏసీబీ సీఐలు వెంకటకృష్ణారెడ్డి, సతీష్, సిబ్బంది స్థానిక సప్తగిరినగర్‌లోని శ్రీ కృష్ణ రెసిడెన్సీలో నివాసముంటున్న డాక్టర్ స్వరాజ్యలక్ష్మి ఇంటికి చేరుకున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఇంట్లోని బ్యాంకు ఖాతాలు పరిశీలించారు. రెండు బ్యాంకు ఖాతాల పాస్బుక్కులతో పాటు ఏటీఎం కార్డు, చెక్కు బుక్కు, రూ.19వేల నగదు, పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోని కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌లోని సమాచారాన్ని సేకరించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో హైడ్రామా ఇంట్లో సోదాలు పూర్తి చేసుకున్న ఏసీబీ అధికారులు అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయానికి వెళ్లారు. డీఎంహెచ్ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మిని కార్యాలయం బయటే ఓ వాహనంలో ఉంచి, అధికారులు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లారు. డీఎంహెచ్ఓ చాంబర్లో పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం డాక్టర్ స్వరాజ్యలక్ష్మిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని వెళ్లారు. కాగా అంతకుముందే డీఎంహెచ్ఓకు సన్నిహితంగా మెలిగే ఇద్దరు ఉద్యోగులు చాంబర్లోకి వెళ్లి పలు రికార్డులు చక్కబెట్టినట్టు కార్యాలయంలో చర్చ జరుగుతోంది. ఏసీబీ అధికారులు చాంబర్లోకి వచ్చినా ఏమీ దొరకనట్టు వారు సర్దినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరితో పాటు మరో ఉద్యోగి డీఎంహెచ్ఓకు సన్నిహితంగా మెలుగుతూ ఆదివారం సైతం విధులు నిర్వహించి అనుకున్న పనులు చక్కబెట్టేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డీఎంహెచ్‌ఓపై పలు ఫిర్యాదులు సైతం రాష్ట్ర ఉన్నతాధికారులకు చేరినట్లు సమాచారం. డీఎంహెచ్ఓ పోస్టుకు కొనసాగుతున్న మకిలీ డీఎంహెచ్ఓ పోస్టు అంటేనే రోత పుట్టేలా చర్యలు ఉంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పనిచేసిన కొందరు డీఎంహెచ్ఓల మాదిరిగానే ఇక్కడకు వస్తున్న అధికారులు తమ అవినీతి పంథాను వీడటం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో డీఎంహెచ్‌ఓగా పనిచేసిన డాక్టర్ చంద్రశేఖర్‌ని ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. దీంతో పాటు ఆయన స్టేషనరీ కుంభకోణంలోనూ ఇరుక్కున్నారు. ఆ తర్వాత వచ్చిన డాక్టర్ సాయిప్రసాద్, డాక్టర్ ఆంజనేయులు సైతం ఇదే విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక్కడ డీఎంహెచ్‌ఓగా పనిచేసి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన డాక్టర్ వెంకటపతి, డాక్టర్ రామకృష్ణారెడ్డిలపైనా ఆరోపణలు వచ్చాయి. మందుల కొనుగోలు విషయంలో డాక్టర్ శివశంకర్‌రెడ్డిపై కేసు నమోదైన విషయం విదితమే. డీఎంహెచ్ఓ పోస్టులో భారీగా ఆదాయం ఉండటం వల్లే ఈ పోస్టుకు రూ.10లక్షల నుంచి రూ.20లక్షలు ఇచ్చి తెచ్చుకునే వారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవినీతి మకిలి అంటించుకుని అధికారులు ఇక్కడి నుంచి స్థానచలనం పొందుతున్నారు. -
అక్రమాలు ‘ఈరన్న’ కెరుక!
- ఉరుకుందలో భారీస్థాయి అవినీతి - కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు - అభివృద్ధి పనుల్లో చేతివాటం! - హుండీలెక్కింపుపైనా విమర్శలు - ఓ అధికారిపై ఆరోపణలు కర్నూలు (న్యూసిటీ) ఉరుకుంద ఈరన్న..భక్తుల ఇలవేల్పు. నిత్యం వందల మంది స్వామిని దర్శించుకొని మొక్కుబడులు సమర్పించుకుంటారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన ఈ క్షేత్రంలో అక్రమాలు మితిమీరినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధి పనులు ఇష్టానుసారంగా చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. టెండర్లలో గోల్మాల్ జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అనుకూలమైన కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టడం.. వారితో కుమ్మక్కై కమీషన్లు దండుకుంటున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ తంతులో ఓ అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తలనీలాలకు మార్కెట్ తగ్గిందట.. క్షేత్ర పరిధిలో తలనీలాల టెండరుకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ టెండరు ఏటా కోట్ల రూపాయలు పలుకుతుంది. అయితే ఏటేటా పెరగాల్సిన ధర ఈ ఏడాది తగ్గిపోవడం అనుమానాలకు తావిస్తోంది. తలనీలాల పోగు చేసుకునేందుకు గతేడాది మూడు టెండర్లు వచ్చాయి. అయితే ఈ ఏడాది సింగిల్ టెండరే వచ్చింది. ఆ టెండరును మల్లయ్య అనే వ్యక్తి తక్కువ ధరకు కైవసం చేసుకున్నారు. దీంతో ఈ ఏడాది దేవుని ఆదాయానికి రూ.81.99 లక్షలు గండి పడింది. ఈ విషయమై..ఆలయ అధికారిని ప్రశ్నిస్తే తలనీలాలకు మార్కెట్ విలువ తగ్గిందని చెప్పారు. అదే నిజమైతే జిల్లాలోని మిగతా ఆలయాల పరిస్థితి కూడా అలాగే ఉండాలి. కానీ బేతంచెర్ల మండలం మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని తీసుకుంటే తలనీలాల టెండరు గత ఏడాది కంటే అధిక ధర పలకడం గమనార్హం. ఉరుకుందలో తలనీలాల టెండర్లు ఇలా.. 2014 రూ.2.22 కోట్లు 2015 రూ.2.55 కోట్లు 2016 రూ.1.73 కోట్లు చలువ పందిళ్లదీ అదే దారి ఏటా శ్రావణమాస పూజల సందర్భంగా క్షేత్రంలో భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించిన టెండరును ఆరేళ్లుగా కర్ణాటకలోని గంగావతికి చెందిన వ్యక్తికి అప్పగిస్తున్నారు. ధర్మకర్త మండలి లేకపోయినా 2015–16లో అతనితోనే చలువ పందిళ్లు వేయించారు. ధర్మకర్త మండలి మాజీ చైర్మన్‌కు సదరు కాంట్రాక్టర్ అనుకూలం కావడంతో ఆయనకే పని అప్పగిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. గత శ్రావణమాసంలో రూ.21.2 లక్షలకు పనులు అప్పగించి.. సుమారు రూ.2 లక్షలకుపైగా కమీషన్ తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. హుండీ లెక్కింపులో కూడా.. క్షేత్రానికి సంబంధించి హుండీ లెక్కింపులో కూడా అవినీతి జరగుతున్నట్లు విమర్శలున్నాయి. శ్రావణమాసంలో 6 నుంచి 7 సార్లు, ఇతర మాసాల్లో నెలకు ఒక సారి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తారు. హుండీని లెక్కించిన ప్రతిసారి చేతివాటం ప్రదర్శించడం సాధారణమై పోయిందనే ఆరోపణలున్నాయి. ఎంతకాదనుకున్నా హుండీ లెక్కించిన ప్రతిసారి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు స్వాహా చేసి ఎవరి వాటా వారు తీసుకుంటున్నారని, ఈ తతంగం క్షేత్రంలో ఐదేళ్లుగా సాగుతోందని ట్రస్టుబోర్డు మాజీ సభ్యుడు ఒకరు ఆరోపించారు. ఇతర అక్రమాలు.. - అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన వ్యక్తితో ఆలయానికి సున్నం, పెయింటింగ్ వేయించారు. ఈయన ఆలయ అధికారికి చెందిన మనిషి. దీంతో ధర్మకర్త మండలికి చెప్పకుండానే రూ.5 లక్షలతో ఈ పని చేయించినట్లు విమర్శలు ఉన్నాయి. ఈ పనిలో రూ 1.5 లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. - ప్రసాదం తయారీలో వినియోగిస్తున్న సరుకుల కొనుగోలు..వాటికి సంబంధించి బిల్లుల్లో గోల్మాల్ జరుగుతున్నట్లు సమాచారం. సరుకుల కొనుగోలుకు టెండర్లు పిలవడం లేదు. - నిర్వహణ ఖర్చులంటూ..ఆలయ ఆదాయాన్ని స్వాహా చేస్తున్నారని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పారదర్శకంగా పనులు: మల్లికార్జున ప్రసాద్, ఆలయ ఈఓ టెండర్లు పిలిచి క్షేత్రంలో అన్ని పనులను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఎక్కడా అక్రమాలు జరగలేదు. హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదరిస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం : జి.చెన్నబసప్ప, ఆలయ చైర్మన్ దేవస్థానంలో అక్రమాలు జరిగితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోతాం. కార్యనిర్వణాధికారి భక్తులకు అందుబాటులో ఉండలేదన్నది వాస్తమే. ఆయన వారానికి ఒకసారి అనంతపురం నుంచి వచ్చిపోతుంటారు. -
అవినీతి నిర్మూలన అందరి బాధ్యత
కర్నూలు సిటీ : అవినీతి నిర్మూలన అందరి బాధత ఉందని పవర్ గ్రిడ్ ఏజీఎం రామకృష్ణంరాజు అన్నారు. గురువారం స్థానిక జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంచార్జి ప్రిన్సిపాల్ వై.వి మోహన్ రెడ్డి అద్యక్షతన అవినీతి నిర్మూలన అవగహన వారోత్సవాల్లో భాగంగా పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగహన సదస్సు ఏర్పాటు చేశారు. రామకృష్ణం రాజుతో పాటు, ఏసీబీ సీఐ కృష్ణారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యుటర్ వెంకటేష్ హాజరై మాట్లాడారు దేశంలో అవినీతి పెరిగి పోయిందని, దీని నియంత్రణకు ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారన్నారు. విద్యార్థులు, యువత ప్రశ్నించే తత్వం పెంచుకోవాలన్నారు. అంతకముందు విద్యార్థులచేత అవినీతి నియంత్రణపై ప్రతిజ్ఞ చేయించారు. -
ఆర్‌యూలో రెండో రోజుకు చేరిన రిలే దీక్షలు
కర్నూలు సిటీ: రాయల సీమ యూనివర్సిటీలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సమగ్ర విచారణ చేయించాలని ఆ వర్సిటీ విద్యార్థి జేఏసీ ఆ«ధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారంతో రెండో రోజుకు చేరాయి. పశ్చిమ టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థి కేవీ సుబ్బారెడ్డి ఈ దీక్షను ప్రారంభించి మాటా్లడారు. యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులపై ఉందన్నారు. దీక్షలకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజ్‌కూమార్, పీడీఎస్‌యూ కార్యదర్శి భాస్కర్, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వెంకటేష్ మద్దతూ తెలిపారు. నేడు ముగియనున్న దీక్షలు మూడు రోజుల పాటు చేపట్టిన రిలే దీక్షలు గురువారంతో ముగియనున్నాయి. కార్యక్రమానికి రాయల సీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హాజరుకానున్నట్లు ఆర్యూ విద్యార్థి సంఘాల జేఏసీ అధ్యక్షడు శ్రీరాములు తెలిపారు. -
కాసులిస్తేనే.. కనులారా దర్శనం
- ఇదేమి గోవిందా - అహోబిల ఆలయ సిబ్బంది ఇష్టారాజ్యం - గాడితప్పిన పాలన -భక్తులకు తప్పని తిప్పలు ఆళ్లగడ్డ: పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలంలో కొంత మంది ఆలయ సిబ్బంది, అర్చకుల తీరుతో భక్తులు మనోవేదనకు గురవుతున్నారు. కాసులిస్తేనే కనులారా దర్శనం కల్పిస్తుండడం విమర్శలు తావిస్తోంది. అహోబిల క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రకృతి అందాల మధ్య నవనారసింహుల ఆలయాలు ఇక్కడ వెలిశాయి.. ఉగ్రరూపం నుంచి శాంతి స్వరూపునిగా మారిన శ్రీలక్ష్మినృసింహస్వామిని దర్శించుకోవడం వల్ల జీవితంలో ప్రశాంతత, సుఖశాంతులు, ఆరోగ్యం, ధనప్రాప్తి కులుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాక విదేశీ భక్తులు సైతం పదుల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయంలో కొందరు అధికారులు, సిబ్బంది, అర్చకుల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అహోబిల క్షేత్రం పరిధిలోని నవనారసింహ స్వాములను దర్శించుకునేందుకు త్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ సంఖ్య శని, ఆదివారాలతో పర్వదినాల్లో రెట్టింపు ఉంటుంది.ఎగువ, దిగువ అహోబిలాల్లో శ్రీ జ్వాలనరసింహస్వామి, ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శించుకుని అనంతరం నల్లమలలో వెలసిన నవనారసింహ క్షేత్రాలను దర్శించుకునేందుకు కాలినడకన వెళుతుంటారు. ఎంతో ఆశతో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇక్కడి పనిచేసే సిబ్బందికి, అర్చకులకు కాసులిస్తేతపప్ప కనులారా స్వామివార్ల దర్శన భాగ్యం కలగడం లేదు. గుడిలోకి వెళ్లిన భక్తుల నుంచి అర్చకులు, సిబ్బంది రూ. 100 నుంచి రూ 10,000 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి ఆలయానికి వచ్చే భక్తులకు జాతకం పేరుతో భయం కల్పించి.. నివారణకు ఏవో మంత్రాలు చదువుతూ అధిక మొత్తంలో బహిరంగంగా నగదు తీసుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. అంతే కాదు దండులు వేస్తు, వేయిస్తూ.. దారాలు కడుతు, జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఫిర్యాదులు అధికం.. నవ నరసింహ స్వామి దేవాలయాల్లో కొందరు సిబ్బంది, అర్చకులు తమ ఇష్టారాజ్యంగా ప్రవరిస్తున్నారు. అడిగినంత సొమ్ములిస్తేనే ఆలయంలోపలికి వదులుతున్నారంటూ భక్తులు అహోబిల అధికారులకు వందల సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. దీంతో కొన్ని సార్లు భక్తుల ఎదుటే సిబ్బందిని అధికారులు మందలించారు కూడా. ఇలాంటి సిబ్బందిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే తప్ప భక్తులకు స్వామివార్ల దర్శన భాగ్యం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్పందించని అధికారులు.. నెల రోజుల క్రితం దిగువ అహోబిలంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు అర్చన చేయించుకునేందుకు టిక్కెట్ తీసుకుని వెళ్లారు. అక్కడ అర్చకుడు సెల్‌తో ఆడుకుంటూ భక్తులను పట్టించుకోలేదు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపొమ్మని అర్చకుడు దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయం ఆలయ అధికారికి పిర్యాదు చేశారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దర్శన టిక్కెట్ల రీసైక్లింగ్ దిగువ అహోబిలంలో శీఘ్ర దర్శనం కోసం రూ. 50 రూపాయలు, అర్చనకు రూ. 50 ప్రకారం టిక్కెట్లు ఇస్తున్నారు. అయితే ఒకసారి తీసుకెళ్లిన టిక్కెట్‌ను చించకుండా మళ్లీ సిబ్బంది ద్వారా బుకింగ్‌లోకి పంపించి రీ సైక్లింగ్ చేస్తున్నారన్న విషయం ఇక్కడ బహిరంగ రహస్యమే. అంతేకాకుండా.. హుండీ మూతికి లోపలి భాగంలో అడ్డంగా ఓ వస్త్రం ఉంచి భక్తులు వేసిన సొమ్ములు పూర్తిగా లోపలపడకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అహోబిలంలో ఓ అధికారి అడుగలకు మడుగులొత్తుతే చాలు.. పనిచేయక పోయినా జీతం వస్తుందనే విమర్శలు ఉన్నాయి. దేవస్థాన పరిధిలోని ఆలయాల్లో వివిధ రకాల విధులు నిర్వహించేందుకు 90 మంది సిబ్బంది ఉన్నారు. భద్రతా ఏర్పాట్లు చూసుకునేందుకు మరో 10 మంది హోంగార్డులను నియమించుకున్నారు. హోంగార్డులు కేవలం అధికారికి, కార్యాలయానికి మాత్రమే కాపలాగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పు చేసే సిబ్బందిపై చర్యలు: వాణి, అహోబిల ఆలయ ఈవో దర్శనానికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. బ్బంది తప్పు చేసినట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకుంటాం. -
‘ఉపాధి’ కొక్కులు..!
– పనులకు వెళ్లకపోయినా మస్టర్లు సృష్టి – వేతనాల పంపిణీలోనూ చేతివాటం – చిన్నతుంబళంలో వెలుగు చూసిన అక్రమాలు పెద్దకడబూరు/మంత్రాలయం : ఉపాధి పనుల్లో అక్రమాలు ఇవి. దొంగ మస్టర్లు సృష్టించి పేదల ధనాన్ని దండుకున్న అవినీతి బాగోతమిది. పేదల శ్రమను వీరు దోపిడీ చేశారు. తినమెరిగిన మేటీలు.. స్వార్థం మరిగిన బీపీఎం.. లాలూచీ అధికారులు..కుమ్మక్కై పాతిక లక్షల రూపాయలు కాజేశారు. పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం ఉపాధి పనుల్లో సాగిన దందాపై ప్రత్యేక కథనం.. పనుల నిర్వహణ ఇలా.. గ్రామంలో ఈ ఏడాది పనులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.2.50 కోట్ల లక్ష్యంగా పెట్టింది. అందులో ఇప్పటి వరకు రూ.93 లక్షల మేర పనులు చేశారు. ఐదు నెలల కాలంలో కేవలం రెండు పర్యాయాలు వేతనాలు చెల్లించారు. ఇటీవల రూ.42 లక్షలు నిధులు డ్రా చేశారు. ఇంకా రూ.51 లక్షల వరకు నిధులు డ్రా కావాల్సి ఉంది. గ్రామంలో మొత్తం 2,700 జాబ్‌కార్డులు ఉన్నాయి. రోజుకు 800–900 వరకు కూలీలు పనులకు హాజరవుతూ వచ్చారు. ఇప్పటివరకు 42 వేల పనిదినాలు కల్పించారు. మస్టర్లలో మాయాజాలం : అవినీతి రుచి మెరిగిన మేటీలు మస్టర్లలో మాయాజాలం చేశారు. పనులకు రాకపోయినా వచ్చినట్లు, ఊళ్లో లేకున్నా పనులు చేసినట్లు మస్టర్లు సష్టించారు. గ్రామంలో అందరూ పనిచేస్తున్నట్లు రికార్డుల్లో ఎక్కించారు. గ్రామంలో బాబా (131772204006011667–01), జిలాన్ (131772204006011644–01), లక్ష్మి (131772204006011593–02), నరసింహ (131772204006010163–01), నారాయణమ్మ (131772204006010163–02) వీళ్లంతా ఏ ఒక్క రోజు పనికి వెళ్లలేదు. అయినా వాళ్ల పేర్లుపై వేతనాలు మంజూరు చేశారు. బాబాకు రూ.5,617, జిలాన్‌కు రూ.2,019, లక్ష్మికు రూ.2,234, నరసింహకు రూ.4,958, నారాయణమ్మకు రూ.4,958 వేతనం జమ చేశారు. నరసింహ, నారాయణమ్మ దంపతులు బతుకు తెరువు కోసం ముంబాయికి వలస వెళ్లారు. వారూ ఇక్కడ పనుల్లో పాల్గొన్నట్లు నమోదు చేశారు. దాదాపు 120 మందికిపైగా పనులకు వెళ్లలేకున్నా వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతేగాక పనులకు వెళ్లిన వారి వేతనాల్లోనూ స్వాహాకార్యం చేశారు. ఉశేని(131772204006010782–03)కు రూ.9,772 గానూ రూ.702, అనుమంతమ్మకు (131772204006010078–01) రూ.11,830 రావాల్సి ఉండగా రూ.1900, నల్లన్నకు (131772204006010717–02) రూ.14,484గానూ రూ.2 వేలు, పరిశప్పకు (131772204006010096–01) రూ.9,928కి గానూ రూ.702, అనుమంతమ్మకు (131772204006010207–04)కు రూ.10,920కి గానూ రూ.340 చేతికి చ్చారు. మిగతా నిధులు ముట్టినట్లు ఖాతా పుస్తకంలో రాసి ముద్ర సైతం వేశారు. ఇలా మోసపోయిన కూలీలు 500 మందికిపైనే ఉన్నట్లు అంచనా. దందా సాగిన తీరు.. పనులు చేయిస్తున్న మేటీలు, పోస్ట్‌మన్ ఏకమై దందాకు పాల్పడ్డారు. మేటీలందరూ ఒక్కటై దొంగ మస్టర్లను రెడీ చేశారు. నిధులు రాగానే రాబట్టుకునేందుకు వ్యూహం పన్నారు. పనులకు రాని వ్యక్తులు వేలి ముద్రల కోసం కొంత డ్రామా కట్టారు. ఎక్కువ కాలం పనులకు రాకపోతే జాబ్‌కార్డులు రద్దు అవుతాయని బుకాయించారు. పనులకు రాకున్నా వారం పనులకు ఉచితంగా డబ్బులు ఇస్తామని ఆశపెట్టారు. వేలి ముద్రలు వేసి డబ్బు తీసుకుపోవాలని పేస్లిప్లు చేతుల్లో పెట్టారు. పాపం అమాయక జనం నిజమేనేమో..అని పాట్మిషన్లలో వేలి ముద్రలు సేకరించారు. ఒక్కసారి కాకుండా ప్రతి వారానికో ముద్ర చొప్పున ఒకేసారి నొక్కించారు. పాస్ పుస్తకాల్లో ఇష్టమెచ్చిన లెక్కలు రాసేశారు. అంతేగాక పనులకు వచ్చిన కూలీలకు వారం వారం పేస్లిప్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇక్కడ మాత్రం అలా సాగలేదు. ఒక్కటీ రెండు పేస్లిప్లు ఇవ్వడం మిగతా స్లిప్‌లు మేటీలతోనే ఉంచుకున్నారు. పనులకు వచ్చిన కూలీలకు వారం కూలితో సరిపెట్టారు. మిగతా కూలీలు సైతం ఇచ్చేసినట్లు ఖాతా పుస్తకాల్లో నమోదు చేశారు. రూ.25 లక్షల స్వాహా : తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు కూలీల సొమ్మును కాజేశారు. రూ.93 లక్షల పనుల్లో రూ.25 లక్షలు స్వాహా చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతకు మించే ఉందని గ్రామస్తులు ఆరోపణ. ఆరు నెలల దోపిడీనే ఇంత ఉంటే. గతంలో భారీ మొత్తంలో నిధులు దండుకున్నారని కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్వాహా వెనక ఎన్ఆర్ఈజీఎస్ మండలాధికారులు ఉన్నట్లు సమాచారం. నిధులు కాజేసే కథనంతా బీపీఎం షాషావలీ ద్వారా నడిపిసున్నట్లు స్పష్టమవుతోంది. అవినీతిని నిలదీస్తే మేటీలు మీరు పనికి రాకున్నా ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాం. తీసుకుపోండి ఎక్కువ మాట్లాడొద్దని ఎదురు తిరుగుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. కూలి డబ్బులు సక్రమంగా ఇవ్వండని అడిగితే ఇంకోసారి పనుల్లో పెట్టుకోమంటూ భయపెడుతున్నారని వాపోయారు. -
దోపిడీ కేసు.. తిర‘కాసు’
– కేసు లేకుండా చేసేందుకు ఎస్ఐ లంచం డిమాండ్ – వేధింపులు తాళలేక నిందితుడి తండ్రి అజ్ఞాతంలోకి కర్నూలు: దొంగతనం కేసు నుంచి నిందితుడిని తప్పించేందుకు ఎస్ఐ చేసిన నిర్వాకం వివాదస్పదమైంది. సి.బెళగల్ మండలంలోని కొండాపురం చెందిన పి.మహమ్మద్ గ్రామంలోనే డీజిల్, పెట్రోల్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెలరోజుల క్రితం గ్రామంలో వరుసగా దోపిడీలు జరిగాయి. మహమ్మద్‌పై అనుమానంతో గ్రామపెద్దల వద్ద బాధితులు పంచాయితీ పెట్టారు. చివరకు దొంగతనం చేశానని ఒప్పుకొని రూ.68 వేలు కట్టేందుకు పెద్ద మనుషులు ఒప్పుకొని పంచాయితీని సి.బెళగల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మహమ్మద్‌పై ఎలాంటి కేసు లేకుండా బాధితులకు డబ్బులిచ్చే విధంగా ఒప్పందం చేసుకొని ఎస్ఐ మల్లికార్జునకు డబ్బులు అప్పగించి నిందితుడు వెళ్లిపోయాడు. నాలుగైదు రోజుల తర్వాత బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి డబ్బులివ్వాలని ఎస్ఐను అడిగితే బెదిరించి పంపాడు. విషయాన్ని బాధితులంతా టీడీపీ ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి దష్టికి తీసుకెళ్లారు. పంచాయితీ డబ్బులను బాధితులకు ఇవ్వాలని విష్ణువర్దన్‌రెడ్డి ఎస్ఐను కోరగా, కేసు నమోదు చేసి డబ్బులను కోర్టు ద్వారా రికవరీ చేయిస్తానని ఎస్ఐ బుకాయించాడు. చేతికొచ్చిన డబ్బులు జారీపోతాయన్న అక్కసుతో ఎస్ఐ.. నిందితుడు మహమ్మద్ కుటుంబంపై వేధింపులు మొదలుపెట్టాడు. రోజూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకొని రూ.50 వేలు ఇస్తే తప్ప వదిలిపెట్టనని బెదిరించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయం వివాదమవుతుందని ఎస్ఐ గ్రహించి ఈనెల 30న మహమ్మద్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపాడు. రూ.50 వేల కోసం తండ్రి గిడ్డయ్యను రోజూ స్టేషన్‌కు రప్పించి వేధించసాగాడు. సోమవారం డబ్బులు తీసుకొస్తానని గిడ్డయ్య కర్నూలుకు వెళ్లి ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. డబ్బులు డిమాండ్ చేయలేదు: మల్లికార్జున, ఎస్ఐ, సి.బెళగల్ దోపిడీ కేసులో అరెస్ట్ అయిన మహమ్మద్‌ను డబ్బులు డిమాండ్ చేయలేదు. దోపిడీ కేసులో రికవరీ కోసం డబ్బులను సీజ్ చేసి అరెస్ట్ చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపాం. -
' పీకల్లోతు అవినీతిలో సీఎం'
-
' పీకల్లోతు అవినీతిలో సీఎం'
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. దళిత మంత్రులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరు అగమ్యగోచరంగా మారిందని ఆవేధన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేయడమే కాకుండా, బడ్జెట్లో దళితులకు కేటాయించాల్సిన నిధుల్లో రూ.ఐదు వేల కోట్లు కత్తిరించారని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న దళిత మంత్రులు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారనడానికి ఇటీవల మంత్రి పీతల సుజాత ఇంటి వద్ద జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దళిత హక్కులను కాలరాస్తుందన్నారు. దళితులకు న్యాయం చేయలేని మంత్రి పీతల సుజాత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.